Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవన గమనంలో…!-5.3

జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు.

నేను సమాధానం చెప్పేలోపే, మా మేనేజరు గారు కల్పించుకుని… “చాలా మంచి కుర్రాడు సార్! ఏ పని చెప్పినా చక్కగా చేస్తాడు! అతి తక్కువ కాలంలోనే తన పెర్‌ఫార్మెన్స్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు! మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు సార్!” అంటూ నన్ను ప్రశంసలతో ముంచెతుత్తున్న మా మేనేజర్ గారిని చూస్తే, నాకు మతిపోయింది. ఎందుకంటే, ఎప్పుడు చూసినా సీరియస్‍గా వుంటూ, రుసరుసలాడుతూ కనిపిస్తారు. తను నవ్వడం కాని, ఎవరినీ మెచ్చుకోవడం గాని, మా సిబ్బందిలో ఏ ఒక్కరూ చూడలేదు. నిజం చెప్పాలంటే, ఆయనంటే నాకు గౌరవం కంటే భయమే ఎక్కువ.

అలాంటి మేనేజరు గారు నా గురించి అంత గొప్పగా చెప్తున్నారంటే, ఆయనేనా మాట్లాడుతుంది… అనే సందేహం కలిగింది నాకు.

అప్పుడు మా రీజియనల్ మేనేజర్ గారు… “అవును! నా దృష్టికి కూడా వచ్చింది ఈ అబ్బాయి గురించి. ఇతను తయారు చేసి, మా ఆఫీసుకు, శాంక్షన్ కోసం పంపుతున్న ప్రపోజల్స్ చూశాను. కరెస్పాండెన్స్ కూడా చదివాను. చాలా బాగుంటున్నాయ్!” అని మేనేజర్ గారితో అన్నారు.

అంటే, నా గురించి, మా రీజియనల్ మేనేజర్ గారికి కూడా తెలుసన్న మాట! నా మీద చాలా మంచి అభిప్రాయం కూడా వుంది. అది తలచుకుంటేనే, నా మనసు ఆనందభరితమైంది.

“అవునండీ! ఏ పని చేసినా మనసు పెట్టి, పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు!” అంటూ ముక్తాయించారు మేనేజర్ గారు.

“ఏం బాబూ! గుంటూరు రీజియనల్ ఆఫీసుకు వస్తావా? అక్కడొక అగ్రికల్చరల్ క్లర్క్ పోస్టుంది… దాంట్లో నువ్వయితే, బాగుంటుందనిపిస్తుంది. మరి నువ్వేమంటావ్?” అని నన్నడిగారు రీజియనల్ మేనేజరు గారు.

అడగందే అమ్మైనా పెట్టదంటారు! అలాంటిది, నేనడక్కుండానే… నాకు గుంటూరు ట్రాన్స్‌ఫరా! ఇది కలా! నిజమా!… ఎందుకంటే మా బ్రాంచి లోనే గుంటూరుకు రిక్వెస్టు ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, రెండు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నవారున్నారు… అలాంటిది… రెండు సంవత్సరాలకే నేను గుంటూరు వెళ్ళబోతున్నాను. మా వాళ్ళందరికి అతి దగ్గరగా వుండబోతున్నాను.

ఆ సంతోషంలో మాటలు తడబడుతుండగా… “మీ ఇష్టం సార్! మీరు ఏం చేసినా, నాకు సమ్మతమే సార్!” అనే మాటలు వణుకుతున్న గొంతు నుండి బయటికొచ్చాయి.

“సరే! ఓ పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్ ఆర్డరు పంపిస్తాను… గుంటూరు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకో!” చెప్పారు రీజియనల్ మేనేజర్ గారు.

సంతోషాతిశయంతో… “థాంక్యూ వెరీమచ్ సార్!” అంటూ వారికి, తరువాత మేనేజర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాను.

“ఆ! మేనేజరు గారూ! ట్రాన్స్‌ఫర్ ఆర్డరు పంపుతాను… వెంటనే రిలీవ్ చేయండి!” అని మేనేజర్ గారికి చెప్పారు రీజియనల్ మేనేజర్ గారు.

“అలాగే సార్!” చెప్పారు మేనేజర్ గారు. మా స్టాఫ్ అందరం, మేనేజర్ గారితో కలిసి వీడ్కోలు చెప్పగా… గుంటూరు వెళ్ళేందుకు కారెక్కారు రీజియనల్ మేనేజర్ గారు.

నా గుంటూరు ట్రాన్స్‌ఫర్ గురించి తెలుసుకున్న నా కొలీగ్స్ అందరూ నన్ను చుట్టుముట్టి నాపై అభినందనల వర్షం కురిపించారు.

అప్పుడే… నాకో టెలిగ్రాం వచ్చింది…!

మరో గుడ్ న్యూస్‌తో…!!

డెలివరీకి పుట్టింటికి వెళ్ళిన నా శ్రీమతి మగబిడ్డకు జన్మనివ్వడాన్ని తెలియజేసింది ఆ టెలిగ్రామ్! ఎగిరి గంతేశాను!!

వెంటనే మేనేజర్ గారితో ఓ రోజు శలవు శాంక్షన్ చేయించుకుని, ఆ రోజు రాత్రికే గుంటూరు బయల్దేరాను. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‍లో వున్న నా భార్యని, బాబును చూశాను. చెప్తే నమ్మరు కాని, అదో మధురానుభూతి!! వివరించలేను! అనుభవించినవారికే తెలుస్తుంది!

అప్పుడే చెప్పాను అందరికీ! నాకు కొద్దిరోజుల్లో గుంటూరుకి ట్రాన్స్‌ఫర్ అవబోతోందని! అది విని అందరు సంతోషించారు. పుడుతూనే తనతో ఓ మంచి వార్తను మోసుకొచ్చాడు… అంటూ బాబును ముద్దు చేశారు.

తరువాత రోజుల్లో బాబు బారసాలకి వెళ్ళొచ్చాను. బ్యాంకులో పని చేస్తున్నానన్న మాటే గాని, నా శ్రీమతి, బాబు, వాళ్ళిద్దరూ గుర్తు రాని క్షణం లేదంటే నమ్మండి!… మూడో నెల్లోనే ఒంగోలుకు పంపించాలని మా ఆవిడ పుట్టింటివాళ్ళు నిర్ణయించారు! అంత దాక ఉండబట్టలేక, వారం వారం గుంటూరు వెళ్ళి, వాళ్ళని చూసొస్తూ, వాళ్ళు ఒంగోలు వచ్చే రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తూనే వున్నాను.

***

పది రోజుల్లో వస్తుందనుకున్న గుంటూరు ట్రాన్స్‌ఫర్ ఆర్డరు ఓ నెల తరువాత వచ్చింది. అప్పటికే మా బ్రాంచి మేనేజర్ గారు గుంటూరు బ్రాంచ్ మేనేజర్‌గా వెళ్ళడం, వారి స్థానంలో కొత్త మేనేజర్‌గా శ్రీ ఎల్. శ్రీరామ్మూర్తి గారు జాయిన్ కావడం జరిగింది.

స్వర్గీయ ఎల్. శ్రీరామ్మూర్తి గారు

ట్రాన్స్‌ఫర్ ఆర్డరు ప్రకారం నన్ను రిలీవ్ చేయండని అడిగితే… ‘నీ ప్లేస్‍లో సబ్‌స్టిట్యూట్ వచ్చిన తరువాతే రిలీవ్ చేస్తా’మన్నారు కొత్త మేనేజర్ గారు. రీజియనల్ మేనేజర్ గారిని అడుగుదామనుకుంటే, అలా అడగడం సబబేనా?… వారు ఏమైనా అనుకుంటారేమో… అని నా భావన. ఇటు రిలీవ్ కాక, అటు మూడో నెలలో నా భార్య, పిల్లవాడ్ని ఒంగోలు తీసుకురావాలా వద్దా అనే సందిగ్ధావస్థలో కొట్టుమిట్టులాడ్తున్న నేను మరొక్క మారు మేనేజర్ గారికి విషయం చెప్పి, రిలీవ్ చేయమని బ్రతిమాలాను, ప్రాధేయపడ్డాను. ఆయన ససేమిరా అన్నారు!

ఇంతలో గుంటూరులో మా అత్తగారింటి ప్రక్క పోర్షన్ ఖాళీ అయింది. మా కోసం అది తీసుకుంటే, పిల్లాడు కొంచెం పెద్దయ్యేంత వరకు ప్రక్కనే వుంటున్న వాళ్ళ సహాయం వుంటుందనే ఉద్దేశంతో, ఆ పోర్షన్‍ని మా కోసం తీసుకోమని చెప్పాను.

నన్ను ఎప్పుడు రిలీవ్ చేస్తారో… ఏమో… తెలియని అగమ్య గోచర పరిస్థితి…; అందుకే, మూడోనెలలోనే నా భార్యా, పిల్లవాడ్ని ఒంగోలుకు తీసుకురండని మా వాళ్ళకి చెప్పాను.

ఆ రోజు రానే వచ్చింది. సాయంత్రానికి మా అత్తగారువాళ్ళు నా భార్యని, బాబుని ఒంగోలుకు తీసుకొచ్చారు.

బ్యాంకు నుండి మేనేజరు గారి పర్మిషన్‍తో కొంచెం పెందలాడే ఇంటికి వచ్చాను… అప్పటికే మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు మా ఇంటికి చేరుకున్నారు. పెద్దలు, పిన్నలు అందరూ మా ఇంట్లోనే ఉన్నారు.

బాబును చూస్తూ… “అంతా… వాళ్ళమ్మ పోలికే!” అని కొందరు, “కాదు… కాదు… వాళ్ళ నాన్న పోలికే!” అని మరి కొందరు, “అయినా, మరీ మూడు నెలలకే పోలికలు ఎలా తెలుస్తాయండి” అని ఇంకొందరు.. అంటూ బాబును తెగ ముద్దాడుతున్నారు. ఇల్లంతా సందడిగా వుంది. నా వెంట తెచ్చిన స్వీట్లు, హాట్లను, అక్కడున్న వారందరికి పంచిపెట్టాము.

కాసేపటికి సందడి సద్దుమడిగింది. ప్రతీ రోజు ఇంటి దగ్గర వున్నంత సేపూ, బాబుతో ఆడుకుంటూ, వాడి ముద్దు మురిపాలతో మురిసిపోతున్నాము. అలా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి.

***

ఒక రోజు కొత్తగా రిక్రూట్ అయిన ‘రూరల్ క్రెడిట్ ఆఫీసర్’ – ఆర్.సి.ఓ, (గ్రామీణ ఋణాధికారి) ఒకరు మా బ్రాంచిలో జాయిన్ అయ్యారు. ఆయన పేరు శ్రీ. టి.వి.యస్. కళాధర్. వారు ఒంగోలు బ్రాంచితో పాటు, ఒంగోలు బ్రాంచిపై ఆధారపడుతున్న మిగతా బ్రాంచీలలోని వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తాలూకూ ఋణాల మంజూరు, వసూళ్ళ కొరకు పని చేయాలి. వారి దగ్గర క్లర్కుగా నన్ను పని చేయమన్నారు మేనేజర్ గారు.

అప్పటివరకు నాకు తెలిసిన అన్ని విషయాలను ఆ ఆఫీసరు గారితో పంచుకున్నాను. ఇద్దరం కలిసి బ్రాంచీలన్నింటిని, ఒకసారి విజిట్ చేసి వచ్చాము. ఆ ఆఫీసర్ గారికి ఆ యా బ్రాంచీలపై అవగాహన ఏర్పరుచుకోడానికి, ఎంతో కాలం పట్టలేదు.

సి.ఎ.ఐ.ఐ.బి. పార్టు I లో మిగిలిన, ఐదో సబ్జెక్టు, అక్కౌంట్స్‌లో ప్రిపేరయి ఆ పరీక్ష వ్రాద్దామనిపించింది. ఈ ట్రాన్స్‌ఫర్, రిలీవింగ్ విషయంలో, నేనున్న అమోమయ స్థితిలో, చదువుపై ఏకాగ్రత కుదరదేమో అనిపించింది. ఇక వేరే ఆలోచన లేకుండా, గుంటూరులో జాయిన్ అయింతర్వాతే, ఆ పరీక్ష గురించి ఆలోచిద్దామనే నిర్ణయానికి వచ్చాను. అలా నన్ను నేను సంబాళించుకుని, కాలం వెళ్ళబుచ్చుతున్నాను.

రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి.

ఓ రోజు మేనేజర్ గారు నన్ను తన క్యాబిన్‌కి రమ్మని కబురు చేశారు. వెంటనే వెళ్ళిన నాకు, ఆయన సంతోషంగా నవ్వుతూ కనిపించారు.

“ఆ! రావయ్యా… రా…! రీజియనల్ మేనేజర్ గారు ఫోన్ చేశారు… నీ ప్లేస్‍లో ఒకర్ని పోస్ట్ చేశారట! నిన్ను వెంటనే రిలీవ్ చేయమన్నారు! హ్యాపీనా!!” అడిగారు మేనేజర్ గారు.

ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆ రోజు ఇప్పుడు వచ్చినందుకు, సంతోషాతిశయంతో, ఏం చెప్పాలో అర్థం కాని నేను… “మీ ఇష్టం సార్!” అన్నాను.

“సరే! శనివారం రిలీవ్ చేస్తాను. ఓ.కే.నా?”

“అలాగే సార్! థాంక్యూ సార్!!”

ఆనందబాష్పాల జల్లులు కమ్ముకోగా, మసకబారిన కళ్ళతో, కౌంటర్ దగ్గరకొచ్చి, పనిలో పడ్డాను.

సాయంత్రం స్వీట్లు తీసుకుని ఇంటికి వెళ్ళి నా శ్రీమతికి గుడ్ న్యూస్ చెప్పాను. తన సంతోషం అంతా ఇంతా కాదు. సహజమే కదా! తన వాళ్ళ దగ్గరకి వెళ్ళబోతున్నందుకు, ఆ మాత్రం సంతోషం వుండదా?!! మరి…!

చెప్పిన విధంగా ఆ శనివారం నన్ను రిలీవ్ చేశారు. స్టాఫ్ అందరూ కలిసి రిలీవింగ్ పార్టీ కూడా ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి బ్రాంచి బయటకు వచ్చాను. ఒక్కసారిగా, అంతవరకు పని చేసిన ఆ బ్రాంచిని, అక్కడి స్టాఫ్‌ని, వదిలి వెళ్తున్నందుకు, మనసులో బాధనిపించింది. అనాలోచితంగా, అప్రయత్నంగా నా కళ్ళల్లోంచి, వెచ్చని నీళ్ళు జాలువారాయి.

ఆ రోజు రాత్రికి అన్న, వదినలు మాకు వాళ్ళింట్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. మా బాబుకి ఓ మంచి డ్రస్సును బహుమతిగా ఇచ్చారు కూడా…!

ఇంటికెళ్తూ, ఒంగోలు వీధులను, షాపులను చూసుకుంటూ దిగాలుగా ఇల్లు చేరాము. రాత్రికి సరిగా నిద్రపోలేదు…

ఆదివారం ఉదయమే గుంటూరు బయలుదేరి వెళ్ళాము. ఆ తరువాత వారం జాయినింగ్ టైమ్‌గా వాడుకుని, ఆ తరువాత వచ్చే సోమవారం రీజియనల్ ఆఫీసులో జాయిన్ అవుదామనుకున్నాను.

ఓ రోజు గుంటూరులో మా అత్తావాళ్ళతో, మరో రోజు మా ఊర్లో మా అమ్మావాళ్ళతో సరదాగా గడిపాము. ఆ తరువాత ఒంగోలు వెళ్ళి రెండ్రోజుల్లో సామాన్లన్నింటిని సర్దుకుని, ఓ లారీలో గుంటూరుకు చేర్చాము. మరో రెండ్రోజుల్లో సామాన్లన్నింటిని కొత్త ఇంట్లో సర్దేశాము.

మొత్తానికి గుంటూరు వచ్చేశాము!!

ఇక్కడో విషయం గమనార్హం! గుంటూరుకి ట్రాన్స్‌ఫర్ కావాలని నేను ఎవరినీ అడగలేదు. ఏలాంటి ప్రయత్నమూ చేయలేదు. అది నా ప్రమేయం ఏ మాత్రం లేకపోయినా, కాకతాళీయంగా జరిగిన మాట నిజం..! కాని, రిలీవింగ్ విషయంలో నేను కొంత ఆందోళనకు గురికావడం… యథార్థం..!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version