Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవితం – నా చరితం

[శ్రీ విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి రచించిన ‘నా జీవితం – నా చరితం’ అనే కవితని అందిస్తున్నాము.]

నాడు ఇలా..
మరునాడు మరోలా..

కొన్నిసార్లు ఒంటరిగా
కొన్నిచోట్ల ఉమ్మడిగా
కలిసి సంబరాలు కొన్నాళ్ళు
కరగని కన్నీళ్ళు కొన్నేళ్ళు

వినిపించుకోని విమర్శలు
పొగడ చెట్టెకించే పొగడ్తలు
కొరతతో గడిపిన పగళ్ళు
కోరిక కన్నుల రాత్రిళ్ళు

నవ్వుల పువ్వుల బాల్యం
నవవసంతపు యవ్వనం
నడివయస్సు సంధ్యాకాలం
నడుము వంగిన వార్ధక్యం

రాజాలా బతకాలన్న మోజులు
రాజీతో గడిపేసిన రోజులు
నన్ను నేను మరిచిన క్షణాలు
నన్ను నేను వెతుక్కునే వీక్షణాలు

చెరిగిపోని జ్ఞాపకాలు
చెదిరిపోయిన వాస్తవాలు
చేరువలో లేని ఆశయాలు

శిలాఫలఖాన మిగిలిన విజయాలు
హృదయఫలఖాన మెదిలే స్మృతులు
కనుల ముందే జననాలు మరణాలు
కంచికి చేరుకున్న కథల నిదర్శనాలు

అలుపులేని అలలతో తీరం కోసం పరుగులు
ఆగిపోని ఆటల్లో ఓటమివిజయాల వలయాలు
ఊపిరి ఉయ్యాలల్లో భ్రమించే రంగులరాట్నాలు
ఉలుకు పలుకు చివరి హోమానికి అంకితాలు

వెరసి తూచేలోగా అంతర్ధానం నా జీవితం
తెరిచి మూసేలోగా సమాప్తం నా చరితం

Exit mobile version