Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మువ్వ తిరుప్పావై

[ధనుర్మాసం సందర్భంగా స్వర్గీయ శ్రీమతి తూములూరి రాజ్యలక్ష్మి గారి అప్రచురిత రచన ‘మువ్వ తిరుప్పావై’ అందిస్తున్నాము.]

నుర్మాస శుభాకాంక్షలు. ఈ మాసములో తిరుప్పావైని చదవడం మనం చూస్తూ ఉంటాము. అసలు ఈ తిరుప్పావై విశేషం ఏమిటి?

తిరుప్పావైలో ఏముంది? దీనిని ఎవరు రచించారు? ఇలాంటి విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతి దేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దానినే కాత్యాయని వ్రతం అంటారు. ఆ కోవాకు చెందినదే ఈ తిరుప్పావై వ్రతము. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని భర్తగా కోరుకుంటూ స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారు అని ఆండాళ్ నమ్మిక.

ఈ తిరుప్పావై పాశురాలని ఒక భక్తి నివేదికగా కూడా పిల్లలు – పెద్దలు ధనుర్మాసంలో ఆచరిస్తూ ఉంటారు. శ్రీవైష్ణవులు ఏడాది పొడుగున ప్రతి దినము తమ ఇళ్లల్లో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలని పఠనం చేస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్క పాశురము ఒక్కొక్క రోజు గానము చేయబడుతుంది. ధనుర్మాసంలో ఆలయాల్లో విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి రచించిన 30 పాశురాల తిరుప్పావైని పఠిస్తారు. ఈ మాసము విష్ణువుకి ప్రీతికరమైనది. ఈ తిరుప్పావై గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన గీత మాలిక,

ఇది పన్నిద్ద ఆళ్వార్లు రచించిన నాలాయిర అనే దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

గోదాదేవి చేసినది కాత్యాయని వ్రతమని కొన్ని గ్రంథాలలో ఉంది. తెలుగులోనూ ఈ పాశురాలకి అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, లక్ష్మణ యతీంద్రులు గారు మొదలైన గొప్ప కవులు, తత్వవేత్తలు ఉన్నారు.

ఇక అసలు ఈ తిరుప్పావైని రచించిన గోదాదేవి గురించి తెలుసుకుందాము. ఈమె శ్రీ విష్ణుచిత్తుడు అనే ఆళ్వారుకి తన ఇంటి పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికినది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్ది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయననే వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. కాని విష్ణుచిత్తుడు భక్తుడు అయినప్పటికీ ఇలా వివాహం జరపడం అసంభవము అని భావించాడు. కాని గోదాదేవి భక్తి ఫలించి రంగనాధుడు విష్ణుచిత్తుని స్వప్నములో కనిపించి గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి తీసుకురావలసినదిగా ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్పించి అందరూ చూస్తూ వుండగా స్వామిలో లీనమై పోయిందని ఇతిహ్యం.

ఇది సుమారు 8 – 9 దశాబ్దాల క్రిందట జరిగిన ఉదాంతం అని పలువురి పరిశోధనల అంచనా.

మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకి (గుడికి) వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే అనగా ఈ 30 పాశురాలే ఈ తిరుప్పావై.

‘తిరు’ అనగా మంగళవాచకం అని, శ్రీకరం అని, శుభప్రదం, పవిత్రం అని మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి.

‘ప్పావై’ అనగా వ్రతం, ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటారు.

ఈ తిరుప్పావై ఒక గొప్ప సాహిత్యమనే చెప్పాలి. ఎందుకంటే మొదటి 5 పాశురాలల్లో తిరుప్పావైలో ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేయడం జరిగింది. చిత్తశుద్ధితో స్వామిని కొలిస్తే వానలు సకాలంలో కురుస్తాయి – పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి 10 పాశురాలల్లో విష్ణువు యొక్క దశ అవతారాలని వర్ణిస్తూ చెపుతుంది. మిగిలిన పాశురాలల్లో కృష్ణుడు తల్లిదండ్రుల గురించి, బలరామ, కృష్ణుడు గురించి మరియు నీలాదేవి గురించిన విషయాలు ఉంటాయి. చిట్ట చివర పాశురములో గోదాదేవి తను విష్ణుచిత్తుల కుమార్తెనని, ఈ 30 పాశురాలను తానే రచించి పాడానని తెలుపుతూ ఎవరైతే వీటిని భక్తితో గానము చేస్తారో వారికి ఆ భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది.

(అలాంటి ఈ తిరుప్పావై పాశురాలని కీ.శే. శ్రీమతి తూములూరి రాజ్యలక్ష్మి గారు – తెలుగులో ప్రతీ పాశురము యొక్క కొంత అర్థంతో పాటు స్వామి వారి నామాన్ని జతపరుస్తూ రచించారు. ఈ పాశురాలని చదువుతున్నప్పుడు, ఈ తిరుప్పావై మీద శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి భావానువాదం కొంత కనపడుతుందనే చెప్పాలి. ఆనాడు గోదా దేవి ఈ పాశురాలపై ఉద్దేశాన్ని శ్రీమతి రాజ్యలక్ష్మి గారు ‘మువ్వ తిరుప్పావై’లో కనపరిచారు. అలానే ఈ పాశురాలని పిల్లలు -పెద్దలు చక్కగా తెలుగులో పాడుకోవడానికి సులభంగా వుండేలా రచించారు.

కావున ఈ ‘మువ్వ తిరుప్పావై’ పాశురములను అందరూ అనుమతీయుతంగా ఆహ్వానిస్తారని కోరుకుంటూ.. ఓం అచ్యుతానంత గోవిందాయ నమః – సంపాదకులు)

***

మొదటి పాశురము:

రంగ రంగ వైభవంగా నిను సేవింపగ
వచ్చినాము దామోదరా
మార్గశిరమున మువ్వ గోవిందా నీ
తిరు నామం మా కెంతో వరం॥

నీ నామ జపముతో అష్ట దిక్కులు –
పంచ భూతములు – ప్రకృతి పుణ్యంగా మారి
కాలానుగుణముగా కలసి వస్తుంది
రాశి – నక్షత్ర జీవులకు భువిపై॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళ ప్రదము॥

వివరణ:
ఈ మొదటి పాశురము, తిరుప్పావై యొక్క మొత్తం సారాన్ని, దానిలోని భక్తిని, భగవంతునితో అనుబంధాన్ని ప్రారంభించేందుకు ఒక గొప్ప ఆహ్వానం వంటిది. ఇవి విష్ణు నామ జపానికి, భక్తికి, మోక్షానికి, మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ప్రతి పాశురము ఒక ప్రత్యేక అర్థాన్ని – భక్తిని కలిగి ఉంటుంది.

ఓం శ్రీరంగనాథాయ నమః

రెండవ పాశురము:

పవ్వళించిన స్వామి పాద పద్మములే
గతియని మది నమ్మి కమ్మగా పాడి
శేష శయన గోప బాల గోవింద
నీ నామ కీర్తనం పాడెదమెంతో॥

కమలా వాసుదేవ సనాతన
వసుదేవాత్మజ లీలా మానుష విగ్రహ
శ్రీవత్స; కౌస్తుభధర పుణ్య
యశోద వత్సల హరి శ్రీకృష్ణ॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

మూడవ పాశురము:

ఇంత వాడింతలో ఎంతకు పెరిగె
గుజ్జు వాడంతలో కొండంత పెరిగె
వామన నీ నామ కీర్తనంతో
వ్యాధి – చోర – భయము పోవునులె॥

దేవకి నందన – నంద గోప ప్రియ
నంద వజ్ర – జనానంది నవనీత
ముకుంద – త్రిభంగి – మధురా కృతి
గోవింద యోగి నాం పతి… అనంత॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతి కి మంగళప్రదము॥

నాల్గవ పాశురము:

జడివాన కురియుము పుడమి వెల్లువగ
వర్షంబు ధారల వసుధ ముంచెత్తు
నీల వర్ణ మేఘ రూపధారి మమ్ము
చేరి కూర్చి ఆడు ఈ వేళ మాతో॥

సుదర్శన చక్రాన్ని ధరియించినట్టు
మెరిసిపోతున్న శ్యామ సుందర
శంఖము వలే గంభీరముగా
వర్షంబు ధారములను దరి చేర్చవయ్యా॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

ఐదవ పాశురము:

మా యొక్క పాపపు పొంగులను అణచి
యమున రేవులలోన ఆడినావయ్య
యమున నదికి పూజ చేస్తూ నీ దివ్య
రూప మంగళాన్ని పాడుకుంటూ..॥

కలువ – లిల్లి పువ్వు – చామతి – జాజి
పారిజాతము – నంది వర్ధనం
తామర – గులాబి – ప్రొద్దుతిరుగుడు – మల్లి
తులసి – మందార పూలతో మంగళం..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
తిరుప్పావై పాశురాలలో ఐదవ పాశురము యమునా నదికి సంబందించినది. మన పురాణ ఇతిహాసాల ప్రకారం యమున సూర్యనారాయణమూర్తి కుమార్తె. యముడికి సోదరి. అందుకే ఆమెని యమి అని పిలుస్తారు. యముడికి సోదరి కాబట్టి ఈ నదిలో స్నానమాచరిస్తే మరణ ధాతువులు దరిచేరవు అని అనాదిగా వస్తున్న విశ్వాసము. అలాగే యమునా నదికి వివిధ రకాల పుష్పాలతో కృష్ణుడి నామాలు తలుస్తూ పూజ చేయడం వలన మంచి ఫలితములు ఉంటాయని శాస్త్ర వచనము.

ఆరవ పాశురము:

అల యోగ నిద్రలో నిలిచిన స్వామి
అఖిల బీజమ్యౌచు అలరెడి స్వామి
అస్మద్ గురుభ్యో నమః అంటూ పాడండి
తిరువారాధనకు తెలవారెను॥

పుణ్య శ్లోక – తీర్థపాద – వేద వేద్య
ఆజన్మ – ఆదిత్య- ఆనంద సాగర
అచ్యుత- అజయ – అచల – అద్భుత
దేవేశ – ద్రవిణ- దామోదర॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతి కి మంగళ ప్రదము॥

వివరణ:
పై పాశురములో ‘పుణ్యశ్లోకః’ నామములను ‘విష్ణుత్రయోదశ నామములు’ అని అంటారు. ఈ నామములను త్రయోదశి తిథి రోజు చదువుకుంటే శుభం.

ఏడవ పాశురము:

నారాయణుని అవతారమ్ము గదవె
కేశవ ప్రభుండు శ్రీ కృష్ణుండు
అస్మద్ పరమ గురుభ్యో నమః అంటూ
కుల శేఖరాళ్వారుని వడి వడిగా వేడరే..॥

సత్యవాక్కు – సత్య సంకల్ప- సత్య
భామతో జయీ సుభద్ర పూర్వజో
భీష్మ ముక్తి ప్రదాయకః విష్ణుః
జగద్గురువు జగన్నాథః హరిః॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళ ప్రదము॥

ఎనిమిదవ పాశురము:

తాళముల్ తప్పెటల్ మేళము చెంద
పాడుకొందుమె గోప బాలుని లీల
కేశి – చారుణ – మల్లుల్ని పట్టిన
నమ్మాళ్వారుని నిత్యంగా కీర్తిస్తూ..॥

ద్వారక – దయాళు – దేవాది దేవ
తులసి దామ భూషణ నరనారాయణాత్మక
పరమ పురుష ముష్టికాసుర చారుణ
మల్ల యుద్ధ విశారదః మాయీ..॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళ ప్రదము ॥

తొమ్మిదవ పాశురము:

మాయావులకు నెల్ల మాయావి యనుచు
మాధవుండు నీ మదిలోన పెంచు
శ్రీమతే రామానుజాయా నమః
ఈ దివ్య నామము అందరికి పంచు..॥

విశ్వం – విష్ణు – వషట్కార యతిరాజ
శ్రీ శఠకోపాయ – శ్రీ వరవరమునయే
పూతాత్మ – పరమాత్మా – పద్మ హస్త ధారణ
సాక్షి – సత్యవ్రత – శ్యామసుందర..॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

పదవ పాశురము:

తడబాటు పడక నిదానమ్ము విడచి
మేల్కొని రావమ్మ – మీనాభ నయన
శ్రీమత్ పరాంకుశ దాసాయ నమః
పెరియాళ్వారుల్ని నోము పట్టి పాడు..॥

నారసింహ – కేశవ – శ్రీమతే శఠకోపాయ
రామనుజాయ శ్రీమత్ వరవరమునయే
సర్వ – శర్వ – శివ – స్థాణు స్వయంభూ
శ్రీవానాచల మహామునయే నమః॥

వైభవంగా నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము..॥

వివరణ:
‘పెరియాళ్వారు’. వీరు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖమైన 12 మంది ఆళ్వార్లులో ఒకరు. విష్ణుచిత్తుడు అనే పేరుతో కూడా పిలువబడుతారు మరియు గొప్ప భక్తుడు. ఆయన తన కుమార్తె ఆండాళ్‌ను (భూదేవి అవతారం గోదా దేవి) దత్తతు తీసుకొని పెంచడం, కృష్ణలీలలను వర్ణించే ‘పెరియాళ్వార్ తిరుమొళి’ వంటి భక్తి కీర్తనలను రచించడం ముఖ్యమైనవి, ముఖ్యంగా తిరుప్పావైతో (గోదా దేవి రచించినది) ముడిపడి ఉంటారు. శ్రీ కృష్ణుని బాల్య క్రీడలను వర్ణించారు.

పదకొండవ పాశురము:

వెన్నుని చేతనే మున్నొక నాడు
కాలుని నోటిలో కడియైన వాడు
శ్రీ మద్యా మునయే నమః అంటూ
పూదత్తాళ్వారును పూజిస్తూ..॥

అప్రమేయ – హృషికేశ
పద్మనాభ – స్థవిష్ఠ
లోహితాక్ష – ప్రాణ – ప్రాణాద
ఈశాన – పరం మంగళం..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
‘పూదత్తాళ్వారు’ వైష్ణవ సంప్రదాయం లోని 12 మంది ఆళ్వారులలో రెండవవారు. వీరిని ‘భూత యోగి’ అని కూడా అంటారు. వీరు కృష్ణుడు (విష్ణువు) దివ్యాయుధమైన ‘కౌమోదకి’ అనే గద అంశతో అవతరించారు. ‘కౌమోదకి’ అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క గద పేరు. ఇది భూమిని సంతోషపెట్టేది అని అర్థం. వీరి అవతార నక్షత్రం ధనిష్ట,

పన్నెండవ పాశురము:

ఇనకలోద్ధార ఇందిరా పతి
అనంతములకు నీవె గతి
శ్రీరామ మిశ్రాయ నమః అంటూ
ఆ రామ నామాన్ని రంగరించి పాడు..॥

రఘు పుంగవ శ్రీ జానకి వల్లభ
జితామిత్ర – జనార్దన
దశగ్రీవ శిరోహర
పురాణ పురుషోత్తమ రాఘవ..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
‘శ్రీరామ మిత్రాయ నమః’ అంటే శ్రీరామచంద్రుడిని స్నేహితుడిగా భావించి చేసే ఒక భక్తి పూర్వక ప్రార్థన, ఇది విశ్వాసం, స్నేహ పూర్వక సంబంధాన్ని సూచిస్తుంది కూడా. ముఖ్యంగా శ్రీరామ అష్టోత్తర శతనామావళిలో ‘జిత మిత్రాయ నమః’ (స్నేహితులను జయించిన వాడివి) అని కూడా వస్తుంది అర్థం. ఇది రాముడి స్నేహ శీలమయిన స్వభావాన్ని సూచిస్తుంది.

పదమూడవ పాశురము:
సుదిన శుభమ్మిది ఆత్మానందము
తాపముల్ దీరగ తానమ్ములాడ
అచ్యుత – అనంత- గోవింద పలుకుతు
ఈ నామత్రయం పాడుతూ ఆడుతూ..॥

గోపికలందరి గీతా గానం
కేశవ నామ లీలల ధ్యానం
భక్తితో కూడి నివేదనలతో
మదిని మాధవునికి అర్పణలు..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళ ప్రదము..॥

వివరణ:
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత – అనంత- గోవింద అనే ఈ నామత్రయం.
సంధ్యా వందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా ‘ఓం అనంతాయ నమః’ – ‘ఓం అచ్యుతాయ నమః’ – ‘ఓం గోవిందాయ నమః’ అని ఆచరించి ఆరంబిస్తారు. ఈ నామాలను పలకడం అనే మందు చేత సర్వ రోగాలు నశించి తీరుతాయి అని శ్రీ ధన్వంతరి గారి ప్రప్రథమ పలుకు. ఈయన ఆయుర్వేద వైద్య విద్యకు ప్రథమ కర్త, పద్మ పురాణం లో ఈ నామత్రయానికి మిక్కిలి గొప్ప వర్ణన కాంతి ఉంది.

పదనాల్గవ పాశురము:

పలుకులతో సుధలొలికెడి వాడు
దివ్య నామమ్ము జగతిలో వాడు
శ్రీ రంగనాథ పెరుమాళ్ నమః
తిరుప్పాణి యాళ్లారును కాలువరో..॥

పెరియ పెరుమాళ్ – రంగనాథ
నం పెరుమాళ్ – రంగనాథర్
అరంగ నాథర్ – శ్రీరంగనాథర్
తెన రంగథన్ – రంగన్ రంగన్..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళ ప్రదము..॥

వివరణ:
ముఖ్యంగా శ్రీరంగంలో ఆలయంలో ‘శ్రీరంగనాథ పెరుమాళ్’ అని పిలుస్తారు. ‘పెరుమాళ్’ అంటే ‘దేవుడు’ అని అర్థం. ‘నం పెరుమాళ్’ అంటే శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రధాన విగ్రహానికి ఉన్న పేరు.

పదిహేనవ పాశురము:

గోపిక మదిని గాచిన వాని
కల్యాణ గుణములు గానము చేయ
శ్రీ శత గోవిందాయ నమ:
తిరు మంగైళ్వారును కొలువరో..॥

ధాత – విధాత – మధుసూధన
శంభు – స్వయంభూ – పురుషోత్తమా
కేశవ – కమలా రూపాయ
దశ – వేంకటపతి నాథాయా..॥

వైభవంగ నీ మంగళశాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
పై పాశురములో తెలిపిన ‘శ్రీ శత గోవిందాయ నమః’ నామం విష్ణువు యొక్క గుప్త నామాలలో ఒక నామం. భయ ఆందోళములు కలిగినపుడు స్మరిస్తే మంచిది.

పదహారవ పాశురము:

తోరణ ద్వారమున ఉన్నాము
మా విన్నపమును మన్నింపుమయ్యా
నీ శరణాగతిని పొందాలని
భావగతులతో వేచి ఉన్నామయా..॥

పద్మం – గద – చక్రం – శంఖం
మాధవాయ – మధుసూధనాయ
శ్రీధరాయ – హృషీకేశాయ
పద్మనాభాయ – కమలాధరాయ..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము..॥

వివరణ:
పైన పాశురములో తెలిపిన ‘పద్మం – గద..’ దశ నామాలను ప్రతి నిత్యం పూజాది సమయంలో చదువు కోవడం వలన ‘దశ అవతార స్తోత్రం’ చదువుకున్న ఫలితము కలుగుతుంది.

పదిహేడవ పాశురము:

ఇంతింత అంతంత ఎంతయో పెరిగే
నింగిని చీల్చి అంతగా పెరిగే
ముల్లోకములు గొల్చు మువ్వ గోవిందుడికి
ముత్యాల హారతితో పాశురాలు..॥

అనంత- ముకుంద – దేవానంద
తీర్థ పాదాయ – వేద రూపాయ
పరాత్పరాయ – పరమేశ్వరాయ
జగన్నాథాయ – జయినే నమః..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము..॥

వివరణ:
‘ముత్యాల హారతి’ అనగా సాధారణంగా తరిగొండ వెంగమాంబ గారు రచించిన కీర్తనలు పాడుతూ హారతి ఇవ్వడం. దీనికి ముత్యాలు అవసరము లేదు. కర్పూరంతో లేదా దీపముతో ఇవ్వవచ్చు. మార్గశిర మాస తిరు పాశురాలు సమయము కాబట్టి పై పాశురమును చదువుకుంటూ.. లేదా పాడుకుంటూ కృష్ణుడికి హారతి ఇవ్వవలయును. ఈ పాశురమే ముత్యాల హారతి స్వామి వారికి.

పద్దెనిమిదవ పాశురము:

గురువింద పందిళ్ళు – కోకిల పదాలు
కుహు కుహు స్వరముల కొసరెడినదిగో
నీలా దేవి పూజ పందిరి
నీలా మేఘ శ్యామకు మందిరం..॥

కృష్ణ – కేశవ – పద్మనాభ
వామన – వరాహ – వాసుదేవ
పద్మనాభాయ – సువర్ణాయ
శ్రీధర – హరి – మాధవాయ..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత… గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
పై పదకొండు నామాలు నీలాదేవి ప్రతి నిత్యం పఠించే నామాలు.

పంతొమ్మిదవ పాశురము:

మా స్వామి కన్నయ్య – మన్నింపుమయ్య
పల్లెత్తి ఒక మారు పలుకుమయ్యా
కువళాయ దత్తా శయన గోవింద
గోపీ జన వల్లభ రక్షించు..॥

అగ్రణ్యే.. గ్రామణ్యే..
ధరణీ ధరాయ ఓం నమః
మంత్రాయ – ఔషధాయ
త్రిమూర్తి దత్తాత్రేయ నమః..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
‘కువలయ’అనే పదము సంస్కృతం లోనిది. తెలుగులో దీని అర్థము, నీటి కలువ పువ్వు అని.
‘కువళాయ దత్తా, శయన గోవింద’ అనగా నీలి కలువ పువ్వు మీద శయనించి ఉన్న దత్తాత్రేయ గోవిందా రక్షించు అని అర్థము.

ఇరవైవ పాశురము:

కోటి దేవతల కొంగు బంగారం
భీతి – ఆపదకు చేయూత చేయి
దీవెనెలొసగే అరుదైన చేయి
నీల వర్ణుడి నిధి చేయి..॥

ఏకాదశ రుద్రాది దేవాయ
ద్వాదశ ఆదిత్యాయ నమః
ముప్పది మూడు దైవత్వాలకు
పాశురములతో మంగళము..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
‘కోటి’ అనగా కోటిమంది దేవతలు కాదు. 33 (ముప్పది మూడు) రకాలైన ముఖ్యమైన దైవిక శక్తులు అని అర్థం, 8 (అష్ట) వసువులు – 11 రుద్రులు (ఏకాదశరుద్రులు) – 12 ఆదిత్యులు (ద్వాదశ ఆదిత్యులు) – ఇంద్రుడు – ప్రజాపతి (బ్రహ్మ) కలిపి మొత్తం 33 ముఖ్యమైన దేవతా వర్గాలు ఉన్నాయి. ఇవన్నియే 33 తరగతుల దైవిక ప్రమాణా స్థానాలు అలంకరించి ఉన్నాయి. ‘అచ్యుత అనంత గోవింద’ నామంలో పై తత్వాలన్నీ ఇమిడే ఉంటాయి. భక్తితో ఆచరణ కాగలిగితే చాలు. అంతా శుభం.

ఇరవై ఒకటవ పాశురము:

నంద గోపు.. ల వారి
ఇంటి ముంగిటకు వచ్చామయ్యా
బృంద గోవింద వేళాయే రా
మమ్ము కావగా నిదుర లేవయ్యా॥

వైకుంఠ ద్వారాలు
తెరిపించి ఉంచామయ్యా
నీ దర్శనముతో మా కింత
మోక్షము సంకల్పించవయ్యా..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

ఇరవై రెండవ పాశురము:

నీ సేవకై.. వేచి యున్నాము
దొర వలె మమ్ము కాపాడవయ్యా
కొనల నైనను మము కనుగొంటే
మా పాపములు పరుగులు పెట్టు..॥

కమల నాయక – కంజలోచన
లక్ష్మి కాంత – మయూర – మోహన
మురళీధర – నంద కుమార
నవనీత చోర – నిరంజన..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

ఇరవై మూడవ పాశురము:

మా విన్నపములన్నీ మన్నింపవయ్యా నంద కిషోరా
నీ చరణములే మాకు గతియని
నమ్మితి ప్రహ్లాద నరసింహ
మేం నమ్మితి ప్రహ్లాద నరసింహ..॥

నీ గర్జనముతో గగనము సైతం
గంభీరమైయే భూమి కదిలెనే
పట పట విరిచే నీ కదలికలు
నరసింహ మమ్మేలు నరసింహ..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
నరసింహ అవతారము విష్ణువు యొక్క మొదటి నాలుగు అవతారములలో ఒకటి. ఇది యుగముల చక్రములో మొదటి యుగమైన ‘సత్య యుగము’ లో జరిగినది. ఈ యుగములో మత్స్య – కూర్మ – వరాహ – నరసింహ అవతారములు వెలువడ్డాయి. విష్ణువు యొక్క అవతారాలలో ఇది అత్యంత లక్ష్యంతో కూడినది మరియు ఉద్దేశపూర్వకమైనదిగా భావించబడుతుంది. శ్రీమద్ భాగవతంలోని 7వ స్కంధంలో ప్రహ్లాదుడు నరసింహ స్వామిని శాంతింప చేయడానికి 12 శ్లోకాలతో కూడిన స్తుతిని పాడాడు. అదే ‘నరసింహ స్తుతి’.

ఇరవై నాల్గవ పాశురము:

నీ గుణమ్మునకు నిత్య మంగళము
నీ నిజ కీర్తికి దివ్య మంగళము
నీ శుభములకు శుభ మంగళము
నీ పాదములకు స్థిర మంగళము..॥

లంక దుష్టులను కడ తేర్చితివి
హిరణ్య కశువుని మట్టు పెట్టితివి
రాక్షస జాతిని లయం చేసితివి
నీకు దిష్టి పోవుటకీ మంగళం..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
మార్గశిర మాసములో ఈ తిరుప్పావై పాశురముల సమయములలో 24వ పాశురము రోజు వేంకటేశ్వర స్వామికి (కృష్ణుడికి) తులసి మాల వేసి తప్పక హారతి ఇవ్వవలయును. పై పాశురము పాడుకుంటూ లేదా చదువుకుంటూ మంగళహారతి ఇవ్వవలయును. శుభము.

ఇరవై ఐదవ పాశురము:

దేవకి దే.. వి కుదయించినాడు
యశోద ఒడికి చేరినాడు
బుద్ధి హీనుండు ఆ కంసుండు
మమ్ము బ్రోవగా ఈ కృష్ణుండు..॥

బాల్యంలోని లీలను చూపి
కంసబుద్ధిని కడ తేర్చినావు
మా సంకల్పం నీ ధ్యానం
నీ దర్శనమే మా భాగ్యం..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

ఇరవై ఆరవ పాశురము:

క్షీర సాగరపు వటపత్రమందు
పరవశముతో పవళించిన స్వామి
మార్గళి సుదినము మా వ్రతమ్ము కదా
వర కమలమ్ములు ప్రసాదింపుమయ్యా..॥

మా పూర్వీకుల విన్నపములనే
మా విన్నపముగా నీకు చేర్చితిమి
నీ అనుగ్రహమే మాకు శరణము
ముకుంద – కణ్ణన్- ముత్య – మాయోన్..॥

వైభవంగ నీ మంగళశాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
పైన తెలిపిన కృష్ణుని నామాలలో ‘మాయోన్’ అనే నామము కృష్ణుడికి ఉన్న ఒక పురాతన తమిళ నామము. ముఖ్యంగా ముల్లె తను అక్కడ వున్న అటవీ ప్రాంతములో కృష్ణుడిని ఈ పేరు తో కొలిచేవారు అని పూర్వుల వాక్యము.

ఇరవై ఏడవ పాశురము:

నీ చెంత చేరి ఆనందము పొంది
మా పాయసమ్మున నేయి ధార కట్టి
నీ మోచేతులకు కారా భుజయింప
మా కదే ఎంతో బహుమానం..॥

అశ్వని – భరణి – కృత్తిక – రోహిణి
మృగశిర – ఆరుద్ర – పునర్వసు – పుష్యమి
ఆశ్లేష – మఖ – పుబ్బ – ఉత్తర
హస్త – చిత్త – స్వాతి – విశాఖ..॥

అనూరాధ – జ్యేష్ఠ – మూల
పూర్వాషాడా.. – ఉత్తరాషాడా
శ్రవణం – ధనిష్ట – శతభిష – పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర – రేవతి – అభిజిత్..॥

నక్షత్ర కూటమితో పూజింతుము
విష్ణు సహస్ర నామము పలుకుతు
ఈ నక్షత్ర కూటమితో పూజింతుము
విష్ణు సహస్ర నామము పలుకుతు
ముత్యాల హారతులతో నిన్ను
మువ్వ గోవిందుడిగా నిన్ను
మా మువ్వ గోవిందుడిగా నిన్ను..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
విష్ణు సహస్ర నామంలో 27 నక్షత్రాల సమూహము కలిసి వుంటుంది. ప్రతీ నక్షత్రము 4. పాదాలు కలుపుకొని 108 నక్షత్ర పాద సమూహ ప్రభావము విష్ణు సహస్ర నామంలో కలిసి వుంటుంది. కనుక జాతకునికి శుభము కలుగుతుంది. ఆధ్యాత్మికంగా 9-18-27-41-51-108 సంఖ్యలు మనోబలాన్ని కలిగి వుంటాయి. అందుకే ఈ సంఖ్యలు విష్ణు సహస్రంలో వుంటాయి. 27 సంఖ్య విశేషము గలది. అందుకే ఈ సంఖ్యగల తిరుప్పావై చదువుకున్న తరువాత విష్ణు సహస్ర నామం చదువు కోవడం లేదా వినడం శుభాతి శుభం.

ఇరవై ఎనిమిదవ పాశురము:

గొల్ల దారులలో గోధూళితో ఆడి
వెలితి ఇంతయు లేని గోవింద
మా ఆపదలను మాయం చేసే
ఆ సుకృతమే చాలు పదివేలు..॥

గొల్ల భామలతో నీ లీలలన్నీ
బాల్య లీలలతో సరి తూగునులే
శాశ్వత మోక్ష సాధనాలకు
నీ పాదములే గతియగు స్వామి..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

ఇరవై తొమ్మిదవ పాశురము:

ఏడేడు జన్మలు ఏనాటికైనా
నిత్య సంబంధము నీ సమక్షమున
నీ కైంకర్యమే దివ్య సన్నిధి
దేవకి నందన – యశోద తనయా..॥

తామస గుణములు అన్నీ మరచి
నీ సేవకు మేం వచ్చితిమయ్యా
నీ పద్మపు పాదాలను కొలిచే
ఋణ భాగ్యమును మాకియ్యవయా..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్యా
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
ఈ 29వ రోజు ఈ పాశురము చదువుకొని లేదా పాడుకొని కృష్ణుడికి వివిద రకముల పువ్వులను సమర్పించుకొనవలయును.

ముప్పైవ పాశురము:

నిండు చంద్రుడువలె ముఖమును కలిగిన
మువ్వ గోవిందుడు మా కృష్ణుండు
మార్గశిరమున మువ్వ గోపాలుడికి
తిరు పాశురాలు అర్పించదమూ..॥

శ్రీ విష్ణుచిత్తుల చిన్నారి బిడ్డతో
ముప్పై పాశురము పాడినవారు
ఆ మువ్వ గోవిందుడి కృపములతో
ముక్తి పాశురము పొందేరు..॥

శ్రీ వత్స వక్షసం శ్రీశం శ్రీ లోలం
శ్రీ కరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం
శ్రీడ్యం శ్రీనివాసం భజేన్నిశం
పఠియించిన చాలు పరమౌషదము..॥

వైభవంగ నీ మంగళ శాసనం
చెయ్యడానికి వచ్చితిమయ్య
అచ్యుతానంత.. గోవింద మమ్మేలు
ఈ నోము జగతికి మంగళప్రదము॥

వివరణ:
శ్రీ గోదా దేవి కటాక్షముతో ఈ మువ్వ తిరుప్పావై ‘చివరి పాశురము’ శ్రీ ‘శ్రీనివాస ఐశ్వర్య మహా మంత్రము’ తో పూర్తి కావించబడినది.

ఓం శ్రీరంగనాథ ప్రియాయై గోదాయై నమః

(సమాప్తం)

Exit mobile version