Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా చార్‌ధామ్ సాహస యాత్ర-7

[ఇటీవల మిత్రులతో కలసి ‘చార్‌ధామ్’ యాత్ర చేసి వచ్చి, ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‍పాండే.]

అధ్యాయం-7 ‘చార్‌ధామ్’లు, ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి కొన్ని ముచ్చట్లు

మా చార్‌ధామ్ అసలైన యాత్రా ముచ్చట్లకు పోయే ముందు నా అధ్యయనంలో నుంచి చార్‌ధామ్ సంగతులు, ఉత్తరాఖండ్ రాష్ట్రం సంగతులు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. చార్‌ధామ్ యాత్ర అంటే నాలుగు తీర్థ క్షేత్రాల సందర్శన అన్నమాట. ఇది కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. పాము మెలికల్లాగా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇరుకైన కొండ దారుల్లో సాగే కఠినమైన, శారీరక, మానసిక శ్రమకు లోనయ్యే యాత్ర. కాలి నడకన పోయే వారి యాతన ఎలాంటిదో నాకైతే అనుభవంలో లేదు కాని, యాత్రలో నేను చూసిన దాన్ని బట్టి, కాలి నడకన పోయిన వారు తమ అనుభవాలను వీడియోల ద్వారా ప్రపంచానికి తెలిపిన దాని ప్రకారం చార్‌ధామ్ యాత్ర ఒక అత్యంత కష్టతరమైనదేనని రూడీగా చెప్పగలను. అందుకే ప్రతికూలమైన వాతావరణంలో సాగించే ఈ యాత్రను ఒక సాహాస యాత్ర గానే వర్ణిస్తున్నాను. నాలాంటి వారికి దుస్సాహాస యాత్ర అని కూడా వర్ణించవచ్చు.

చార్‌ధామ్ యాత్రను ఒక సాంస్కృతికోద్యమంగా మార్చిన తర్వాత భారతదేశంలోని లక్షలాది మందికి ఈ యాత్ర ఒక కలగా మారిపోయింది. చార్‌ధామ్ యాత్ర చేయడం దేశభక్తికి చిహ్నంగా మారిన పరిస్థితి. ‘అయ్యో మీరింకా పోలేదా! నేను ఎప్పుడో పోయాను’ అని మన మీద జాలి చూపించే ఒక విచిత్ర పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్. బద్రీనాథ్‌ క్షేత్రాలను సందర్శించాలని కోరుకుంటున్నారు. ఏటేటా దేశం నలుమూలల నుంచి వచ్చే చార్‌ధామ్ యాత్రీకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఏటా 6 నెలలు.. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా మాత్రమే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు తెరచి ఉంటాయి. కాబట్టి ఎండా కాలం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో యాత్రీకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అటు తర్వాత తగ్గుముఖం పడుతుంది. అందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చార్‌ధామ్ యాత్రా నిర్వాహణకు టూరిస్ట్ సంస్థలు ప్యాకేజీలు ప్రకటించి, లక్షలాది మంది యాత్రీకులను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తోలుకు పోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈ ఆధ్యాత్మిక పర్యాటకం ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చార్‌ధామ్ సాంస్కృతికోద్యమానికి ఇతోధిక ప్రోత్సాహం ఇస్తున్నాయి. కాని ఈ లక్షలాది మంది భక్త జనానికి తగినన్ని సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని నా యాత్రలో తెలుసుకున్నాను.

చార్‌ధామ్ రూట్ మ్యాప్

ఈ నాలుగు తీర్థ స్థలాలు ఉత్తరాఖండ్‌ లోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. కొన్ని చోట్ల రోడ్లు ఇరుకుగా ఉంటాయి, వాతావరణం వేగంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రయాణం ప్రారంభించే ముందు యాత్రలో ఎదురయ్యే కష్టనష్టాల గురించి, వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి అవసరం. సాధారణంగా ఈ చార్‌ధామ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి ప్రారంభమవుతుంది. మా టూర్ ఆపరేటర్ హరిద్వార్ నుంచి యాత్రను ప్లాన్ చేసినాడు. మొదట యాత్రికులను రోడ్డు మార్గంలో యమునోత్రికి తీసుకు వెళతారు. యమునోత్రి తర్వాత గంగోత్రికి, ఆ తర్వాత ప్రయాణం కేదార్‌నాథ్ వైపు సాగి, బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది. ఇదొక పరిక్రమ లాంటిది. యాత్రికులు ఈ నిర్దిష్ట క్రమాన్ని అనుసరిస్తూ ప్రయాణాన్ని మొదట యమునా మాత దర్శనంతో ప్రారంభించి, ఆ తర్వాత గంగా మాత దర్శనానికి వెళ్లి ఈ రెండు పవిత్ర నదీమ తల్లుల ఆశీర్వాదాలు పొందిన తరువాత, కేదార్‌నాథ్‌ లోని శివుని దర్శనానికి వెళతారు. బద్రీనాథ్‌లో విష్ణుమూర్తి దర్శనంతో చార్‌ధామ్ యాత్ర పూర్తవుతుంది. ఈ పరిక్రమాన్ని చాలా కాలంగా యాత్రీకులు అనుసరిస్తున్నారు. టూర్ ఆపరేటర్లు కూడా ఈ పరిక్రమాన్ని తప్పక పాటిస్తారు.

ప్రతి ‘ధామ్’ (క్షేత్రం) కు దానికంటూ ఒక ప్రత్యేక మార్గం ఉంది. కొన్ని చోట్ల కొద్ది దూరం నడవాల్సి రావచ్చు లేదా హెలికాప్టర్ సేవలను ఉపయోగించాల్సి రావచ్చు. యమునోత్రి, కేదార్నాథ్ క్షేత్రాలకు మాత్రం గుర్రాలు, డోలిలు, పాల్కీల ద్వారా కూడా పోవచ్చు. వాటి గురించి తర్వాత అధ్యాయాల్లో వివరిస్తాను. 95 శాతం ప్రయాణం రోడ్డు మార్గంలోనే సాగుతుంది. ప్రయాణంలోని కొన్ని భాగాలు సాధారణ రహదారులుగా ఉంటాయి. కొన్ని భాగాలు పదునైన మలుపులతో కూడిన ఇరుకైన ఘాట్ రోడ్లుగా ఉంటాయి. కానీ ప్రతి చోటా దృశ్యం అందంగా, అద్భుతంగా ఉంటుంది. దారిలో పొడవైన దేవదారు వృక్షాలతో నిండిన అడవులు, జలపాతాలు, లోయలు, ఆ లోయల్లో ప్రవహించే యమునా, గంగా నదుల ఉప నదులు, అనేక గ్రామాలు, చిన్న పట్టణాలు, కొండవాలులో అంచెలవారి వరి, గోధుమ పొలాలు కనిపిస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇదొక గొప్ప అనుభవం. మనం పైకి ఎక్కుతున్నా కొద్దీ గాలి పలుచనవుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మేము వెళ్ళింది ఎండాకాలంలో కాబట్టి పగలు తీవ్రమైన ఎండా వేడిమి, సాయంత్రం నుంచి అతి శీతల వాతావరణం, ఎప్పుడు పడతాయో తెలియని వానలు మమ్ములను వెంటాడినాయి. యమునోత్రి, కేదార్నాథ్ ప్రయాణంలో మనకు ఆక్సీజన్ కొరత కూడా అనుభూతిలోకి వస్తుంది. చాలా మంది కొండ ఎక్కే ముందే ముందు జాగ్రత్తగా పోర్టబుల్ ఆక్సీజన్ సిలిండర్‌ను వెంట తీసుకుపోతారు.

చార్‌ధామ్ యాత్ర మైదాన ప్రాంతాల నుండి ప్రారంభమై, నెమ్మదిగా మనలను ఎత్తైన పర్వతాల పైకి తీసుకు వెళుతుంది. హరిద్వార్, రిషికేశ్ వరకు రైలు, బస్సు లేదా విమానం (డెహ్రాడూన్ విమానాశ్రయం) ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి నుండి అసలైన పర్వత రహదారి మార్గం ప్రారంభమవుతుంది. హరిద్వార్ లేదా రిషికేశ్ నగరాలలో మనం వెచ్చని బట్టలు, మందులు, రెయిన్ జాకెట్లు, మనకీ టోపీలు, హ్యాండ్ గ్లోవ్స్, బ్యాగ్‌లు కొనుగోలు చేయవచ్చు. టూర్ ఆపరేటర్లు వారిని హోటల్ వద్దకే పిలిపిస్తారు. మేము మే 17న యమునోత్రికి బయలుదేరే ముందు హరిద్వార్‌లో మా హోటల్ వద్దనే వీటన్నిటిని కొనుగోలు చేసుకున్నాము.

ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం:

ఇకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల గురించి కొంత చెప్పాలని ఉంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ ఉద్యమం. 2000 సంవత్సరానికి ముందు ఈ కొండ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఉత్తరప్రదేశ్ 85 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న చాలా పెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో గంగా మైదాన ప్రాంతాలదే ఆధిపత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నిర్లక్ష్యానికి, వివక్షకు గురి అయిన విధంగానే కొండ ప్రాంతం అయిన ఉత్తరాఖండ్ కూడా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై అభివృద్ధిలో వెనుకబడిపోయింది. వారు ప్రత్యేక రాష్టం కోసం ఉద్యమించడం మొదలుపెట్టారు. సుదీర్ఘ పోరాటాలు, అనేక బలిదానాల తర్వాత 9 నవంబర్ 2000 న ఉత్తరాఖండ్ (మొదట్లో ఉత్తరాంచల్) భారతదేశపు 27వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అదే సందర్భంగా బీహార్ నుంచి ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘర్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కావలసి ఉండింది. కాని బలమైన ఆంధ్రా లాబీయిస్టుల కారణంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం కాలేదు. అదంతా మనందరికీ తెలిసిన చరిత్రనే.

ఉత్తరాఖండ్ ఉద్యమ నేపథ్యం & ప్రారంభం:

శ్రీ కాశీసింగ్ ఐరీ

ముఖ్యమైన హింసాత్మక ఘట్టాలు – బలిదానాలు:

ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణ సంఘటనలు ప్రజా ఆగ్రహాన్ని మరింత పెంచాయి:

రాజకీయ ఆమోదం – రాష్ట్ర ఏర్పాటు:

ఉత్తరాఖండ్ రాష్ట్ర పాలనా వ్యవస్థ:

కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. పరిపాలనా పరంగా ఈ రాష్ట్రాన్ని గర్వాల్, కుమోన్ అనే రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజించారు. గర్వాల్ విభాగంలో 7 జిల్లాలు ఉన్నాయి. చమోలి (బద్రీనాథ్ మరియు ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ ఇక్కడే ఉన్నాయి), డెహ్రాడూన్ (రాష్ట్ర రాజధాని), హరిద్వార్ (ప్రసిద్ధ తీర్థ క్షేత్రం), పౌరీ గర్వాల్, రుద్ర ప్రయాగ్ (కేదార్‌నాథ్ ఇక్కడే ఉంది), తెహ్రీ గర్వాల్, ఉత్తర కాశీ (గంగా నది భగీరథిగా ఇక్కడే ఉద్భవిస్తుంది). కుమోన్ విభాగంలో 6 జిల్లాలు ఉన్నాయి.

అల్మోరా, భాగేశ్వర్, చంపావత్, నైనితాల్ (సరస్సులకు ప్రసిద్ధి), పిథోరాగఢ్, ఉధంసింగ్ నగర్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 5 లోక్‌సభ (పార్లమెంట్) నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అల్మోరా, గర్వాల్, హరిద్వార్, నైనితాల్-ఉధంసింగ్ నగర్, తెహ్రీ గర్వాల్. దీనితో ఉత్తరప్రదేశ్‌లో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 80కి పడిపోయింది. ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 2022 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారంగా భారతీయ జనతా పార్టీకి 47 సీట్లు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు, బహుజన్ సమాజ్ పార్టీకి 2 సీట్లు, స్వతంత్రులకు 2 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. పుష్కర్ సింగ్ ధామీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లో ‘ప్రయాగ’లు:

ఉత్తరాఖండ్‌లో ‘ప్రయాగ’ అనే పదం చివరన కలిగిన ఆరు ముఖ్యమైన పట్టణాలు లేదా భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. సంస్కృతంలో ‘ప్రయాగ’ అంటే ‘నదుల సంగమ స్థలం’ అని అర్థం. ఆరు ప్రధాన ప్రదేశాలు విస్తృతంగా గుర్తింపు పొందాయి.

  1. దేవ ప్రయాగ:

తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం అన్నింటిలోనూ అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడే అలకానంద, భాగీరథి నదులు కలిసి గంగా నదిగా రూపాంతరం చెందుతాయి.

  1. రుద్ర ప్రయాగ:

ఇది ఒక ముఖ్యమైన జిల్లా కేంద్రం. ఇక్కడ అలకనంద నది మందాకిని నదితో కలుస్తుంది. ఆ తర్వాత నది దేవప్రయాగ దాకా అలకానంద గానే ప్రవహిస్తింది.

  1. కర్ణ ప్రయాగ:

చమోలి జిల్లాలో ఉన్న ఈ పట్టణం అలకనంద, పిండార్ నదుల సంగమ స్థలం.

  1. నంద ప్రయాగ:

చమోలి జిల్లాలోని ఒక చిన్న చారిత్రక పట్టణం. ఇక్కడ అలకనంద నది నందాకిని నదితో కలుస్తుంది.

  1. విష్ణు ప్రయాగ:

ఈ వరుస క్రమంలో మొదటి సంగమ స్థలం ఇది. జోషిమఠ్ సమీపంలో ఉన్న ఇక్కడ అలకనంద నది ధౌలిగంగతో కలుస్తుంది.

  1. సోన్‌ ప్రయాగ:

రుద్రప్రయాగ జిల్లాలో సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పట్టణం. కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో అత్యంత రద్దీగా ఉండే కీలకమైన మజిలి. ఇది మందాకిని, వాసుకి గంగ నదుల సంగమ స్థలం.

ఉత్తరాఖండ్ లో ‘కాశీ’లు:

ఉత్తరాఖండ్‌లో ‘కాశీ’ అనే పేరును కలిగి ఉండి, ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన రెండు పట్టణాలు ఉన్నాయి.

ఉత్తరకాశీ:

ఇది గర్వాల్ ప్రాంతంలో ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. భాగీరథీ నదీ తీరంలో ఉన్న ఈ పట్టణానికి, అసలైన కాశీతో(వారణాసి) ఉన్న భౌగోళిక, ఆధ్యాత్మిక పోలికల కారణంగా ఆ పేరు వచ్చింది. వారణాసి లాగానే ఇది కూడా రెండు నదుల (వరుణ మరియు అసి) మధ్య ఉంది. ఇక్కడ శివునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం, ప్రత్యేకమైన మణికర్ణికా ఘాట్ ఉన్నాయి.

గుప్తకాశీ (‘అజ్ఞాత కాశీ’):

ఇది కూడా గర్వాల్ ప్రాంతంలో రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. కేదార్‌నాథ్ వెళ్లే మార్గంలో మందాకినీ నదీ లోయలో ఇది ఉంది. హిందూ పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ పాప పరిహారం కోసం శివుని దర్శనం కోరుకున్నారు. వారి నుండి తప్పించుకోవడానికి శివుడు అజ్ఞాతంలోకి (గుప్తంగా) వెళ్లి, నంది రూపంలో ఇక్కడ దాక్కున్నాడట. అందుకే ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని ఒక పురాణ గాథ ఉన్నది. ఇక్కడ కూడా ఒక పురాతన విశ్వనాథ ఆలయం, మణికర్ణికా కుండం ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో భారతదేశం అంతటా వారణాసితో సమానమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అనేక ‘కాశీ’లు గుర్తించబడినా, హిమాలయాలలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్నఈ రెండు కాశీలకే విశేష ఆధ్యాత్మిక ప్రాచుర్యం దక్కింది. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో వెలసిన కాళేశ్వరం తీర్థ క్షేత్రాన్ని ‘దక్షిణ కాశీ’ గా పిలవడం మనకు తెలిసిందే.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అటవీ సంపద – జీవ వైవిధ్యం:

ఉత్తరాఖండ్ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ హరితవనాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో దాదాపు 45.4% అడవులతో నిండి ఉంది. ఈ రాష్ట్రం మైదాన ప్రాంతాల నుండి మొదలై హిమాలయాల మంచు శిఖరాల వరకు విస్తరించి ఉండటం వల్ల, ఇక్కడి అడవులు ఎత్తును బట్టి పూర్తిగా మారిపోతుంటాయి. సముద్ర మట్టం నుండి ఉండే ఎత్తును బట్టి ఇక్కడి అడవులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు అటవీ శాస్త్రవేత్తలు.

ఉత్తరాఖండ్ లో జీవవైవిధ్యం & రక్షిత ప్రాంతాలు:

ఈ విభిన్న అడవులు రాయల్ బెంగాల్ పులులు, చిరుత పులులు, మంచు చిరుతలు, ఆసియా నల్ల ఎలుగుబంట్లు, కస్తూరి మృగాలు, ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయిన హిమాలయన్ మోనాల్ వంటి ఎన్నో అరుదైన వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి. ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి, ఉత్తరాఖండ్‌లో ఒక బలమైన రక్షణ నెట్‌వర్క్ ఉంది:

ఉత్తరాఖండ్‌లో సామాజిక అడవుల నిర్వహణ: వన్ పంచాయతీలు:

ఉత్తరాఖండ్ అటవీ సంరక్షణలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే.. ప్రజల భాగస్వామ్యంతో నడిచే వన్ పంచాయతీలు (అటవీ మండళ్లు). బ్రిటీష్ వారి అటవీ నియంత్రణ చట్టాలకు వ్యతిరేకంగా 1921లో జరిగిన స్థానిక నిరసనల తర్వాత ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో 12,000 కంటే ఎక్కువ వన్ పంచాయతీలు పని చేస్తున్నాయి. ఇవి స్థానిక గ్రామస్థులకు, ముఖ్యంగా మహిళలకు, తమ గ్రామ పరిసరాల్లోని అడవులను రక్షించుకునే మరియు వాటి నుండి పశుగ్రాసం, వంటచెరుకు, ఔషధ మూలికలను సేకరించి స్థిరమైన పద్ధతిలో ఆదాయం పొందే చట్టపరమైన హక్కులను కల్పిస్తాయి.

ఉత్తరాఖండ్ Vs ఉత్తర ప్రదేశ్:

తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు 2000 సంవత్సరంలో ఏర్పడిన ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్‌ఘర్.. మూడు రాష్ట్రాలు తమ మాతృ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే మానావాభివృద్ధిలో, ఆర్ధికాభివృద్ధిలో ఎటువంటి మార్పులు సంభవించాయి అన్న అంశంపై అధ్యయనాలు జరిగినాయి. ఈ అధ్యయనంలో కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలు కూడా తమ మాతృ రాష్ట్రాలతో పోలిస్తే అత్యుత్తమమైన ప్రగతిని సాధించాయని తేలింది. ఇప్పుడు ఈ ట్రావెలాగ్ రాస్తున్నప్పుడు మళ్ళీ అటువంటి ఒక ప్రయత్నం ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో చేసినాను. నాకు లభించిన సమాచారం ప్రకారం 2000 లో ఏర్పడినప్పటి నుండి ‘పిల్ల రాష్ట్రం’ అయిన ఉత్తరాఖండ్‌ను దాని మాతృ రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పోల్చినప్పుడు చాలా విలక్షణమైన, ఆసక్తికరమైన అభివృద్ధి ప్రస్థానం మనకు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రం. ఇటీవలి సంవత్సరాలలో యుపిలో ఎక్స్‌ప్రెస్‌ వేలు, నోయిడా వంటి తయారీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, తలసరి ఆదాయంలో, మానవాభివృద్ధి సూచికలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను గణనీయంగా అధిగమించిందని తెలుస్తున్నది. గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే, కొన్ని ప్రధాన రంగాలలో అభివృద్ధి వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తాయి.

1. తలసరి ఆదాయం & సంపద పంపిణీ:

ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఉత్తరాఖండ్‌లో తలసరి ఆదాయం సుమారు రూ. 2.60 లక్షలకు పైగా ఉంది. ఇది భారత జాతీయ సగటు కంటే దాదాపు 40% ఎక్కువ. ఉత్తర ప్రదేశ్ భారతదేశంలో మూడవ అతిపెద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) కలిగిన భారీ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ, దాని అధిక జనాభా తలసరి ఆదాయాన్ని తగ్గిస్తున్నది. యుపి తలసరి ఆదాయం గమనించదగ్గ విధంగా చాలా తక్కువగా సుమారు రూ 1.70 లక్షలుగా ఉంటుందని ఒక అంచనా. అంటే 25 ఏళ్లలో ఉత్తరాఖండ్ ఆర్ధిక వ్యవస్థ తన మాతృ రాష్ట్రాన్ని మించిన తలసరి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడిన సంపదను సృష్టించిందని తేలుతున్నది.

2. మానవ అభివృద్ధి సూచికలు (Human Development Indicators):

లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఉమ్మడి యుపి ప్రభుత్వం కొండ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందనే భావనే ఉత్తరాఖండ్ రాష్ట్ర హోదాను కోరడానికి ప్రధాన కారణమని ఇంతకూ ముందే ప్రస్తావించాను. రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం స్థానిక మానవాభివృద్ధిపై దృష్టి సారించిన ఫలితంగా ఆయా మానవాభివృద్ది సూచికలలో గణనీయమైన ప్రగతి కనిపిస్తున్నది.

3) ఆరోగ్యం & విద్య:

యూపిలో అక్షరాస్యత రేటు సుమారు 69% ఉంటే ఉత్తరాఖండ్‌లో అక్షరాస్యత రేటు 78% పైగా ఉంది. సవాళ్ళతో కూడిన పర్వత ప్రాంతం అయినప్పటికీ, యూపీ మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాఖండ్ ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో, మాతా, శిశు మరణాల రేటులో మెరుగైన ఫలితాలను సాధించింది.

4) పేదరిక నిర్మూలన:

జాతీయ బహుముఖ పేదరిక సూచికల ప్రకారం, ఉత్తరాఖండ్ తన జనాభాలో అధిక శాతాన్ని పేదరికం నుండి విజయవంతంగా బయటకు తీసుకువచ్చింది. ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ, ముఖ్యంగా దాని తూర్పు, మధ్య గ్రామీణ ప్రాంతాలలో అధిక సంఖ్యలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న ప్రజలను దారిద్ర రేఖ పైకి తీసుకు రావడానికి ఇంకా పోరాడుతున్నది.

5) ఆర్థిక నిర్మాణం & పారిశ్రామికీకరణ:

ఈ రెండు రాష్ట్రాలు పూర్తిగా భిన్నమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో తయారీ రంగం విజృంభణ కొనసాగింది. కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే పన్ను ప్రోత్సాహకాలు అందించడం వల్ల హరిద్వార్, పంత్‌నగర్, సేలాక్వి వంటి ప్రదేశాలు భారీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థల (SIDCUL) కేంద్రాలుగా రూపుదాల్చినాయి. ఇది ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), ఆటోమొబైల్ తయారీ (ఉదా. టాటా మోటార్స్, బజాజ్) రంగాలకు ఒక బలమైన కేంద్రంగా మారింది.

6) ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విస్తృతి:

యూపీ ఆర్థిక వ్యవస్థ భారీగా సాగే వ్యవసాయంపై (ఇది భారతదేశపు చెరకు, గోధుమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం) ఆధారపడుతున్నది. దీనితో పాటు ప్రధానంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ జోన్ (నోయిడా/గ్రేటర్ నోయిడా) లో కేంద్రీకృతమై ఉన్న టెక్/ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, సాంప్రదాయ కుటీర పరిశ్రమలు (వారణాసిలో చేనేత, కాన్పూర్‌లో తోలు పరిశ్రమ) కూడా ఉన్నాయి.

7) పర్యాటకం మరియు హరిత శక్తి:

ఉత్తరాఖండ్ తన సహజ భౌగోళిక స్వరూపాన్ని బలంగా ఉపయోగించుకుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకున్నది. ఉత్తరాఖండ్ మతపరమైన పర్యాటకాన్ని(చార్‌ధామ్ యాత్ర), సాహస పర్యాటకాన్ని (రిషికేష్, ఔలి, తెహ్రీ) ఒక అత్యంత వ్యవస్థీకృత సేవా రంగంగా మార్చింది. ఇది రాష్ట్ర జిఎస్‌డిపి పెరగడానికి దోహదం చేస్తున్నది.

8) జలవిద్యుత్ ఉత్పత్తి:

ఉత్తరాఖండ్ తన ఆదాయంలో అధిక భాగాన్ని ఎనర్జీ రంగంలో చిన్న, పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై వెచ్చించడం ద్వారా జల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు వాడుకుంటూనే వాణిజ్యపరంగా కూడా ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నది. 2400 మెగావాట్ల తెహ్రీ జల విద్యుత్ కేంద్రం అందులో ఒకటి. హరిత ఇంధన ఎగుమతిదారుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తింపు పొందింది. మరోవైపు యుపి ఎక్కువగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడుతున్నది.

చిన్నదైన, కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ కూడా తలసరి ఆదాయాన్ని వేగంగా అభివృద్ధి చేయగలదని ఉత్తరాఖండ్ విజయవంతంగా నిరూపించింది. ఇది మన తెలంగాణలో కూడా రుజువయ్యింది. రాష్ట్రంగా ఏర్పడిన పదేండ్లలోనే తెలంగాణా దేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలచింది. అయితే ఇది ఉత్తరాఖండ్ పారిశ్రామిక, ఆర్థికవృద్ధిలో అధిక భాగం ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్, డెహ్రాడూన్ లాంటి కొన్ని మైదాన జిల్లాలలోనే కేంద్రీకృతమై ఉంది. కాగా స్థానిక ఉద్యోగాల కొరత కారణంగా ఎత్తైన హిమాలయ ప్రాంతాల నుంచి ఇప్పటికీ మైదాన ప్రాంతాలకు వలసల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇది మైదాన ప్రాంతాలను ఒత్తిడికి గురి చేస్తున్నది. ఇది కొండ ప్రాంతాలకు ఉండే ఒక అనివార్య భౌగోళిక సమస్య. ఈ లోటును ఉద్యానవనాల పెంపకం, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఆధ్యాత్మిక పర్యాటకం, హోమ్-స్టే పర్యాటకం లాంటి కార్యక్రమాల ద్వారా పరిష్కరించుకోవడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం చురుకుగా ప్రయత్నిస్తున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో, కొండ దారుల విస్తరణలో, పర్యాటకులు మోసుకు వచ్చే లక్షలాది టన్నుల ప్లాస్టిక్‌ను, ఇతర వ్యర్థాలను నిరోధించడంలో, లేదా నిర్వహించడంలో, హిమాలయ పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం బాగా వెనుకబడి ఉన్నదని నా చార్‌ధామ్ యాత్రలో కనిపించిన వాస్తవం.

ఈ చార్‌ధామ్ క్షేత్రాల ఉపోద్ఘాతం, ఉత్తరాఖండ్ రాష్ట్ర విశేషాలతో మా అసలైన చార్‌ధామ్ యాత్రానుభవాలను తర్వాతి అధ్యాయాల్లో వివరిస్తాను.

(ఇంకా ఉంది)

Exit mobile version