[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘నా దేశం నాడు – నేడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మహాత్ముని నాయకత్వంలో
గళం కలిపిన నాయకుల స్ఫూర్తితో
కలం ఝళిపించిన కవుల ఆలోచనలతో
మహావీరుల ప్రాణార్పణల జ్వాలలతో
భరతమాత దాస్యశృంఖకలాలను తొలగించి
మేధావుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న
రాజ్యాంగ వ్యవస్థ కులమతాలకతీతంగా
హక్కులు బాధ్యతలు పౌరులకందించింది
ధర్మానికి నెలవైన రామాయణం పుట్టింది
వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే భగవద్గీత వెలిసింది
అహింసా బోధకుడైన బుద్ధుడు
నడయాడిన నేల ఇది
ఆధ్యాత్మికత పరిఢవిల్లిన చోటు
నాగరికతలకు పుట్టినిల్లు నా దేశం
భిన్నత్వంలో ఏకత్వమే మా సిద్ధాంతం
ఆ దేవుడే మానవుడిగా
అవతరించిన కర్మభూమి
అన్యాయాన్ని ఎదిరించటమే మా లక్ష్యం
ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తూ
దేశదేశాలు చెయ్యెత్తి జేకొట్టే నా దేశం
విదేశీ వ్యామోహాలకు లోనై
వెర్రితలలు వేసిన నాగరికతా వ్యామోహం
విఛ్ఛిన్నమవుతున్న వైవాహిక వ్యవస్థ
ఛిద్రమవుతున్న కుటుంబనేపథ్యం
మనీకే తప్ప మనసుకు
విలువనివ్వని మానవ సంబంధాలు
అత్యాచారాలు అరాచకాలు
అక్రమాలతో అట్టుడుకుతూ
అశాంతికి నెలవైనది
స్వార్థపూరిత నాయకుల ఆలోచనలు
నోటుకే తప్ప ఓటుకు విలువ లేని
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో
మనిషి మనుగడకు అర్ధమేది?
మంచికి మానవతకు వీలువెక్కడ
ఇదా! జనం కోరుకున్న స్వాతంత్రం
ఇదా! గాంధీజీ కలలు కన్నా నా దేశం.
