[మాయా ఏంజిలో రచించిన ‘My life has turned to blues’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(వేసవి సెలవుల జ్ఞాపకాలను చాలామంది పెద్దయ్యాక కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వేసవి స్నేహం గురించి కవయిత్రి తలపుల తలపోత ఈ కవిత!)
~
మా వేసవి గడిచిపోయింది
బంగారు రోజులు కరిగిపోయాయి
నీతో కలిసి మేల్కొన్న
గులాబీ ఉదయాలు
ఉదాసీనపు బూడిద రంగులోకి మారిపోయాయి
నా జీవితం బరువుగా మారింది
ఒకప్పటి పచ్చని పచ్చిక బయళ్ళు
ఇప్పుడు మంచుతో మెరుస్తున్నాయి
నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి
రెడ్ రాబిన్ కూడా
దక్షిణం వాలుగా ఎగిరెళ్ళిపోయాడు
నా జీవితం విషాదంగా మారింది
చలికాలం కూడా ఇలాగే గడిచిపోతుందని
నేనో వార్త విన్నాను
ఆ వసంతకాలపు సంకేతం
చివరలో వేసవి వస్తుందని
కానీ
పచ్చికలో పవళించి ఉన్న
నిన్ను కళ్ళతో చూసేదాకా
నా జీవితం బరువుగానే గడుస్తుంది!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
మాయా ఏంజిలో, ఓఫ్రా విన్ ఫ్రే ఇద్దరూ సన్నిహిత స్నేహితులు. వయసులో ఉన్న తారతమ్యం వారి స్నేహానికి అడ్డు రాలేదు. 1970లో మేరీలాండ్ రాష్ట్రం లోని బాల్టిమోర్ నగరంలో విన్ ఫ్రే నిర్వహిస్తున్న టీవి షో నిమిత్తం వారిద్దరూ కలుసుకున్నారు. మాయాతో ఒక టాక్ షో చేసింది ఓఫ్రా.
పేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, అత్యాచారాలకు గురి అయి కూడా ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిన ఓఫ్రా విన్ ఫ్రే, ఒక అమెరికన్ నల్లజాతి యువతి. ఆమె మాయా ఏంజిలోకి అతి సన్నిహిత స్నేహితురాలిగా మారింది. ప్రభుత్వ పథకాలు అందించే సొమ్ముతో ఓఫ్రాని ఆమె తల్లి పెంచి పోషించింది. ఓఫ్రా తన పదవ యేడు నుంచి పద్నాలుగో యేడు దాకా అత్యాచారాలకి గురైంది. ఆమె తన 14వ యేట గర్భం దాల్చడంతో ఆమె తల్లి ఆమెని డిటెన్షన్ హోంకి తరలించింది. దయనీయ పరిస్థితుల లోంచి ఓఫ్రా మాయాని కలుసుకుంది. ఆ రోజుల్లో మాయాని కలవడం అంటే తనని తాను సంపూర్ణంగా చూసుకున్నట్టుగా ఉందని ఓఫ్రా చెప్పుకుంది.
మాయా – ఓఫ్రాకి ప్రజలను అర్థం చేసుకొవడం గురించి విలువైన పాఠాలు నేర్పింది. జీవితం నేర్పించిన అనేక సత్యాలతో పాటు మాయా తన జీవితకాలం ఓఫ్రాకి ఒక స్నేహితగా, సన్నిహిత సలహాదారుగా ఉండిపోయింది. నా ఇరవైయ్యో ఏట నుంచి నాకు ఒక గురువుగా/తల్లిగా/సోదరిగా/స్నేహితురాలిగా మాయా లభించడం జీవితం నాకు ఇచ్చిన వరం అని, I am very much blessed అని చెప్పుకునేది ఓఫ్రా.
మూడు దశాబ్దాల TV షో ప్రయోక్తగా, ప్రొడ్యూసర్‌గా తాను నిర్వహించిన టాక్ షోలన్నింటిలోను, మహిళలు తమ చేదు గత జీవితపు జ్ఞాపకాలను, మరచిపోయి తాము అనుకున్నట్టుగా తిరిగి తమ జీవితాలని మలచుకోవాలని ఉద్భోదించింది. వర్తమానంలో బ్రతుకుతూ, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని కోరేది ఓఫ్రా. జీవితం పట్ల తన సానుకూల వైఖరికి మూలం మాయా రచనలు, మాటలు, బోధనలు అని ఎంతో ప్రేమపూర్వకంగా చెప్పుకునేది.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.