Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మురళీరవ నాదార్చన

[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘మురళీరవ నాదార్చన’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

బృందావన విహారీ కర్ణాలంకార కర్ణ
కర్ణికారప్రభలతో భువన మోహన రూప
పసిడి వన్నె పట్టు పీతాంబరధారివై
నయన విలాసముల వేణుగానముల
స్వర రాగ మధురిమల ‘రాగమాలిక’తో
శిగలోన శిఖిపింఛంపు మెరుపులతో
వైజయంతీమాల గళమున ధరియించీ
విధాత, గంధర్వ, స్వర, బేధమూర్ఛనల,
శారదాస్తుతుల, సామవేద గానప్రభల,
ఆలమందల మేపు హరి నాదార్చనలతో
గోత్రములు గోపికల బృందసమూహాల
మైమరచి మాధవీలతలతో మాధవుని
చేర నవనీతచోరుని చెంత గోపికలు నిలచి,
హరి ముఖకమలము గని ఒక గోపిక!
హరిపదకమలముల సేవించునొక లేమ!
హరిమనోకమలమున పూజించునొక ఇంతి!
హరి కరకమలముల చేరెనొక పూబంతి!
అరవిందదళ నేత్ర! రార! మా చెంతకని,
అరవిందకోమల చరణములు పట్టి,
అరవిందనయనలు కరుణించమని కోరి,
అరవిందాక్షుని మనమున స్మరియించ,
అరవిందములన్ని విరిసి పావనమాయె
మా జన్మమని మురిసె హరిస్మరణతో!
కువలయజనవినుత కరుణాంతరంగ!
కువలయమునణచిన కంసాంతక!
కువలయశిరోమణి కరిరాజవరద!
కువలయనాయక మంగళకరరూప!
గళమున మధురరాగముల మ్రోగించు,
మురళీరవముల సరళీస్వరములు
సమ్మోహనమోహన‘రామలు’ సమర్పించు
శుభ మంగళ కర్పూరహారతులు లివే
జయమంగళకర లోకనాయకునకు
మణిదీపముల మణిమయ హారతులు.

Exit mobile version