[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]
నానమ్మ చనిపోయినాక కాలేజీ జీవితం:
నానమ్మ చనిపోయాక కూడా యథావిధిగా కళాశాలకు, రామ కోటేశ్వర రావు సార్ వాళ్ల ఇంటికి ప్రైవేటుకు వెళ్ళసాగాను. రోజు నాన్న నన్ను కళాశాలకు తీసుకుని వెళ్లితీసుకుని రావడం చూచిన చుట్టుపక్కల వాళ్ళ విమర్శలు ఆగలేదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి నాతోనే అనేవాళ్ళు. చాలా బాధ అనిపించింది. వాళ్ళ మాటలు విని నేను చదువు ఆపేయాలని నాన్న కష్టపడుతున్నారని ఆలోచించలేదు. వాళ్ళ మాటలు బాధ అనిపించాయి అంతే.
పాలిటిక్స్ పురుషోత్తం సార్ చెప్పిన ధైర్యం:
ఒకరోజు కళాశాల విడిచే సమయానికి నాన్న కిందకు వెళ్లి ఉండగా రాజనీతి శాస్త్రం చెప్పే పురుషోత్తం సార్ తరగతికి వచ్చారు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు సార్ నా ముందు బెంచీలో కూర్చొని “బాగా చదువుతున్నావా అమ్మ? బాగా చదువుకోవాలి” అన్నారు. అప్పుడు నేనేమో – నేను చదువుకోవడం తప్పని, నాకు చదువు అనవసరమని నేను నాన్నను కష్టపెడుతున్నాను అని అందరూ నేను చదువుకోవడాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పాను. దానికి సార్ “అధైర్యపడకు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అన్నీ చూడగలుగుతున్నావు, రాయగలవు. నేను అవి రెండు చేయలేను. మన లిపి నాకు రాదు” అన్నారు. ఈ మాటలు నన్ను ప్రోత్సహించడానికి అన్నారని అర్థమైంది. “నువ్వు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అప్పుడు నిన్నువిమర్శించిన వాళ్ళు నీ చుట్టూ చేరి నీకు సేవలు చేస్తారు. నిన్నుపొగుడుతారు” అని చెప్పారు. ఈ విధంగా నన్నుచదువు విషయంలో చాలా ప్రోత్సహించేవారు.
నా అధ్యాపకుల అందరి ప్రోత్సాహం:
పరీక్షలకు అన్ని చదవలేం అని నాన్న అడుగగా ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టించే వారు. ఈ సారే కాదు అందరూ అధ్యాపకులు నా చదువు విషయంలో నాకు చాలా సహాయం చేశారు. అందరి సహకారంతోనే నేను చదువుకోగలిగాను.
బాధలోనైనా చదువుకోవాలన్న పట్టుదల:
డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత పొందినట్లు నానమ్మ విన్నది. కానీ డిగ్రీ రెండవ సంవత్సరం నేను ఉత్తీర్ణత పొందిన విషయం వినడానికి నానమ్మ లేదు. తాతయ్య మాత్రమే ఉండినారు. నానమ్మ చనిపోయిన బాధలో పరీక్షలకు శ్రద్ధగా చదవడానికి నా మనసు అంగీకరించలేదు. అయినా ఉత్తీర్ణత పొందాలి అన్న లక్ష్యం పెట్టుకొని బలవంతంగా చదివి ఉత్తీర్ణత పొందాను. నానమ్మ 92 డిసెంబర్ ఒకటవ తారీకు చనిపోతే 93 మార్చిలో పరీక్షలు జరిగాయి. ఈమధ్య వ్యవధి చాలా తక్కువ కదా. చాలా బాధ తోనే చదివాను.
విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ అన్న:
డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి తరగతికి విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ అని ఒక అన్న వచ్చేవాడు. తరగతి ఖాళీగా ఉన్నప్పుడు సార్ ఎవరు లేనప్పుడు వచ్చినా వెనుక బెంచీలో ఉన్న వాళ్లను పలకరించి వెళ్తూఉండేవాడు. ఒకరోజు ఆ అన్న వాళ్ల కుటుంబానికి సంబంధించిన చిత్రపటాలు తీసుకొని వచ్చినా వెనక బెంచీలో ఉన్న వాళ్లకు చూపిస్తూ ఉండినారు. వాళ్లు ఆ చిత్రపటాలు నాకు ఇవ్వగా నేను అందులో ఉన్న ఒకరిని గుర్తుపట్టాను. ఆయన ఎవరంటే నేను రాజుపాలెం ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగులో పార్వతి తపస్సు పాఠం చెప్పడానికి వచ్చిన రామిరెడ్డిసార్‍గా గుర్తించాను. శ్రీకాంత్ అన్న రామిరెడ్డిసార్ వాళ్ళ అబ్బాయి అట. ఈ విషయం తెలియగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అన్న ఎస్.ఎఫ్.ఐ సంఘానికి నాయకుడు. నాతోటి విద్యార్థినీ విద్యార్థులతో ఆ సంఘంలో సభ్యులుగా సంతకం చేయించుకున్నాడు. అప్పుడు నన్ను కూడా సంతకం చేయమని చెప్పాడు. నేను చేయను నాకు భయమని చెప్పాను. నేనున్నాను నీకేమీ భయంలేదు సంతకం చేయమన్నాడు. చేశాను. అప్పుడప్పుడు వీళ్ళు కూడా పాటల పోటీలు పెట్టేవాళ్ళు. నేను వెళ్ళేదాన్ని.
ఆనందలక్ష్మి పరిచయం:
అక్కడ ఆనంద లక్ష్మి అని వేరే గ్రూపుకు సంబంధించిన ఒక అమ్మాయి నాకు పరిచయమైంది. అదృష్టవశాత్తు ఆ అమ్మాయిది కూడా వేదాయపాలెమే. ఇంకా చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారి సహ విద్యార్థి. ఇల్లు దగ్గర కాబట్టి తరచూ మా ఇంటికి వచ్చేది. ఆమెకు ఇద్దరు అన్నలు అని వారిలో పెద్దన్నకు మతిస్థిమితం లేదని అతనికి పెళ్లిచేయాలని సంబంధం దొరకటం లేదని వాళ్లకు బాగా ఆస్తి ఉందని చెప్తూ ఉండేది. మళ్లీనేమో వాళ్ళ అన్నని గదిలో పెట్టి బంధించేవారని కూడా చెప్పేది. మా అమ్మానాన్నలు పెద్దవాళ్ళు అయిపోతే మా అన్నయ్యను ఎవరు చూస్తారు అందుకే పెళ్లి చేయాలనుకుంటున్నాం అన్నది. చాలా బాధ అనిపించేది. ఆ అమ్మాయి అన్నమాచార్య కీర్తనలు చాలా బాగా పాడేది. మంచి కంఠస్వరం. వాళ్ళ నాన్నగారు వయోలిన్ విద్వాంసులు అట. వయోలిన్ చాలా బాగా వాయిస్తారట. నాన్నకు కూడా ఈ విషయం తెలుసు. నాన్న పదే పదే చెప్పేవారు ఆనంద లక్ష్మివాళ్ళ నాన్నగారు చాలా బాగా వయోలిన్ వాయిస్తారని.
స్నేహితురాళ్ళు ఇంటికి రావడం:
నా సహ విద్యార్థిని ధనలక్ష్మి ఇల్లు అక్కడే కాబట్టి మా ఇంటికి వచ్చేది. కలిసి చదువుకునే వాళ్ళం. ఇంకా లేగుంటపాడు నుంచి వచ్చే లక్ష్మీదేవమ్మ కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది. మా తాతగారు నానమ్మ లక్ష్మీదేవమ్మ అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. తరగతి గదిలోనూ ఉన్నప్పుడు ఎప్పుడైనా తరగతి జరగనప్పుడు ఖాళీ సమయంలోను నేను లక్ష్మీదేవమ్మ పోటీపడి చదువుకునే వాళ్ళం. లక్ష్మీదేవమ్మ చాలా కష్ట పడే చదివేది. పాపం లక్ష్మీదేవమ్మ వయసుకు తగినట్లు మనిషి ఎదగలేదు. మాటలో స్పష్టత ఉండేది కాదు. బాగా కష్టపడే మనస్తత్వం. కష్టపడి చదివేది. కానీ నాలాగే త్వరగా మర్చిపోయేది. అందువల్ల బట్టీపట్టి చదివేది తను కూడా. నేను పూర్తిగా చదవలేనని నాన్న నా కోసం అన్ని సబ్జెక్టుల సార్ల దగ్గరకు వెళ్లి “మా అమ్మాయి అన్నిగుర్తుపెట్టుకోలేదు, కొన్నిముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టిఇవ్వండి” అని అడిగి గుర్తుపెట్టించుకుని తెచ్చి ఇచ్చేవారు. పాపం లక్ష్మీదేవమ్మ కూడా ఉత్తీర్ణత పొందాలి అని అధ్యాపకులు నాకు ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు నేను చదువుకుంటూ ఆ అమ్మాయికీ మాత్రమే ఇచ్చాను. ఇద్దరమూ కలిసి ఒకటిగా చదివేవాళ్ళం. కంఠస్థం చేశాక ఒకరికొకరం ఒప్పజెప్పుకునే వాళ్ళం. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్టులోనే పాఠ్యాంశాలను ఒకరికొకరం ఒప్పజెప్పుకునే వాళ్ళం.
నాన్నకు ఉత్తమ తండ్రి సన్మాన ప్రదానం:
ఒకసారి డిగ్రీ మూడవ సంవత్సరంలో నాకు బాగా జ్వరం వచ్చింది. ఒక వారం రోజులు మేము కళాశాలకు వెళ్ళలేదు. ఒక రోజు సాయంత్రం శ్రీకాంత్ అన్న ఇంటికి వచ్చాడు. “కళాశాలలో కొందరు అధ్యాపకులను ఉత్తమ అధ్యాపకులుగా సత్కరిస్తున్నాము. ఆ రోజు మిమ్ములను కూడా ఉత్తమ తండ్రిగా సత్కరించాలని నిర్ణయించాము. మీరు ఆ రోజు తప్పక రావాలి” అని నాన్నను ఆహ్వానించాడు. ఒక వారం ముందే పిలిచాడు అనుకుంటా. శ్రీకాంత్ అన్నను చూచి మా తాతగారు “ఎవరా అబ్బాయి ఏదో చెప్తున్నాడు ఏంటి?” అని ఆతృతగా అడిగారు. ఈ విషయం చెప్తే చాలా సంతోషించారు. నాకు కొంచెం జ్వరం తగ్గాక కళాశాలకు వెళ్ళడం ప్రారంభించాను. రాజనీతి శాస్త్రం చెప్పే పురుషోత్తమ్ సార్‌కు నాన్న ఈ విషయం చెప్పారు. అప్పుడు సార్ “మీరు మీ కర్తవ్యాన్నినిర్వహిస్తున్నారు. మీరు సన్మానాన్నిస్వీకరించడం అంత సబబు కాదు” అని చెప్పారు. సార్ అలా చెప్పాక వెళ్లాలా వద్దా అని సందేహంగా ఉండేది. శ్రీకాంత్ అన్న “మీరు తప్పక రావాలి, సత్కారం స్వీకరించాలి” అని పదే పదే అడిగాడు. ఆ రోజు కార్యక్రమానికి వెళ్లాము. అధ్యాపకులకు సన్మానం జరిగిన తరువాత నాన్నకు కూడా ఉత్తమ తండ్రి అని సత్కరించారు. నాకు పాటల పోటీలో మూడవ స్థానం వచ్చింది. సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. అవి తీసుకొని ఇంటికి వెళ్ళాక తాతకు చూపించాము. తాత ఏమో “నేను ఉత్తమ తాతను కదా నాకు సన్మానం?” అన్నారు పరిహాసంగా. ఎందుకో తెలియదు ఆ రోజు నాన్న చాలా సంతోషంగా ఉన్నారు.
తాతయ్య పుస్తకం – జీవన్ముక్తి:
తాతయ్య ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి కొన్నిసంవత్సరాలుగా ఒక పుస్తకం రాస్తూ ఉండేవారు. పెద్ద వయసు రావడంతో రాయడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఒకసారి నానమ్మ ఉన్నప్పుడు తాతయ్య “నేను చెప్తూ ఉంటాను నువ్వు రాయి” అని చెప్పారు. ఒకసారి అనుకుంటా ఒక మూడు లైన్లు రాశాను. అప్పుడు చదువుతున్నాను కదా అందుకే క్రమం తప్పకుండా రాయలేకపోయాను. క్రమేణా తాతయ్య కూడా వార్ధక్యం రావడంతో అప్పటివరకు చాలా రాసి ఇంక రాసే శక్తిలేక రాయడం ఆపేసారు.
తాతయ్య మరణం:
ముందంతా ఉదయం సాయంత్రం కర్ర పట్టుకొని నడక వ్యాయామం బయటికి వెళ్లికొంత దూరం నడిచి వచ్చేవారు. క్రమేణా అది కూడా తగ్గిపోయి ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో గోడ పట్టుకొని కర్ర పట్టుకుని అలా తిరిగేవారు తర్వాత అది కూడా తగ్గిపోయింది. తాతయ్యకు ఎటువంటి అనారోగ్యం లేదు. మాకందరికీ ఆస్తి పంపకం చేస్తున్నట్లుగా వీలునామా రాసేశారు. తర్వాత కొద్ది రోజులు అలా కాలం గడిచింది. వార్ధక్యం వల్ల నీరసించి పోవడంతో ఒక పది రోజులు మంచానికి పరిమితమయ్యారు. 1994 ఫిబ్రవరి 27 తారీకు తాతగారు సాయి బాబా, సాయి బాబా అని స్మరిస్తూ తుది శ్వాస విడిచారు.
డిగ్రీ మూడో సంవత్సరం:
నేను డిగ్రీ మూడవ సంవత్సరం మార్చి పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఆ సమయంలో ఇలా జరిగింది. ఇది రెండవసారి నాకు జరిగిన నష్టం. నానమ్మ ఉన్నప్పుడు ఒకసారి మిట్టమధ్యాహ్నం ఆతిథ్యం కోసం కొందరు బ్రాహ్మణులు రాగా తాతయ్య అప్పుడు వాళ్లకు వంట చేసి పెట్టమని నానమ్మకు చెప్పారట. అప్పటికే నానమ్మ శక్తి తగ్గి ఓపిక లేకపోయినా ఇంటి వరకు ఏదో చేస్తూ ఉండేది. ఇంకా ఆ రోజు వాళ్ళందరికీ వంట చేసి పెట్టిందట. అది తెలుసుకున్న అత్త వాళ్ళు “అసలే ఓపిక లేకపోతే మా అమ్మని ఇలా ఎందుకు ఇబ్బంది పెడతావు నాన్నా?” అన్నారట. “బాగా ఓపిక ఉండి భోజనం పెడితే మంచిదే కానీ ఇంట్లో చేయడానికి కష్టపడుతున్న అమ్మను ఇబ్బంది పెట్టవద్దు నాన్నా” అని తాత గారికి చెప్పారట. ఒక్కపూట మనమే ఇబ్బందిపడ్డా ఎదుటివారి ఆకలి తీర్చామన్న సంతృప్తి ఉంటుంది అని చెప్పారట తాతయ్య. తాతగారి దశదిన కార్యక్రమాలు పూర్తయిన తరువాత మళ్ళీ రామ కోటేశ్వరరావు సార్ వాళ్ల ఇంటికి ప్రైవేట్‍కు వెళ్లాను. అప్పుడు సార్ ఏమ్మా ఇన్నిరోజులు రాలేదు అని అడిగారు. విషయం చెప్పాను. అంతే సార్ “ఏమ్మా డిగ్రీ సెకండ్ ఇయర్‌లో నానమ్మ, ఫైనల్ ఇయర్‌లో తాతయ్యను పంపించేసావా?” అన్నారు పరిహాసంగా. నేను ఏడ్చాను.
“ఏడవకూడదు ఇది సహజం అని చెప్పాను కదా” అన్నారు సార్. రామ కోటేశ్వర రావు సార్ – నేను నానమ్మ తాతయ్య పోయినందుకు దిగులు పడినప్పుడు ధైర్యం చెప్పి చదువు విషయంలో నన్నుచాలా ప్రోత్సహించేవారు. ఇంకా డిగ్రీ అయిపోయాక నన్ను ఎంఏ చదివించాలని నాన్న అనుకున్నారు. అప్పుడు సార్ ఏమో “ఎంత చదివినా ఉద్యోగం చేయడానికే కదా. ఇంగ్లీషు సబ్జెక్టుకు వచ్చే శ్రీనివాసులు సార్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే పేరుతో శిక్షణా కేంద్రాన్నినెలకొల్పి ఉన్నారు. డిగ్రీ అయిపోయాక, అక్కడ చేర్చండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు శిక్షణ ఇప్పించండి” అని చెప్పారు నాన్నకు. నాన్న అలాగే అన్నారు. తర్వాత డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు వచ్చాయి. అన్ని పరీక్షలు బాగానే రాశాను. తృతీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు వచ్చాయి. మా నాన్న పేపర్లో నా నంబరు వెతకసాగాడు. ఎక్కడా కనిపించలేదు నాన్నకు. ఇక నేను పరీక్ష తప్పాను అనుకొని ఏడవడం మొదలు పెట్టాను. అప్పుడే మా రెండో చిన్నాన్న పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఎందుకు ఏడుస్తున్నావ్, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత పొంది కూడా అన్నారు. అప్పుడు పేపర్లో నా నంబర్ చూపించారు నాన్నకు నాకు. అప్పుడు నాన్నకు నాకు సంతోషానికి అవధులు లేవు. నా కన్నా కూడా నాన్న నన్నుతన శక్తినంతా ధారపోసి ఎత్తుకొని కళాశాలకు రోజు తీసుకొని వచ్చినందు తగిన ఫలితం దక్కినందుకు చాలా సంతోషపడ్డాము. నాన్న నన్నుమోసుకొని తీసుకొని వచ్చినందుకు నేను కూడా కష్టపడి చదివాను. ఎవరు కాదన్నాఇది నిజం.
రెండో చిన్నాన్న దుర్గాప్రసాద్:
ఇక మా రెండో చిన్నాన్న గురించి కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను .మా రెండో చిన్నాన్న చాలా మంచి వ్యక్తి. అమాయకులు. నేనంటే చాలా ఇష్టం. తుమ్మగుంటలో ఉన్నప్పుడు నాన్న నాకు చేసే సేవలు అన్నీఈ చిన్నాన్న కూడా చేసేవారు. అందరూ మంచి చదువులు చదివినా మా రెండో చిన్నాన్న మటుకు మెట్రిక్యులేషన్‌తో చదువు ఆపేసారు. తుమ్మగుంటలో ఉన్నప్పుడు కాస్త వ్యవసాయం చూసుకునేవారు. తరువాత మా పెద్దత్త భర్త పెద్ద మామయ్య పాటు రామ సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు వి.ఆర్. కాలేజీలో అధ్యాపకులుగా పని చేసేవారు. ఆయన తన పలుకుబడితో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆ క్రమంలోనే మా రెండో చిన్నాన్నకు కూడా నెల్లూరు వి.ఆర్. లా కాలేజ్ గ్రంథాలయంలో ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకు వివాహమైనది. రెండో చిన్నాన్నకు ముగ్గురు అమ్మాయిలు కలిగారు. పెద్దమ్మాయి పదవ తరగతి పరీక్షలకు పది రోజుల ముందు హఠాత్తుగా రెండో చిన్నాన్న కాలం చేశారు.
మంజుల పిన్నమ్మ ఒంటరి పోరాటం:
ఇది పిన్నమ్మకు పిల్లలకి పెద్ద నష్టం. సజావుగా జరిగి పోతున్న రెండో చిన్నాన్న కుటుంబం ఇబ్బందుల పాలయింది. తాతగారు ఇచ్చిన ఆస్తితో ఇల్లు కొనుక్కున్నారు చిన్నాన్న. చిన్నాన్న కాలం చేసిన తర్వాత ఇల్లు తప్ప వాళ్లకు ఎటువంటి ఆధారమూ లేదు. ఇటువంటి పరిస్థితులలో పిన్నమ్మ క్రుంగిపోకుండా ధైర్యంగా నిలబడి కష్టపడి ముగ్గురు ఆడపిల్లలో పెద్ద వాళ్ళిద్దరినీ డిగ్రీ చదివించి వివాహం చేసింది. మూడో అమ్మాయిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుకే ఇచ్చి వివాహం చేసింది. కష్టాలు వస్తే క్రుంగిపోకుండా ధైర్యంగా నిలబడి తమ విధులు నిర్వర్తించుకోవాలని తన చేతలతో చాటి చెప్పింది పిన్నమ్మ. ఇది నలుగురికి ఆదర్శం అవ్వాలని ఈ విషయం రాశాను.
మూడో చిన్నాన్న భీమశంకరం:
భీమశంకరం చిన్నాన్న మేము ఎక్కడ ఉన్నా వచ్చి మా యోగ క్షేమాలు తెలుసుకొని వెళ్లేవారు.
అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్‌లో నా చదువు:
డిగ్రీ అయిపోయాక రామ కోటేశ్వర రావు సార్ చెప్పిన విధంగా అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శ్రీనివాసులు సార్ దగ్గర క్లరికల్ పోస్ట్‌కు శిక్షణ తీసుకున్నాను. ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశం బలంగా ఉండింది. శిక్షణ సమయంలో శుభప్రియ అనే సహ విద్యార్ధిని నాకు బాగా దగ్గర అయింది. ఇంకా కొంతమంది విద్యార్థినిలు నాకు చాలా దగ్గరగా ఉండేవారు. అప్పుడప్పుడు తరగతి గది మార్చేవారు. నాన్న ఎప్పుడైనా నన్నుశిక్షణా కేంద్రంలో వదిలిన తర్వాత చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్లేవారు. ఆ సమయంలో ఒక్కొక్కసారి తరగతి గదిని మార్చేవారు. అప్పుడు నా తోటి సహ సహ విద్యార్థినులు నేను కూర్చున్న కుర్చీని నలుగురు పట్టుకొని మార్చిన గదికి నన్ను తీసుకుని వెళ్ళేవారు. నాకు సహకారాన్నిఅందించిన నా సహ విద్యార్థినులకు కృతజ్ఞతలు. ఒకరోజు నాన్న నా దగ్గర లేని సమయంలో ఇలాగే తరగతి మార్చినప్పుడు నా సహా విద్యార్థినులందరూ హడావిడిలో నన్నుతీసుకుని వెళ్లడం మరచిపోయారు. నాకు పెద్దగా తెలివితేటలు లేకపోయినా పాఠం వినాలి. సార్ 10 పదాలు చెప్తే అందులో ఒక్క పదమైన నేర్చుకోగలుగుతాను అన్న నమ్మకం నా మీద నాకు చాలా ఎక్కువ. ఇక అక్కడ అందరూ పక్క గదిలోకి వెళ్ళిపోయాక తరగతిలో నేను ఉండలేక పోయాను. ఎలాగైనా తరగతికి వెళ్లి పాఠం వినాలి అన్న సంకల్పంతో నా కుర్చీ పక్కన ఉన్న తలుపు పట్టుకొని కుర్చీమీద నుంచి కిందికి దూకేసాను. అక్కడ ఎవరూ లేరు. నన్ను చూడలేదు. నా పుస్తకాల సంచి చెవిని మెడకు తగిలించుకుని నేల మీద పాకుకుంటూ పక్క గదికి వెళ్లడం ప్రారంభించాను. నేలంతా గతుకులు మట్టితో నిండిపోయి ఉండింది. పాకుతూ ఉంటే కాళ్లు గుచ్చుకోవడం ఒక చోటికి వెళ్లేసరికి కాలు గీచుకు పోయి రక్తం వచ్చింది. బాగా ఏడ్చాను. ఎవరికీ వినిపించలేదు. ఎలాగో కష్టపడి తరగతి వాకిలి వరకు వెళ్లాను. అప్పుడు నాన్న వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. అది శ్రీనివాసులు సార్, నా సహ విద్యార్థినిలు చూచారు. శ్రీనివాసులు సార్ “అయ్యో అమ్మా” అన్నారు. నా సహ విద్యార్థినిలు “సారీ ప్రసూన మర్చిపోయాము హడావిడిలో” అన్నారు. తీరా ఇంత కష్టపడి వెళ్ళితే తరగతి అయిదు నిమిషాలు మాత్రమే ఉండింది. శిక్షణ అయిపోయాక పరీక్షాసమయం వచ్చింది. ఆరోజు నాకు బాగా జ్వరం. పైగా హోరు గాలి వాన. పరీక్షకు ఆటోలో వెళ్తుంటే నేను నాన్న బాగా తడిసిపోయాము. చలికి వణికిపోయాను. పరీక్ష బాగా రాయలేకపోయాను. పరీక్ష తప్పాను.
ఇంటి పనులు:
తరువాత ఇంటికి ఇంటి పనులకు పరిమితమైపోయాను. కానీ మనసులో బాధ తట్టుకోలేని వేదన. ఉద్యోగం చేయాలన్న తపన వల్ల అవకాశం కోసం ఎదురు చూపులు. ఏ అవకాశాలు రావట్లేదు.
ఆస్తి పంపకం:
ఇది ఇలా ఉండగా తాతగారి సంవత్సరీకాలు పూర్తి అయిన తర్వాత కొద్దిరోజులకు ఆస్తి పంపకాలు జరిగాయి. నాన్నకు కూడా కొంత భాగం పైకం వచ్చింది. దానిని చిన్న అత్త మామయ్య వాళ్లు వాళ్లకు తెలిసిన నమ్మకమైన వ్యక్తులకు నాన్న భాగానికి వచ్చిన పైకం వడ్డీకి ఇచ్చారు. అది తప్ప నాన్నకు నాకు ఇద్దరికీ ఎటువంటి ఆధారం లేదు. ఏదో చిన్నత్త మామయ్య వాళ్ళ పుణ్యమా అని వడ్డీడబ్బులతో జీవనం సాగుతోంది. కానీ నాలో ఒకటే తపన ఏదైనా చేయాలి. సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించాలి దాంతోనే నాన్న నేను జీవనం సాగించాలి అన్న తపన.
ఉద్యోగం చేయాలి అన్న ఆలోచనను విరమించుకోవడం:
ఇంటి పనులు చేస్తున్నాఈ ఆలోచనలతో సతమత మయ్యేదాన్ని. ఇది ఇలా ఉండగా ఒకరోజు చిన్న తలనొప్పికూడా ఎరుగని నాన్నకు విపరీతంగా జ్వరం వచ్చింది. అప్పుడు ఇంట్లోలో ఎవరు చూసే వాళ్ళులేక రెండో చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. జ్వరం తగ్గేవరకూ అక్కడే ఉండినాము. అప్పుడు ఉద్యోగం చేసే ఆలోచన చేయకూడదని నిర్ణయించుకోవాలసి వచ్చింది. దీనికి కుటుంబ పరిస్థితులే కారణం.
(ఇంకా ఉంది)
92916 35779
prasunasuram@gmail.com