చాలా కాలం కిందట విజయపురి అనే రాజ్యం వుండేది. ఆ రాజ్యానికి పడమరగా శ్రీపర్వతాలు అని పిలవబడే కొండలున్నాయి. విజయపురి రాజు ఒక కొండపై విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని విజయపురి విద్యాపీఠమని పిలిచేవారు. దేశంలోని నలుమూలల నుంచి గొప్పగొప్ప పండితులను పిలిపించి రాజుగారు అక్కడ విద్యాబోధన చేయించేవాడు. ఆ విద్యాపీఠపు గోప్పతనాన్ని గురించి ఇరుగుపొరుగు దేశాలవారు కూడా చెప్పుకోసాగారు. తమ పిల్లల్ని అక్కడ చేర్చి చదువు చెప్పించాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశ పడేవారు. రాజగారు విద్యాపీఠానికి కావలసిన సమస్త సౌకర్యాలనూ కలగజేశాడు. రాజుగారి శ్రమకు తగ్గట్లుగా విద్యాపీఠంలోని గురువులు యుద్ధవిద్యాలు, సంగీతం, సాహిత్యం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇలాంటి అన్ని విషయాలలోను విద్యను నేర్పేవారు. ఖగోళశాస్త్రం విషయం చెప్పేటప్పుడు వరాహమిహిరుడు, ఆర్యభట్టు మొదలగు ఖగోళశాస్త్రవేత్తల జీవితాలు, వారు చేసిన పరిశోధనలను గురించి చెప్పేవారు. అలాగే గణితశాస్త్రం నేర్పేటప్పుడు భాస్కరాచార్యుని లాంటి గణితశాస్త్రవేత్తల జీవితాలను, వారు కనుగొన్న గణిత సూత్రాలనూ నేర్పేవారు. అంతేకాక అక్కడి ఆచార్యులు తాము స్వయంగా నీతివంతమైన జీవితాన్ని గడుపుతూ పిల్లలకు ఆదర్శప్రాయంగా వుండేవారు. అప్పుడు చదువు నేర్చుకునే శిష్యులలో మాధవుడు కూడా ఒకడు. అతనికి గురువులంటే ఎంతో భక్తి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ తన చదువును పూర్తి చేశాడు. కానీ అతనికి ఆ విద్యాపీఠం వదిలి వెళ్లాలనిపించలేదు. ఆ మాటే తను బాగా ఆరాధించే గురువుగారితో చెప్పాడు.
“మాధవా! గురువుల యందు, విద్యాపీఠం పట్ల నీకున్న భక్తి శ్రద్ధలకు సంతోషించాల్సింది. కాని నీకు నీ తల్లిదండ్రులు, నువ్వు పుట్టిన ఊరు నీకు ఎంతో ముఖ్యం నీకు నేనొక శ్లోకం జ్ఞాపకం చేస్తాను” అంటూ
“అపి స్వర్గమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి”
ఈ మాటల్ని లక్ష్మణుడు ‘అందమైన లంకలోనే ఉండిపోదామన్నా’ అని అన్నప్పుడు ‘మన తల్లీ, మన జన్మస్థలం స్వర్గంకంటే ఎక్కువ నాయనా’ అని శ్రీరాముడు తన తమ్ముడికి తెలియజేస్తాడు. కాబట్టి ఎవరికైనా పుట్టిన స్థలం ఎంతో పవిత్రమైనది. నీవు కూడా మీ ఊరు వెళ్లు. తల్లిదండ్రులకు సేవ చెయ్యి. నువ్వు నేర్చుకున్న విద్యతో ఈ రాజ్యానికీ, ప్రజలకూ మేలు చెయ్యి” అని చెప్పి గురువుగారు అతణ్ణి ఊరికి పంపించారు.
మాధవుడు అందరి దగ్గరా శెలవు తీసుకున్నాడు. కాలి నడకనే ప్రయాణమయ్యాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత రెండు గుఱ్ఱాలూ, వాటి మీద స్వారీ చేసే ఇద్దరు యువకులూ కనపడ్డారు. వారిద్దరూ స్నేహితులు. చాలా దూరం ప్రయాణం చేసినందువలన వారు వారి గుఱ్ఱాలూ బాగా అలిసిపోయాయి. ఒక పెద్ద చెట్టునీడ చూసి గుఱ్ఱాలను ఆపి దిగారు. ఆ చెట్టు దగ్గరకే మాధవుడు కూడా వచ్చాడు. ఒకరి విషయాలొకరు తెలుసుకున్నారు. వారిరువురూ పొరుగు రాజ్యమైన శ్రీరంగపుర రాజకుమారుడూ, మంత్రి కుమారుడూ అని తెలిసింది. విజయపుర రాజుగారి కొక కుమార్తె. కొడుకులు లేరు. బాగా సమర్థుడైన యువకుడిని చూసి తన కుమార్తెని ఇచ్చి పెళ్ళి చేసి, విజయపురి రాజ్యాన్ని అప్పగించాలని రాజుగారు ఆలోచిస్తున్నారు. కొన్నిపోటీ పెట్టి ఆ పోటీలలో గెలుపొందిన యువకుడికే తన కూతుర్ని, రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిచాడు. ఆ పోటీలలో పాల్గొనటానికే శ్రీరంగపుర రాకుమారుడు, మంత్రి కుమారుడు వస్తున్నారు.
మాధవుడు తన విషయం కూడా చెప్పాడు. మా గురువుగారి మాట ప్రకారం మా ఊరు వెళ్లి తల్లిదండ్రుల సేవ చేస్తూ, నా కొచ్చిన చదువునూ పది మందికీ నేర్పుతాన్నాడు.
మాధవా మేము మీ ఊరు వైపుకే వస్తున్నాం. ఇంక నువ్వు నడవటం మానేయి. నా గుఱ్ఱమెక్కి కూర్చో అన్నాడు. మాధవుడు అలాగే చేశాడు. దారిలో కొంత సేపు మాట్లాడుకునే సరికీ మంత్రి కొడుక్కు, మాధవునికీ స్నేహం కలిసింది. మాధవుని ఊరు కంటే ముందుగా విజయపురి రాజ్య రాజధాని పట్టణమే వచ్చింది.
“మాధవా! ఇంకొ రెండు రోజులు నువ్వు కూడా ఇక్కడే వుండు. జరిగే పోటీలన్నీ చూడు. ఆ తర్వాత పోటీలలో గెలుపొందిన యువకుడితో రాజకుమార్తె వివాహమూ చూడవచ్చు” అని మంత్రి కుమారుడన్నాడు. మాధవుడు అలాగేనని వాళ్లతో పాటు ఉండిపోయాడు.
విజయపురి రాజ్య పోటీలలో పాల్గొనటానికి వచ్చిన యువకులందరికీ బస ఏర్పాటు చేశారు. మంత్రి కుమారుడూ, మాధవుడూ ఒకే చోట వున్నారు. రాజకుమారుడు విడిగా వున్నాడు. ఇంకా అనేక మంది యువ వీరులు వచ్చారు. మరునాడు బాణవిద్య, ఖడ్గవిద్య, గుఱ్ఱపుస్వారీ, వీటన్నించిలోనూ పోటీలు జరిగాయి. అందరి కన్నా శ్రీరంగపు రాజకుమారుడూ, మంత్రికుమారుడూ అన్నింటా ముందు నిలిచారు. చివరకు ద్వందయుద్ధ పోటీ కూడా పెట్టారు. ఇద్దరూ సమానంగా నిలిచారు. రాజుగారికున్నది ఒకర్తే కూమార్తె. ఏం చెయ్యాలా అని ఆలోచించారు. మరుసటి రోజు రాజకుమార్తె సమక్షంలో మరో చివరి పరీక్ష వుంటందని చెప్పారు.
శ్రీరంగపుర రాజకుమారుడికీ, మంత్రి కుమారునికీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. రేపటి పోటీలో ఎవరు నెగ్గితే వారిదే రాజకుమార్తె, రాజ్యమూనూ. ఇద్దరిలో ఎవరు నెగ్గినా సరే. విజయపురినీ, శ్రీరంగపురాన్ని కలిపి పరిపాలించాలి. ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకోవాలి. ఇదే వారిద్దరి కోరిక.
మర్నాడు రాజుగారు సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు రాజకుమారుడూ, మంత్రి కుమారునితో పాటు మాధవుడు కూడా వెళ్లేడు. రాజు సింహాసనం మీద కూర్చునివున్నాడు. మంత్రి సేనానీ, అందరూ తరువాత స్థానల్లో కూర్చునివున్నారు. రాజుగారి సింహాసనం పక్కన అటూ ఇటూ ఆసనాలు ఏర్పాటు చేయబడ్డవి. మంత్రి లేచి నిలబడ్డాడు. మంత్రి లేచి నిలబడి ఇలా అన్నాడు “వీర యువకులారా ఇప్పుడు రాజ సభలోకి ఇద్దరు యువతులు వస్తారు. వారిలో రాజకుమార్తె ఎవరు కనిపెట్టాలి. అలాగే ఇద్దరిలో ఎవరు అందమైన వారో తేల్చి చెప్పాలి. వీటికి సరైన సమాధానాలు చెప్పిన వారికే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని ఒప్పగిస్తాం” అన్నాడు.
మంత్రి చెప్పిన కొంచెం సేపటికే ఇద్దరు యువతులు ఒకేసారి సభలోకి వచ్చారు. తమ మేలి ముసుగులు తొలగించారు. ఇద్దరిదీ కళ్లు చెదిరే అందం. ఒకే రకం బట్టలు కట్టుకున్నారు. ఒకే రకం నగలు పెట్టుకుని వున్నారు. ముఖంలోని పోలికలు మాత్రం వేర్వేరుగా వున్నాయి. ఒకే ఎత్తులో, ఒకే లావులో వున్నారు. రాజకుమారుణ్ణి ముందుగా జవాబు చెప్పమన్నట్లుగా మంత్రి కుమారుడు అతని వంక చూశాడు. రాజకుమార్తె ఎవరో ఎలా తెలుసుకోవాలా? అని ఒక్క క్షణం రాజకుమారుడు ఆలోచిస్తూ అప్రయత్నంగా మాధవుని వంక చూశాడు.
మాధవుడు తన కుడి చెయ్యెత్తి చూపించాడు. రాజకుమారుడి కేదో అర్థమయింది. “రాజుగారి కుడి పక్కన కూర్చున్నామె రాజకుమార్తె” అని చెప్పాడు. రాజు ముఖంలో గానీ, మంత్రి ముఖంలో గాని ఏ భావమూ కనుపించలేదు. ఈ సారి రాజకుమారుడు మంత్రి కుమారుని వంక చూసి తరువాత జవాబు నువ్వు చెప్పు అన్నట్లుగా చూశాడు.
మంత్రి కుమారుడు లేచి నిలబడ్డాడు. ‘మొదటి ప్రశ్నకు జవాబు నా స్నేహితుడు చెప్పాశాడు. మిగిలిన రెండవ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను’ అన్నాడు.
“జవాబులు చెప్పేదానికి కూడా ఇద్దరూ సిద్ధపడుతున్నారన్న మాట. మంచిది” అంటూ మంత్రి ఆ యువతులనిద్దరినీ లోపలికి పంపేశాడు.
వాళ్లిద్దరూ లేచి నడుచుకుంటూ తెరచాటుకు వెళ్లిపోయారు.
మంత్రి కొడుకు వాళ్లు వెళ్లేదాకా ఆగి జవాబులు చెప్పటం మొదలు పెట్టాడు. “రాజుగారి కుడి చేతి ప్రక్కన కూర్చున్నామే రాజసభలోకి వచ్చేటప్పుడు చాలా అందంగా వున్నది. అలాగే సభలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎడమ చేతి వైపు కూర్చున్నామె చాలా అందంగా వున్నది. కాబట్టి ఇరువురూ అందగత్తెలే. సందేహం లేదు” అని చెప్పి కూర్చున్నాడు.
మాధవుడు మెచ్చుకోలుగా చూశాడు.
“ఇప్పటికి సభ చాలిస్తున్నాం. సాయంకాలం సభలో ఏ విషయమూ తెలియిజేస్తామని” సభను అప్పటికి ముగించారు.
వీళ్లు ముగ్గరూ తమకిచ్చిన బసలలోకి వెళ్లారు. రాజకుమారుడు ముందుగా మాట్లాడాడు. “మాధవా! ధన్యవాదాలు. నువ్వు రాజకుమార్తెను గుర్తించావు. ముఖం తుడుచుకునే నెపంతో కుడి చేతిని పైకి లేపి నాకు విషయం అర్థమయ్యేటట్లు చేశావు” అన్నాడు.
“రాజకుమారా! రాజకుంటుంబీకులు ఎప్పుడూ గౌరవాన్ని కోరుకుంటారు. అందుకనే ఆమె కుడి చేతివైపున్న ఆసనం మీద కూర్చున్నది. ఆమె కూర్చున్న తరువాతనే రెండవ ఆమె ఎడమ చేతి వైపున్న ఆసనం మీద కూర్చున్నది. అది నేను గ్రహించి నీకు తెలియజేశాను ” అని మాధవుడు చెప్పాడు.
“ఆ విషయం నాకు అర్థమయింది. రాజకుమార్తెతో పాటు తోడుగా వచ్చినామె కూడా ఉన్నత కుటుంబీకురాలయ్యే వుంటదన్న వుద్దేశ్యం కలిగింది. ఆమెనూ తక్కువ చేయకూడదనుకుని ఆమె తిరిగి వెళ్లేటప్పుడు అందంగా వున్నదని చెప్పాను. సాయంకాలం రాజుగారు, రాజకుమార్తె ఏం చెప్తారో విందాం” అన్నాడు మంత్రి కుమారుడు.
సాయంకాలం రాజుగారు సభ ఏర్పాటు చేశారు. “రాజకుమారా! నువ్వు ఏ ఆధారంతో రాజకుమార్తెను గుర్తించావో చెప్పు” అనడిగాడు రాజు.
“రాజకుమార్తె కాబట్టి వచ్చి మీ కుడివైపు వున్న ఆసనం మీద ముందుగా తాను కూర్చున్నది. రాజకుమార్తెలు ఎప్పుడూ తమ గౌరవాన్ని మర్చిపోరు గదా రాజా” అని సమాధానం చెప్పాడు.
“నువ్వు నిజమే చెప్పావు. మంత్రి కుమారా! నువ్వే ఆధారంతో అందాన్ని గురించి చెప్పావన్నాడు” రాజు.
“నిజానికి ఇద్దరూ చాలా సౌందర్యవతులు. ఉన్నత కుంటుబీకులు. ఎందుకంటే వారికా నగలు బట్టలు, సహజంగా అతికిపోయాయి. ఎవర్నీ తక్కువ చేసి చూడాలనిపించలేదు. అందుకనే ఒకరు వచ్చేటప్పడు, మరొకరు వెళ్లేటప్పుడు అందంగా వున్నరని చెప్పాను” అన్నాడు మంత్రి కుమారుడు.
“నీ సమాధానం బాగా తెలివిగా వున్నది. మేం ఏం ఆలోచించామో మా నిర్ణయమేంటో మా మహామంత్రిగారు తెలియజేస్తారు” అన్నాడు రాజు.
మంత్రి లేచి నిలబడ్డాడు “మీతో పాటు వచ్చిన యువకుడు తన కుడిచేతి నెత్తి చూపటం, నేను గ్రహించాను. మీరు ముగ్గురూ, ముగ్గురే. ఒకరి పట్ల ఒకరికి అసూయ కాని, ద్వేషం కాని లేవు. ముగ్గరూ కలిసికట్టుగా వుండి సమాధానాలు చెప్పారు. రాజ్యం రాజకుమార్తె నాకే సొంతం కావాలని రాజకుమారుడు కాని, మంత్రి కుమారుడు గాని భావించలేదు. ఇద్దరిలో ఎవరికి దక్కినా ఫర్వాలేదు అనుకున్నారు. అయితే బయట వారికి దక్కనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. మీ ఉద్దేశం మాకర్థమయింది. మీ రాజ్యంతో పాటు, ఈ విజయపురి రాజ్యాన్ని కూడా కలిపి పరిపాలించాలని ఆలోచించారు. ఆ విషయం మకందరికీ బాగా నచ్చింది. రాజకుమారా! ద్వదంయుద్ధంతో సహా అన్నింటా నీ నేర్పరితనం చూపావు. అలాగే మాధవుని ఒక్క సైగతో విషయాన్ని వెంటనే గ్రహించావు” అంటూ రాజగారి వంక చూశాడు.
అప్పుడు రాజుగారు మాట్లాడటం ప్రారంభించాడు. “రాజకుమారా! నువ్వు మాకు మా కుమార్తెకు కూడా బాగా నచ్చావు. కాబట్టి రాజకుమార్తెతో నీ వివాహం జరుగుతుంది. అలాగే మంత్రి కుమారుని ఆలోచనా మాకు బాగా నచ్చింది. అతనికి మా మంత్రిగారి కుమార్తె నిచ్చి పెండ్లి జరిపిస్తాం. మీరిరువురూ కలిసి రాజూ, మంత్రులులాగా వుండి అటు శ్రీరంగపురాన్ని, ఇటు విజయపురినీ కంటికి రెప్పలా కాపాడుకోండి. మీ తల్లిదండ్రులకీ విషయం తెలియజేద్దాం. ఆ తర్వాత మీతో వచ్చిన మాధవుని సంగతి ఆలోచిద్దాం. మంచి తెలివితేటలు ఉన్నవాడిలా కనబడుతున్నాడు. అతని కోరిక ఏదైనా సరే తీరుస్తాను. చెప్పు మాధవా!” అన్నాడు.
మాధవుడు లేచాడు. “ప్రభువులకు నమస్కారం. నేను కూడా ఈ విజయపురి రాజ్యపౌరుణ్ణే. మీ విద్యావీఠంలోనే విద్య పూర్తి చేసుకుని వచ్చాను. వీరు దయతో ఇక్కడికి దగ్గరలో వున్న మా ఊరి సమీపంలో కూడా ఒక విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తే దాని బాధ్యతలు నేను చూసుకుంటూ వుంటాను. తల్లిదండ్రులనూ, విద్యాపీఠాన్ని రెండు కళ్లలా భావిస్తాను” అని అడిగాడు.
రాజుగారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత రెండు రాజ్యాలూ కలిసిపోయాయి. మాధవుని విద్యాపీఠం కూడా బాగా అభివృద్ధి చెందింది.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి.
వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.