[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]
అధ్యాయం-4 చార్ధామ్ యాత్రలో మొదటి మెట్టు – దిల్లీకి రైలు ప్రయాణం
చార్ధామ్ యాత్ర కరపత్రం
చార్ధామ్ యాత్రలో తెలంగాణా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో దిల్లీ దాకా రైలు ప్రయాణం మొదటిది. 2026 మే 14 న నా సహా యాత్రీకులు చాలా మంది హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో రైలు ఎక్కినప్పటికీ మరి కొంత మంది కాజీపేటలో, రామగుండంలో, మంచిర్యాలలో కూడా రైలు ఎక్కినారు. మా టూర్ ఆపరేటర్ రెండు నెలల ముందే వేరు వేరుగా బెర్త్‌లు రిజర్వ్ చేయించి పెట్టినాడు కనుక మా మిత్ర బృందంలో సగం ఒక బోగీలో, మరో సగం ఇంకో బోగీలో ఉండిపోవలసి వచ్చింది. మేమున్న బోగీలో దాదాపు అన్ని కంపార్ట్మెంట్స్లో చార్ధామ్ యాత్రీకులే ఎక్కువ మంది ఉన్నారు. నేను, రమేశ్, వాడి భార్య అనుపమ సికిందరాబాద్ స్టేషన్లో పొద్దున్న6 గంటలకు రైలు ఎక్కి కూర్చొన్నాము. ఇక్కడే మరో బోగీలో రాజేందర్, అతని భార్య ఉమారాణి కూడా రైలు ఎక్కినారు. తల్లిదండ్రులను రైలు ఎక్కించడానికి రమేశ్ కొడుకు అభిరాం సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. రైలు బయలుదేరే దాకా మాతోనే ఉన్నాడు. 6.20కు రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. సుమారు 10 గంటలకు మంచిర్యాల స్టేషన్‌కు చేరుకున్నది. మంచిర్యాలలో అరవింద్, వాడి భార్య ఉమ; వెంకటరమణా రెడ్డి, వాడి భార్య ప్రశాంతి రైలు ఎక్కినారు. వారు వేరేగా రెండు బోగీల అవతల ఉన్నారు. వీళ్ళు బోథ్ నుంచి రోజు ముందే మంచిర్యాల వచ్చారట.
సికింద్రాబాద్ స్టేషన్లో
దిల్లీకి రైలు ప్రయాణంలో మిత్రులు
అందరూ ప్రయాణంలో తినడానికి బోలెడన్ని ఫలహారాలు తీసుకువచ్చారు. నేను కూడా ఒక సంచి నిండా ఫలహారాలు తీసుకుపోయాను. అరవింద్ భార్య ఉమ అందరి కోసం గోధుమ రొట్టెలు, పులిహోర తయారు చేసుకొని వచ్చింది. అవి లంచ్‌కు, డిన్నర్‌కు పనికి వచ్చాయి.
యాత్రకు బయలుదేరే తేదీకి ముందే పిల్లలు చెప్పినట్టు మంచి గ్రిప్ ఉన్న హైకింగ్ బూట్లు కొనుక్కున్నాను. నా అవసరాలకు అనుగుణంగా భారతి అన్ని రకాల మందులు కొని వేరు వేరు సాచేట్లలో పెట్టి అవి ఎప్పుడు, ఏ జబ్బుకు వాడాలో రాసిన స్లిప్పులు కూడా పెట్టి నా సూట్ కేసులో సర్ది పెట్టింది. నా వెంట ఒక డిస్పెన్సరీని తీసుకుపోతున్నానన్న మాట. అమెరికాలో పిల్లలు కొన్న హూడి స్వెట్టర్ పెట్టుకున్నాను. చెడ్డీలు, బనియన్లు కొనుక్కున్నాను. దారిలో చదువుకోవడానికి యాత్రానుభవాల పుస్తకాలు సర్దుకున్నాను. పాస్‌పోర్ట్, టికెట్లు, డబ్బులు, ఇతర పత్రాలు పెట్టుకోవడానికి పిల్లలు అమెరికాలో కొనిచ్చిన చిన్న లెదర్ బ్యాగ్ భుజానికి అడ్డంగా వేసుకున్నాను. చార్ధామ్ కొండ ప్రాంతంలో జియో నెట్ వర్క్ తప్ప మరేది పనిచేయదని చార్ధామ్ యాత్ర చేసిన వారు చెపితే నా ఫోన్లో కొత్త జియో సిమ్ కార్డు కూడా వేయించుకున్నాను. ఎటిఎం కార్డు దగ్గర పెట్టుకున్నాను. 50 వేల క్యాష్ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే టూర్ ఆపరేటర్‌కు మేము 5 వేలు మాత్రమే అడ్వాన్స్ చెల్లించినాము. దిల్లీలో దిగగానే టూర్ ఆపరేటర్‌కు మొత్తం డబ్బు నగదు రూపేణా చెల్లించాలి.
***
గత పన్నెండెండ్ల కాలంలో పలుమార్లు దిల్లీకి పోయినా విమానంలోనే పోయి వచ్చాను తప్ప రైలు ఎక్క లేదు. దిల్లీ 24 గంటల రైలు ప్రయాణం బోరింగ్ గానే ఉంటుంది. రైలు ప్రయాణంలో చదువుకోవడానికి నాతో యాత్రా సాహిత్యం పుస్తకాలు ఉన్నాయి. మ్యూజిక్ వింటాననుకున్నాను. రాత్రి వేళలో ఎట్లాగు నిద్రపోవలసిందే. వింధ్య పర్వత శ్రేణులను దాటడాన్ని చూడాలని ఆశ పడినాను. అయితే అప్పటికి చీకటి పడుతుందేమో అన్న అనుమానం కూడా ఉంది. వచ్చేటప్పుడు చూసే అవకాశం వస్తుంది. 2013 తర్వాత మొదటిసారి రైలెక్కాను. అప్పుడు ‘సంసద్ యాత్ర’ పేరు మీద దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి ఒక ప్రత్యేక రైలులో పోయాము. ఆ రైలు మా ఉద్యమకారులదే. పాటలు, చర్చలు జోరుగా సాగేవి. రైలు ఆగిన ప్రతీ స్టేషన్లో దిగి తెలంగాణ నినాదాలు ఇవ్వడం, కరపత్రాలు పంచడం చేశాము. కరపత్రాలు ఇంగ్లీష్‌లో, హిందీలో రూపొందించారు. అరుణోదయ కళాకారులు రైలు దిగి డప్పులు మోగించగానే ఒక ఉద్యమ వాతావరణం వెల్లి విరిసేది. అందరం వారితో గొంతు కలిపేవారం. వచ్చేటప్పుడు మే డే వచ్చింది. ఝాన్సీ స్టేషన్లో అరుణోదయ కళాకారులు ఒక అమరవీరుల స్థూపం తయారు చేసి ఏర్పాటు చేశారు. స్ఫూర్తిదాయకంగా మే డే జరపడం ఒక మరపురాని అనుభవం. సంసద్ యాత్రలో ఝాన్సీ స్టేషన్లో మే డే జరుపుకున్నది ఉదయం 9 గంటలకు. అప్పుడు ఉద్యమ చర్చలలో మునిగిపోయి రైలు వింధ్య పర్వతాలను దాటడం గమనించలేదు. ఇప్పుడు నా యాత్రా లక్ష్యమే భారత దర్శనం కాబట్టి హిమాలయాలతో పాటు తిరిగి వచ్చేటప్పుడు వింధ్య పర్వతాలను కూడా చూస్తాను అని అనుకున్నాను. కాని నా అనారోగ్యం కారణంగా తిరుగు ప్రయాణంలో దిల్లీ నుంచి విమానంలోనే హైదరాబాద్‌కు వచ్చాను. అట్లా ఈ సారి కూడా వింధ్య పర్వతాలను చూడలేకపోయాను. అప్పుడు రైల్లో తెలంగాణ ఉద్యమకారులతో దిల్లీకి ప్రయాణించాను. ఇప్పుడు పన్నెండేండ్ల తర్వాత రైల్లో చార్ధామ్ యాత్రికులతో దిల్లీకి ప్రయాణిస్తున్నాను. వీరంతా వేరు వేరు టూర్ ఆపరేటర్ల ద్వారా యాత్రకు బయలుదేరారు.
నేనేమో చార్ధామ్ యాత్రకు పోతున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలో నా క్లాస్మేట్, ఆ తర్వాత సాగునీటి శాఖలో నా కొలీగ్, జిగ్రీ దోస్త్ మహబూబ్ హుస్సేన్ రెండో సారి హజ్ యాత్రకు పోతున్నాడు. మొదటి హజ్ యాత్రలో మక్కా నుంచి పవిత్ర జలం తీసుకు వచ్చాడు. రెండవ యాత్రలో నా కోసం మక్కా నుంచి అరేబియన్ ఖర్జూరాలు తీసుకు వస్తానని చెప్పాడు. తన కోసం గంగోత్రి నుంచి స్వచ్ఛ గంగా జలాలు తీసుకు రమన్నాడు. తానూ మక్కా నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాలు, గంగా జలాలు రెండింటిని కలిపి సేవిస్తానని చెప్పాడు. రెండు జలాల్లో శరీరంలో శక్తిని పెంచే ఔషధ విలువలు ఉన్నాయని వాడి నమ్మకం. సరే అన్నాను.
***
హైదరాబాద్ నుంచి దిల్లీకి సాగే 24 గంటల ప్రయాణంలో చదువుకోవడానికి ప్రొఫెసర్ ఆదినారాయణ గారి ‘భ్రమణ కాంక్ష’ పుస్తకం అందుబాటులో ఉంచుకున్నాను. టిఫిన్ అయిన తర్వాత అవి ఇవీ ముచ్చట్ల తర్వాత పుస్తకం చదువుకోవడానికి ఉపక్రమించాను. కొద్ది సేపటికి మిత్రుడు, ప్రముఖ ట్రావెలర్ లోకేశ్వర్ నుంచి ఫోన్ వచ్చింది. యాత్రలో ఉన్నానని చెప్పాను. ఆయన యాత్రికుడు కదా సంతోషించాడు. యాత్ర సుఖంగా సాగాలని కోరుకున్నాడు. దారిలో చదువుకోవడానికి కొన్ని ట్రావెలాగ్స్ వెంట తీసుకుపోతున్నానని, అందులో తను రాసిన ‘సిల్క్ రూట్ సాహాస యాత్ర’ పుస్తకం కూడా ఉందని చెప్పాను. ‘ఈ పుస్తకాలు ఇంట్లో కూడా చదువుకోవచ్చు. యాత్రలో లీనం కావడానికి నీ మనసు, నీ కళ్ళు యాత్ర మీద, నీవు ప్రయాణిస్తున్న పరిసరాల పరిశీలనలో ఉంచాలి, వాటిని ఆస్వాదించాలి తప్ప పుస్తకాలు చదువుతూ ఉంటే నీ యాత్ర సఫలం కాదు’ అన్నాడు. ఇక అంతే పుస్తకం రాత్రి వేళల్లో తప్ప పగటి పూట ప్రయాణంలో మళ్ళీ ముట్టలేదు.
రైలు ప్రయాణంలో ఏ ఊర్లు వస్తున్నాయో గమనించసాగాను. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రాపూర్ దాటుకొని నాగపూర్‌కు చేరుకున్నాము. నదులు, వాగులు పంట పొలాలు, అడవులను, మనుషులను, వారి వస్త్రధారణ, ఇండ్లను గమనించసాగాను. రైలు వైన్ గంగ నదిని దాటడాన్ని గమనించాను. మే నెల కాబట్టి నదిలో పెద్దగా ప్రవాహాలు లేవు. నదిలో అక్కడక్కడా నీటి మడుగులు మాత్రమే కనిపించాయి. ఈ వైన్ గంగా నదియే ప్రాణహిత నదికి అత్యధికంగా నీటిని మోసుకు వచ్చే ఉప నది. వైన్ గంగ, వార్ధా నదుల సంగమం తర్వాత ఏర్పడే నదినే ప్రాణహిత నదిగా పిలుచుకుంటాము. ప్రాణహిత సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణించి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసిపోతుంది. వైన్ గంగ, వార్ధా నదుల సంగమం వద్దనే కదా తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఆ బ్యారేజికి సంబంధించిన వివాదాలను విశ్లేషిస్తూ సాగునీటి రంగం మీద నేను రాసిన వ్యాసాలలో, పుస్తకాల్లో విస్తృతంగా చర్చించాను.
మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించే దాకా తెలంగాణలో ఉన్నట్టే అనిపించింది. రైలును బల్లార్శా జంక్షన్లో చాలా సేపు నిలిపివేశారు. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అయినా వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్ళను పంపించిన తర్వాతనే ఈ రైలుకు అనుమతించడం గమనించాను. బల్లార్శా వరకు రైల్వే బోర్డుల్లో తెలుగు భాష కనిపించింది. ఆ తర్వాత తెలుగు మాయం అయ్యింది. రైలు నాగ్‌పూర్ స్టేషన్ చేరే సరికి సాయంత్రం 5 దాటింది. అప్పటికి ఇంకా వెలుతురూ ఉండడం వలన రైలు సాత్పూర పర్వత శ్రేణులు దాటడం గమనించాను. మా బోథ్ గుట్టలు, నిర్మల్ ఘాట్లు ఈ సాత్పూర పర్వత శ్రేణుల్లో భాగమే. రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత వింద్య పర్వత శ్రేణులను దాటడం గమనించాను.
వింధ్య పర్వత శ్రేణుల దృశ్యం
ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారతానికి వింధ్య పర్వత శ్రేణులు ఒక అడ్డు గోడగా నిలిచి ఉన్నాయి. చరిత్ర కాల గమనంలో ఉత్తర భారత దేశానికి ఉండిన విదేశీ దండయాత్రల బెడద దక్షిణానికి లేకపోవడానికి వింధ్య పర్వతాలు ప్రధాన అవరోధంగా నిలచినాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన దక్కన్ పీఠభూమిలో శాతవాహనులు, పల్లవులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, చోళ రాజులు బలమైన స్వతంత్ర రాజ్యాలుగా విదేశీ దండయాత్రలకు లోను కాకుండా మనుగడ సాగించాయి. ఇక్కడి రాజ్యాలు తమలో తాము రాజ్య విస్తరణకు యద్ధాలు చేసుకున్నారు తప్ప విదేశీ దండయాతలను చవి చూడలేదు. వాటిని అడ్డుకున్న్డది వింధ్య పర్వతాలే. మొఘల్ చక్రవర్తులు, వారి కంటే ముందు దిల్లీ సల్తనత్‌ను ఏలిన ఖిల్జీ, తుగ్లక్ వంశ రాజులు మాత్రం వింద్యను దాటుకొని గోల్కొండ సహా దక్షిణ రాజ్యాలపై దండెత్తి వాటిని తమ సామంత రాజ్యాలుగా చేసుకున్నారు. వారి రాజ ప్రతినిధులను సుబేదార్లుగా నియమించి దక్షిణ భారతాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సల్తనత్ బలహీన పడింది. దిల్లీ నుంచి సాగే కేంద్రీకృత అధికారం బలహీనపడడంతో మొఘల్ చక్రవర్తులు నియమించిన దక్కన్ సుబేదార్లు స్వతంత్రం ప్రకటించుకొని రాజ్యాలు ఏలినారు. హైదరాబాద్ నిజాం రాజ్యం అటువంటిదే. రైలు వింధ్య పర్వతాలు దాటే సమయానికి చీకటి పడడంతో ఏమీ చూడలేక పోయాను. రాత్రి భోజనం ముగించి బెర్త్ ఎక్కి మళ్ళీ పుస్తకం తెరిచాను. ఒక గంట తర్వాత నిద్రకు ఉపక్రమించాను.
***
మే 15 న ఉదయం 8 గంటలకు రైలు న్యూదిల్లీ స్టేషన్‌కు చేరుకున్నది. టూర్ ఆపరేటర్ ప్రతినిధి మమ్ములను రిసీవ్ చేసుకొని ఆటో రిక్షాలలో స్టేషన్ దగ్గరలోనే ఉన్న టూరిస్ట్ హోటల్‌కు తీసుకు వెళ్ళారు. దిల్లీలో నెలకొని ఉన్న తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ఎలెక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతిస్తారు. డిల్లీలో తిరిగే టాక్సీ కార్లు, బస్సులు అన్నీ ఎప్పుడో సి.ఎన్.జి. (CNG) కి మారిపొయినాయి. మన రాష్ట్రంలో తిరిగే ఆటలతో పోలిస్తే దిల్లీలో తిరిగే ఆటోలు సౌకర్యవంతంగా ఉన్నాయని అనిపించింది. ఒకసారి చార్జ్ చేసుకుంటే 250 కిలోమీటర్లు తిప్పవచ్చునని ఆటో డ్రైవర్ చెపితే ఆశ్చర్యపోయాను. హారన్ చప్పుడు తప్ప ఇంజన్ చప్పుడు అసలే లేదు. టూరిస్ట్ హోటల్లో ఇద్దరికి కలిపి ఒక షేరింగ్ రూమ్ కేటాయించారు. నా మిత్రులు అందరు జంటలుగా వచ్చారు కాబట్టి వారు తమ సతీమణులతో రూముల్లో అడ్జస్ట్ అయ్యారు. నాకు తోడుగా నాలాగే కామారెడ్డి నుంచి ఒంటరిగా వచ్చిన షావుకారు శ్రీ కొడిశాల మల్లేశం గారిని నాతో జత కలిపాడు టూర్ ఆపరేటర్.
అందరం గంటలో స్నానాలు కానిచ్చి టిఫిన్ కోసం డైనింగ్ హాల్లో జమ అయినాము. టిఫిన్ అయ్యాక ప్రహ్లాదుడు పంతులు గారు చార్ధామ్ యాత్రకు సంబంధించి వివరాలు సంక్షిప్తంగా వివరించాడు. ప్రతీ రోజు ఆ రోజు ప్రోగ్రాం గురించి ఇట్లాగే బ్రీఫింగ్ ఇస్తానని చెప్పాడు. తన సూచనలు పాటిస్తే యాత్ర మొత్తం హాయిగా గడుస్తుందని హామీ ఇచ్చాడు. తనకు ఇది 105వ చార్ధామ్ యాత్ర అని చెప్పాడు. ఈ రోజు ఇక్కడే ఉంటాము కనుక దిల్లీలో తిరగాలనుకున్న వాళ్లకు బస్సులు లేదా కార్లు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. వాటి ఖర్చులు యాత్రికులే భరించాలని చెప్పాడు. మేము మా బృందం 10 మందికి ఒక టెంపో ట్రావెలర్ (మినీ బస్సు లాంటిది) ఏర్పాటు చేయమని చెప్పాము. అప్పుడే అందరం పంతులు గారికి చెల్లించవలసిన బకాయి మొత్తాలను కూడా చెల్లించాము. 11 గంటల కల్లా మా కోసం మినీ ఎసి బస్సు రెడీగా ఉన్నది.
దిల్లీ పర్యటన వివరాలు తర్వాతి అధ్యాయంలో వివరిస్తాను.
(ఇంకా ఉంది)
శ్రీధర్ రావు దేశ్‌పాండే తెలంగాణకు చెందిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు. రచయిత. సాగునీటి శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసినారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి కార్యాలయంలో పదేళ్ళ పాటు ఓఎస్డిగా సేవలు అందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’తో పాటు సాగునీటి రంగంపై పలు పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. తెలంగాణ అస్తిత్వంపై వ్యాసాల సంకలనం వెలువరించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. మరుగున పడిపోయిన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జీవిత చరిత్రను రాశారు. ‘అమెరికా ముచ్చట్లు’ ట్రావెలాగ్ రాశారు. ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో తన బాల్యపు జ్ఞాపకాలతో పాటు స్వగ్రామం బోథ్ భౌగోళిక, సాంస్కృతిక చరిత్రను వివరించారు.
