[జార్ట్ స్ట్రెయిట్, అలాన్ జాక్సన్ పాడిన ‘మర్డర్ ఆన్ మ్యూజిక్ రో’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జార్ట్ స్ట్రెయిట్ – మర్డర్ ఆన్ మ్యూజిక్ రో (2000)
- ఆల్బమ్ – లేటెస్ట్ గ్రేటెస్ట్ స్ట్రెయిటెస్ట్ హిట్స్
- రచన – లారీ కోర్డిల్, లారీ షెల్
- నిర్మాత – టోనీ బ్రౌన్, జార్జ్ స్ట్రెయిట్
~
జార్జ్ స్ట్రయిట్ సోలో సింగర్. ఈయన డ్యూయెట్లు పెద్దగా పాడలేదు రికార్డు చేయలేదు. ఆయన పేరున నమోదయిన డ్యూయెట్లలో అలాన్ జాక్సన్‌తో పాడిన పాట బాగా ప్రాచుర్యం పొందింది. అది కంట్రీ మ్యూజిక్ లోనే ఓ ప్రత్యేకమైన గీతం. అదే ‘మర్డర్ ఆన్ ది మ్యూజిక్ రో’.
నిజానికి దీన్ని1999లో లారీ కోర్డిల్, లారీ షెల్ రాసారు. మొదట అమెరికన్ బ్లూగ్రాస్ గ్రూప్, లారీ కోర్డిల్, లోన్సమ్ స్టాండర్డ్ టైమ్ వారి ఆల్బమ్ ‘మర్డర్ ఆన్ మ్యూజిక్ రో’ టైటిల్ ట్రాక్‌గా దీన్ని రికార్డ్ చేశారు. దీనికి 2000 అంతర్జాతీయ బ్లూగ్రాస్ మ్యూజిక్ అవార్డులలో సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. ఈ పాటను జార్జ్ స్ట్రెయిట్, అలాన్ జాక్సన్ మొదట 1999 కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ షోలో కలిసి పాడారు. తరవాత దీనిని 2000 నాటి లేటెస్ట్ గ్రేటెస్ట్ స్ట్రెయిటెస్ట్ హిట్స్ ఆల్బమ్ కోసం రికార్డ్ చేశారు. వీరిద్దరి గాత్రంతో ఇది, అధికారికంగా సింగిల్‌గా ఎప్పుడూ విడుదల కాకపోయినా, హాట్ కంట్రీ సాంగ్స్ చార్ట్‌లో 38వ స్థానానికి చేరుకుంది. 2000లో, కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్, వోకల్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, అలాగే ఒక సంవత్సరం తర్వాత CMA, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ పాట అందుకుంది. జూన్ 7, 2014న AT&T స్టేడియంలో జరిగిన ‘ది కౌబాయ్ రైడ్స్ అవే టూర్’ పేరుతో జార్జ్ స్ట్రెయిట్ చివరి కచేరి సందర్భంగా అలాన్ జాక్సన్, జార్జ్ స్ట్రెయిట్ మళ్లీ ఈ పాటను కలిసి పాడారు.
(అలన్ జాక్సన్, జార్జ్ స్ట్రెయిట్)
ఈ పాట సాంప్రదాయ కంట్రీ మ్యూజిక్ కోల్పోతున్న పూర్వ వైభవాన్ని సూచిస్తుంది. ‘మ్యూజిక్ రో’ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని టేనస్సీలోని నాష్విల్లే డౌన్‌టౌన్‌కు నైరుతి దిశలో ఉన్న ఒక చారిత్రాత్మక జిల్లా. నాష్విల్లే వినోద పరిశ్రమకు ముఖ్య స్థావరంగా పరిగణించబడే ప్రాంతం ‘మ్యూజిక్ రో’. ముఖ్యంగా కంట్రీ మ్యూజిక్, సువార్త సంగీతం, సమకాలీన క్రైస్తవ సంగీత పరిశ్రమకు మారుపేరుగా గుర్తింపు పొందిన జిల్లా ఇది.
కంట్రీ మ్యూజిక్ జనసమాజం నుంచి వచ్చిన సాంప్రదాయ సంగీతం. ఆధునికత మాటున కొత్త తరం ఈ నియోట్రెడీషనల్ సంగీతానికి ఉనికే లేకుండా చేసి పాప్ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇది చాలా మంది కంట్రీ గాయకులను బాధపెడుతున్న విషయం. తమ జనజీవన సంగీతాన్ని కనపడకుండా హత్య చేస్తున్న ఆధునిక పోకడలు, సంగీత బాణీలపై తమ ఆగ్రహాన్ని సూచిస్తూ సున్నితంగానే కాని బలంగా కంట్రీ గాయకుల గొంతుకలు వినిపించే గీతం ఇది. పాప్ ట్రెండ్‌ను ‘మ్యూజిక్ రోలో జరిగిన భయంకరమైన హత్య’తో పోలుస్తున్నారు గాయకులు. సాంప్రదాయ వాయిద్యాలు కనుమరుగవడం డ్రమ్స్, రాక్ అండ్ రోల్ గిటార్లు తెరపై రావడం ఒక రకంగా చరిత్రను మౌనంగా హత్య చేయడమే. అలనాటి గొప్ప సాంప్రదాయ కంట్రీ కళాకారులు ‘నేటి పరిస్థితులలో కనీసం రేడియోలో కూడా అవకాశం పొందలేని స్థితిలో అమెరికా సంగీత ప్రపంచం ఉంది. హాంక్ విలియమ్స్ (‘ఓల్డ్ హాంక్’), మెర్లే హాగర్డ్ (‘ది హాగ్’), జార్జ్ జోన్స్ (‘ది పోసమ్’) లాంటి దిగ్గజాలు ఇప్పుడు తయారయ్యే పరిస్థితులు లేవు’ అన్న వ్యథను ఆ గాయకులు ఈ గీతంలో వినిపిస్తారు. ఈ ముగ్గురూ కంట్రీ సంగీతంలో దిగ్గజాలు. వారికే స్థానం లేనంత హీనమైన స్థితిలో సంగీత ప్రపంచం దిగజారిపోయింది.
Nobody saw him running from sixteenth avenue
They never found a fingerprint or the weapon that was used
But someone killed country music, cut out its heart and soul
They got away with murder down on music row
(ఎవరూ అతన్ని సిక్స్టీన్త్ ఎవన్యూ నుండి పారిపోతుండగా చూడలేదు. ఉపయోగించిన ఆయుధాన్ని కాని వేలిముద్రలు కాని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కాని ఎవరో కంట్రీ మ్యూజిక్‌ని చంపేసారు. దాని గుండెను, ఆత్మను చీల్చిపడేసారు. ఆ క్రింద మ్యూజిక్ రో లోనే హత్య చేసి వాళ్లు తప్పించుకుపోయారు)
హత్య చేసినవాడిని కాని ఆయుధాన్నికాని దానిపై వేలిముద్రలు కాని లేవు. కాని హత్య జరిగింది. ఆ చనిపోయిన సంగీతపు గుండె ఆత్మ వేరుచేయబడ్డాయి. ఇది కనిపించకుండా జరిగిన హత్య అని చెప్పడంలో కొన్ని తరాల చారిత్రిక కళను మరణిస్తూ చూడవలసిన బాధ ఆ గొంతులో వినిపిస్తుంది.
The almighty dollar and the lust for worldwide
Slowly killed tradition and for that someone should hang
They all say not guilty, but the evidence will show
That murder was committed down on music row
(సర్వశక్తిమంతురాలైన డాలర్, ప్రపంచాన్ని జయించాలన్న వాంఛ మెల్లిగా సాంప్రదాయాన్ని చంపేసింది. దానికి వాళ్లెవరో కనుక్కుని ఎవరినన్నా ఉరి తీయాల్సిందే. వాళ్లు మేము దోషులం కాము అనగలరు. కాని ఆ క్రింద మ్యూజిక్ రో లో జరిగిన హత్యకు సాక్షాలు కనిపిస్తున్నాయి.)
డాలర్ శక్తి ముందు కళ, సాంప్రదాయాలు కూడా నిర్వీర్యం అయ్యాయి. మనిషి లోభత్వం ఈ హత్య వెనుక ఉన్న కారణం. ఎవరు దీనికి బాధ్యులో కనుక్కుని వారిని ఉరి తీయాల్సిందే. అంటే ఇలాంటి హత్యలు మళ్లీ మళ్లీ జరిగి మానవ చరిత్రే అంతరించిపోకుండా హంతకులను శిక్షించవలసిందే. వాళ్లు మేము దోషులమే కాదు అని మెత్తగా తప్పుకోగలరు. కాని ఈ హత్యకు సాక్షాలు ఉన్నాయి. అవి కనిపిస్తున్నాయి. హత్య జరిగిందని, హంతకులను శిక్షించవలసిందే అని గట్టిగా చాటి చెపుతున్నాయి.
For the steel guitars no longer cry and fiddles barely play
But drums and rock ‘n roll guitars are mixed up in your face
Old Hank wouldn’t have a chance on today’s radio
Since they committed murder down on music row.
(స్టీల్ గిటార్లు విషాదంగా పలకట్లేదు. ఫిడేలుల ఆటలే లేవు. కాని మీ మొహంలో డ్రమ్స్, రాక్ అండ్ రోల్ గిటార్లు కలగలిసి కనిపిస్తున్నాయి. ఆనాటి హాంక్ (హాంక్ విలియమ్స) కు ఇప్పుటి రేడియోలో స్థానమే దొరకదు ఎందుకంటే వాళ్లు ఆ క్రింద మ్యూజిక్ రో లో ఓ హత్య చేశారు).
కంట్రీ మ్యూజిక్ హత్య చేయబడింది అని చెప్పడానికి సాక్షాలున్నాయ్ అని అన్నాక ఆ సాక్షాలు ఇలా బైటపెడుతున్నారు. స్టీల్ గిటార్ల చప్పుళ్లు లేవు. ఫిడేలు రాగాల్ లేవు. కాని అందరి మొహాలలో డ్రమ్స్, రాక్ అండ్ రోల్ గిటార్లు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అలనాటి ఆ మాధుర్యాలు ఎక్కడికి వెళ్లాయి. మీ అందరిలో ఒకేసారి ఈ అధునికత ఎలా వచ్చి చేరింది. ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే దిగ్గజ కంట్రీ గాయకుడు హాంక్ విలియమ్స్ అంతటి వాడికి కూడా ఇప్పుడూ కనీసం రేడియోలో పాటలు పాడే అవకాశం కూడా దొరకదు. ఇంత దారుణమైన స్థితి వచ్చిందంటే కంట్రీ మ్యూజిక్ హత్యకు గురి అయినట్లే కదా.
They thought no one would miss it, once it was dead and gone
They said no one would buy them old drinking and cheating songs (I’ll still buy’em)
Well there ain’t no justice in it and the hard facts are cold
Murder’s been committed down on music row
(వాళ్లంతా అది మరణించి, కనపడకుండాపోతే దాని లోటు ఎవరికీ తెలియదని అనుకున్నారు. ఆ పాత తాగుబోతుల, మోసగాళ్ళ పాటలను ఎవరూ కొనరని వాళ్లు అపోహపడ్డారు (కాని నేను ఇప్పటికీ అవి మాత్రమే కోంటాను) ఇందులో ఏ న్యాయమూ లేదు. నిజాలు కఠినంగానే ఉంటాయి. ఆ క్రింద మ్యూజిక్ రో లో ఓ హత్య నిజంగానే జరిగింది)
కంట్రీ సంగీతాన్ని మౌనంగా హత్య చేసి, దాని ఆనవాలే లేకుండా చేస్తే దాన్ని అందరూ మర్చిపోతారని ఆధునికులు భావిస్తున్నారు. కాని అది నిజం కాదు. నేను కూడా వెతుక్కునే వాటినే కొనుక్కుంటున్నాను. దాని అభిమానుల్ ఇప్పటికీ ఉన్నారు. వారికి అది లేని లోటు బాధిస్తూనే ఉంటుంది. ఈ హత్యలో ఎటువంటి న్యాయమూ లేదు. కఠిమైన నిజం ఏంటంటే, అహంకారంతో ఆ సాంప్రదాయ సంగీతాన్ని కొందరు హత్య చేసి మాయం చేయాలనుకున్నారు.
Oh, the steel guitars no longer cry and you can’t hear fiddles play
With drums and rock ‘n roll guitars mixed right up in your face
Why, the Hag, he wouldn’t have a chance on today’s radio
Since they’ve committed murder down on music row
(స్టీల్ గిటారు ఇక విషాదంగా పలకట్లేదు. ఫిడేలుల ఆటలు వినిపించట్లేదు. మీ మొహంలో డ్రమ్స్, రాక్ అండ్ రోల్ గిటార్లు కలగలిసి కనిపిస్తున్నాయి. ఆ హాగ్ (మెర్లే హాగర్డ్) కు ఇప్పటి రేడియోలో అవకాశమే లేదు. ఎందుకంటే ఆ క్రింద మ్యూజిక్ రోలో హత్య జరిగింది).
ఇక్కడ మేర్లె హాగర్డ్ ప్రస్తావన తీసుకొస్తారు గాయకులు, ఈయన కూడా కంట్రీ మ్యూజిక్ లో రారాజు. కాని ఇప్పటి పరిస్థితిలో అంతటి గొప్ప కళాకారుడికి కూడా సముచిత స్థానం దొరకదు.
Why, they’d even tell the Possum to pack up and go back home
There’s been an awful murder down on music row
(వాళ్ళు పాసమ్ (జార్జ్ జోన్స్) ని కూడా అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పగలరు. ఎందుకంటే ఆ క్రింద మ్యూజిక్ రోలో ఓ హత్య జరిగింది)
ఈ వాక్యంలో పాసమ్ అని జార్జ్ జోన్స్ ముద్దు పేరుతో సంబోధిస్తున్నారు. ఈయన కంట్రీ మ్యూజిక్‌లో మరో మేరు పర్వతం. ఆయనకే స్థానం లేనంతగా దిగజారుడు సంగీత వాతావరణం అల్లుకుపోయి ఉంది.
ప్రతి దేశంలోనూ సాంప్రదాయాన్ని తుడిచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఆధునికతను ఆహ్వానిస్తూనే చారిత్రకతను, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాటిని సముచిత స్థానాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆధునికత అంటే పూర్తిగా పాతను తుడిచిపెట్టేయమని నిర్దాక్ష్యంగా ఆ జ్ఞాపకాలను చెరిపేయమని కాదు. వాటికి సముచిత స్థానాన్ని ఇస్తూనే కొత్తని స్వాగతించమని. ఇది జరగకపోవడం ఒక రకంగా మానవ జీవిన పరిమాణపు చారిత్రకతను హత్య చేయడమే. ఇది కనిపించని హత్య. కాని దీని ప్రభావం మాత్రం చాలా కఠినంగా ఉండి మానవ జీవన ప్రమాణాలకే ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.
సాంప్రదాయ సంగీతకారుల ఘోష ప్రపంచంలో ప్రతి చోటా ఒకే విధంగా ఉంది అనడానికి ఈ పాట ఓ ఉదాహరణ.
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/r2DBxF_ncQU?si=e2Pv1ewXg_AINihj )

