Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముకుంద రామారావు మూడు చిన్న కవితలు

[శ్రీ ముకుంద రామారావు గారి మూడు చిన్న కవితలను అందిస్తున్నాము.]

~

1. మార్పు

వినపడక శబ్దాలు
కనపడక చిత్రాలు
తీగల్లోనూ ఉన్నాయి
తీగల్లేకుండా కూడా

ఆ చలన చిత్రంలో
ఎప్పటివాడో అతను
శ్వాసలేకపోయినా
తాగుతున్నాడు
వాగుతున్నాడు

సినిమా పూర్తయాక
చీకటిలోంచి లేచిన
మొహాల్లా మనం

2. అయోమయంలో అతను

నాకు తప్పకుండా తెలిసుంటుందని
అతనెవరో చిరునవ్వుతో చిరునామా అడిగాడు
నాకు తెలిసి ఈ దారి చివర్లోనే ఉంటుందన్నాను
నా పక్కన ఉన్నాయన ఈ దారి మొదట్లో కదా అన్నాడు
నన్ను అడిగినాయన
అదేదో తానే వెతుక్కుంటానని వెళ్లిపోయాడు

3. ప్రవేశ ద్వారం

ఇంటివారిని కలుపుతుందో
విడదీస్తుందో తెలియదు

లోనికో బయటకో
ఏది చేసినా
ఆనుకొని ఉన్న గోడలకు
అంతా మద్దతుగానే

Exit mobile version