[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]
డిగ్రీ:
ఇంటర్మీడియట్ ఐపోయాక డిగ్రీకి సర్వోదయ కళాశాల లోనే కొనసాగాను. డిగ్రీలో తెలుగుకు శివరామ ప్రసాద్ సార్ రామకృష్ణ సార్, ఆంగ్లానికి పాండు సార్ శ్రీనివాసులు సార్ నాగరాజులు సార్, చరిత్రకు వెంకటేశ్వరరావు సార్ అర్థశాస్త్రానికి రామ కోటేశ్వరరావు సార్, సత్యనారాయణ సార్ వచ్చేవారు, రాజనీతి శాస్త్రం పురుషోత్తం సార్, ప్రభుదాస్ సార్ చెప్పేవారు. ఇంకా సహ విద్యార్థినులు ధనలక్ష్మి, లక్ష్మీదేవమ్మ కృష్ణవేణిలు ఉండేవారు. ధనలక్ష్మి, కృష్ణవేణి వేదాయపాలెం లోనే ఉండేవారు. లక్ష్మీదేవమ్మ మాత్రం లేగుంటపాడు నుంచి వచ్చేది. కృష్ణవేణి ఇల్లు అయితే వేదాయపాలెంలో మా ఇంటి నుంచి బస్ స్టాప్‌కి వచ్చేదారిలో ఉండేది. నేను కళాశాలకు వస్తూ నాన్న నన్ను ఎత్తుకొని వస్తుండగా వాళ్ల ఇంటి దగ్గర త్వరగా రా అని పెద్దగా పిలిచేదాన్ని. ఇద్దరం కలిసి ఒకే బస్సులో వచ్చేవాళ్ళం కళాశాలకు. ధనలక్ష్మి వేదాయపాలెం తొమ్మిదవ వీధిలో ఉండేది. అక్కడే బస్సు ఎక్కేది. రోజూ క్రమం తప్పకుండా తరగతులు జరిగేవి. అధ్యాపకులు ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు. అప్పుడప్పుడు కళాశాలలో పాటల పోటీలు జరిగేవి. పాటల పోటీలకు నేను కూడా వెళ్ళేదాన్నికానీ నాకు సినిమా పాటలు రావు, నేర్చుకోలేదు. అవి నేర్చుకోవాలన్న శ్రద్ధ కాని ఆసక్తి కానీ నాకు లేదు. నేను శబరిమల వెళ్ళినప్పుడు నేర్చుకున్నా4 భజన పాటలు మాత్రమే వచ్చు. పాటల పోటీలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆ నాలుగు పాటల్లో మార్చి మార్చి ఏదో ఒకటి పాడేదాన్ని. నాకెప్పుడు ప్రోత్సాహక బహుమతి వచ్చేది. ఒకసారి డిగ్రీ రెండవ సంవత్సరం అనుకుంటా పాటల పోటీకి వెళ్లాను. అక్కడ ఇంగ్లీష్ శ్రీనివాసులు సార్ పాటల పోటీకి జడ్జిగా ఉన్నారు. ఇంకా కొందరు జడ్జీలుగా ఉన్నారు. పాటల పోటీ జరిగింది. అందరూ సినిమా పాటలు పాడారు. నేను మాత్రం అయ్యప్ప స్వామి భజన పాట పాడాను. నా పాట అయిపోయిన వెంటనే శ్రీనివాసులు సార్ భక్తిపాటలు పరిగణనలోకి తీసుకోము అన్నారు. ముఖ్యంగా అక్కడ సినిమా పాటలు మాత్రమే పాడాలి ఈ విషయం నాకు తెలియదు. అక్కడ జడ్జీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. శ్రీనివాసులు సార్ వాదించి ఆక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి నేనే క్షమాపణ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవాలి. నాన్న బయట ఉండడంతో అక్కడే కూర్చొని ఉండాల్సివచ్చింది. పాపం సార్ వెళ్ళిపోయారు. నాకు ఆ సంవత్సరం కూడా ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. ఆ సంవత్సరం అంటే 1992 సెప్టెంబర్ నెల వచ్చింది. రోజులాగే సెప్టెంబర్ 4 వ తారీకు కళాశాలకు వచ్చాము. నా తోటి తరగతిలోని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. ఆ రోజు అన్నితరగతులు జరిగాయి. ప్రతి తరగతికి వచ్చిన ప్రతి సార్ ఒక్క శివరామ ప్రసాద్ సార్ తప్ప మిగతా అందరూ అధ్యాపకులు రేపు మేము తరగతి తీసుకోవట్లేదు రాము అని చెప్పేసారు. ఇక మిగతా పిల్లలందరూ రేపు తరగతులు ఏమి జరగవు మేము కూడా రాము అన్నారు. అప్పుడు నాన్న శివరామ ప్రసాద్ సార్ వద్దకు వెళ్లి రేపు మీరు తరగతి తీసుకుంటారా అని అడిగారు. అప్పుడు సార్ రేపు నేను వస్తాను అన్నారు. ఒక్కతరగతి కైనా హాజరు అవ్వాలి అని నాన్న నేను అనుకున్నాము.
1992 సెప్టెంబర్ 5:
రోజులాగే ఆ రోజు కూడా కళాశాలకు నాన్న నన్నుతీసుకొని వచ్చారు. అనుకోకుండా ముందు రోజు రాని ఒక అమ్మాయి ఆ రోజు వచ్చింది. అయ్యో ఈ రోజు తరగతులు జరగవు నాకు తెలియదు తెలిసుంటే వచ్చేదాన్నికాదు అన్నది. తెలుగు తరగతి జరుగుతుంది అని చెప్పాను. అప్పుడు అమ్మాయి సంతోషపడింది. శివరామ ప్రసాద్ సార్ తరగతికి వచ్చారు. కొలకలూరి ఇనాక్ గారు రచించిన తలలేనోడు పాఠం చెప్తారు. తలలేనోడు కథలోని పాత్రలను ఇనాక్ గారు ఎలా చిత్రీకరించారో బాగా అర్థమయ్యేలా వివరించారు. ఒకటిన్నర గంట సేపు ఎంతో ఓపికగా పాఠం చెప్పారు ఒకరిద్దరికి కూడా పాఠం చెప్పే సార్ అంకితభావానికి శతకోటి కృతజ్ఞతా పూర్వక వందనాలు. దేనినైనా బట్టీపట్టి చదివే నేను ఈ పాఠాన్నితరగతి అయిపోయి ఇంటికి వెళ్ళాక ఒకసారి మాత్రమే చదివాను. ఆ తరువాత ఈ పాఠాన్ని తెలుగు ఆ సంవత్సరం పరీక్ష ముందు రోజు చదివాను. అదృష్టవశాత్తు పరీక్షల్లో తెలుగులో ఈ పాఠమే వచ్చింది. సార్ చెప్పింది గుర్తుపెట్టుకొని రెండుసార్లు మాత్రమే చదివి చాలా బాగా రాశాను. అన్ని సబ్జెక్టుల కంటే తెలుగులోనే ఎక్కువ మార్కులు వచ్చాయి.
రామ కోటేశ్వరరావు సార్ – ట్యూషన్:
అర్థశాస్త్రానికి రామ కోటేశ్వరరావు సార్ వచ్చి చెప్పేవారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రామ కోటేశ్వర రావు సార్ నాన్నను పిలిచి మీ అమ్మాయిని ప్రైవేటుకు మా ఇంటికి తీసుకురండి అని చెప్పారు. సార్ నాకు డిగ్రీ మూడు సంవత్సరాలు ఉచితంగా ప్రైవేటు చెప్పారు. నా ఒక్క దానికైనా ఎంతో ఓపికగా ప్రతి రోజు ప్రైవేటు చెప్పారు. నాకు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోడానికి చాలా సంతోషంగా శ్రద్ధగా ఉండింది. సార్ నాకు టెస్ట్ పేపర్ లోని ప్రశ్నలకు సమాధానాలు వివరించేవారు. ఇంటికెళ్ళి చెప్పిన దాన్ని పది సార్లు బట్టీపట్టేదాన్ని. మేడం అప్పుడప్పుడు తినడానికి ఏదో ఒకటి పెట్టేది. అప్పుడు రామ కోటేశ్వరరావు సార్ గారి ఇల్లు టెక్కాయమిట్ట చిరంజీవి అపార్ట్మెంట్ పక్కన. ఒకరోజు నేను ప్రైవేట్‌కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు సార్ వాళ్ళ ఇంట్లో ఆడుతూ ఉండినాడు. ఆ బాబు ఎవరు అని నాన్న అడుగగా చిరంజీవి మేనల్లుడు అని చెప్పారు. ఆ బాబు ఆడుతుంటే చాలా సరదాగా ఉండేది. ఇంకా అప్పుడప్పుడు సార్ వాళ్ళ అబ్బాయిలు కూడా బయటకు వచ్చిఆడుకునే వాళ్ళు.
టైఫాయిడ్ జ్వరం – తల్లిని మరిపించిన నానమ్మ:
ఒకసారి నాకు డిగ్రీ రెండో సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అప్పుడు నానమ్మ చాలా శ్రద్ధగా చూసింది. నాన్న నాకు సరైన సమయానికి మందులు ఇచ్చేవారు. నానమ్మ నాకు అమ్మ. చిన్నప్పుడు నుంచి అమ్మను మరిపించింది. నానమ్మకి పెద్ద వయసు అయినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు లేవు. రక్తపోటు మాత్రం ఉంది ఉండినది. పెద్ద వయసులో అయినా కూడా ఇంట్లో పని మొత్తం తనే చేసుకునేది. నానమ్మ నా చేత ఒక్క పని కూడా చేయించేది కాదు. అప్పుడు డిగ్రీ చదువుతున్న వయసు వచ్చిన నాకు అగ్గిపుల్ల కూడా వెలిగించడం వచ్చేది కాదు. దీపావళి పండుగ వస్తే నాన్న నాకు కాకర పూలు, మతాబులు ఇంకా కొన్ని తెచ్చి ఇచ్చేవారు. అప్పుడు మతాబు పేటలోని పుల్లలు పొడవుగా ఉండడం చేత అవి మాత్రమే వెలిగించగలిగే దాన్ని. 75 ఏళ్ల వయసులో కూడా నానమ్మ మాకు అందరికీ వంట చేసి అన్ని సమకూర్చిపెట్టేది. నాన్న సాయంత్రం పూట తరచూ బయటికి వెళ్లిపొద్దుపోయిన తరువాత ఇంటికి వచ్చేవారు. నాన్న గురువారం శనివారం రాత్రి పూట ఉపవాసం వుండేవారు. నాన్న పొద్దుపోయి ఇంటికి వచ్చినా అంత పెద్ద వయసులో కూడా ఎంతో ఓపికగా నానమ్మ నాన్న బయట నుంచి ఆకలితో ఇంటికి వస్తాడు అని ఉపవాసం రోజు అప్పటికప్పుడు వేడిగా అల్పాహారం చేసి పెట్టేది. నేను కళాశాలకు బయలుదేరే లోపు నానమ్మ అన్నిసమకూర్చిపెట్టేది.
తుమ్మగుంటలో మా ఇంటి ఆవరణలో నానమ్మ తాతయ్యలు
టైప్ ఇన్‌స్టిట్యూట్:
అలా కళాశాలకు వెళ్లివస్తున్న క్రమంలో మా ఇంటి వద్ద నుంచి బస్ స్టాప్‌కు మధ్యలో కృష్ణవేణి వాళ్ళ ఇంటికి దగ్గరగా టైప్ ఇన్‌స్టిట్యూట్ పెట్టారు. ఆ పెట్టిన సార్ దగ్గరే మా చిన్న అత్త అప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం నేర్చుకుందట వేరే చోట. నేను టైప్ నేర్చుకుంటానని నాన్నతో చెప్పాను. నాన్నఆ సార్ దగ్గరికి వెళ్లిమా అమ్మాయికి టైప్ నేర్పిస్తారా అని అడిగారు. అప్పుడు ఆ సార్ తీసుకుని రండి మీ అమ్మాయిని నేర్పిస్తాను అన్నారు. అయితే కళాశాల కి రావాలి కదా టైం నిర్ణయించుకొని వస్తామని నాన్న చెప్పారు. కళాశాల అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ వస్తామని నాన్న చెప్పారు ఆ సార్‌తో. మంచి రోజు చూసుకొని టైప్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాను. వెళ్ళాక టైపు మిషన్ ముందు నన్నునాన్న కుర్చీలో కూర్చోబెట్టారు. నాకు చిన్నప్పుడు కాళ్ళు నడుముతో పాటు ఎడమ చేతికి కూడా పోలియో సోకింది. ఎడమచేతితో ఏవైనా వస్తువులు పట్టుకోవడం కానీ పుస్తకాలు పట్టుకోవడం కానీ మంచినీళ్లు తాగడం ఇలాంటివి చేయగలిగే దాన్నికానీ పూర్తిగా చెయ్యి జాపలేను. నేను టైప్ మిషన్ ముందు కూర్చొని కొంచెం ముందుకు వంగగా మిషన్ లోనీ బటన్స్ ఎడమ చేతికి బాగా అందాయి. ఎడమచేతి చిటికెన వ్రేలు మిషన్ లోని బటన్ పైపెట్టగానే మొదటిసారి చిటికెన వేలితో బటన్ నొక్కేప్రయత్నం చేశాను. మొదటిసారి సరిగా చేయలేక పోయాను. అప్పుడు సార్ నేను ఎలా చేస్తున్నాను అన్నది గమనించారు. రెండవ సారి నేను మళ్లీఅదే ప్రయత్నం చేశాను. అప్పుడు బాగా చేశాను. కానీ రెండవ సారి సార్ గమనించలేదు. మళ్లీమూడవసారి ప్రయత్నం చేశాను అప్పుడు సరిగ్గాచేయలేకపోయాను. అది సార్ గమనించి “నీకు టైప్ చేయడం రాదు. నువ్వు చేయలేవు. పరీక్షలో చాలా త్వరగా చేయాలి. అది నీవు చేయలేవు” అని చెప్పారు. నేను “కుడిచేతితో మొత్తం ప్రయత్నిస్తాను” అని చెప్పాను. కానీ సార్ “నువ్వు టైప్ చేయలేవు, నీకు రాదు. చాలా త్వరగా చేయాలి. అది నీవు చేయలేవు” అంటూ నన్ను తీసుకెళ్ళమని నాన్నకు చెప్పారు. ఎంతో ఆశగా నేర్చుకోవాలన్న నా ఆకాంక్ష నీరుగారి పోవడంతో చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. మా నానమ్మ నా బాధ చూడలేక “ఏడవకు, ఏడవకు ఈయన కాకపోతే వేరే చోట నేర్చుకుందువులే. బాధపడకు, ఏడవకు” అని ఓదార్చింది. ఒక నెల రోజులో వారం రోజులో నా చేత సాధన చేయించి నాకు రాకపోతే ‘నీవు త్వరగా చేయలేవు పరీక్షలో స్పీడుగా చేయలేవ’ని చెప్పి ఉంటే నాకు టైప్ చేయడం రాదు అని నాకు నేనే విరమించుకొనే దాన్ని. అపుడు నాకు ఇంత బాధ ఉండేది కాదు. ఏది ఏమైనా మొత్తానికి నేను టైప్ నేర్చుకోలేకపోయాను. ఆ కోరిక అలానే మిగిలిపోయింది.
దీనిని బట్టి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అదేమంటే – ఈ సార్ చేసిన విధంగా నా పాఠశాల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు చేసి ఉంటే నేను చదువుకునే అవకాశం కోల్పోయే దాన్ని. ఇది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది.
ఇలా ఆలోచించ కూడదు:
నడవలేకపోవడం అంగవైకల్యం పొందడం పాపమేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇది గుర్తుకు వస్తే. ఇలా ఆలోచించకూడదు అని తెలుసు కానీ ఎందుకో చెప్పలేను అప్పుడప్పుడు ఇలా అయిపోతూ ఉంటాను.
ప్రోత్సాహం:
నా పాఠశాల జీవితం రెండు సంవత్సరాలు. కళాశాల జీవితం ఐదు సంవత్సరాలు. నన్ను ఎత్తుకొని పాఠశాలకు కళాశాలకు తీసుకెళ్ళిన మా నాన్నగారికి పాఠశాలలో కానీ కళాశాలలో కానీ నా ఉపాధ్యాయులు అధ్యాపకులు నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ప్రత్యేకంగా చదువు చెప్పి నన్నుఇంత దాన్నిచేసిన నా గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇంకా మా నానమ్మ నేనెప్పుడైనా బాధపడితే ఎంతో ఓదార్చేది.
మా నాన్నగారికి మా సర్వోదయ కాలేజీలో ఉత్తమ తండ్రి అనే సన్మానం చేయడం
నానమ్మ మరణం:
డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు నవంబర్ నెలలో నానమ్మకు కాస్త జ్వరం వస్తూఉండినది. అయినా కూడా నేను కళాశాలకు వెళ్లేలోపు పొద్దున్నేలేచి అల్పాహారం తయారు చేసి పెట్టేది. కళాశాల నుంచి వచ్చేసరికి భోజనం భోజనం తయారు చేసి పెట్టేది ఎంతో ఓపికగా. జ్వరం తగ్గలేదు. నీరసించి పోతోంది రోజురోజుకి. ఇంక ఇలా కాదని అపోలో వైద్యశాలలో చేర్చారు చిన్నాన్న అత్త వాళ్ళు. మూడు రోజులు వైద్యశాల లోనే ఉండినది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు నాన్న నన్ను వైద్యశాలకు తీసుకెళ్లారు నానమ్మని చూడడానికి. నానమ్మకు పైపులు మిషన్లు పెట్టి ఉన్నారు. నానమ్మను అలా చూడగానే నాకు, నాన్నకు చాలా బాధ కలిగింది. ఏడుపు వచ్చింది. నానమ్మను చూసి ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత నానమ్మకు బాగుంది ఇక ఒక రోజు ఉంచి ఇంటికి పంపుతామని వైద్యులు చెప్పారు. ఆ రోజు రాత్రంతా తాతా నేను నాన్న నానమ్మ ఇంటికి వస్తుందని సంతోషంగా ఉన్నాము. ఆ రోజు డిసెంబర్ ఒకటవ తారీకు 1992. ప్రక్క రోజు ఉదయాన్నే ముందుగా పెద్ద అత్త వచ్చింది. విషయం ఏమిటంటే నానమ్మ రాత్రే చనిపోయారని చెప్పింది. నానమ్మ వయస్సు 75 సంవత్సరాలు ఉంటాయి. తాతయ్యకి 89 పైనే ఉంటాయి. ఆ వార్త వినగానే తాతయ్య కుప్పకూలిపోయారు. నేను బాగా ఏడ్చేసాను. అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు. నాకు అమ్మ అలవాటు తక్కువే. బాధ పెద్దగా తెలియలేదు. అప్పుడు. మా నాన్నమ్మ పోయిందని తెలిసాక తట్టుకోలేక పోయాను. చిన్నప్పట్నుంచి అమ్మ లేని లోటు తెలీకుండా అమ్మను మించిన మరొక అమ్మ. నానమ్మ లేకపోవడం నాకు తీరని లోటు. ఆడపిల్లకు అమ్మ ఉండాలి అంటారు కదా అంతటి గొప్ప అమ్మలాంటి నానమ్మను పోగొట్టుకొని దురదృష్ట వంతురాలిని అయ్యాను. సంవత్సరానికి పైగా నానమ్మ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నట్లు నాతో మాట్లాడుతున్నట్టు నాకు ఆలాపనగా ఉండింది. నానమ్మ దిన కార్యక్రమాలు అయిన తర్వాత రామ కోటేశ్వరరావు సార్ వాళ్ల ఇంటికి ప్రైవేట్‌కు వెళ్లాను. రామకోటేశ్వరరావు సార్ ఏమి ఇన్నిరోజులు రాలేదు రాలేదు అని అడిగారు. నానమ్మ చనిపోయారని ఏడ్చాను. సారేమో “ఏడవకు మీ నానమ్మ పెద్దవారు కదా, ఇది సహజం. ఎవరికైనా ఇది జరుగుతుంది. ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏడిస్తే నానమ్మ బాధపడతారు” అని ధైర్యం చెప్పారు. “బాగా చదువుకోవాలి. నువ్వు పాస్ అయితే మీ నాన్నమ్మ సంతోషిస్తారు” అని చెప్పారు సార్. చేసేదేమీ లేదు కదా నన్నునేను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేశాను. నానమ్మ చనిపోయాక తాతయ్య ఉండేవారు. అప్పుడు కళాశాలకు వచ్చేలోపే నాన్న ప్రొద్దున్నేలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసేవారు. తాతయ్య రోజు ఇడ్లీ తినేవారు. తాతయ్యకు నాన్న రోజు బయటనుంచి ఇడ్లీ తెచ్చిపెట్టేవారు. అల్పాహారం నాన్నే నాకు నాన్నకి తయారు చేసేవారు ఇంట్లోనే. బియ్యం మాత్రం నేనే కడిగి ఇచ్చేదాన్ని. తాతయ్య బియ్యం కడగడంలో నాకు మెలకువలు చెప్పేవారు. అంటే బియ్యం రెండు సార్లకు మించి ఎక్కువసార్లు కడగనిచ్చేవారు కాదు. పొరపాటున మూడవసారి కడగడానికి ప్రయత్నిస్తే బియ్యంలో ఉన్న విటమిన్లు పోతాయని అలా కడగకూడదు అని చెప్పేవారు పదే పదే. ఏది ఏమైనా తాతయ్య చూస్తూఉండగా తాతయ్య ముందే బియ్యం కడగాలి.
నెల్లూరులో రొట్టెల పండుగ – తిరుపతి ప్రయాణం:
ఒకసారి డిగ్రీ రెండవ సంవత్సరం మొదటిలో టెక్స్ట్ బుక్స్ కొన్ని ఇక్కడ దొరకలేదు. తిరుపతి ఎస్. వి. విశ్వవిద్యాలయంలో దొరుకుతాయి అన్నారు. అప్పుడు తిరుపతికి వెళ్ళవలసి వచ్చింది. తిరుపతి అమ్మమ్మ ఊరు కదా ఆ రోజు ఉదయం వెళ్లి సాయంత్రానికి నెల్లూరు వచ్చేయాలి అనుకున్నాము. ఒక రోజంతా నాన్న లేకుండా నాకు జరగదు కాబట్టి నన్ను కూడా తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకొన్నారు నాన్న. ఉదయం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్యాసింజర్‌కు తిరుపతి బయలుదేరాము. తిరుపతి చేరేసరికి రెండు మూడు గంటలు అయింది. వెంటనే నన్ను అమ్మమ్మ దగ్గర వదిలి నాన్న విశ్వవిద్యాలయానికి వెళ్లి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వచ్చారు.
స్వార్థమా? మానవత్వమా?:
నాన్న రాగానే నన్ను తీసుకొని, వెళ్లివస్తాము అని అమ్మమ్మకు చెప్పి ఆ రోజు సాయంత్రమే 6-45కు రైలుకు బయలుదేరినాము. టికెట్ తీసుకుని నన్ను ఎత్తుకొని రైలు ఎక్కుతుండగా గుంపులు గుంపులుగా ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతున్నారు. నాన్న ఎలాగో నన్ను ఎత్తుకొని ఎక్కారు. ఆ జనంలో రైలు లోపలికి వెళ్ళగలిగాము కానీ నన్నుకూర్చోబెట్టడానికి ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. మామూలుగా అయితే నేను కళాశాలకు వచ్చేటప్పుడు బస్సులో సీటు ఖాళీగా లేకుంటే నాన్న నన్నుఎత్తుకొని ఉంటే ఎవరో ఒకరు లేచి నన్ను కూర్చోపెట్టమని చెప్పేవారు. అలా నాకు ఎవరో ఒకరు సీటు ఇచ్చేవారు. కానీ ఆ రోజు రైల్లో ఏ ఒక్కరు నాకు సీటు ఇవ్వలేదు. నాన్న నన్ను తిరుపతి నుంచి కాళహస్తి వచ్చేవరకు ఎత్తుకునే ఉన్నారు. బాగా అలసిపోయారు, రొప్పు వచ్చింది నాన్నకు. అది చూసి కూడా ఎవ్వరికి నాకు సీటు ఇవ్వాలని అనిపించలేదు. ఆ రోజు ఎంత అవస్థ పడ్డామో చెప్పలేను. నాన్నకు ఏమన్నా అవుతుందేమోనని చాలా భయమేసింది. కాళహస్తి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు లేచి నాకు సీటు ఇచ్చారు. అప్పటికైనా భగవంతుడు కనికరించినందుకు కొంచెం ఊరటగా అనిపించింది. నెల్లూరు వచ్చిన తర్వాత తెలిసింది ఆ రోజు రొట్టెల పండగ అని. ముందు తెలిసి ఉంటే ఆ రోజు వెళ్ళేవాళ్ళం కాదు అనుకున్నాము. ఏది ఏమైనా మొత్తానికి మనుషుల్లో మానవత్వం లోపించిందని రుజువు అయింది కదా. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని నాన్న చెప్పారు.
(ఇంకా ఉంది)
prasunasuram@gmail.com