నాకు మాత్రమే ఎందుకో
ఏ రాత్రీ శుభరాత్రి కాదు
ఉదయించని అస్తమయాలూ
అస్తమించని ఉదయాలూ
నాకు మాత్రమే ఎందుకో
ఏ రాత్రీ శుభరాత్రి కాదు
పగళ్ళను వికసించే చీకటులూ
చీకట్లను విరబూసే వెన్నెలలూ
నాకు మాత్రమే ఎందుకో
ఏ రాత్రీ శుభరాత్రి కాదు
సృష్టి దర్శనం ఒక
అనాకాంక్షిత యాదృచ్ఛికం
కనుపాపలు కలలుగనే
వసంత శోభిత నర్తనం ఒక
సుందర వాంఛిత ఉపాసనం
చవులూరు సరిగమల వీచికలు
విప్పారిన మధుమాస
మావి కోయిల గొంతుకల
పరవశ మధురిమలు
అనుభూతుల ఆఖరి అంచుల
ఆస్వాదన కాంక్షలు
బతుకంతా
ఎండమావిలో వెతుకులాటలు
అందుకే కాబోలు
నాకు మాత్రమే ఎందుకో
ఏ రాత్రీ శుభరాత్రి కాదు
అందుకే కాబోలు
నా రెప్పవాలని నిద్రలన్నీ
తనివితీరని వేదనల
అపురూప చిత్రాలు