[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]
అధ్యాయం-5 మండే ఎండల్లో దిల్లీ పర్యటన
మే నెలలో దిల్లీలో ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీ సెల్సియస్ కు పైనే ఉష్ణోగ్రత ఉంది. ఎసి బస్సు కాబట్టి బస్సు లోపల ఉన్నంత సేపు హాయిగానే ఉండేది. స్పాట్ లో దిగిన తర్వాత ఆ ఎండను భరించడం కష్టంగా ఉండింది. అందరి తలల మీద హోటల్లో పంతులు గారు ఇచ్చిన టోపీలు ఉన్నాయి. అయినా ఎండ వేడిమి తీవ్రంగానే ఉండింది. దిల్లీలో ఏయే ప్రదేశాలకు వెళదామనే విషయం మీద కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చాము. దిల్లీ పాత నగరంలో ఉన్న ఎర్రకోట, కుతుబ్ మినార్; కొత్త దిల్లీలో ఉన్నఇండియా గేట్, మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్ ఘాట్; దిల్లీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్షర్ ధాం స్వామీ నారాయణ్ టెంపుల్ సందర్శించాలని నిర్ణయించాము.
మొదట డ్రైవర్ మమ్ములను ఎర్రకోట వద్దకు తీసుకుపోయాడు. అయితే కొన్ని నెలల క్రితం ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు సంభవించిన కారణంగా ప్రభుత్వం సందర్శకులను ఎర్రకోట లోపలకు పోనివ్వడం లేదు. ఎండకు తాళలేక ఎర్రకోట ముందర నిలబడి ఫోటోలు దిగి 15, 20 నిమిషాల్లో పూర్తి కానిచ్చాము. గత పదేళ్ళలో ఆఫీస్ పని మీద అనేక సార్లు దిల్లీ వచ్చినప్పటికీ ఎర్రకోట చూసే అవకాశం రాలేదు. అప్పుడు వచ్చి ఉంటే ఎర్రకోట లోపలికి కూడా వెళ్ళే అవకాశం దక్కేది.
ఎర్రకోట ముందు
మొఘల్ చక్రవర్తుల తొలి రాజధాని ఆగ్రాలో కూడా 1565-73 మధ్య కాలంలో మూడవ తరం మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒక ఎర్ర కోటను నిర్మించాడు. అతని మనుమడు షాజహాన్ రాజధానిని ఆగ్రా నుంచి దిల్లీకి మార్చిన తర్వాత 1638-48 మధ్య కాలంలో అదే తరహా ఎర్ర కోటను దిల్లీలో కూడా నిర్మించాడు. తాజ్ మహల్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహమ్మద్ లాహోరి చేతనే దిల్లీ ఎర్ర కోటను డిజైన్ చేయించాడు షాజహాన్. రెండు కూడా యమునా నది ఒడ్డునే ఉన్న నగరాలు కావడం విశేషం. 1947 నుంచి ఏటా భారత ప్రధానమంత్రి పంద్రాగస్టు నాడు ఎర్రకోటపై జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయడం మనకు తెలిసిందే. అది ఎర్రకోట ముఖ ద్వారం పైననే ఉంటుంది. ఎర్రని సాండ్ స్టోన్ రకం రాళ్ళతో నిర్మించిన కోట కాబట్టి ఎర్ర కోట, రెడ్ ఫోర్ట్, లాల్ ఖిలా అని పేరుబడింది. ఆగ్రాలో ఉన్నఎర్ర కోటను ఒక పర్యటనలో నేను చూసి ఉన్నాను. అది కూడా ఎర్రని సాండ్ స్టోన్ రకం రాళ్ళతో నిర్మించినదే. దిల్లీలో ఉన్నఎర్రకోట చుట్టూ 20, 25 మీటర్ల వెడల్పుతో ఒక కందకం కూడా తవ్వినారు. ఇప్పుడు ఆ కందకంలో నీళ్లు లేవు. ఫోటో సెషన్ ముగిసిన తర్వాత బస్సు ఎక్కి మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్ ఘాట్‌కి వెళ్ళాము.
రాజ్ ఘాట్ ప్రాంతం వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న ఒక పెద్ద ఉద్యానవనం లాంటిది. ఇక్కడ ఒక్క గాంధీ సమాధే కాకుండా చాలా మంది ప్రముఖుల సమాధులు కూడా వివిధ పేర్లతో ఉన్నాయి. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ (శాంతివన్), రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి (విజయ్ ఘాట్), మూడవ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (శక్తి స్థల్), ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ (కిసాన్ ఘాట్), ఏడవ ప్రధాన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ (వీర్ భూమి), ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రాం (సమతా స్థల్), రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ (ఏక్తా స్థల్), రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ(కర్మభూమి), పదకొండవ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి (సదైవ్ అటల్), ఉప ప్రధానమంత్రి చౌదరి దేవీలాల్ (సంఘర్ష్ స్థల్) మొదలైనవి ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. ప్రధానమంత్రి పి.వి నరసింహారావుకు మాత్రం ఈ ఉద్యానవనంలో స్థానం దక్కలేదు. దక్షిణ భారతం నుంచి వచ్చినందుకు ఈ వివక్ష కావచ్చు లేదా ఇతరేతరమైన రాజకీయ కారణాలు కావచ్చు. పి.వి సమాధిని హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులో ‘పివి జ్ఞాన భూమి’ పేరుతో ఒక స్మారక స్థలాన్ని ఏర్పాటు చేశారు. 2015 లో పి.వి పేరు మీద ఒక స్మారక శిలా ఫలకాన్ని మాత్రం రాజ్ ఘాట్ ఉద్యానవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తున్నది.
రాజ్ ఘాట్ వద్ద
గాంధీ సమాధి వరకు ఒక కిలోమీటర్ దూరం ఎండలో నడవాల్సి వచ్చింది. రాజ్ ఘాట్‌లో గాంధీ సమాధిని సందర్శించాము. అక్కడ కూడా పెద్దగా జనం లేరు. గాంధీ సమాధి వద్ద కూడా నిరంతరం గ్యాస్ ద్వారా ప్రజ్వలించే ఒక దీపం ఉంది. గాంధీ సమాధికి దండం పెట్టుకొని మళ్ళీ ఎండలో ఒక కిలోమీటర్ నడిచి బస్సు ఉన్న చోటికి చేరుకున్నాము. అందరం నిమ్మ షర్బత్ తాగి ఎండ వేడికి ఉపశమనం పొంది బస్సులో కూచున్నాము. భోజనం చేసే సమయం లేదు కనుక స్నాక్స్ మూట విప్పి స్నాక్స్ తిన్నాము. రాజ్ ఘాట్ తర్వాత బస్సు డ్రైవర్ మమ్ములను ఇండియా గేట్ వద్దకు తీసుకుపోయాడు.
ఇండియా గేట్ అంటే ఒక వార్ మెమోరియల్ అన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటిష్ ఇండియా సైనికుల స్మారకార్థం బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఇండియా గేట్ నిర్మించింది. ఇక్కడ కూడా గ్యాస్ ద్వారా ప్రజ్వలించే ఒక అమరజ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. గేట్ గోడల మీద సైనికుల పేరు కూడా రాసినారు. ఇండియా గేట్‌ను చాలా సార్లు సందర్శించాను. ఇది తెలంగాణా భవన్‌కు దగ్గరలోనే ఉంటుంది కనుక మా ఆఫీస్ పని అయ్యాక భోజనాలు ముగించుకొని నడుచుకుంటూ ఇండియా గేట్ వరకు పోయేవాళ్ళం. తెలంగాణా ఉద్యమ కాలంలో కూడా మూడు, నాలుగు సార్లు దిల్లీకి వచ్చినప్పుడు మిత్రులతో ఇండియా గేట్ సందర్శించాను. ఆ రోజుల్లో సందర్శకులను అమరజ్యోతి వరకు అనుమతించేవారు. ఇప్పుడు భద్రతా కారణాల వలన గేట్‌కు వంద మీటర్ల దూరం వరకే అనుమతిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఇండియా గేట్ పరిసరాలు జనంతో క్రిక్కిరిసి ఉంటాయి. అర్ధ రాత్రి వరకు ఈ సందడి కొనసాగుతుంది. లైట్ల వెలుగుల్లో ఇండియా గేట్ జిగేల్మంటూ కంటికి ఇంపుగా ఉంటుంది.
ఇండియా గేట్ ముందు
ఇండియా గేట్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లు ఉంటాయి. చబ్బీస్ జనవరి నాడు జరిగే పరేడ్ ఈ రెండు బ్లాకులకు నడుమ ఉండే విశాలమైన రోడ్డు మీదనే జరుగుతుంది. గేట్‌కు వంద మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు పెట్టిన కారణంగా అక్కడ నుంచే ఫోటోలు తీసుకోవలసి ఉంటుంది. రెండేళ్ల క్రితం ఇండియా గేట్ వెనుక సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. మేము వెళ్ళింది ఎర్రటి ఎండలో కాబట్టి సందర్శకులు పెద్దగా లేరు. ఆ ఎండలోనే నిలబడి త్వరత్వరగా ఫోటో సెషన్ ముగించుకొని బస్సు ఎక్కేసాము. ఇండియా గేట్ నుంచి కుతుబ్ మినార్ వద్దకు వెళ్ళాము.
కుతుబ్ మినార్ ఎర్రని సాండ్ స్టోన్ రకం రాళ్ళతో, తెల్లటి పాల రాయితో కట్టిన ఐదు అంతస్తుల ఎత్తైన భవనం. ఒక స్తంభం లాగా ఉండే ఈ కట్టడం ఎత్తు 72.5 మీటర్లు (238 అడుగులు). ఇది యునెస్కో (UNESCO) ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అద్భుతమైన ఆ కట్టడం చూపరులను విభ్రాంతికి గురి చేస్తుంది. ఒకప్పుడు సందర్శకులను మినార్ పైకి పోనిచ్చేవారట. కొందరు మినార్ మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోవడంతో సందర్శకులను మినార్ పైకి పోవడాన్ని నిషేధించారు.
కుతుబ్ మినార్
ఇదే పరిస్థితి మన హైదరాబాద్ లోని చార్మినార్‌లో కూడా ఏర్పడింది. ఈ కారణంగానే చార్మినార్ పైకి పోవడానికి సందర్శకులకు అనుమతి రద్దు చేసింది ప్రభుత్వం. ఇక కింద నుంచే మినార్ సౌందర్యాన్ని చూడాలి.
1199లో ఢిల్లీ సల్తనత్ మొదటి పాలకుడైన కుత్బుద్దీన్ ఐబక్ ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆయన కేవలం మొదటి అంతస్తును మాత్రమే పూర్తి చేయగలిగాడు. ఆయన తర్వాత వచ్చిన సుల్తాన్ ఇల్తుత్మిష్ మరో మూడు అంతస్తులను నిర్మించి దీనిని పూర్తి చేశాడు. 1368 లో పిడుగుపాటు వల్ల పై అంతస్తు దెబ్బతినగా ఫిరోజ్ షా తుగ్లక్ దానిని బాగు చేయించి, ఐదో అంతస్తును కూడా చేర్చాడు. దీని గోడలపై ఇస్లామిక్ శైలి జ్యామితీయ నమూనాలు, పవిత్ర ఖురాన్ వాక్యాలు చెక్కి ఉంటాయి. ఇది ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ.
కుతుబ్ మినార్ ఉన్న ప్రాంగణంలో మరికొన్ని చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు అందులో ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలోనే నిర్మించిన మొదటి మసీదులలో ఒకటి. ఇక్కడి ప్రాంగణంలో ఉన్న 1600 ఏళ్ల నాటి గుప్తుల కాలం నాటి ఉక్కు స్తంభం (Iron Pillar) ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉండటం విశేషం.
కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉన్నఇనుప స్తంభం ముందు
మసీదు ప్రాంగణంలో ఉన్న కట్టడాల్లో హిందూ దేవాలయంలో ఉండే లాంటి స్తంభాలు, వాటి మీద శిల్పాలు, టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో ఒక హిందూ దేవాలయం ఉండేదన్న దానికి సూచనగా ఇవి మనకు కనబడతాయి. ఈ అంశాన్ని అక్కడ ఏర్పాటు చేసిన ఒక శిలా ఫలకంలో కూడా నమోదు చేసినారు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించి ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ శాఖ వారి పర్యవేక్షణలో కుతుబ్ మినార్ ప్రాంగణాన్ని బాగానే నిర్వహిస్తున్నారు. అక్కడ బోలెడన్ని ఫోటోలు దిగి బస్సు ఎక్కేసాము.
బస్సు డ్రైవర్ మమ్ములను ప్రభుత్వ దుకాణం అని చెప్పి ఒక ప్రైవేట్ హస్త కళల దుకాణానికి తీసుకువెళ్ళాడు. దాని పేరు నేషనల్ హ్యాండీ క్రాఫ్ట్స్ స్టోర్. టూరిస్టులను తప్పనిసరిగా ఇక్కడకు తీసుకుపోవాలని దిల్లీలో డ్రైవర్లకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయట. అంతా అబద్ధం. దిల్లీ, ఆగ్రా, జైపూర్ లాంటి చాలా టూరిస్టు కేంద్రాల్లో ఇదొక వ్యాపారం. డ్రైవర్లతో ఈ దుకాణాలు నడిపే వ్యాపారస్తులు ఒప్పందం చేసుకుంటారు. టూరిస్టులను తీసుకు వచ్చినందుకు వారికి ఎంతో కొంత ముట్టజెప్పుతారు. ఇటువంటి దొంగ దుకాణాలు ఆగ్రాలో, జైపూర్ లో కూడా నేను చూసినాను. అవి ప్రభుత్వ దుకాణాలని టూరిస్టులను నమ్మబలుకుతారు. కాని అవి ప్రైవేట్ దుకాణాలని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక తీసుకు వచ్చినందుకు అందరం అందులో దూరిపోయాము. అది రెండస్తుల దుకాణం. ఎన్నెన్నో కళా ఖండాలు అక్కడ అమ్మకానికి పెట్టారు. వాటి ధరలు దిల్లీలో ఎండ లెక్కనే మండి పోతున్నాయి. ఒక అరగంట ఆ చల్లటి వాతావరణంలో గడిపాము. ఎవరు ఏమి కొన్నారో నాకు తెలియదు. నేను మాత్రం ఏమీ కొనలేదు. మా బృందంలోని మహిళలు చీరల మీద ఎక్కువ కాలాన్ని వెచ్చించారు. ఆ ధరలు చూసి వారు కూడా ఏమీ కొనకుండా తిరిగి వచ్చేశారు. అప్పటికే సమయం నాలుగు గంటలు. స్వామీ నారాయణ్ టెంపుల్ లోకి ఎంట్రీ 6 గంటల వరకే ఉంటుందని తెలిసి మా మినీ బస్సు డ్రైవర్ ను నేరుగా స్వామీ నారాయణ్ టెంపుల్‌కి తీసుకు వెళ్ళమని చెప్పాము.
అక్షర్ ధాం – స్వామీ నారాయణ్ ఆలయం (ఇంటర్నెట్ ఫోటో)
ఒక గంట ప్రయాణం తర్వాత స్వామీ నారాయణ్ టెంపుల్ ‘అక్షర్ ధాం’ కి చేరుకున్నాము. జనం విపరీతంగా ఉన్నారు. ఎంట్రీ ఉచితమైనా ఫోటోలు తీయడం నిషిద్దం కాబట్టి సెల్ ఫోన్లు, చెప్పులు, బూట్లు బస్సులోనే వదిలి మందిరంలోకి ప్రవేశించాము. మందిర నిర్మాణం అద్భుతంగా ఉంది. తెల్లని పాలరాయితో నిర్మించిన కృష్ణ మందిరంలో శిల్పాలు గొప్పగా ఉన్నాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా గొప్పగా ఉంది. అక్షర్ ధాం లోకి ప్రవేశించగానే అక్కడ గోడల మీద అక్షర్ ధాం నిర్మాణ చరిత్రను వివరించే పోస్టర్లు, బోర్డులు కనిపించాయి. వాటిని చదివే సమయం లేకపోవడంతో ముఖ్యమైన సమాచారాన్ని అందజేసే కొన్ని పోస్టర్లను మాత్రం చదవగలిగాను. దిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ‘బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ’ (BAPS) అధిపతి అయిన ప్రముఖ్ స్వామి మహారాజ్ నేతృత్వంలో నిర్మించారు. 2005 నవంబర్ 6 న ఈ ఆలయాన్ని అప్పటి భారత రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమక్షంలో అధికారికంగా ప్రారంభించి, ప్రజల సందర్శనార్థం తెరిచారు. ఈ భారీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కేవలం 5 సంవత్సరాలలో (2000 నుండి 2005 మధ్య) పూర్తి చేయడం ఒక విశేషం. దీని నిర్మాణంలో దాదాపు 11,000 మంది కళాకారులు, వేలాది మంది స్వచ్ఛంద సేవకులు రాత్రింబగళ్లు శ్రమించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా స్టీల్ లేదా కాంక్రీటును ఉపయోగించలేదు. దీనిని పూర్తిగా రాజస్థాన్‌కు చెందిన ఎర్రటి సాండ్ స్టోన్, తెల్లని ఇటాలియన్ పాలరాయితో అద్భుతంగా చెక్కారు. ప్రాచీన భారతీయ శిల్పశాస్త్ర నియమాల ప్రకారం దీనిని నిర్మించామని ఆలయ నిర్మాణ చరిత్రలో రాసినారు. ఆలయ గోడలపై భారతదేశ చరిత్ర, సంస్కృతి, పురాణాలు మరియు జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వేలాది శిల్పాలను చెక్కారు. ఆలయ పునాది భాగంలో 148 పూర్తి సైజు ఏనుగుల రాతి శిల్పాలు ఉన్నాయి. ఇవి భారతీయ సంస్కృతిలో ఏనుగులకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత భారీ హిందూ ఆధ్యాత్మిక కాంప్లెక్స్ (World’s Largest Comprehensive Hindu Temple) గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అమెరికాలో కూడా న్యూజెర్సీ, కాలిఫోర్నియా, హూస్టన్, షికాగో, అట్లాంటా, డెట్రాయిట్ నగరాల్లో, యునైటెడ్ ఎమిరేట్స్ అబుదాబి నగరంలో స్వామీ నారాయణ్ టెంపుల్స్‌ను భారీగా స్థాయిలో నిర్మించారు. ఇటీవలే పారిస్‌లో ఒక భారీ ఆలయాన్ని నిర్మించి ఫ్రాన్స్‌లో మహిళల పట్ల వివక్షకు సంబంధించి ఒక వివాదం ఇరుక్కుపోయిన సందర్భం మనం చూసిందే. ఇంత భారీ నిర్మాణాలకు, వీటి నిర్వహణకు వీరికి సొమ్ము ఎట్లా సమకూరుతుందో!
చీకటి పడే దాకా మందిరంలో శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించాము. ఫోటోలు నిషిద్దం కాబట్టి స్వామీ నారాయణ్ అక్షర్ ధాం టెంపుల్ జ్ఞాపకాలు ఏమీ లేవు. మా మనస్సులో మాత్రమే మిగిలిపోయాయి.
ఇక అక్కడ నుంచి టూరిస్ట్ హోటల్‌కు బయలుదేరాము. ఆడవాళ్ళు మాత్రం దారిలో తమని పాలికా బాజార్లో వదిలిపెట్టమని, షాపింగ్ అయిన తర్వాత ఆటోలో హోటల్‌కు వస్తామని అన్నారు. వారిని పాలికా బాజార్లో వదిలిపెట్టి మేము హోటల్ చేరుకునే సరికి సాయంత్రం ఏడయ్యింది. ఎండాకాలం కాబట్టి ఇంకా వెలుతురు ఉంది. పెద్దగా నడవకపోయినా ఎండకు బాగా అలసిపోయాము. విపరీతమైన బడలిక. హోటల్ రూములో చల్లటి నీటితో షవర్ బాత్ చేసిన తర్వాత బడలిక కొంత తీరింది. ఆడవాళ్ళు షాపింగ్ ముగించుకొని రాత్రి తొమ్మిది గంటలకు హోటల్ చేరుకున్నారు. అప్పటికే యాత్రీకులందరూ డైనింగ్ హాల్లో ఉపాహారానికి సిద్ధం అయినారు. 15 రోజుల యాత్రలో పొద్దున్న ఉపాహారం, మధాహ్నం భోజనం, రాత్రి మళ్ళీ ఉపాహారం మాత్రమే ఇచ్చేది.
రాత్రి ఉపాహారం ముగిసిన తర్వాత మరుసటి రోజు కార్యక్రమం గురించి పంతులు గారు వివరించారు. అందరూ ఉదయం 4 గంటల కల్లా స్నానపానాదులు ముగించుకొని కిందకు రావాలని, తమ వెంట ఉండే అత్యవసర సామాను తప్ప మిగతా లగేజి అంతా రాత్రి రూము ముందర పెట్టేస్తే తమ స్టాఫ్ వాటిని బస్సులోకి ఎక్కిచ్చేస్తారని చెప్పాడు. అందరూ టీ, కాఫీలు తాగి బస్సులో ఎవరికీ నిర్దేశించిన సీట్లలో వారు కూర్చోవాలని ఆదేశాలు జారీ చేశాడు. రేపు దిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళతామని, దిల్లీ నుంచి హరిద్వార్ 210 కిలోమీటర్ల దూరంలో ఉందని, 4 లేదా 5 గంటల ప్రయాణమని, ఉదయం సుమారు 10 గంటకు హోటల్ చేరుకుంటామని, 11 గంటలకు గంగా స్నానానికి వెళ్ళడానికి ఆటోలు వస్తాయని, భోజనాల అనంతరం హరిద్వార్‌లో ఎవరు ఏమీ చూడాలని అనుకుంటే అక్కడకి తమ స్వంత ఖర్చుల మీద వెళ్ళ వచ్చునని సూచన చేసినాడు. రాత్రి హరిద్వార్ బస చేసి, మరుసటి రోజు మే 17 న యమునోత్రి యాత్రలో భాగంగా బార్కోట్ వెళతామని చెప్పాడు. హరిద్వార్, యమునోత్రి సందర్శన వివరాలు మళ్ళీ వివరంగా చెపుతానని, తన సూచనలు అందరూ విధిగా పాటించాలని, ఆలస్యం చేసిన వారికోసం బస్సు ఆగదని హెచ్చరించాడు. ఆయన సూచనల తర్వాత అందరూ రూముల్లోకి నిష్క్రమించి నిద్రకు ఉపక్రమించారు.
అట్లా మే 15 న మా దిల్లీ యాత్ర సంపన్నం అయ్యింది.
(ఇంకా ఉంది)
శ్రీధర్ రావు దేశ్‌పాండే తెలంగాణకు చెందిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు. రచయిత. సాగునీటి శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసినారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి కార్యాలయంలో పదేళ్ళ పాటు ఓఎస్డిగా సేవలు అందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’తో పాటు సాగునీటి రంగంపై పలు పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. తెలంగాణ అస్తిత్వంపై వ్యాసాల సంకలనం వెలువరించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. మరుగున పడిపోయిన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జీవిత చరిత్రను రాశారు. ‘అమెరికా ముచ్చట్లు’ ట్రావెలాగ్ రాశారు. ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో తన బాల్యపు జ్ఞాపకాలతో పాటు స్వగ్రామం బోథ్ భౌగోళిక, సాంస్కృతిక చరిత్రను వివరించారు.
