Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 4

ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు.

కఞ్చుకీ: 

ఏవ మే వైతత్.

అర్థం:

ఏతత్+ఏవం+ఏవ=ఇది అంతే! (తమరు చెప్పింది నిజమే).

రాజా:

కి మేతత్?  

అర్థం:

ఏతత్+కిమ్=ఇది (నిజమంటే) ఏమిటి?

కఞ్చుకీ:

దేవ, ఇదమ్.

అర్థం:

దేవ=దేవరా, ఇదమ్=ఇది…

రాజా:

స్ఫుటం కథయ.    

అర్థం:

స్ఫుటం+కథయ=స్పష్టంగా చెప్పు.

కఞ్చుకీ: 

ప్రతిషిద్ధః కౌముదీ మహోత్సవః

అర్థం:

కౌముదీ మహోత్సవః+ప్రతిషిద్ధః=వెన్నెల పండుగ నిలుపు చేయించారు (చేయించబడింది).

రాజా:

(సకోపమ్) ఆః! కేన?

అర్థం:

(సకోపమ్=కోపంతో) ఆః=ఆఁ!, కేన=చేసింది ఎవరు (ఎవని చేత)?

కఞ్చుకీ: 

దేవ, నాతఃపరం విజ్ఞాపయితుం శక్యమ్.

అర్థం:

దేవ=దేవరా, అతః+పరం+విజ్ఞాపయితుమ్+న+శక్యమ్=అంతకు మించి మనవి చేయడానికి వీలులేదు.

రాజా:

న ఖలు ఆర్యచాణక్యే నాపహృతః ప్రేక్షకాణా మతిశయ రమణీయ శ్చక్షుషో విషయః 

అర్థం:

ప్రేక్షకాణాం=చూపరులకు, అతిశయ+రమణీయః+చక్షుషః+విషయః=మిక్కిలి మనోహరమూ, కన్నులకింపూ అయిన దానిని (కౌముదీ ఉత్సవాన్ని), ఆర్యచాణక్యేన+అపహృతః+న+ఖలు=అయ్యవారు చాణక్యుడు కాని (వాని చేత గాని) ఎత్తివేయబడలేదు కద? (వాని చేత గాని, ప్రజల సంతోషం హరింపబడలేదు కదా?)

కఞ్చుకీ:

దేవ, కోఽన్యో జీవితుకామో దేవస్య శాసన మతివర్తేత?

అర్థం:

దేవ=దేవరా!, దేవస్య+శాసనమ్=దేవర వారి ఆదేశాన్ని, జీవితుకామః+కః+అన్యః=ప్రాణం మీద ఆశ వున్నవాడు ఎవరు (ఇతరుడెవడు), అతివర్తేత=అతిక్రమించగలడు (జవదాటగలడు)?

రాజా:

శోణోత్తరే, ఉపవేష్టు మిచ్ఛామి

అర్థం:

శోణోత్తరా, ఉపవేష్టుం+ఇచ్ఛామి=కూర్చోవాలనుకుంటున్నాను.

ప్రతీహారి:

దేవ, ఏదం సింహాసణమ్. (దేవ, ఏతత్ సింహాసనమ్).

అర్థం:

దేవ=దేవరా, ఏతత్=ఇదిగో, సింహాసనమ్=(తమరు కూర్చోనదగిన యోగ్యమైన) సింహాసనం.

రాజా:

(నాట్యే నోపవిశ్య) ఆర్య వైహీనరే, ఆర్య చాణక్యం ద్రష్టు మిచ్ఛామి।    

అర్థం:

(నాట్యేన+ఉపవిశ్య=నాటకీయంగా కూర్చుని), ఆర్య+వైహీనరే=వైహీనరయ్యా, ఆర్య+చాణక్యం=చాణక్య అయ్యవారిని, ద్రష్టుం+ఇచ్ఛామి=చూడాలనుకుంటున్నాను.

కఞ్చుకీ:  

యదాజ్ఞాపయతి దేవ. (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

యత్+దేవః+ఆజ్ఞాపయతి=దేవర ఆజ్ఞాపించినట్టే (చేస్తాను), (ఇతి+నిష్క్రాన్తః=అని వెళ్ళాడు).

(తతః ప్రవిశతి ఆసనస్థః స్వభవనగతః కోపానువిద్దాం చిన్తాం నాటయం శ్చాణక్య)

చాణక్యః:

కథం! స్పర్ధతే మయా సహ దురాత్మా రాక్షసః!

అర్థం:

(తతః=పిమ్మట, స్వభవనగతః+ఆసనస్థః=తన ఇంటిలో పీఠం పై కూర్చొని, కోపానువిద్దాం+చిన్తాం+నాటయన్=కోపం నిండిన ఆలోచనను నాటకీయంగా ప్రకటిస్తూ, చాణక్య=చాణక్యుడు, ప్రవిశతి=ప్రవేశిస్తున్నాడు)

కథం=ఏమిటీ!, దురాత్మా+రాక్షసః=దుర్మార్గుడైన రాక్షసమంత్రి, మయా+సహ+స్పర్ధతే=నాతో వైరం పూనుతాడా?

శ్లోకం:

కృతాగాః కౌటిల్యో భుజగ ఇవ

నిర్యాయ నగరా

ద్యథా నన్దాన్ హత్వా నృపతి మకరో

న్మౌర్యవృషలమ్,

త థాహం మౌర్యేన్దోః శ్రియ మపహరా

మీతికృతధీః

ప్రకర్షం మద్బుద్ధే రతిశయితు మేష వ్యవసితః. (11)

అర్థం:

కౌటిల్యః=చాణక్యుడు, కృత+అగాః=(తన పట్ల) అపరాధం జరిగిన వేళ (చేయబడిన అపరాధం కలవాడై), భుజగ+ఇవ=(పగపట్టిన) పాము మాదిరి, నగరాత్+నిర్యాయ=పట్టణం విడిచిపోయి, యథా=ఏ విధంగా అయితే, నన్దాన్+హత్వా=నందవంశీయుల్ని చంపి, మౌర్యవృషలమ్=ముర సంతానమైన శూద్రుణ్ని, నృపతిమ్+అకరోత్=రాజును చేశాడో, తథా=అదే విధంగా (నగరం దాటి పోయి), అహం=నేను (రాక్షసుడు), మౌర్య+ఇన్దోః+శ్రియమ్=మౌర్య చండ్రుడి వైభవాన్ని, అపహరామి+ఇతి=ఒడిసిపట్టుకుంటాను – అని, కృత+ధీః=నిర్ణయించుకున్నవాడై, ఏషః=ఇతడు (రాక్షసుడు), ప్రకర్షం+మత్+బుద్ధేః+అతిశయితుమ్=విశిష్టమైన బుద్ధి విశేషాన్ని దాటి పోవాలని, వ్యవసితః=నిశ్చయించుకొన్నాడు.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

చాణక్యః:

(ఆకాశే లక్ష్యం బద్ధ్వా) రాక్షస రాక్షస, విరమ్యతా మస్మా ద్దుర్వ్యసనాత్.

శ్లోకం:

ఉత్సిక్తః కుసచివదృష్ట రాజ్యభారో

నన్దోఽసౌన భవతి; చన్ద్రగుప్త ఏషః,

చాణక్యస్త్వ మపి నైవ. కేవలం తే

సాధర్మ్యం మదనుకృతేః ప్రధాన వైరమ్. (12)

అర్థం:

(ఆకాశే+లక్ష్యం+బద్ధ్వా=ఆకాశంలో దృష్టి నిలిపి), రాక్షస+రాక్షస=రాక్షస స్వభావం గల ఓ రాక్షసమంత్రీ!, అస్మత్+దుర్+వ్యసనాత్=ఈ చెడ్డ తలంపు నుంచి, విరమ్యతామ్=విరమించుకొందువుగాక!

అసౌ=వీడు, ఉత్సిక్తః=పొగరునిండి, కు+సచివ+దృష్ట+రాజ్యభారః=పనికిమాలిన మంత్రులు వ్యవహర్తలుగా రాజ్య వ్యవహారాలు నడుపుతుండే, నన్దః+న+భవతి=నందుడు కాడు; ఏషః=వీడు, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు (సుమా!), త్వమ్+అపి=నువ్వు కూడా, చాణక్యః+న+ఏవ=చాణక్యుడవు కానే కాదు. మత్+అనుకృతేః=నన్ను అనుకరించడంలో (నాతో నీకున్న పోలిక) తే+సాధర్మ్యం=నీ శక్తి (ఏ మాత్రమంటే), కేవలం+ప్రధాన+వైరమ్=నాకు నందునితో శతృత్వం – (ప్రధాన వ్యక్తుల వైరం) అంత మాత్రమే!

వృత్తం:

ప్రహర్షిణి. మ – న – జ – ర – గ గణాలు.

చాణక్యః:

(విచిన్త్య) అథవా నాతిమాత్ర మత్ర వస్తుని మయా మనః ఖేదయి తవ్యమ్. కుతః..

అర్థం:

(విచిన్త్య=ఆలోచించి), అథ+వా=అలాగ కాదు, అత్రవస్తుని=ఈ విషయంలో, మనః=మనసు, అతిమాత్రం+న+ఖేదయితవ్యమ్=మిక్కిలిగా నలత పెట్టకూడదు. కుతః=ఎందుకంటే…

శ్లోకం:

మద్భృత్యైః కిల సోఽపిపర్వతసుతో

వ్యాప్తం ప్రవిష్టాన్తరై

రుద్యుక్తాః స్వనియోగసాధనవిధౌ

సిద్ధార్థ కాద్యాః స్పశాః,

కృత్వా సంప్రతి కైతవేన కలహం

మౌర్యేన్దునా రాక్షసమ్

భేత్స్యామి స్వమతేన భేదకుశల

స్త్వేష ప్రతీపంద్విషః. (13)

అర్థం:

సః+పర్వతసుతః+అపి=పర్వతరాజు పుత్రుడైన మలయకేతుడు సైతం, ప్రవిష్ట+అంతరైః+మత్+భుత్యైః=అంతరంగికులలోనికి చొరబడిన నా సేవకుల చేత, వ్యాప్తః+కిల=ఆక్రమింపబడ్డాడు కదా (వారు చుట్టుముట్టారు కదా). (మత్) స్పశాః= నా వేగులవాళ్ళు, సిద్ధార్థక+ఆద్యాః=సిద్ధార్థకుడు మొదలైనవాళ్ళు, స్వ+నియోగ+సాదహన+విధౌః=తమకు అప్పగింపబడిన పనులను నెరవేర్చే పనిలో, ఉద్యుక్తాః=సిద్ధంగా ఉన్నారు. మౌర్య+ఇన్దునా=మౌర్య చంద్రగుప్తునితో, సంప్రతి=ఇప్పుడు, కైతవేన+కలహం+కృత్వా=కపట వైరం పూని (ఉత్తుత్తి దెబ్బలాట పెట్టుకుని), ఏష+భేదకుశలః=విభేదాలు కల్పించడంలో చతురుడైన వీడు (అనగా – నేను – చాణక్యుణ్ణి), ప్రతీపం+రాక్షసం=వ్యతిరేకంగా వున్న రాక్షసమంత్రిని, ద్విషః=(మా) శత్రువు నుంచి (మలయకేతుడి నుంచి), భేత్స్యామి=విడదీస్తాను (వారి మైత్రిని చీల్చి వేస్తాను).

వ్యాఖ్య:

“సంప్రతి కైతవేన మౌర్యేన్దునా కలహం కృత్వా…” అంటూ, తన పథకంలో భాగంగా చంద్రగుప్తుడితో కలహం ఉత్తుత్తిదే అని చాణక్యుడు కూడా తలచుకుంటున్నాడు. ఇంతకు ముందు రంగంలోకి ప్రవేశిస్తునే చంద్రగుప్తుడు – “కృతక కలహం కృత్వాస్వతన్త్రేణ కిఞ్చిత్కాలాన్తరం వ్యవహర్తవ్య మిత్యార్యాదేశః” అని – తమ కలహం కపటమైనదని స్పష్టం చేశాడు. ఈ చర్యల వల్ల నాటక ఉత్కంఠ పరిపోషణ దృష్ట్యా పాత్రలకే (అన్య పాత్రలకే) ఉత్కంఠ తప్ప నాటక పాఠక, ప్రేక్షకులకు ఉండదు.

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

(సశేషం)

Exit mobile version