[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[మారుతున్న కాలంలో సామాజికంగా వచ్చిన మార్పులను తలచుకుంటాడు ప్రభాకరం. జీవితాలు ఒకప్పటిలా సరళంగా లేవనీ, చాలా సంక్లిష్టమైపోయాయని, అందుకే మానసిక వైద్యుని వద్దకు వెళ్ళడానికి జనాలు సంకోచించడం లేదని భావిస్తాడు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య కేసులు కూడా ఎక్కువైపోయాయని అనుకుంటాడు. సర్దుకుపోవడం తగ్గి, విడాకుల కేసులు అధికమయ్యాయని తలుస్తాడు. ఎన్నో కేసులలో కోడళ్ళకో, అత్తమామలకో, భార్యలకో, భర్తలకో సాయం చేసిన ప్రభాకరం తన భార్యా మీనాక్షిని తలచుకుని గర్వపడతాడు. ఆమెను పెళ్ళి చేసుకోడం తాను జీవితంలో చేసిన అద్భుతమైన పని అనుకుంటాడు. ప్రతిచిన్న విషయాన్నీ గృహహింస కింద చిత్రీకరించేసి, ఆ ఆడవాళ్ళు పెడుతున్న కేసులు చూస్తున్నకొద్దీ అతనికి మతిపోతుంది. ఒక కేసు విషయంలో మీన్స్ నుంచి సలహా కోరితే, సుదీర్ఘమైన సమాధానం వస్తుంది. విడాకులు సాఫీగా జరగడానికి మూడు ‘C’ ల సిద్ధాంతం గురించి చెప్తాడు. మీన్స్ సలహాతో సంధ్య, వినీల అనే దంపతుల సమస్యని పరిష్కరిస్తాడు ప్రభాకరం. మీన్స్ చెప్పినట్టే స్టెప్ బై స్టెప్ చేసి, వారిద్దరి మధ్య అపోహలను దూరం చేసి, వారిద్దరినీ దగ్గర చేస్తాడు. దాంతో ప్రభాకరం దగ్గరికి కేసులు రావడం ఎక్కువవుతుంది. ప్రాక్టీస్ బాగా పెరగడంతో ఉద్యోగం మానేసి కౌన్సిలింగ్‍నే పూర్తిస్థాయి వృత్తిగా మార్చుకుంటాడు. మీన్స్ పట్ల అతనికి కృతజ్ఞతాభావం పెరిగిపోతుంది. తన పురోగతిని అంతా వివరించి, దానికి కారణం మీన్స్ అనీ, ఒకసారి అతన్ని తమ ఇంటికి భోజానికి రమ్మని ఆహ్వానిస్తాడు. రాకపోతే, అతనితో ఇంక మాట్లాడనని బెదిరిస్తాడు ప్రభాకరం. ఇక చదవండి.]
అధ్యాయం 19
మర్నాడు మధ్యాహ్నం పదకొండు గంటలకి అందరూ ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళిపోయాక అలవాటుగా కంప్యూటర్ తెరిచింది మీనాక్షి. మీన్స్ మెయిల్‌కి ప్రభాకరం పంపిన కృతజ్ఞతలు, కలవమన్న కోరికా చూసింది. అది చూసి కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగాయామెకి.
ప్రభాకరం మీన్స్‌ని ఇంతగా అభిమానిస్తాడని మీనాక్షి ఊహించలేకపోయింది. గత పదేళ్ళనుంచీ రాత్రి తొమ్మిది గంటలు దాటాక ప్రభాకరం తన సమస్యలను అడగడం, ఆ మర్నాడు మీనాక్షి వాటికి పరిష్కారాలు చెప్పడం వారిద్దరికీ ఒక దినచర్యగా మారిపోయింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా దాగుడుమూత లాడడం మీనాక్షికి కష్టంగానే ఉంది.
ఇప్పుడు అలా ప్రభాకరం మీన్స్‌కి కృతజ్ఞతలు చెప్తుంటే గుండెల్లోంచి బాధ తన్నుకుంటూ పైకొచ్చింది మీనాక్షికి. ఈ మీన్స్ తన భార్య మీనాక్షేనని తెలిస్తే ప్రభాకరం రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందామె.
ఈ విషయం ఖచ్చితంగా ముందు నమ్మడు. ఆడవాళ్ళకి అంత చదువూ, విజ్ఞానం ఉంటుందని ఊహించని అతను ఈ సంగతి తెలియగానే తెల్లబోతాడు. తర్వాత సంతోషిస్తాడో లేదో తెలీదు కానీ, ముందుగా ఇంత చదువు తను చదువుకున్నట్టు అతని దగ్గర దాచిపెట్టినందుకు చీవాట్లేస్తాడు. చీవాట్లేస్తాడా.. లేకపోతే సంభ్రమంతో అలా నిలబడిపోతాడా.. ఏమీ తేల్చుకోలేకపోయింది మీనాక్షి.
అతనే మనుకుంటే తనకెందుకు.. ఈ విషయం చెప్పడం వల్ల తనకి హానే తప్పితే మంచయితే జరగదు. ఎంతోమందికి ఫామిలీ కౌన్సిలింగ్ ఇచ్చిన మీనాక్షి తన ఫామిలీ గురించి స్థిమితంగా ఆలోచించుకుంది. తనే మీన్స్ అని చెప్పడం వల్ల హాయిగా సాగిపోతున్న తమ కుటుంబంలో లేనిపోని గొడవలొచ్చే అవకాశం ఉంది. తనకు ఒక ఇల్లాలిగా ఈ సమాజంలో గౌరవం కావాలనుకున్నప్పుడు ప్రభాకరం భార్యగా ఉంటే తప్పితే ఆ గౌరవం దక్కదు. అందుకే ఎగసిపడే మనసుని తొక్కిపెట్టింది. “నేనే మీన్స్‌ని” అని గట్టిగా అరవాలనుకున్న గొంతుని నొక్కిపెట్టింది. హాయిగా ఎగరాలనుకున్న పావురం రెక్కలు ముడిచేసుకున్నట్టు మీనాక్షి తనలో తను ముడుచుకుపోయింది.
ప్రభాకరం పంపిన కృతజ్ఞతలకి యాంత్రికంగా “ఇట్స్ మై ప్లెజర్..” అని జవాబిచ్చింది.
కలుద్దామన్న అతని కోరికకి ఏమి సమాధాన మివ్వాలా అని ఆలోచిస్తుంటే బైట టపటపా వాన పడుతున్న శబ్దం వినిపించింది. ‘అయ్యో, పెరట్లో బట్టలారేసేను..’ అనుకుంటూ గబగబా పెరటివైపు వెళ్ళి, బట్టలన్నీ తీసుకుని ఇంట్లోకి వస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. తెచ్చిన బట్టలు హాల్లో సోఫాలో పడేసి ఈ టైమ్‌లో ఎవరొస్తారా అనుకుంటూ తలుపు తీస్తే ఎదురుగా ప్రభాకరం కనిపించేడు. “ఏమైందండీ! ఏమైనా మర్చిపోయేరా!” అన్న మీనాక్షి మాటలకి, “ఊ.. ఓ బుక్ తీసికెళ్ళడం మర్చిపోయేను..” అంటూ దానికోసం రీడింగ్ రూమ్ లోకి వెళ్ళేడు.
మీనాక్షి గుండాగినంత పనయింది. అక్కడ డెస్క్‌టాప్‌లో తను చూస్తున్న మీన్స్ మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుంది. “భగవంతుడా, ప్రభాకరం దృష్టి అటు పడకుండా చూడు..” అని దండం పెట్టుకుంటుండగానే,
“మీనా, ఈ కంప్యూటర్ ఎవరు ఓపెన్ చేసేరు. పిల్లల్ని దీన్ని ముట్టుకోనియ్యొద్దన్నానా..” అన్న అతని మాటలు గట్టిగా వినిపించేయి. హడిలిపోయిందామె. అంతే..
తరవాత నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. ప్రభాకరం మాటా వినపడలేదు, మనిషీ బైటకి రాలేదు. అయిదు నిమిషాలు.. పది నిమిషాలయినా లోపల్నించి ఏ శబ్దమూ లేదు.
భయపడుతూ గుమ్మందాకా వెళ్ళి లోపలికి తొంగిచూసింది మీనాక్షి. ప్రభాకరం డెస్క్‌టాప్ ముందు కూర్చుని, కళ్ళింత చేసుకుని అందులోకి చూస్తున్నాడు. భగవంతుడా అనుకుంది. అయిపోయింది.. అంతా అయిపోయింది. ఇన్నేళ్ళూ ఎంతో కష్టపడి దాచుకున్న రహస్యం బయటపడిపోయింది. భయం భయంగా ప్రభాకరం మొహాన్నే చూస్తోంది. కంప్యూటర్ లోంచి నెమ్మదిగా తలెత్తిన ప్రభాకరం గుమ్మంలో నిల్చున్న మీనాక్షిని చూసేడు. ఆ కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో తీవ్రంగా చూస్తున్నట్టున్నాయి. నోట మాట పడిపోయినట్టు యాంత్రికంగా కంప్యూటర్ వైపు ఒక చెయ్యి చూపిస్తూ, రెండో చెయ్యి ‘నువ్వేనా’ అన్నట్లు మీనాక్షి వైపు తిప్పేడు.
ఏం చెప్పాలో తెలీలేదామెకి. ఏమంటే ఏమవుతుందో అన్నట్టుంది అప్పటి పరిస్థితి. నోట మాట లేకుండా నిలబడిపోయిన మీనాక్షిని కాస్త తేరుకున్న ప్రభాకరం చెయ్యి పట్టుకుని తీసికెళ్ళి డెస్క్‌టాప్ ముందు కూర్చోబెట్టి, ఓపెన్ అయి ఉన్న మీన్స్ మెయిల్ అకౌంట్ వైపు చూపించేడు. తలొంచేసుకుంది మీనాక్షి.
అలా తలొంచుకున్న మీనాక్షిని చూస్తుంటే మీనాక్షే మీన్స్ అని అర్థమైపోయిందతనికి. కలలో కూడా ఊహించని విషయం ఎదురుగా సాకారమవగానే ఒక రకమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడతను. నమ్మలేని ఆ నిజాన్ని జీర్ణించుకుందుకు కాస్త సమయం పట్టిందతనికి. మనసులో మథనం ప్రారంభమయింది.
మీనూ సైకాలజీలో రీసెర్చ్ చేసిందన్న పెద్ద విషయాన్ని మొగుడినైన తన దగ్గర దాచినందుకు ఒక్కసారిగా ఉక్రోషం లాంటిది వచ్చింది. తన చదువు గురించి ఎందుకు అబధ్ధాలాడిందో నిలదీయాలనిపించింది.
ఆడవాళ్ళకి ఇల్లూ, పిల్లలూ తప్ప మరో ఆలోచన ఉండకూడదనుకున్న తన సంకుచిత మనస్తత్వమే అలా దాచడానికి కారణమని కూడా అతనికి అర్థమైపోయింది.
ఒక్కసారిగా ఇన్నేళ్ళూ ఒంటపట్టించుకున్న మానసికశాస్త్రం అతన్ని నిలదీసింది.
అందరి మనసులూ బాగు చేస్తున్నాననుకున్న తను తన మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నాడా!.. లేదే..
ఎందుకంటే తనకి అన్నీ తెలుసనీ, తనేమీ తప్పు చేయననే అహం తనని విశాలంగా ఆలోచించనీయలేదు. మనుషుల మనసులను మార్చి ఈ సమాజాన్నే మార్చేస్తున్నాననే భ్రమలో ఉండిపోయేడు.
అవునూ, ఆ చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడూ!
ఈ ప్రపంచం సరైన త్రోవలో నడవాలంటే ముందు మనం మన మనసుని సరైన పధ్ధతిలో పెట్టుకోవాలని ఎంత గొప్పగా చెప్పాడూ! కానీ తనేం చేసాడు! ఆ మనసునే సంకుచితం చేసేసుకున్నాడు.
ఇన్నేళ్ళూ ఇంతటి సరస్వతీమూర్తి ఎదురుగా ఉన్నా గుర్తించలేకపోయేడు.
అది తన అశక్తతా లేక ఆమె గోప్యంగా వ్యవహరించిన తీరా అన్నది తేల్చుకోలేకపోయేడు.
ఈ పదేళ్ళూ తన చెయ్యి పట్టుకు నడిపించిన శక్తి తను మామూలు ఇల్లాలుగా భావించే మీనూయేనా అనుకుంటున్న అతని సంభ్రమానికి అంతులేకుండా పోతోంది. ఇంతటి శ్రీవాణిని తను నీకేం తెలీదంటూ ఎన్నిసార్లు తీసిపడేసేడూ! వంటిల్లూ, పిల్లలూ తప్ప మరో ప్రపంచమే తెలీదని ఎంత చిన్నబుచ్చేడూ! క్షణం క్రితం తన భార్యలా కనిపించిన ఆమె ఇప్పుడు ఎత్తైన హిమశృంగంలా కనిపిస్తుంటే అతని కళ్ళముందు ఒకేసారి లక్ష్మీ, సరస్వతీ,పార్వతీల రూపమైన లలితాదేవి సాక్షాత్కరించి నట్టనిపించింది.
అంతే ఒక విధమైన ఆవేదనతో ఒక్కసారిగా మీనాక్షి ముందు కూలబడిపోయేడతను. కంగారుగా లేచి, ఏం చెయ్యలేని అయోమయ స్థితిలో అతని పక్కనే మీనాక్షి కూడా కూలబడిపోయింది.
ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. ఏమవుతుందిప్పుడు! తనే మీన్స్ నన్న విషయం తెలిసిపోయేక ప్రభాకరం ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిందామెకి. ఇలాంటి విషయం దాచినందుకు తనని కేకలేస్తాడనుకున్న మీనాక్షి అతను అలా కూలబడిపోవడం చూస్తే ఎందుకో తప్పు చేసినట్టు అనిపించింది. అవును.. తను తప్పే చేసింది.
భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదన్న విషయాన్ని తను పాటించలేదు. తనను ఎంతో నమ్మిన ప్రభాకరం నమ్మకాన్ని వమ్ము చేసింది. పదేళ్ళ నుంచీ ఈ మీన్స్ చెప్పిన ప్రతి మాటా ప్రభాకరం తనతో చెపుతూనే ఉన్నాడు. కానీ ఒక్కసారయినా ఆ మీన్స్ తనే నని చెప్పలేదు. తను చెప్పిన విషయాలే మళ్ళీ అతను తనకి చెప్తుంటే ఎంతో శ్రధ్ధగా విన్నట్టు నటించి అతన్ని వెర్రివాడిని చేసింది. అహంకారమున్న మగవాడే కాదు, ఇలాంటి విషయం దాస్తే ఏ ఆడదీ కూడా ఊరుకోదు. మరిప్పుడు తనేం చెయ్యాలి? భావోద్వేగాన్ని తట్టుకోలేక, మనసుని కాస్త కూడదీసుకుని, ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ప్రభాకరం చేతి మీద చెయ్యి వేసింది మీనాక్షి.
అధ్యాయం 20
నెమ్మదిగా తలెత్తేడతను. అప్పటిదాకా ఎటువంటి ఉద్వేగానికి లోనయ్యేడో కానీ పైకెత్తిన ఆ కళ్ళలో ఒక విధమైన స్థిరత్వం కనిపించింది మీనాక్షికి.
గుండె గొంతుకలో కొచ్చి నోట మాట రాలేని స్థితిలో ఉన్న ప్రభాకరం తనని తను కూడదీసుకుని, మీనాక్షి చేతులు రెండుచేతుల్లోకీ తీసుకుని డెస్క్ టాప్ వైపు చూపిస్తూ “నువ్వే కదూ!” అన్నాడు.
నూతిలోంచి వచ్చినట్టు ఉందా మాట.
ఏం మాట్లాడలేదామె. తప్పు చేసినట్టు తల వంచేసుకుంది.
“ఈ మీన్స్ నువ్వే కదా!” మళ్ళీ అడిగేడు.
ఇప్పుడూ మాట్లాడలేదు. మొహం చూపించలేనట్లు తలొంచేసుకుంది.
మౌనం అంగీకారమే కదా!
ప్రభాకరం తనలో తనే మథనపడిపోతున్నాడు.
“ఈ సరస్వతిని ఇన్నాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయేను. ఇన్నాళ్ళు ఇంత విద్యనీ ఈ నాలుగ్గోడల మధ్యా బంధించడానికి కారణం నేనేనా.. అవును నేనే.. ఇన్నాళ్ళూ ఈ విషయం చెప్పకపోవడానికి తను ఆమెకి అవకాశం ఎప్పుడిచ్చేడనీ!
మామూలు డిగ్రీలూ, డిప్లొమాలూ ఉన్నవాళ్ళే ఏదో పెద్ద చదివేసేమన్నట్టు కాలర్లెగరేసుకుంటూ తిరుగుతుంటే ఇంత రీసెర్చ్ చేసే ఈ మహాతల్లి అంత మామూలుగా ఎలా ఉండగలిగిందీ!
ఆమె మనసెంత నలిగిపోయుంటుందో కదా!”
నోట మాట లేకుండా శిలలా కూలబడిపోయిన ప్రభారాన్ని చూస్తుంటే మీనాక్షికి భయం వేసింది. గుండె లోంచి వస్తున్న మాటలు గొంతు దాటి రాలేకపోతున్నాయి.
ధైర్యమంతా కూడ దీసుకుని నెమ్మదిగా అంది.
“నన్ను క్షమించండీ. మీ దగ్గర ఈ విషయం దాచి నేను చాలా పెద్ద తప్పే చేసేను. అది మీమీద నమ్మకం లేక కాదండీ. దాని గురించి చెప్పవలసిన అవసరం నాకు కనిపించలేదు. మన సంప్రదాయం ప్రకారం ఈ సమాజంలో ఒక ఇల్లాలిగా, ప్రభాకరం భార్యగా నాకు దక్కే గౌరవం కన్న ఈ రీసెర్చ్ ఎక్కువ కాదనిపించింది.”
ఒక్క పది నిమిషాలు అక్కడ మౌనం రాజ్యమేలింది.
షాక్ నుంచి కోలుకున్నట్టు బేలగా తలెత్తాడు ప్రభాకరం. మీనాక్షిని చూసి తప్పు చేసినవాడిలా నెమ్మదిగా అన్నాడు.
“నువ్వు నన్ను మభ్యపెడుతున్నావు. ఇన్నేళ్ళ కాపరంలో నా మీద నీకామాత్రం కూడా నమ్మకం కలగలేదా మీనా! ఇంత పెద్ద విషయాన్ని నానుంచి దాస్తావని నేనెప్పుడూ ఊహించను కూడా లేదు.”
గబుక్కున అతని మాటలకి అడ్డుపడింది మీనాక్షి.
“అది మభ్యపెట్టడం కాదండీ. మన సమాజంలో కుటుంబానికున్న ప్రాముఖ్యత అలాంటిది. ఏ ఒక్క ఇల్లాలూ కూడా తన చదువు గురించీ, కెరియర్ గురించీ ఆలోచించుకోదు. వారు మొట్టమొదట ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే. అందుకే ఏ మగవాడైనా తాగినా, తిరిగినా అంత లెక్కచేయని సమాజం ఒక స్త్రీ అలా చేస్తే ఊరుకోదు. ఎందుకంటే ఆ తల్లి చేతుల్లోనే వాళ్ల పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన పిల్లలే భవిష్యత్తులో నేరాలవైపు వెళ్ళకుండా మంచి పౌరులయి, చక్కటి సమాజాన్ని నిర్మిస్తారు. అలాంటి ఇల్లాలు హోదాని ఏ ఆడదీ చిన్నచూపు చూడదండీ.”
“నువ్వెన్ని చెప్పు, చదువుకున్న విలువ తెలీకుండా కాబోయే భార్య డిగ్రీ వరకూ చదివితే చాలని ఆ రోజుల్లో నేను చెప్పడం ఎంత పెద్ద తప్పో అనిపిస్తోంది.”
“తప్పు కాదండీ. అప్పటికీ ఇప్పటికీ చుట్టూ పరిస్థితులను గమనిస్తున్న మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. అప్పటి మీరు పెరిగిన పరిస్థితులూ, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మీకెలాంటి భార్య కావాలో స్పష్టంగా తెలుసుకున్నారు. ఇప్పుడు, మారిన పరిస్థితులు గమనించి, నన్ను అర్థం చేసుకుని, ఈ సంగతి దాచినందుకు ఇలా క్షమించడం నా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసాండీ. ఇన్నాళ్ళూ మీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానన్న భావన ఇప్పుడు పోయింది.”
“ఏమో మీనూ, నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీటం లేదు” మీనాక్షి చేతులు గట్టిగా పట్టుకుని అన్నాడు ప్రభాకరం.
‘ఊహు… ఇంక మాటలెందుకూ!’ అన్నట్టు ఆ చేతులని తన శిరస్సు మీద ఉంచుకుంది మీనాక్షి.
అక్కడంతా ప్రశాంతమైన మౌనం రాజ్యమేలింది.
‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’.
(సమాప్తం)
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.