[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]
అధ్యాయం-2 ఆయి ఉత్తర, దక్షిణ భారత తీర్థయాత్రలు
చార్ధామ్ యాత్రకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉన్నందు వలన నన్ను నేను మానసికంగా యాత్రకు సిద్ధం చేసుకునే పనిలో పడినాను. చార్ధామ్ యాత్రా విశేషాలను ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అవగాహన పెంచుకున్నాను. ఈ క్రమంలో మా ఆయి (ఆయి అంటే మరాఠిలో అమ్మ) ఉత్తర, దక్షిణ భారత యాత్రలు అనివార్యంగా గుర్తుకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మా ఆయి సుశీలాబాయి
మే 10 ‘మదర్స్ డే’ రోజున మా ఆయి తీర్థయాత్రలను గుర్తు చేసుకున్నాను. ఉత్తర భారతానికి తీర్థయాత్ర అంటే వారి భాషలో కాశీ యాత్ర అనే అర్థం. గోదావరికి ఎడమ వైపున ఉన్న ఆదిలాబాద్, కుడి వైపున ఉన్న నిజామాబాద్ జిల్లా వాళ్ళు సోన్ వద్ద గోదావరి తానంకు పోయినప్పుడు ‘గంగ తానంకు పోయినం’ అనేవారు. మన వాళ్ళకు ఏ నదిలో మునిగినా అది గంగ తానం కిందనే లెక్క. అట్లే కేదార్‌నాథ్‌కు పోయినా, బద్రీనాథ్‌కు పోయినా అది కాశీ యాత్రనే. అప్పుడు చార్ధామ్ యాత్ర అని పేరు లేకుండే. కాశీ యాత్రకు ఆయి రెండు సార్లు వెళ్ళింది. దక్షిణ యాత్రకు.. అంటే రామేశ్వరం యాత్రకు ఒకసారి వెళ్ళింది. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. ఇది ఆమె చెప్పిన ముచ్చటనే. మొదట కాశీ యాత్రకు పోయి గంగ నీళ్ళు తీసుకొచ్చి, తర్వాత యాత్రలో రామేశ్వరం వెళ్ళి గంగ నీళ్ళను అక్కడ సముద్రంలో కలపాలి. రామేశ్వరం సముద్రపు నీళ్ళను తీసుకొని వెళ్ళి మళ్ళీ కాశీ యాత్రలో గంగలో కలపాలట. అప్పుడే తీర్థయాత్రా ఫలం సిద్ధిస్తుందని వారి నమ్మకం.
ఈ యాత్రకు బోథ్ నుంచి ఒక ప్రత్యేకమైన బస్సు బయలుదేరింది. సాధారణంగా ఈ యాత్రలను ఎండా కాలంలోనే నిర్వహించేవారు. తీర్థ యాత్రలు నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఒకాయన ఈ యాత్రలను నిర్వహించేవాడు. ఆయన పేరు ఇప్పుడు గుర్తుకు లేదు. వంట పాత్రలు, బియ్యం పప్పులు, ఉప్పులు, కట్టెలు.. తదితర సరంజామాతో బస్సు బయలుదేరుతుంది. ఆయి మొదటి కాశీ యాత్ర యాదికి లేదు కానీ రామేశ్వరం యాత్ర, రెండవ కాశీ యాత్ర మాత్రం యాదికి ఉన్నాయి. అవి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే చేపట్టిన యాత్రలు. 1988లో అనుకుంటాను.. రామేశ్వరం పోయినప్పుడు వర్షకొండ (కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి దగ్గర ఈ ఊరు ఉంటుంది) అత్తను కూడా తన వెంట తీసుకుపోయింది. పోయేటప్పుడు ఆయికి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాను. ఆ కాలంలో వెయ్యి రూపాయలు ఎక్కువే. ‘అత్తకు కూడా ఇవ్వురా’ అని సిఫారసు చేసింది. ఆమెకు కూడా అయిదు వందలు చేతిలో పెట్టాను. పాపం అత్త మధ్య దారిలో ఎక్కడో జారి పడితే కాలు విరిగిపోయింది. తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకునే యాత్రను పూర్తి చేసిందట. ఇక రెండవ కాశీ యాత్రకు పోయినప్పుడు ఆదిలాబాద్ నుంచి తన పెద్ద వదినను వెంట తీసుకుపోయింది. ఇక యాత్ర మొత్తం ఆమెకు సేవలు చేయడంలోనే దందం అయిపోయిందట. మొత్తం మీద గంగ నీళ్ళను రామేశ్వరంలో, రామేశ్వరం సముద్రం నీళ్ళను గంగలో కలిపి తీర్థయాత్రను సఫలం చేసుకున్నది. అదొక తృప్తి ఆమెకు. ఆమె తీర్థయాత్రలకు పోయినప్పుడు కొన్ని పోస్ట్ కార్డుల మీద నా అడ్రస్ రాసి ఇచ్చాను. మరాఠీలో ఉత్తరాలు రాసేది. అట్లా రాసిన ఆమె లేఖలు ఇప్పటికీ నా వద్ద భద్రంగా ఉన్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండే మా బాబా ఈ యాత్రలకు వెళ్ళాడో లేదో తెలియదు. యాత్ర నుంచి వచ్చాక ఒక నెల రోజుల పాటు ఎవరు ఇంటికి వచ్చినా అవే ముచ్చట్లు చెప్పేది.
ఇక్కడ మా చిన్నాయి (నాయినమ్మ) కాశీ యాత్రను గుర్తు చేసుకోవాలని అనిపిస్తున్నది. ఉత్తర భారత యాత్రలు ఎండా కాలంలోనే చేస్తారని ఇంతకూ ముందే చెప్పాను కదా. చిన్నాయి కాశీ యాత్ర సమయానికి నేను ఇంకా పుట్టనే లేదు. యాత్రలో ఎక్కడో ఒక దేవాలయంలో ఆమె చెప్పులు మాయం అయినాయట. కొత్త చెప్పులు కొనుక్కోకుండా బరిగాల్లతోనే నడిచిందట. ఆ ఎండకు కాళ్ళు కాలి కుడి పాదానికి పుండు అయ్యిందట.
మా నాయినమ్మ సక్కుబాయి
ఆమెకు శక్కరి బీమారి ఉండడంతో ఆ పుండు యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తగ్గకపోగా ఇన్ఫెక్షన్ పైకి పాకింది. ఒక చిన్న పుండు గాంగ్రీన్‌గా మారడంతో బాబా ఆమెను ఆదిలాబాద్ జిల్లా దవాఖానాకు తీసుకోపోతే డాక్టర్లు ఇది నయం కాదని, కాలు తీసేయ్యక పొతే ప్రాణాలకే ముప్పు అని చెప్పి మోకాలి పై వరకు కాలును తీసి వేశారట. ఆమె చనిపోయేదాకా ఒంటి కాలు మీదనే బతికింది. నాకు బుద్ది తెలిసినప్పటి నుంచి ఆమెను ఒంటి కాలుతోనే చూశాను. ఆమె మాకు రాత్రి వేళల్లో అద్భుతమైన కథలు చెప్పేది. ఈ సంగతులన్నీ నా ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో రాసుకున్నాను. యాత్రలో ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందో గుర్తుకు వచ్చింది.
***
మరి నా చార్ధామ్ యాత్ర సందర్భంగా నా ఇద్దరు బిడ్డలు.. అంజలి, వెన్నెల అమెరికాలో ఉన్నారు. నా యాత్ర ఏమిటో గాని రోజు పిల్లల క్లాస్ పీకుడు ఎక్కువ అవుతున్నది.
- ఆస్టిన్‌లో జాన్సన్ లైబ్రరీలో తప్పిపోయినట్టు చెయ్యకు. అందరితో పాటు నడువు
- హూవర్ డ్యాం వద్ద పట్టు దప్పి పడ్డట్టు పడకు. కిందా మీదా చూసుకుంట నడువు.
- నయాగరా దగ్గర జారి పడ్డట్టు పడకు. జాగ్రత్తగా నడువు.
- నాకేమి కాదు అన్న ధీమాతో అజాగ్రత్త పనికిరాదు.
- రోజు రెండు సార్లు ఫోన్ చేసి నీ నువ్వెక్కడున్నావో మాకు చెప్పాలి.
- నీతో వస్తున్న దోస్తుల ఫోన్ నంబర్లు, టూర్ ఆపరేటర్ ఫోన్ నంబరు ఇవ్వు.
- ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న బూట్లకు గ్రిప్ లేదు. ఖర్చుకు వెనుకాడక మంచి హైకింగ్ బూట్లు కొనుక్కో. బూట్లు కొన్నాక ఫోటో పెట్టాలట. పెట్టకపోతే పోనివ్వరట.
ఇట్లా.. పెద్దది క్లాస్ పీకుడు కాంగనే చిన్నది.. ఒకదాని తర్వాత ఒకరు.. నడుస్తున్నది క్లాస్ పీకుడు జుగల్బందీ వ్యవహారం. చిన్నపోరని కంటే అధ్వాన్నం అయిపోయింది. చిన్నప్పుడు మా అయి కూడా ఎప్పుడూ ఇన్ని జాగ్రత్తలు చెప్పలేదు. మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పొచ్చెర గుండం పోకురా’ అని మాత్రమే చెప్పేది. అయినా ఆమెకు తెలవకుండా పొచ్చెర గుండంకు (పొచ్చెర జలపాతం) పోయినం, గుండంలో తానం చేసినం. క్షేమంగా ఇంటికి వచ్చినం. ఏమీ కాలే.
పిల్లలు ఏడేండ్ల కింద 2019 నాటి నా కార్నామా ఇప్పుడు గుర్తు చేస్తే ఎట్లా? అప్పుడు వయసు 55. ఒంటిలో శక్తి ఉండేది. ఆ ధీమాతో కొంత దూకుడుగా పోయి అడ్డంబడ్డా. ఇప్పుడు వయసు 63. జాగ్రత్తగా కిందా మీదా చూసుకుంట నడుస్తా కదా! మా చిన్నాయి నిర్లక్ష్యం ఎక్కడకి దారి తీసిందో నాకు ఎరుకే కదా! పిల్లలు ఏడు సముద్రాల అవతల ఉన్నా ఆయి కంటే ఎక్కువగా నన్ను నియంత్రిస్తున్నారు.
ఇది నా చార్ధామ్ యాత్ర షురువాద్ ముచ్చట.
(ఇంకా ఉంది)
శ్రీధర్ రావు దేశ్‌పాండే తెలంగాణకు చెందిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు. రచయిత. సాగునీటి శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసినారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి కార్యాలయంలో పదేళ్ళ పాటు ఓఎస్డిగా సేవలు అందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’తో పాటు సాగునీటి రంగంపై పలు పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. తెలంగాణ అస్తిత్వంపై వ్యాసాల సంకలనం వెలువరించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. మరుగున పడిపోయిన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జీవిత చరిత్రను రాశారు. ‘అమెరికా ముచ్చట్లు’ ట్రావెలాగ్ రాశారు. ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో తన బాల్యపు జ్ఞాపకాలతో పాటు స్వగ్రామం బోథ్ భౌగోళిక, సాంస్కృతిక చరిత్రను వివరించారు.
