3. టప్పు టప్పులు – నిప్పు రవ్వలు
ఒక రోజు మా ప్రవేటు అయ్యోరు… మమ్మల్నందర్నీ టూరుకు తీసకపోతానని చెప్పినాడు. దాంతో అందరికీ ఒకటే కుశాల అయిపాయె. ఎక్కడికి తీసకపోతాడో… ఏమోనని అందరూ సెవులొగ్గి ఇంటిమి.
‘సెంద్రగిరి’కి తీసకపోతాననీ, ఆడ రాజుగారి కోట, రాణిగారి కోట, రాజులు వాడిన కత్తులు, కటార్లు, కిరీటాలు, వాళ్లేసుకున్న గుడ్డలు, నగలు, కోట ముందు కోనేరు, దొంగల్ని ఉరేసిన సోటు… ఇట్టాంటియన్నీ సూసొస్తామని చెప్పినాడు.
మాకందరికీ ఒకటే ఉసారొచ్చేసింది. అందరమూ నేనొస్తానంటే నేనొస్తానని పందాలు ఏసుకోని మాట్లాడుకుంటా ఉండాము. అప్పుడే మేము ఏమేం గుడ్డలేసుకోవాలి, ఏమేం తీసకపోవాలి ఇట్టాంటియ్యన్నీ మాట్లాడేసుకుంటా ఉండాము.
బస్సు చార్జీకి తలా ఐదు రూపాయలు తీసకరమ్మనీ, మద్దేనం తినేందుకు పులుసన్నమో, పెరుగన్నమో, సెపాతీలనో ఏదో ఒకటి తెచ్చుకోమనీ చెప్పినాడు అయ్యోరు.
ఈ ఇసయాన్ని మా ఇంట్లో చెప్పి, నన్ను కూడా టూరుకు పంపీమని మా నాయినతో గెట్టిగా చెప్పినాను.
“నాయినా, నేను కూడా టూరుకు పోతాను నాయినా?” అనింది మా సిన్నక్క.
“నువ్వేం వొద్దు పో. నేను మాత్రమే పోతాను.” అన్నాను అది ఏడ నాకు అడ్డం వొస్తుందోనని.
“నేనొస్తే నీకేం రా? నీ వొళ్లోనా కూసోబోతాను నేను? బస్సులో కదా కూసోబోతాను.” అంటా లాజిక్కు లాగింది.
“ఊహూ, నువ్వొద్దు. ప్రవేటులో సదివేవాళ్లను మాత్రమే రమ్మన్నాడు అయ్యోరు. మిగతావోళ్లు వొద్దంట.” అని లేని కండీసను సెప్పినాను.
“సరే, నువ్వు మాత్రమే పోదువు లేరా! అమ్మా, నువ్వు స్కూల్లో టూరేస్తే పోదువులే…” అన్నాడు మా నాయిన మా అక్కకు నచ్చజెప్పుతా.
“అప్పుడు వీణ్ణి నాతో పంపీయద్దు నాయినా!” అనింది మా అక్క నన్ను ఉడికిస్తా.
ఆ ఆదివోరమే సెంద్రగిరికి టూరు పోతున్నామనీ, తెల్లార్తో ఏడో గంటకంతా అందురూ ప్రవేటు దగ్గరకు వొచ్చేయాలని చెప్పినాడు మా సైదా అయ్యోరు.
ఆ దినం తెల్లార్తో తినేందుకు సెపాతీలు సెయ్యిస్తానని, మద్యానానికి పులుసన్నమూ… కొంచిం పెరుగన్నమూ కూడా కట్టిస్తాననీ చెప్పింది మా పిన్ని.
ఆదివోరం తెల్లర్తో ఐదో గంటకంతా నిద్రలేసి, నీళ్లు పోసుకోని, మంచి గుడ్డలు ఏసుకుని నేను నీటుగా తయారైపోతిని. మా పిన్ని ఐదు సెపాతీలు ఒక ఇస్తరాకులో పెట్టి మడిసి నూలుతో సుట్టింది. కొంచిం పులుసన్నమూ, కొంచిం పెరుగన్నమూ ఇంకో రొండు పొట్లాలుగా కట్టిచ్చింది. వాటిని ఒక సంచీలో పెట్టుకున్నాను. తాగేదానికి నీళ్ల బాటిల్ నిండుగా నీళ్లు పోసుకుంటిని. మద్దెమద్దెలో తినేదానికి సెనిగుంటలూ, మురుకులూ, పబ్బిళ్లలూ కాయితంలో సుట్టిచ్చింది మా పిన్ని.
ఇంతలో… “నేను రెడీ. నువ్వు రెడీనా రా…” అంటా వొచ్చినాడు వేనుగోపాల్.
“నేను కూడా రెడీ నే…” అంటా సంచీ తీసుకుని బయటికి పరిగెత్తితిని.
“వొరే, వొరే… నీళ్ల బాటిల్ మర్చిపోయినావురా…” అంటా బయటికొచ్చి దాన్ని నా సేతికిచ్చింది మా సిన్నక్క. ఆనక…”వొరే, జాగ్రత్త రా…” అంటా ఎచ్చరిచ్చింది కూడానూ.
బాటిల్‌ను తీసుకుని మా ప్రవేట్ కాడికి పరుగులు తీస్తిమి ఇద్దరమూ.
అప్పిటికే అక్కడికి చానామంది పిలకాయిలు వొచ్చేనుండారు. మంచిమంచి గుడ్డలేసుకోని చేతల్లో సంచులు పెట్టుకుని నిలబడుకోని ఉండారు. ఒకరినొకరు పలకరించుకుంటా మురిసిపోతా ఉండారు.
తినేదానికి ఏమేం తెచ్చుకోనుండారో ఒగరికొకరు చెప్పుకుంటా ఉండారు. బస్సులో ఎవురెవురి పక్కన ఎవురు కూసోవాలో నిర్ణయించుకుంటా ఉండారు.
టూరు బస్సు ఇంకా రాలేదు. బస్సుకోసం అందరమూ ఆత్రంగా ఎదురుచూస్తా ఉండాము. సైదా అయ్యోరు కూడా ఇంకా రాలేదు.
కొంచేపటికి బస్సు రానే వొచ్చింది. అందరమూ బిలబిలమంటా బస్సు ఎక్కినాము. కొందరు పెద్దాళ్లు తమ బిడ్డలు కోసరం సీట్లు పడతా ఉండారు. అందరూ కిటికీల పక్కనే కూసోవాలని తాపత్రపడతా ఉండారు.
నేనూ ఎట్టాగో బస్సులోకి దూరి కిటికీ పక్కన సీటు సంపాదిస్తిని. నా పక్కన కాంచన కూసునింది. ఆ పక్కన వేనుగోపాలు, సుమతీ, రాజేశ్వరి కూసున్నారు.
కాంచనాను ఆ పక్కకుపోయి, వేనుగోపాలును నా పక్కకు రమ్మంటే కాంచన వొప్పుకోలేదు. నా పక్కనే కూసినింది. ఇంతలో బస్సు బయలుదేరింది. అందరమూ ఒగరినొకరు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉండాము.
***
సాయింత్రమైంది. “నాయినా బాలడు ఏందో బొళువుగా తెస్తా ఉండాడు, ఇటొచ్చి చూడు నాయినా….” అనింది బాలడి సిన్నక్క, ఇంట్లో నుండి గబగబ బయటికొచ్చి చూసినారు బాలడి నాయినా, పిన్నీ.
సంచిలో ఏందో బళువుగా పెట్టుకొని మొయ్యలేక మోసకొస్తా ఉండాడు బాలడు.
“టెంకాయిలా?” అనింది పిన్ని.
“మామిడికాయలేమో?” అన్నాడు నాయిన.
“కాదు, బెల్లం ముద్దలు…” అనింది సిన్నక్క.
“ఏందో అది, దగ్గరికి రానీయండి సూద్దాం. పరవాలేదు, మనోడు సెంద్రగిరినుండి ఒఠి చేతల్తో రాకుండా ఏదో ఒకటి తెస్తా ఉండాడు. గెట్టోడే…” అన్నాడు నాయిన.
ఇంటికాడికి రానే వొచ్చినాడు బాలడు. “వొరేయ్, ఏందిరా అది చానా బలంగా తెచ్చినావే, ఇంటికి.” అంటా అడిగినాడు నాయిన.
“నాయినా ఇది చూడు. ఎంత ఇసిత్రంగా ఉంటిందో?” అంటా సంచీని తీసి చూపించినాడు బాలడు.
ముగ్గురూ ఆత్రంగా సంచిలోకి తొంగి చూసినారు. దాంట్లో… వాళ్లు ఇంతకు మునుపు అనుకునిందేమీ లేవు. ఒట్టి రాళ్లు మాత్రం కనిపించినాయి! తెలుపూ, పసుపూ, ఎరుపూ రంగులు కలగలిసి గుండ్రాయి సైజుల్లో ఉండాయి రాళ్లు.
“నాయినా ఇందా నీకు రొండూ, పిన్నీకి రొండూ, ఇంద మేయ్ నీకూ రొండూ…” అంటా తలా రొండేసి రాళ్లు వాళ్ల చేతికిచ్చినాడు బాలడు. చివరగా తనూ రొండు రాళ్లును చేతికి తీసుకున్నాడు.
వాటితో ఏం చెయ్యాలో తెలీక వాటిని తిప్పి తిప్పి చూస్తా ఉండారు ముగ్గురూ.
“నాయినా, ఇట్ట సూడు నాయినా ఈ ఇంత…” అంటా రొండు రాళ్లను ఒకదానితో ఒకటి టప్పు టప్పుమంటా రాస్తున్నట్టుగా కొట్టినాడు బాలడు.
వాటి రాపిడికి దాన్నుండి నిప్పురవ్వలు పుట్టినాయి. రాసేకొద్దీ చమక్ చమక్ మంటూ నిప్పురవ్వలు బయటికి రాసాగినాయి.
“మీరూ రాయండి నాయినా… బాగుంటాది…” అన్నాడు బాలడు.
బాలడి సిన్నక్క ఉసారుగా రాళ్లను రాసుకునేలా కొట్టింది. కొన్ని నిప్పురవ్వలు పుట్టుకొచ్చినాయి. పిన్నీ రాళ్లను ఒకదానితో ఒకటి కొట్టింది. కానీ అందులో నుండి ఏమీ రాలేదు. మళ్లా కొట్టింది. ఊహూ రాలే. విసుగ్గా… “థూ… దీనికా ఈటిని అంతదూరం నుండి మోసకొచ్చినావు?” అంటా వాటిని విసుగ్గా కింద పడేసింది.
“వొరే, ఏమిరా ఇది? ఆ మాత్రం నిప్పురవ్వలు పుట్టించేందుకు ఈడ రాళ్లు దొరకవా, ఏందీ?” అన్నాడు నాయిన.
“నాయినా ఇవి రంగులు రంగులుగా ఎంత బాగుండాయో చూడూ… ఇట్టాంటివి ఈడ యాడ దొరకతాయి నాయినా మనకు. అందుకే తలా రొండు రొండు రాళ్లు అవసరమవుతాయని ఇన్ని తెస్తిని.” అన్నాడు బాలడు.
“పోరా పిచ్చోడా, పొయ్ పొయ్ ఊర్నిండి రాళ్లనా తెస్తారు ఎవురైనా… నీ తెలివి తెల్లారినట్టే ఉండాది.” అనింది పిన్ని.
“అది కాదే, పెద్దాళ్లు నాలుగు రాళ్లను ఎనకెయ్యమంటారుగా. వీడు మన నలుగురి కోసరమూ ఎనిమిది రాళ్లను ఎనకేసేందుకు తెచ్చినాడు.” అంటా నవ్వినాడు బాలడి నాయిన.
“ఎనకేమో కానీ, మన నెత్తిన ఎయ్యకుంటే అంతే చాలు… ఒసేయ్ నలినీ ఈటిని తీసుకెళ్లి బయట గుమ్మరించి రాపో…” అని చెప్పి సక్కా లోపలికి పోయింది బాలడి పిన్ని.
ఎర్రి మొగం ఏసుకుని నిలబడినాడు బాలడు.
(మళ్ళీ కలుద్దాం)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).