తేది 13-09-2026 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పద్మశాలి మిత్ర మండలి మరియు ముంబయి భారతి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ భాషా దినోత్సవం’ సందర్భంగా ముంబయి భారతి వ్యవస్థాపక ఆధ్యక్షులు డా. అంబల్ల జనార్దన్ గారు మాట్లాడుతూ, కన్నడ తల్లి, మరాఠీ తండ్రికి కర్ణాటకలో పుట్టిన కాళోజీ నారాయణ రావు గారు తెలంగాణ వరంగల్ లోని మడికొండలో స్థిరపడి తెలంగాణ భాషకు, తెలంగాణ ప్రాంతానికి తన జీవితం ధార పోయడం ముదావహం అని కొనియాడారు.
ప్రజల గొడవ తన గొడవ అనీ, బడిపలుకుల భాష కాకుండా బోధనలో కూడా పలుకుబడుల భాష ఉండాలని పోట్లాడిన త్యాగధనులు కాళన్న అని ప్రసంసించారు. కాళోజీ గారి జీవిత విశేషాలు, తెలంగాణ ఉద్యమంలో కాళోజీ గారి కృషి మరియు తెలంగాణ భాష దాని ప్రాముఖ్యత ఇప్పుడు వస్తున్నటువంటి తెలుగు సినిమాలలోని తెలంగాణ మాటల, పాటల వాడుకను ఉదహరించారు. తెలంగాణ భాష కేవలం మాండలికం కాదనీ, అది ఒక ప్రత్యేక భాష అని ఉదాహరణలతో, డా. నలిమెల భాస్కర్ గారి పుస్తకాలను ఉటంకించారు.
సభకు అధ్యక్షత వహించిన పద్మశాలి మిత్ర మండలి అధ్యక్షులు శ్రీ పిట్ల బాలకృష్ణ గారు, సభకు స్వాగతం పలికి, రచయిత డా. అంబల్ల జనార్దన్, మరియు సమీక్షకులు శ్రీ పి. నాగేశ్వర్ రావు గార్లను వేదిక నలంకరించ వలసిందిగా కోరారు. సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ గద్దె వెంకటేష్ ఆ తర్వాత పద్మశాలి మిత్ర మండలి గురించి చెబుతూ వారు చేసే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అందులో భాగంగానే ‘తెలంగాణ భాషా దినోత్సవం’ జరుపడానికి పూనుకున్నామన్నారు. డా. జనార్దన్ గారి ప్రసంగం తర్వాత శ్రీ పి. నాగేశ్వర్ రావు గారిని ‘మాకథలు- 2024’ మరియు ‘ప్రాణధార’ పుస్తకాలను పరిచయం చేయవలసిందిగా కోరారు.
శ్రీ పి. నాగేశ్వర్ రావు గారు రెండు పుస్తకాలలోని కొన్ని కథలను విశ్లేషించి, అవి తనకు ఎందుకు నచ్చాయో సోదాహరణంగా వివరించారు. అలాగే నేటి కథల ధోరణి గురించి చెప్పారు.
కవులు నడిమెట్ల ఎల్లప్ప, గుర్రపు కిషన్ గార్లు తెలంగాణ వాడుక భాష, యాస గురించి తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో మాట్లాడే పదాల గురించి ఉటంకించారు.
పద్మశాలి మిత్రమoడలి అధ్యక్షులు పిట్ల బాలకృష్ణ మరియు ధర్మకర్త తలకొక్కుల గంగాధర్ గార్లు మున్ముందు ఉదయం నుండి పగలు దాకా కవి సమ్మేళనం, సాహిత్య గోష్టి నిర్వహించడానికి ‘ముంబయి భారతి’ సహకరించాలని కోరారు. ఆ సందర్భంగా ఆహూతులకు తగిన ఆతిథ్యం సమకూర్చుతామని హామీ ఇచ్చారు.
రచయితలు, తెలుగు భాషాభిమానులు కవులు, ఔత్సాహికులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

