[నేపాల్ లోని ముక్తినాథ్ ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలో, తోరోంగ్ లా పర్వత మార్గం వద్ద ఉండే ముక్తినాథ్ ఆలయం మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా హిందువులు విశ్వసిస్తే, బౌద్ధులు ముక్తినాథున్ని అవలోకితేశ్వర అవతారంగా భావిస్తారు. వైష్టవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో, ఇది 106 వదని అంటారు. (107 వది పాల సముద్రమని, 108 వది పరమ పదమని విశ్వాసం) అలాగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో ఇదొకటని (మిగిలినవి శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల, నైమిశారణ్యం, తోతాద్రి, పుష్కర్, బద్రీనాథ్), విష్ణుభగవానుని ఆలయాల్లో అతి పురాతనమైనదని నమ్మకం.
ముక్తినాథ్ ప్రవేశద్వారం
ఇది సముద్రమట్టానికి 3800m ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రవహించే కాలా గండకి (ఇక్కడ నదిలో నీళ్లు నల్లగా కనిపిస్తాయి) నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. గండకి అనే వేశ్యకు, ఆమె కడుపున పుడతానని విష్ణువిచ్చిన వరం వలన, మరుజన్మలో ఆమె గండకీనదిగా మారితే, జలంధరుడనే అసురుని భార్య బృంద విష్ణుమూర్తికిచ్చిన శాపం వలన శిలారూపంగా మారి, గండకీనదిలో సాలగ్రామాలుగా మారాడని పురాణ కథనం.
ముక్తినాథ్ చేరుకోవాలంటే నేపాల్ లోని పోఖరా నుండి రోడ్డుమార్గం ద్వారా గాని, వాయుమార్గం ద్వారా గాని జెంషుం చేరుకుని, అక్కడినుండి జీపుల్లో ముక్తినాథ్‌కు చేరుకోవాలి. నేను రెండుసార్లు, రెండు మార్గాల ద్వారా వెళ్లాను.
జెంషుం విమానాశ్రయంలో దిగగానే అన్నపూర్ణ రేంజ్ హిమాలయాలు దర్శనమిస్తాయి. చుట్టూ పచ్చదనం. మంచుతో కప్పబడిన పర్వతాలు. నీలి ఆకాశం. తెల్లని మబ్బులు. వర్ణ చిత్రంలా అనిపిస్తుంది. విమానాశ్రయానికి దగ్గరలో పేయింగ్ గెస్ట్ ఎకామిడేషన్లు, హోటళ్లు చాలా ఉంటాయి. నేను వెళ్ళిన మొదటిసారి సరైన రోడ్డు లేదు. త్రోవంతా రాళ్ళు, రప్పలే. కొంతదూరం గండకీ నది ఒడ్డు నుండి, మరికొంత దూరం గండకీ నది మధ్యలో నుండి, ఒక గంటలో ముక్తినాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో జీపులను నిలిపే స్థలానికి చేరుకున్నాం. రెండోసారి వెళ్ళినప్పుడు రోడ్డు సదుపాయం బాగుంది.
అక్కడనుండి రానిపౌవా అనే ఊరు దాటి వెళ్తాం. ఇక్కడ కూడా హోటళ్ళు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లు ఉన్నాయి. రుద్రాక్షలు, సాలగ్రామాలు, ఇంకా రంగురంగుల పూసలూ ఇళ్ళ ముందరపెట్టి అమ్ముతున్నారు. బౌద్ధుల మొనాస్టరీ ఉందిక్కడ. అలా 3 కిమీ నడిచి, తర్వాత సుమారు 150 మెట్లెక్కితే, ముక్తినాథ్ ప్రవేశద్వారం కనిపిస్తుంది.
అక్కడి నుండి లోపలికి మరలా నడుచుకుంటూ వెళ్లాలి. ఎడమవైపు వెళ్తే ఆలయం, కుడివైపు కొంత దూరం వెళ్తే బుద్ధుని విగ్రహం, ఇంకా ముందుకు వెళ్తే జ్వాలామాయి ఆలయం వస్తాయి. ఇక్కడ జ్వాలల రూపంలో (జ్వాలాముఖిలో కనిపించినట్లుగా) దైవాన్ని సందర్శిస్తాం.
మెట్లు తక్కువ ఎత్తులో స్లాంటుగా ఉన్నాయి. నడవలేని వాళ్లకు పోనీలు, డోలీలు దొరుకుతాయి.
ముక్తినాథ్ ఆలయం మూడు అంతస్తుల పగోడా. ఇక్కడ పంచ భూతాలు (నీరు, వాయువు, అగ్ని, భూమి, ఆకాశం) కొలువై ఉన్నాయని నమ్మకం. విష్ణువిక్కడ ముక్తినాథుని రూపంలో శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉంటాడు. గుడి చిన్నదే. స్వామి విగ్రహం బంగారంతో చేసినది. కూర్చున్న భంగిమలో ఉంటుంది. గర్భగుడి లోపలకు ఎవరినీ రానివ్వరు. ద్వారం దగ్గర నిలబడి స్వామిని దర్శించుకోవాలి. ఎంతసేపు నిలబడినా వెళ్ళిపొమ్మని ఎవరూ అనరు.
ఇక్కడ నిత్యమూ హోమం చేస్తారు. దీపారాధన చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్లే ముందే శివకోవెల ఉంటుంది.
పుణ్య కుండం, పాప కుండం
ఆలయానికి ముందు రెండు నీటికుండాలు ఉంటాయి. ఒకటి పుణ్య కుండం, ఒకటి పాప కుండమని చెప్పారు. పాపకుండంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, తర్వాత పుణ్యకుండంలో స్నానం చెయ్యాలని చెప్పారు.
ఆలయం వెనుకున్న 108 జలధారలు, 108 క్షేత్రాలను సూచిస్తాయని, వాటితో స్నానం చేస్తే 108 క్షేత్రాలలో స్నానం చేసిన ఫలితమని చెప్పారు. అతి శీతలంగా ఉంటాయీ జలాలు. మీద నీళ్లు పడగానే ఒళ్ళు ఝళ్ళుమంటుంది. చేసిన పాపాలు చేసేసి, ఇలా చేస్తే పుణ్యం వస్తుందన్న భ్రమ నాకైతే లేదు గాని, నాకన్నా వయసులో పెద్దవాళ్ళిద్దరు స్నానం చెయ్యడంతో, నాకూ ధైర్యమొచ్చి చేసాను. ధారలలా పడుతూనే ఉంటాయి. స్నానం చేసాక, బట్టలు మార్చుకునే ఏర్పాటుంది. స్నానం చెయ్యలేని వాళ్ళు, తలమీద నీళ్ళు జల్లుకుంటారు.
108 జలధారలు
ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద, పెద్ద రుద్రాక్ష వృక్షాలు, వెనుక మంచుతో కప్పబడిన పర్వతాలు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక పర్వతం అంచుపై, విష్ణుమూర్తి నిల్చున్న భంగిమలో ఒక రూపం కనిపిస్తుంది. ఇక్కడ సూర్యాస్తమయం రాత్రి ఏడు ఏడున్నర మధ్యలో అవుతుంది. మొబైల్ ఫోన్లను ఎలౌ చెయ్యరు.
సముద్రమట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి ఆక్సిజన్ అందక ఇబ్బంది కలగవచ్చు. ఎక్యూట్ మౌంటైన్ సిక్ నెస్ వచ్చి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, శ్వాస అందకపోవడం జరగవచ్చు. పచ్చకర్పూరం పిలిస్తే శ్వాస కాస్త ఆడుతుంది. లేకపోతే చిన్న ఆక్సిజన్ సిలిండర్లు కూడా అక్కడ దొరుకుతాయి. నడిచి వెళ్లేవాళ్ళు నెమ్మదిగా నడుస్తూ, మధ్యలో ఆగి, ఆగి వెళ్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాదు. అలాగే ముందు నుండీ ప్రాణాయామం అభ్యసిస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో డైమాక్స్ 125 మిగ్రా టాబ్లెట్ ఉదయమొకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి.
పోఖరా నుండి జెంషమ్ 150 కిమీ. బస్సులో గాని, ప్రైవేట్ వెహికిల్లో గాని వెళ్ళవచ్చు. రోడ్డు కొంత దూరం బాగుంటే, కొంతదూరం రోడ్డు సరిగ్గా ఉండదు. కొండల అంచున ఊగుతూ బస్సు వెళ్తుంటే, క్రిందకు చూస్తే చాలా భయమేస్తుంది. కాని డ్రైవర్లు చాలా చాకచక్యంగా వాహనాలను నడుపుతారు. రోడ్డు మార్గంలో కాలాగండకీ నది త్రోవ పొడవునా కనిపిస్తుంది. ప్రయాణమంతా ఎత్తైన పర్వతాలు (కొన్ని పచ్చని చెట్లతో శోభిస్తే, ఖనిజాలతో కొన్ని మెరిసిపోతుంటే, మరికొన్ని పూర్తిగా ఇసుకనే కప్పుకున్నట్లు అనిపించాయి), లోయలు, జలపాతాలతో ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో, అంత భయాన్ని కూడా కలిగిస్తుంది.
మేం వెళ్ళినప్పుడు, జలపాతాలనే ఎగురవేసే కొండగాలిని, భయంతో మమ్మల్ని వణికించి, ఇసుక కొండలపైన ఇసుకను ఎగురవేసే గాలి దుమారాన్ని కూడా చూసాం. ఒకవైపు తలెత్తినా కనిపించినంత ఎత్తులో కొండలు, ఇంకోవైపు చూస్తే కళ్ళు తిరిగేలా ఉన్న లోయలు, మధ్య సన్నని గీతలా కొండ అంచున రహదారి. కొండ చరియలు విరిగిపడి, ప్రయాణానికి ఏ నిమిషంలో నైనా ఆటంకం కలగవచ్చు. ప్రయాణం చేసే ముందు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. బై రోడ్డు వచ్చినవాళ్ళు తప్పనిసరిగా రాత్రి అక్కడుండాలి. చాలా చలిగా ఉంటుంది. రూములో హీటర్, గీజర్ తప్పనిసరిగా ఉండాలి.
జెంషమ్ ఎయిర్‌పోర్ట్‌లో రచయిత్రి
పోఖరా నుండి జెంషమ్‌కు చిన్న ఫ్లైట్లు ఉంటాయి. మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ వాతావరణం మారిపోతుంది. ఫ్లైట్లో వెళ్తే తిరిగి ఈవినింగుకు పోఖరా చేరుకోవచ్చు. జర్నీ మొత్తం కొండల మీద నుండే. ఫ్లైట్ నుండి క్రిందకి చూస్తే మంచు కప్పుకున్న పర్వతాలు, పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపై గుత్తులు గుత్తులుగా పూలు, చిన్న చిన్న గ్రామాలు, సెలయేరులు, నీలి ఆకాశం, తెల్లని మబ్బులు.. వ్యూ అద్భుతంగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోతే ఫ్లైట్లు ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు.
రెండుసార్లు వెళ్ళినప్పుడు కూడా చక్కని దర్శనమై, చక్కని అనుభూతులను మనసున నింపుకొని, తిరుగు ప్రయాణమయ్యాం.

