[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]
అధ్యాయం-6 చార్ధామ్ యాత్రలో తొలి మజిలీ హరిద్వార్‌లో గంగ తానం
పంతులు గారు చెప్పినట్టుగానే అందరూ రాత్రి సామాన్లు సర్దేసి రూమ్ ముందు పెట్టేసాము. మే 16 న ఉదయం 4 గంటలకు టీ, కాఫీలు సేవించి యాత్రీకులందరూ 40 సీట్లు ఉన్న రెండు పెద్ద ఎసి బస్సుల్లో తమకు కేటాయించిన సీట్లలో కూచున్నారు. ఉదయం 4.30కు బస్సులు హరిద్వార్‌కు బయలుదేరినాయి. పంతులు గారి సహాయకులు రాత్రే మా అందరి సామాన్లను బస్సుల కింద సామాన్ల అరల్లో సర్దేశారు. నాకు, నా జోడి కొడిశాల మల్లేశం గారికి పక్క పక్కనే సీట్లు కేటాయించారు. ఇది యాత్ర మొత్తం కొనసాగింది. మిగతా అందరు జంటలుగా వచ్చారు కాబట్టి జంటలుగా వారు తమ సీట్లలో అడ్జస్ట్ అయినారు. బస్సు దిల్లీ – డెహ్రాడూన్ జాతీయ రహదారి మీద ప్రయాణం. నోయిడా దాటే వరకు దిల్లీ ట్రాఫిక్ వలన ప్రయాణం మెల్లగా సాగినా ఆ తర్వాత 8 లేన్ల జాతీయ రహదారిపై వేగం పుంజుకున్నది. ఏసీ బస్సు కాబట్టి బయట ఎండ వేడిమి ఉన్నా ప్రయాణం హాయిగానే సాగింది. రెండు గంటల తర్వాత ఒక హైవే రెస్టారెంట్ వద్ద బస్సును ఛాయ్, నాస్తాల కోసం ఆపినారు. దాని పేరు ‘మామా యాదవ్’ రెస్టారెంట్. అదొక అన్ని సౌకర్యాలు ఉన్న రహదారి రెస్టారెంట్. శుభ్రంగా చాలా బాగుంది. ఛాయ్ మట్టి కప్పుల్లో ఇవ్వడం నచ్చింది. రుచి కూడా బాగుంది. ఒక కప్పు చాయ్ బిస్కట్లు తినడానికే సరిపోయింది. తాగడానికి మరో కప్పు చాయ్ ఆర్డర్ చేశాను. పొద్దుటి పూట తాగే చాయ్ వలన పేగు తడవాలట. ఒక అరగంట మామా యాదవ్ రెస్టారెంట్లో సేద దీరిన తర్వాత బస్సులు మళ్ళీ బయలుదేరినాయి. ఉదయం 10.30కు బస్సులు హరిద్వార్‌కు చేరుకున్నాయి. హరిద్వార్‌లో రోడ్ల విస్తరణ కార్యక్రమం, ఫ్లై ఓవర్ల నిర్మాణం జోరుగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే నగరంలో రోడ్లు మాత్రం అధ్వాన్నంగా, అపరిశుభ్రంగా ఉన్నాయి.
హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ తీర్థ క్షేత్రం. చార్ధామ్ యాత్రీకులకు ఇది తొలి మజిలీ కాబట్టి హరిద్వార్‌లో ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. వీరు నగరానికి తీసుకువచ్చే చెత్త, ముఖ్యంగా ప్లాస్టిక్ నగరంలో రోడ్ల మీద, గంగా ఘాట్ల వద్ద పేరుకుపోతాయి. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక పర్యాటకానికి పేరుగాంచిన దేవభూమి కాబట్టి రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపించింది. దిల్లీలో ఉన్నట్టే హరిద్వార్‌లో కూడా విపరీతంగా ఎండ కాస్తున్నది.
పంతులు గారి సహాయకులు మా సామాన్లను దించి ఎవరివి వారికి అందజేశారు. ‘హరిద్వార్ హార్మోని’ హోటల్లో బస ఏర్పాటు చేశారు. హోటల్ ముందు ఉన్న కదంబ వృక్షం నన్ను ఆకర్షించింది. కదంబ పుష్పాలు గుండ్రంగా ఒక బంతి లాగా ఎంత అందంగా ఉన్నాయో! ఇక్కడ కూడా ఇద్దరికి షేరింగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నాకు, మల్లేశంకు ఒక రూమ్ కేటాయించినారు. టిఫిన్లు అయ్యాక గంగ తానానికి అవసరమయ్యే సామాన్లు సర్దుకొని అందరూ 11.30 గంటల కల్లా ఆటోల్లో ఎక్కి స్వామీ సర్వానంద్ గంగా ఘాట్‌కు పోయాము.
ఎండాకాలం అయినా గంగ నీరు చల్లగా, స్వచ్చంగానే ఉన్నాయి. హరిద్వార్‌లో గంగా నది స్వచ్ఛంగా కనిపించినందుకు సంతోషపడినాను. హరిద్వార్‌లో ఇటువంటి స్నాన ఘట్టాలు చాలా ఉన్నాయి. హరిద్వార్‌లో ఎగువన ‘హర్ కి పౌరి’ సమీపంలో నదిపై ఒక బ్యారేజిని నిర్మించారు. ఈ బ్యారేజీని భీమ్‌గోడ బ్యారేజీ (Bhimgoda Barrage) అంటారు. గంగా నది నీటిని అప్పర్ గంగా కెనాల్ వైపు మళ్లించడానికి ఈ బ్యారేజీని 1955లో నిర్మించారు. ఈ బ్యారేజీ ద్వారా వ్యవసాయ అవసరాల కోసం పెద్ద ఎత్తున నీటిని మళ్లించడమే కాకుండా హరిద్వార్ లోని గంగా ఘాట్లకు స్వచ్చమైన నీటిని కూడా సరఫరా చేస్తారు. రోజూ వేలాది మంది పర్యాటకులు వస్తున్నా హరిద్వార్‌లో గంగా ఘాట్లకు భీమ్‌గోడ బ్యారేజీ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఘాట్ల వద్ద స్నానాలు చేసే వారు ఉండరు కాబట్టి ప్రవాహాలను తగ్గిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ప్రవాహాలను పెంచుతారు. మేము వెళ్ళిన ఘాట్ వద్ద మెట్లకు ఒక 5 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు నిర్మించారు. స్నానం చేసే వారు అంత కంటే మించి గంగా నది లోపలకి వెళ్ళలేరు. అక్కడ మెడ లోతు వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు మనిషిని లాక్కు పోయేంత వేగంతో ప్రవహిస్తున్నాయి.
మొదట మా మిత్ర బృందంలోని నాలుగు జంటలు గంగ తానానికి పోయారు. ప్రహ్లాదుడు పంతులు గారు వారికి శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో స్నానం చేయించాడు. నదిలో మూడు మునకలు వేసి గంగా మాయికి దీపారాధన చేసినారు. వారి స్నానం అయ్యే దాకా నేను గట్టుమీద మా సామాన్లకు కాపలా కాశాను. వారి స్నాన ఘట్టం పూర్తి అయినాక అరవింద్ నన్ను గంగ తానానికి తీసుకుపోయాడు. ఆ చల్లటి నీటిలో మూడు మునకలు వేశాను. కొద్ది సేపు మెట్ల మీద కూచుని గంగా ప్రవాహాన్ని ఆస్వాదించాను. ‘నీ గంగ తానాన్ని పై నుంచి చూసి మీ ఆయి సంతోషిస్తుందిరా’ అన్నాడు అరవింద్ నవ్వుకుంటూ. వాడి సంతోషమంతా నాస్తికుడినైన నన్ను ఆస్తికుడిగా మారుస్తున్నందుకు మాత్రమే అని నా గట్టి నమ్మకం. చల్లటి నీళ్ళలో మూడు మునకలతో జలుబు, దగ్గు వర్షం పట్టుకున్నది. ఇక అది రోజులు గడుస్తున్నా కొద్దీ ఎక్కువ అయ్యిందే తప్ప తగ్గలేదు. యాత్ర ముగిసిన నెల రోజుల వరకు నన్ను వెంటాడి సతాయించిన దగ్గు వర్షానికి పునాది ఇక్కడనే పడింది. మొత్తం మీద స్వామీ సర్వానంద్ గంగా ఘాట్‌లో అందరం స్నానాలు పూర్త్రి చేసుకొని, ఫోటోలు దిగి సగం ఎండిన తడి బట్టలతోనే అవే ఆటోల్లో హోటల్‌కు తిరిగి వచ్చాము. రూములోకి వెళ్లి పొడి బట్టలు వేసుకొని భోజనానికి డైనింగ్ హాల్‌కు చేరుకున్నాము. అన్నం, పప్పు, సాంబారు, ఒక కూర, పెరుగు, అప్పడాలు, మురుకులు.. ఇదే భోజనంలో పెట్టేది. సాత్విక ఆహారమన్న మాట.
భోజనాల తర్వాత హరిద్వార్ సందర్శనకు బయలుదేరాము. పంతులు గారు ఆటోలు పిలిపించారు. ఖర్చులు మాత్రం మావే. ఎక్కడకు పోవాలి అన్నదానిపై పంతులు గారు సలహా సూచనలు చేశాడు. హరిద్వార్‌లో రెండు కొండలపై మానసాదేవి ఆలయం, చండీదేవి ఆలయం ఉన్నాయని, వాటి పైకి కాలి నడకన వెళ్ళవచ్చు. కేబుల్ కార్ల ద్వారా వెళ్ళే సౌకర్యం కూడా ఉందని చెప్పాడు. కాలి నడకన వెళ్ళే టైం లేదు కాబట్టి కేబుల్ కార్లకు రెండింటికి ఒకేసారి టికెట్లు కొనుక్కోవచ్చునని చెప్పాడు. ఇవి రెండు చూసుకొని ‘హర్ కీ పౌరి’ వద్ద గంగా నది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైనదిగా భావించే గంగా ఘాట్ వద్ద ప్రతి రోజూ సాయంత్రం గంగా హారతి జరుగుతుందని, గంగా హారతి చూడటానికి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి 6 గంటల కల్లా ఘాట్‌కు చేరుకోవాలని సూచించాడు.
మానసాదేవి ఆలయం
మొదట మానసాదేవి ఆలయం చూడటానికి ఆటల్లో బయలుదేరాము. మా బ్యాచ్‌లో నేను, రమేష్, మల్లేశం, మరి కొందరు ఇతర యాత్రీకులతో కలిసి ఒక ఆటోలో వెళ్ళాము. మిగతా వారు మా కంటే ముందే వేరే ఆటోల్లో బయలుదేరినారు. మానసాదేవి ఆలయం గంగా నదికి ఎడమ వైపున ఉన్న బిల్వ పర్వతంపై ఉంది. కొండ కింద ఉన్న కౌంటర్లో రెండు ఆలయాలకు ఒకేసారి టికెట్ కొనుక్కొని ముగ్గురం కేబుల్ కార్ క్యూలైనులో నిలబడినాము. ఒకదాని తర్వాత ఒక కేబుల్ కారు వస్తూనే ఉన్నవి. ఒక్కో కారులో నలుగురిని కూచోబెట్టి పైకి పంపిస్తున్నారు. కేబుల్ కార్లో వెళ్తున్నప్పుడు హరిద్వార్ నగరం, గంగా నది, సుందరమైన బిల్వ పర్వతం ప్రకృతి అందాలు చూస్తూ, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఒక 20 నిమిషాల్లో కొండ మీదకు చేరుకున్నాము. మన తిరుమల కొండ మీదకు మెట్ల మార్గం ద్వారా కాలి నడకన పోయినట్టు ఇక్కడ కూడా వందలాది మంది భక్తులు నడుస్తూ కొండ ఎక్కడం చూసినాము. కొండ పైన మళ్ళీ పెద్ద క్యూ లైన్. మానసాదేవి అమ్మవారి దర్శనానికి అరగంట పట్టింది. ఈ దేవాలయాలు ప్రైవేట్ ట్రస్ట్‌ల ద్వారా నిర్వహించబడుతున్నట్టు గమనించాను. ఆలయం నిర్వహణపై, ఆదాయంపై ప్రభుత్వ నియంత్రణ ఏమీ ఉన్నట్టు లేదు. భక్తులకు సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అడుగడుగునా ఏదో ఒక పేరుతో భక్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. భక్తి ఉన్నవారు దక్షిణలు సమర్పించుకుంటున్నారు. నేను అవేమి పట్టించుకోకుండా క్యూలైన్ నుంచి బయటకు వెళ్లి కొండ మీద ప్రకృతిని ఆస్వాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాను. క్యూలైన్లో ముగ్గురం కలిసే పోయాము. కలిసే వచ్చాము. బయటకు వచ్చాక కొండ మీద సుందరమైన ప్రకృతిని తనివి తీరా ఆస్వాదించాను. ఫోటోలు తీసుకున్నాను. కేబుల్ కార్లోనే తిరుగు ప్రయాణం చేసి కిందకు దిగి వచ్చి మేము వచ్చిన ఆటోలోనే చండీదేవి ఆలయానికి బయలు దేరాము.
చండీదేవి ఆలయం గంగా నదికి కుడి వైపున ఉన్న నీల్ పర్వతం శిఖరంపై ఉంది. హరిద్వార్ ఊరిలో ఒక ఇరుకైన రోడ్డు మీద దించి కేబుల్ కార్ వద్దకు ఎట్లా వెళ్ళాలో చూపించి పార్కింగ్ కు వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. ఒక ఇరుకైన మెట్ల దారిలో కిందకి దిగి మరో ఇరుకైన తోవ గుండా ఒక 500 మీటర్లు నడచిన తర్వాత కేబుల్ కార్ ఎక్కే స్థలానికి చేరుకున్నాము. ఈ ఇరుకైన తోవలో రెండు వైపులా బట్టలు, బ్యాగులు, ఇతర సామాన్లు అమ్మే దుకాణాలు ఉన్నాయి. వాటి పక్కనే రైల్వే లైన్ కూడా ఉంది. మొత్తం మీద కేబుల్ కార్లో కూచుని నీల్ పర్వత శిఖరం మీదకు చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం ఆరున్నర అయ్యింది. ఇక గంగా హారతికి పోలేమని రూడి అయిన తర్వాత కొండ మీద కొంచం ఎక్కువ సేపు గడిపాము. ఫోటోలు తీసుకున్నాము. మల్లేశం గారు మాతో విడిపోయి చాలా సేపటికి గాని మమ్ములను కలుసుకోలేక పోయారు. కొండ మీద సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. ఆయన మా కోసం, మేము ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాము. మొత్తానికి ఒక అరగంట తర్వాత ముగ్గురం కలుసుకొని కేబుల్ కార్లో కిందకి దిగి అదే ఇరుకైన తోవ గుండా నడచి ఆటో ఎక్కి హోటల్ కు చేరుకున్నాము.
అరవింద్ బ్యాచ్ గంగా హారతి చూడాలని చండీదేవి ఆలయానికి రాలేదు. గంగా హారతికి నిర్వహించే ఘాట్‌కు వెళ్ళినారు. కాని అప్పటికే వేలాది మంది జనం హాజరు కావడంతో గంగా హారతి కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూసి అస్వాదించలేక పోయారట. ఇక హారతి మిగిసినాకా తామెక్కడ ఉన్నది ఆటో డ్రైవర్‌కు చెప్పలేక, ఆటో ఉన్న చోటును కనుక్కోలేక, తమ ఆటోను వెతుక్కోవడంలో చీకట్లో ఒక గంట ఆపసోపాలు పడ్డారు. మేము హోటల్‌కి చేరుకున్న గంటన్నరకు వారు హోటల్‌కు చేరుకున్నారు. కాశీలో జరిగే గంగా హారతి ఇంకా బాగా జరుగుతుందట. హరిద్వార్‌లో సరిగా చూడలేకపోయామన్న అసంతృప్తి ఉన్నప్పటికీ కాశీలో చూసినాము కదా అనుకోని సమాధానపడినారు.
రాత్రి భోజనాలు అయ్యాక పంతులు గారు మే 17 నాటి ప్రోగ్రాం వివరాలు వెల్లడించారు. హరిద్వార్ నుంచి మొత్తం యాత్రీకులను మూడు బ్యాచ్‌లుగా వర్గీకరించామని. మూడు బ్యాచ్‌లకు మూడు చిన్న 25 సీటర్ బస్సులు ఏర్పాటు చేసినామని చెప్పాడు. యాత్ర మొత్తంలో మళ్ళీ హరిద్వార్ వచ్చేదాకా ఇవే బస్సుల్లో ప్రయాణించాలని, ప్రతీ రోజు సీట్ల కేటాయింపులు మారతాయని, ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూచుని సహకరించాలని కోరినాడు. మే 17న ఉదయం టిఫిన్ అయిన తర్వాత 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పాడు. యమునోత్రి ప్రయాణంలో భాగంగా రాత్రి బార్కోట్ అనే ఊర్లో బస చేస్తామని చెప్పాడు. మే 18 ఉదయం 4 గంటలకు బస్సులు యమునోత్రికి బయలుదేరుతాయని చెప్పాడు. మనం ఎంత ఆలస్యం చేస్తే దర్శనం అంత ఆలస్యం, కష్టతరం అవుతుందని చెప్పాడు. కాబట్టి సమయపాలన పాటించాలని కోరినాడు. ఆయన సూచనలు తీసుకొని అందరూ ఎవరి రూంలోకి వారు దూరిపోయారు.
హరిద్వార్‌లో చాలా మంది సహా యాత్రీకులు పరిచయం అయినారు. అందులో కరీంనగర్ నుంచి వచ్చిన ఒక సీనియర్ జర్నలిస్టు సంగనభట్ల రామకృష్ణయ్య గారు కూడా ఉన్నారు. వీరు ప్రముఖ చరిత్రకారులు, బహు గ్రంథకర్త సంగనభట్ల నరసయ్య గారికి బంధువేనట. నేను అతనికి నా రచనల ద్వారా తెలుసునట. అయితే మేమిద్దరం కలుసుకోవడం ఇదే తొలిసారి.
మే 16 న మా చార్ధామ్ యాత్రలో తొలి మజిలి ‘హరిద్వార్ గంగా దర్శనం’ సుఖంగా ముగిసింది.
(ఇంకా ఉంది)
శ్రీధర్ రావు దేశ్‌పాండే తెలంగాణకు చెందిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు. రచయిత. సాగునీటి శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసినారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి కార్యాలయంలో పదేళ్ళ పాటు ఓఎస్డిగా సేవలు అందించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’తో పాటు సాగునీటి రంగంపై పలు పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. తెలంగాణ అస్తిత్వంపై వ్యాసాల సంకలనం వెలువరించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. మరుగున పడిపోయిన హైదరాబాద్ లెజెండ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జీవిత చరిత్రను రాశారు. ‘అమెరికా ముచ్చట్లు’ ట్రావెలాగ్ రాశారు. ‘బొంతల ముచ్చట్లు’ పుస్తకంలో తన బాల్యపు జ్ఞాపకాలతో పాటు స్వగ్రామం బోథ్ భౌగోళిక, సాంస్కృతిక చరిత్రను వివరించారు.

