[శ్రీ సాహితి రచించిన ‘నా గదిలో నేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గదిలో ఒక్కడేనని
మోసపోయాను..
కొద్దిసేపటికే గదంతా
పాత, కొత్త స్నేహితుల మధ్య
వింత, విడ్డూర తత్వాలతో
కిక్కిరిపోయింది..
కాస్తా కునుకు పట్టేలోగే
పాత మాటల చప్పుళ్ళుతో
తిరుణాల
మబ్బు పట్టినట్లుగా
విసురుగా కొందరు
ముఖాన్ని తాకారు..
ఎర్రని ఎండలా
ఇంకొ ఇద్దరు
వేడిని కురిపించారు
అంతలోకే
గొంతు లోతు నీళ్లతో మరో ఇద్దరు
వరదలా ముంచెత్తారు..
నా ఒంటరితనాన్ని
దొంగిలించే వీరందరెవరు?
ఆ హక్కు ఎక్కడిది వీళ్లకు?
నిద్ర చెడి
మనసు చెదరి
అద్దం ముందు నిలబడ్డాను..
నేను కనిపించలేదు.
నా పాత ముఖం
కనిపించింది..
దాని వెనుకే
గుంపులు గుంపులుగా
నిలబడి ఉన్నారు..
అంతలో తెల్లవారింది
గదిలో వెలుతురు
చప్పుడుకు అంతా నిశ్శబ్దం..
మనసులో
ఏదో మాయ..
మళ్ళీ
మనిషి చుట్టూ అందరూ
కనిపించారు..
ఇకపై గదిలో
ఒంటరితనం
నేను ఎదురుపడబోము..
