[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]
అధ్యాయం-3 ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్ర చరిత్ర: ఆదిలాబాద్ జిల్లా ప్రస్తావనలు
మా చార్ధామ్ యాత్ర సందర్భంగా కొన్ని యాత్రా చరిత్రలు, ట్రావెలాగ్లు చదవడం ప్రారంభించాను. అందులో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీ యాత్ర చరిత్ర’, పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన ‘సిల్క్ రూట్ సాహాస యాత్ర’, ప్రొ ఆదినారాయణ గారు రాసిన ‘భ్రమణ కాంక్ష’-దిల్లీకి పాదయాత్ర, పైడిమర్రి గిరిజ గారు రాసిన ‘గిరిగమనం’ పుస్తకాలు ఉన్నాయి. తీర్థయాత్రలకు పోయినవారు, లేదా ఇతరత్రా చారిత్రిక, పర్యావరణ దృష్టితో యాత్రలు చేసినవారు తమ యాత్రానుభావాలను రికార్డు చేసినవి ట్రావెలాగ్లు తెలుగు సహా ప్రపంచ భాషల్లో వందలాది పుస్తకాలు ప్రచురణ అయినాయి. సాహిత్యంలో యాత్రా సాహిత్యం కూడా కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ లాగా ఒక సాహిత్య విభాగంగా గుర్తింపు పొందింది. తెలుగులో కూడా యాత్రా సాహిత్యం చాలానే వచ్చింది. వాటిలో అత్యంత ప్రాచీనమైనది ఏనుగుల వీరాస్వామయ్య రాసిన ‘కాశీ యాత్ర చరిత్ర’. ఇది చదవడం ఒక అద్భుత అనుభవం. ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రా చరిత్రలో ఆయన ఆదిలాబాద్ జిల్లా గుండా ప్రయాణిస్తున్నప్పుడు రికార్డు చేసిన కొన్ని విశేషాలు పాఠకులతో పంచుకోవాలనుకొంటున్నాను.
కాశీయాత్ర చరిత్ర పుస్తకం ముఖపత్రాలు
ఏనుగుల వీరాస్వామయ్య మద్రాస్ హైకోర్టులో దుబాసిగా (Interpreter) పనిచేసేవాడు. 1830లో ఆయన వంద మంది పరిచారగణంతో మద్రాస్ నుంచి యాత్రను మొదలు పెట్టి తిరుపతి-కర్నూలు-మహబూబ్ నగర్-హైదరాబాద్-కామారెడ్డి-బాల్కొండ-సోన్-నిర్మల్-వాంకిడి-వడూర్-ఇచ్చోడ- ఆదిలాబాద్-నాగ్‌పూర్ మీదుగా కాశీ వెళ్లి, తిరుగు ప్రయాణంలో కలకత్తా, పూరి, విశాఖపట్టణం, పుదుచ్చేరి నుంచి మద్రాస్ చేరుకున్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన అనుభవాలను పుస్తకంలో రికార్డు చేసినాడు. ఈ యాత్రా చరిత్ర 1848లో అచ్చు అయ్యింది. కాశీయాత్ర చరిత్ర నాల్గవ ప్రకరణంలో ఆయన మన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న తెలంగాణా గోదావరి తీర విశేషాలను ఆసక్తికరంగా నమోదు చేశాడు. వాటితో పాటు ఆదిలాబాద్ జిల్లా దాటే వరకు అనేక ఆసక్తికరమైన అంశాలను నమోదు చేసినాడు. ఈ తరం వారు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ విశేషాలను సంక్షిప్తంగా పేర్కొంటున్నాను.
సోన్ వద్ద కిలోమీటర్ వెడల్పు ఉన్న గోదావరి నదిని పడవల్లో దాటి ఇటు ఆదిలాబాద్ జిల్లాలోకి రావడం దుర్లభంగా ఉండేది. వానాకాలం 4 నెలలు పడవల్లో కూడా రాకపోకలు బంద్ అయ్యేవి. గోదావరిపై సోన్ వద్ద ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ 1905లో రాతి వంతెన నిర్మించిన తర్వాతనే హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి. అంతకు ముందు ఏ అవసరాలకైనా నాగ్‌పూర్ వెళ్ళవలసి వచ్చేది. సోన్ వద్ద గోదావరి నది దాటడానికి సంబంధించిన సంగతులను ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలోఈ విధంగా వర్ణించాడు. వీరాస్వామయ్య తన యాత్రానుభావాలను ఆనాడు వినియోగంలో ఉన్న సరళ గ్రాంథిక తెలుగు భాషలోనే రాసినాడు.
“(జూలై) 28 తేదీ ఉదయమున 6 గంటలకు ఆయూరు వదిలి 12 గంటలకు అక్కడికి 9 కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరి తీరము. ఆరు బ్రాహ్మణుల యిండ్లున్నవి. గోదావరి కవతలి గట్టున స్వణ్ (సోన్) అని చెప్పబడే బ్రాహ్మణుల యిండ్లు గల యగ్రహార మున్నది. ఆ దినము నడచిన బాట సరాళము, యిసుకపొర, నిండా అడవి లేదు. జగనంపల్లి(జంగంపల్లి) నుంచి యీ దూదుగాముకు రెండు మూడు బాటలు కలవు. అందులో నేను వచ్చిన బాట కొంచెం చుట్టయినా వసతి యయినది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనం పల్లెకు 2 కోసుల దూరములో నున్నది. ఆయూరి మీద నొక బాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనం పల్లెకు 4 కోసుల దూరములో బాలకొండ యనే గొప్ప గ్రామము షహరు వలెనే బస్తీగా నున్నది. యేరస్తా గుండా జగనం పల్లెకు వచ్చినా యీ బాలకొండ నడి వీధిలో నడిచి రావలసినది. నేను వచ్చిన బాట శీదాగ బాలకొండకు మధ్య యేయూరును తగలకుండా వచ్చుచున్నది.”
“..నది దాటించే పుట్ల విచారణకర్త వాసముగా నున్నాడు. ఈ యూరికి అవతలి తట్టున నుండే యూరు మద్వల మయము. వారే తీర్థ వాసులు. స్మార్తులు పది యిండ్ల వారు ఈ రెండూళ్ళలో నున్నారు. కావలసిన పదార్థములు యధోచితముగా దొరుకును. ఈ దూదుగాముకు ఉభయపాశ్వాలలో షహరుల వంటి గ్రామాలు రెండున్నవి. ఒక పక్క బాలకొండ సరే గదా! గోదావరికి అటుపక్క నిర్మల అనే షహరొకటి యున్నది. ఈ రెండు స్థలములలో పట్టణములలో దొరికేలాగు సకల వస్తువులు దొరుకును..”
“.. పై జగనం పల్లె నుంచి కుశదర్పణ (కుస్తాపురం) మనే గోదావరి తీరపు రామ క్షేత్రానికి పోవుచున్నది. ఆ క్షేత్రము ఇక్కడికి 4 కోసుల దూరము. నాగపూరు దారికి వొత్తియించున్నది. అక్కడ అనేక బ్రాహ్మణులు తీరవాసమని యిండ్లు కట్టుకొని యున్నారు. ఈ దూదుగాముకు నదికి గడియ దూరములోనున్నది. యిక్కడ స్నాన ఘట్టము వసతి కాదు; నీడ లేదు. నది యిప్పట్లో పూర్ణ ప్రవాహగముగా నున్నది. ఇక్కడ సుమారు నది గడియ దూరము వెడల్పు కలది. నది నడమ కొన్ని లంకలున్నవి.”
ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో సోన్ వద్ద గోదావరి వెడల్పు ఒక గడియ దూరం అన్నాడు. గడియ అంటే 24 నిమిషాలకు సమానం. గోదావరిని 24 నిమిషాల్లో లేదా అద్ద గంటలో దాటవచ్చు అన్న అర్థంలో ఆయన దూరాన్ని కాలమానంలో చెప్పినాడు. ఈ రకంగా దూరాన్ని కాలమానంలో చెప్పడం యూరప్, ఆమెరికాల్లో ఉన్నది తప్ప మన వద్ద లేదు. వీరాస్వామయ్య 1848లో దూరాన్ని కాలమానంలో చెప్పినాడంటే ఆయనకు పాశ్చాత్య వ్యక్తీకరణల పట్ల అవగాహన ఉందని అనుకోవచ్చు
“31 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరులోకి 4 గంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు పక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది..”
ఇట్లా వీరాస్వామయ్య గారు సొన్న గంగ నదీ తీరాన్ని వర్ణించినాడు. సొన్న మధ్వల ప్రాబల్యం ఉన్న ఆగ్రహారం అని వీరాస్వామయ్య చెప్పింది నిజమే. అయితే ఇక్కడ స్మార్తులు కూడా ఉన్నారు. మా కుటుంబ పురోహితుడు దివంగత రాములు గారు స్మార్త సాంప్రదాయానికి చెందినవాడు. కాలానికి అనుగుణంగా పట్టు విడుపులు ప్రదర్శించేవాడు. మధ్వలు మరింత కట్టర్ సాంప్రదాయవాదులని ఒక అభిప్రాయం ఉన్నది.
ఆయన నిర్మల్‌లో వేంకటేశ్వరుని దేవాలయం దేవరకోటలో బసచేసినట్టు, నిర్మల్ దేష్పాండ్యా వెంకటరాయుని ఆతిథ్యం పొందానని పేర్కొన్నాడు. నిర్మల్‌లో కంచర కులస్తులు తయారు చేసే ఇత్తడి పంచపాత్రలకు ప్రసిద్ది అని కూడా రాశాడు. కాని నిర్మల్ కొయ్య బొమ్మల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఈ విషయమై నా మిత్రుడు, ప్రముఖ నిర్మల్ చరిత్రకారుడు, కవి శ్రీ తుమ్మల దేవరావు గారిని అడిగినప్పుడు ఆయన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పినారు. వీరాస్వామయ్య ప్రస్తావించిన కంచరుల ఇత్తడి పరిశ్రమ ఇంకా కొనసాగు తున్నదని, కంచర కుటుంబాలు వ్యాపార వర్గాల సహకారంతో ఇత్తడి సామాన్లు తయారు చేసి అమ్మి బతుకు తెరువు చూసుకుంటున్నారని చెప్పాడు. అయితే వారికి వరంగల్ జిల్లా పెంబర్తి ఇత్తడి పరిశ్రమకు లభించిన ప్రాచుర్యం మాత్రం లభించలేదు. నిర్మల్ బస్టాండ్‌ని ఆనుకొని ఉన్న ధర్మసాగర్ చెరువు పాత పేరు ‘కంచరోని కట్ట’నట. పాత తరం వారు ఆ చెరువును ఇప్పటికీ ‘కంచరోని కట్ట’ గానే పిలుస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను.
ఇక నిర్మల్ ప్రాంతంలో వీరాస్వామయ్య వచ్చేనాటికే కొయ్యబొమ్మల తయారి గ్రామాల్లో కొనసాగుతున్నప్పటికీ అది అప్పటికి పరిశ్రమ రూపం తీసుకోలేదు కాబట్టి వీరాస్వామయ్య దృష్టికి రాకపోయి ఉండాలి అన్నాడు. 1970వ దశకంలో కొయ్య బొమ్మల తయారి కళాకారులు ఒక సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నాక నిర్మల్ కేంద్రంగా కొయ్యబొమ్మల పరిశ్రమకు ఒక స్థిరత్వం, గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం కూడా కొయ్య బొమ్మల తయారీ కార్మాగారానికి కొంత స్థలం కూడా కేటాయించడంతో కొయ్య బొమ్మల పరిశ్రమ నిలదొక్కుకోవడమే కాదు ప్రపంచ ఖ్యాతి కూడా వాటికి లభించిందని, అయితే కొయ్యబొమ్మల తయారీకి వాడే ‘పొనికి కర్ర’ లభ్యత రోజు రోజుకి ఆదిలాబాద్ అడవుల్లో తగ్గిపోవడంతో బొమ్మల తయారీ పరిశ్రమ సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం ముంచుకు వస్తున్నదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు దేవరావు గారు.
నిర్మల్ నుంచి బయలుదేరి అంకిరి (వాంకిడి) గ్రామం గుండా 1830 ఆగస్టు 2 న “వొడ్డూరు (వడూర్)” చేరుకున్నానని వీరాస్వామయ్య తన ట్రావెలాగ్లో నమోదు చేసినాడు. అక్కడి నుంచి ఇచ్చోడ మీదుగా ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నాడు. అంటే వీరాస్వామయ్య పర్యటన నాటికి కూడా వడూర్ రహదారి మీదనే ఉన్నదని రూడి అవుతున్నది. ఆ తర్వాతనే కొత్త రహదారి నేరేడిగొండ మీదుగా నిర్మాణం అయినట్టు తెలుస్తున్నది. దానితో వడూర్ జాతీయ రహదారికి సుమారు 5 కిలోమీటర్లు పక్కకు జరిగిపోయింది. వీరాస్వామయ్య తన పుస్తకంలో “వొడ్డూరు బస్తి గ్రామము. సకల పదార్థాలు దొరుకును. బ్రాహ్మణుల యిండ్లు, చావిళ్లున్నవి. ఇక్కడ నొక చావిడిలో ఈ రాత్రి నిలిచినాను” అని మాత్రమే నమోదు చేసినాడు. ఆనాటికే వైడూర్యపురం వడూర్గా మార్పు చెందింది. వడూర్ చారిత్రిక వైభవం ఆనాటికి క్షీణించి పోయిందని అనుకోవచ్చు. అందుకే వీరాస్వామయ్య ఆ సంగతులు ఏవీ తన కాశీ యాత్ర చరిత్రలో వర్ణించలేదు.
ఆగస్టు 3న కడం నది దాటి విచ్చోడ (ఇచ్చోడ) అనే చిన్న ఊరులో డేరాల్లో బస చేసినామని నమోదు చేసినాడు. కడం నది ఉదృతంగా ప్రవహిస్తున్న కాలంలో కుంఫిని టప్పా (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపని పోస్ట్) కూడా రెండు మూడు దినములు నిలిచిపోతాయని పేర్కొన్నాడు. ‘విచ్చోడ చిన్న వూరు అయినా ముసాఫిరులకు యథోచితంగా కావలసిన వస్తువులు’ దొరుకుతాయని రాసినాడు.
ఆగస్టు 4న విచ్చోడ నుంచి దుర్గమమైన ‘మేకలగండి’ అడవిని దాటి యేదులాబాద్ (ఆదిలాబాద్) అనే షహరు వంటి యూరికి చేరుకున్నానని నమోదు చేసినాడు. మేకలగండి దాటేటప్పుడు పులుల నుంచి, దొంగల నుంచి రక్షణ కోసం తుపాకులు పేలుస్తూ అట్నూరు (గుడిహత్నూరు) వాగు దాటి, మలులే (మావల) తర్వాత యేదులాబాదు షహరు చేరినారట. ఇక ఆదిలాబాద్ గురించి వీరాస్వామయ్య ఈ విధంగా రాసినాడు. “యేదులాబాదులో సకల పదార్థాలు దొరుకును. సకల విధములైన పనివాండ్లు వున్నారు. జలవసతి కలదు. బ్రాహ్మణ ఇండ్లు కలవు. ఊరికి బయట బ్రహ్మంచారి బావ మఠం ఉన్నది. వూరి మధ్య కొన్ని మఠాలు ఉన్నవి. ఒక మఠంలో దిగినాను. విచ్చోడా అనే ఊరు మొదలుగా వోణి (మహారాష్ట్రాలో ఉన్న వణి) అనే వూరి వరకు ముషర్మల్కు అనే దివాన్జికి జాగీర్ అయి వున్నవి. ఈ యేదులాబాదులో నాయబు అనే అమలుదారుడున్నాడు. ఈ యూళ్లో కూడా వచ్చిన వారి యొక్క అసోదా నిమిత్తమున్నూ, పదార్థాల సంగ్రహము కొరకున్నూ ఆ దినమంతా నిలిచినాను.”
పై పేరాలో ప్రస్తావించిన ఊరి బయట ఉన్న బ్రహ్మంచారి బావ మఠం అనేది ప్రస్తుతం అందరి ఎరుకలో ఉన్న గోపాలకృష్ణ మఠమేనని మా మేనబావ సతీష్ చంద్ర దేశ్‌పాండే, ఆదిలాబాద్‌లో నా ఇంటర్, ఇంజనీరింగ్ క్లాస్మేట్ సుశీల్ దేశ్‌పాండే ద్రువీకరించారు. అట్లే ఊరి మధ్యన ఉన్న మఠాల గురించి అడిగితే ఇప్పుడు పిలుస్తున్న భైరంభట్ గుడి, బొజ్జావారి గుడి ఒకప్పుడు వసతి సౌకర్యాలు కలిగిన మఠాలేనని చెప్పాడు.
ఆగస్టు 5న ఆదిలాబాద్ నుంచి జైనద్‌లో చెరువు పక్కన ‘ముచ్చటగా రాతి పని చేసిన’ విష్ణు దేవాలయాన్ని(సూర్యనారాయణ దేవాలయం) సందర్శించి ధనోరా గ్రామం వద్ద పిన్నగంగ (పెన్ గంగ) నదిని దోనేల్లో దాటి మహారాష్ట్రలో ప్రవేశించినానని రాసినాడు. నదిని దాటించడానికి దోనే వాండ్లకు 2 రూపాయలు ఇచ్చినట్టు కూడా నమోదు చేసినాడు. తమ ఆదాయంలో నుంచి ఈ దోనే వాండ్లు ఒక హిస్సా నిజాం సర్కారుకు ఆదాయపు పన్ను చెల్లిస్తారని కూడా నమోదు చేసినాడు.
ఇవీ ఏనుగుల వీరాస్వామయ్య రాసిన కాశీ యాత్ర చరిత్రలో మా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు. ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. ఆయన సరళ గ్రాంథిక తెలుగు భాషను ప్రస్తుత వాడుక భాషలోకి సంస్కరించి మరొక పుస్తకాన్ని ప్రచురించారు కాలి నడక యాత్రీకుడు, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. ఈ తొలినాటి యాత్రానుభవాన్ని చదివి మీరూ ఆస్వాదించండి.
ఉత్తర, దక్షిణ భారత తీర్థయాత్రలు చేసిన మన ‘ఆయి’లు ఎవరూ యాత్రానుభావాలను రికార్డు చేయలేకపోయారు. ఇప్పుడు మా ఆయి బతికి ఉంటే ఆమె యాత్రానుభవాలను రికార్డు చేసి అక్షర రూపం ఇచ్చేవాడిని. తెలుగులో పురుషులు రాసిన ట్రావెలాగ్లు చాలానే ఉన్నాయి. మహిళలు రాసిన ట్రావెలాగ్లు చాలా తక్కువ. 1967లో ‘కాశ్మీర దీపకళిక’ అనే శీర్షికతో తన యాత్రానుభావాలను ప్రొ. నాయిని కృష్ణకుమారి గారు రాసినారు. ఇప్పుడిప్పుడు మహిళలు తమ యాత్రానుభావాలను రాస్తున్నారు. ఇటీవల ‘ఇంతియానం’ పేరిట 45 మంది మహిళలు రాసిన యాత్రానుభవాలతో రెండు భాగాలుగా పుస్తకాలను వెలువరించారు రచయిత్రి స్వర్ణ కిలారి గారు. పైడిమర్రి గిరిజ గారు రాసిన ‘గిరిగమనం’ తెలుగు యాత్రా సాహిత్యంలో విలువైన చేర్పుగా వచ్చాయి.
(ఇంకా ఉంది)
శ్రీధర్ రావు దేశ్‌పాండే తెలంగాణకు చెందిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు. రచయిత. సాగునీటి శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసినారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి కార్యాలయంలో పదేళ్ళ పాటు ఓఎస్డిగా సేవలు అందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’తో పాటు సాగునీటి రంగంపై పలు పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. తెలంగాణ అస్తిత్వంపై వ్యాసాల సంకలనం వెలువరించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. మరుగున పడిపోయిన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జీవిత చరిత్రను రాశారు. ‘అమెరికా ముచ్చట్లు’ ట్రావెలాగ్ రాశారు. ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో తన బాల్యపు జ్ఞాపకాలతో పాటు స్వగ్రామం బోథ్ భౌగోళిక, సాంస్కృతిక చరిత్రను వివరించారు.
