Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మృత్యువాగదు

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘మృత్యువాగదు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

విర్రవీగకు తుళ్ళిపడకు
రోజు నీదని జులుం చేయకు
కాలం మారినపుడు
కాలు జారినపుడు
వీలు లేని రోజు నీదవుతుంది
కూసాలు కదిలినపుడు
గోస ఎవరికీ పట్టనపుడు
శ్వాస అందడమే కష్టమైనపుడు
అంతా పూర్తిగా అర్ధం అవుతుంది
నా వారు అనుకున్న వారు
కాని వారుగా మారినపుడు
కనబడకుండా పోతున్నపుడు
మనసు భారంగా మూలిగినపుడు
ఎంత ఒంటరివో బోధపడుతుంది
ఎంతగా వేడుకున్నా
మరెంతగా ప్రాధేయపడినా
చేసిన తప్పులు ఎదురు నిలబడతాయి.
పశ్చాత్తాపం ప్రకటించినా
పాపాలను కడిగేసుకోవాలనుకున్నా
కుదిరేది ఉండదు సమయమూ ఉండదు
చీకటి తాటకిగా మారి
విరుచుకుపడిన వికృత వేళ
ఏం చెప్పినా మృత్యువు వినదు
ఎంత ఆపినా మృత్యువాగదు

Exit mobile version