[కన్నడంలో బి. ఆర్. లక్ష్మణ రావు రాసిన కవితని ‘నా గాంధీ’ పేరిట అనువదించి అందిస్తున్నారు డా. రాజేశ్వరి దివాకర్ల.]
కళ్ళు మూసి పడుకున్నా
మంచం మీద జ్వరంతో నీరసంగా,
చల్లని చేయి ఏదో తల నిమిరినట్టుగా
గాభరాపడి గబుక్కున కళ్ళు తెరిచా!
చూద్దును కదా! అరెరే ! సాక్షాత్తుగ గాంధీజీ|
సంభ్రమంగా యత్నించా లేవాలని
ఆపారు నన్ను భుజం తట్టి గాంధిజీ
కదలక పడుకోమన్నారు ప్రేమగా చూసి!
అడిగారు; ఏరి!ఎవ్వరూ కనబడరేమని.
చూస్తున్నారనుకుంటా ‘టివి’ని..
అలాగా? అని నవ్వి, వెళ్లారు వంటింటిలోనికి
చేసి తెచ్చారు స్వయంగా కాఫీని.
గాంధీ చేసిచ్చిన కాఫీని ధన్యుడనై చూస్తూ రుచిని,
మొదలెట్టానిక నా సోదిని,
నీవు వెళ్ళాక మహాత్మా ఇక యేమని చెప్పను!
ఈ దేశ పరిస్థితిని గురించి,..
కోపించారు గాంధీ.
నీకు దండంపెడతా “చాలునిక ఆపు
విని విని విసుగొచ్చింది,
దేశం సంగతి అటుంచు,
మొదట నాకు చెప్పు నీ స్థితీ గతీ,
ఏం చదువుతున్నాడు నీ కొడుకు?
నీ కూతురు పెళ్ళెప్పుడు?
అన్నట్టు ఎలా ఉన్నాడు మీ నాన్న?
యిపుడాయనకు వయస్సు పై బడిందనుకుంటా!
ఆయనను అపుడెపుడో చూసా|
కట్టుదిట్టమైన మనిషి కదా
యిప్పటికీ అలాగే ఉన్నాడా నన్ను తిడుతూ,
గాంధీ వల్లనే దేశం పాడయిందని?
ఆయనన్నదే నిజమైంది ఒక విధంగా!
యిప్పటికీ నా దిగులు అదే!
నేననుకున్నది ఒకటి, జరిగింది మరొక్కటి
అంతా అయింది తలకిందులుగా..
సరే ఆ మాట కేమి గాని,
యిప్పుడు చెప్పు నీ సంగతి
ఎలా సాగుతోంది నీ కవిత్వ కృషి?
యింకా ఉన్నావా అక్కడే?
కేవలం జనాలకు ఖుషీని కలగజేస్తూ?
చాలించు ఇక నీ కులాసా రచనలు
లోతుగ ఆలోచించు,
బుద్ధిని ఉపయోగించు,
పదిమందికి హితమును చేకూర్చు,
మందలించి చెబుతున్నా,
నీ మంచిని కోరి చెబుతున్నా!
బయలుదేరుతా నేనిక,
కోలుకో త్వరగా.
వేళ తప్పక తీసుకో
తగిన మందులు పథ్యం,
అందరినీ అడిగానని చెప్పు,
ముఖ్యంగా మీ నాన్నని”
అలా అంటూనే తన కర్రను పట్టుకుని
వెళ్లిపోయారు గాంధీజీ..
మరొక్కసారి నిమిరి నా నుదుటిని,
యింకా ఎవరెవరిని చూడాలో ఏమో,
ఆ మానవతామూర్తి పని గట్టుకుని.
కన్నడ: బి. ఆర్. లక్ష్మణ రావు
తెలుగు: రాజేశ్వరి దివాకర్ల
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
