[శ్రీమతి రాధకృష్ణ కర్రి రచించిన ‘ముడుచుకున్న మనసు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మాట వినబడడం లేదు
పెదాలేం పెగల్చడం లేదు
ఫెవిక్విక్ నోటిలో లాలజలమైంది
గొంతు ద్వారాలకు తాళాలు వేయబడ్డాయి
చేతులు స్వార్థపు తాళ్లతో కట్టేయబడ్డాయి
అడుగులు ముందుకు పడకుండా
గడపే కాపలాదారు
ఆలోచనలు కంటి రెటీనా వెనుక భద్రం
మార్పుల రాపిడి లేక
ముడుచుకుపోయిన మనసు
మోదుగ పూల రంగు అజ్ఞాతంలో
తెల్ల రంగు పరదా దేశం మీద
మరో రంగు అంతర్లీనంగా చల్లబడుతోంది
దక్షిణాయన సూరీడు
మాయపొరల మంచు
ముంగిట్లో దోబూచి పెట్టిపోతున్నాడు
అధికారం – అహంకారాల మధ్య చిక్కుకున్న
నువ్వు.. నేను
ఆకలి – ఆవేదనల మధ్య చేతి సంచులు
ఊరి పొలిమేరలో
నీటి చారలను తుడుస్తూ ఒక్కొక్కటిగా
ఎప్పటికి వస్తుందో ఉత్తరాయణం
నిప్పులు కక్కే రథం ఎక్కి
విచ్చుకునే మనసుల్లోకి
కంటి రెప్పల కంచెలు దాటి.
