శ్రీ మాత్రే నమః.
భారతదేశానికి వచ్చాక ముందు మా అమ్మ, నాన్నల దగ్గర ఓ వారం ఉండి తరువాత మా ఆవిడ ఉండే తణుకుకు వచ్చాను. మా ఆవిడ ఒకటే గొడవ ఇండియా వచ్చే మార్గం చూడండి, ఉద్యోగం సంపాదించండి ఇక్కడ అని.
అంతా అమ్మ దయ అని చెప్పి దగ్గరలో మా ఆవిడ కుల దేవత మండపాక ఎల్లారమ్మ గుడికి ఇద్దరు వెళ్లి అమ్మకి కుంకుమ పూజ చేయించాము ఓ శుక్రవారం.
ఇక్కడ ఆ అమ్మ చాలా ప్రసిద్ది చెందింది. కంచి పరమాచార్య తణుకు వచ్చి ఓ భక్తుడు ఇంట్లో ఉంటే రాత్రి అయన స్వప్నం లోకి వచ్చి “నా దగ్గరికి రావా?” అని అడుగగా అయన వెంటనే లేచి మండపాక గుడికి నడిచి వెళ్లారు అక్కడ అమ్మకి స్వయంగా పూజ చేసారు అని చెబుతారు.
ఇక్కడ ప్రతి రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు అమ్మ వారికి అందరి కుంకుమ పూజలు అన్ని అయ్యాక నైవేద్యం ఉంచి అమ్మ వారికీ దండకం చదువుతూ పూలు అమ్మ తల మీద ఉన్న గిన్నెలో ఉంచుతుంటారు. ఆ రోజు పూజలు చేయించుకున్న వారి గోత్ర నామాలు చదువుతారు. గిన్నె లొంచి పూలు క్రింద పడే వరకు దండకం చదువుతూనే ఉంటారు. మన గోత్రం నామం చదువుతున్నప్పుడు పూవు పడితే మనం అనుకున్నది జరుగుతుంది అని చెబుతారు.
ఓ కార్తీక సోమవారం నేను ఉపవాసం (నక్తం) ఉన్న సమయంలో మా ఆవిడ “ఇక్కడ కు దగ్గరలో ఇరగవరం గ్రామంలో పీసపాటి సిద్ధాంతి గారున్నారు. వారు జాతకాలూ చూసి భవిష్యత్ బాగా చెబుతారు” అని చెప్పగా తణుకు నుండి ఇరగవరం (12 కిలోమీటర్లు) ఇద్దరు రిక్షా మీద వెళ్లి వారు ఇల్లు కనుక్కుని వారి ఇంట్లోకి ప్రవేశించాము.
“సిద్ధాంతి గారు పడుకున్నారు, లేచే సమయం అయ్యింది వేచి ఉండండి” అని వరండాలో కుర్చీలు చూపించారు.
సరిగ్గా 3.10 నిముషాలకు మమ్మల్ని లోపలకు పిలిచారు. లోపలకు వెళ్లి వారికీ నమస్కారం చేసుకుని వారికి నా ఉద్యోగం సమస్య చెప్పాను. మా ఆవిడ “దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఇది వరకు రాజమండ్రిలో చేసి బయటకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. దగ్గరకి వస్తే బాగుంటుంది” అని అడిగింది.
ఆయన నా వంక చూశారు. సమయం చూసారు తరువాత పంచాంగం తీసి ఏవో లెక్కలు వేసుకుని మాతో ఇలా అన్నారు
“రాజమండ్రిలో మీకు ఉద్యోగం సిద్ధంగా ఉంది మీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, ఉద్యోగం దొరుకుతుంది”. అని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా జాతకం ఇవ్వబోయను.
అయన “అవసరం లేదు. నా మాట నమ్మండి.” అని అన్నారు.
ఆయనకు నమస్కారం చేసి “ఉద్యోగం ఆర్డర్ వచ్చాక మిమ్మల్ని వచ్చి కలుస్తాము.” అని చెప్పి ఆనందంగా తిరిగి వచ్చాము.
వారి వయసు 80పైనే. అద్భుతం అయిన ముఖ వర్చస్సుతో ప్రకాశిస్తున్నారు కొద్దిగా చెదిరిన నుదుట కుంకుమ విభూతి రేఖలతో.
మరుసటి రోజు మంగళవారం అయినా సరే ఉదయాన్నే బయలుదేరి రాజమండ్రి చేరుకొని పేపర్ మిల్‌లో ప్రెసిడెంట్ గారిని కలిసాను.
వారు నన్ను “ఉద్యోగం ఇస్తే వస్తావా?”అని అడిగారు. “తప్పకుండా వస్తాను ఆర్డర్ పంపండి” అని అన్నా.
అయన “జనరల్ మేనేజర్‌ని కలవండి” అని చెప్పారు. నేను జనరల్ మేనేజర్‌ని కలువగా వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు.
“జీతం ఎంత కావాలి” అని అడిగారు. “నా సీనియర్‌కి ఎంత ఇస్తున్నారో అంత ఇవ్వండి, మిల్లు లోపల కాలనీలో ఇల్లు తప్పకుండా కావాలి” అని అడిగాను.
“దుబాయ్‌లో 4 రెట్లు జీతం వస్తుంది. వదిలి వస్తారా లేదా ఆర్డర్ చూపించి అక్కడ ప్రమోషన్ లేదా జీతం పెంపు పొందుతారా” అని అడిగారు.
“అదేమీ లేదు మీరు ఆర్డర్ పంపిన నెల 15 రోజులు తరువాత మీ మిల్లులో తప్పకుండ చేరుతాను” అని చెప్పి ఆర్డర్ పంపమని మా నాన్నగారి అడ్రస్ ఇచ్చాను.
వారు “సరే” అన్నారు.
ఇక అక్కడ నా మిత్రులు ఎవరిని కలవకుండా తణుకు వచ్చి మా ఆవిడకి శుభవార్త చెప్పాను. ఆవిడ చాలా సంతోషించింది.
ఇండియాలో నేను పనిచేసిన రాజమండ్రిలో మళ్ళీ ఉద్యోగం వస్తుంది, ఇది అంత అమ్మ దయ, నవరత్న ఉంగరం ధరించిన విశేషం అని అనుకుంటూ దుబాయ్ చేరుకొని మిల్లులో ఉద్యోగంలో చేరాను.
అక్కడ జనరల్ మేనేజర్ గారికి ఈ విషయం చెప్పాను.
“నీ ఇష్టం. ప్రస్తుతం పిల్లలు చిన్న వాళ్ళు కదా ఇంకొంత కాలం ఉంటే ఇంక డబ్బులు సంపాదించవచ్చు. మళ్ళీ ఇక్కడ ఉద్యోగం రావడం కష్టం” అని చెప్పారు.
“ఇక ఉండలేను అక్కడ నా కుటుంబానికి నా అవసరం చాలా ఉంది. నా పిల్లలు చదువులు చూసుకోవాలి” అని చెప్పాను.
ఇద్దరు పద్మ గార్లకు ఈ విషయం చెబితే చాలా ఆనందించారు.
రోజు ఉదయం పూజలు చేస్తూ ఇండియా నుండి ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న.
ఫిబ్రవరి నెలలో నా జన్మదినానికి ముందు నాకు మా నాన్నగారు రాజమండ్రిలో ఉద్యోగం ఉత్తర్వులు పంపారు. వెంటనే నా శ్రేయోభిలాషి పద్మ గారికి చూపించి వారి ఇంట్లో పూజ మందిరంలో ఉంచి కుంకుమ పూజ చేయించి తీసుకున్నా.
నా ఉద్యోగానికి రాజీనామా చేసాను.
నెల రోజుల్లో నన్ను విడుదల చేసి రావలసిన బకాయిలు వచ్చే ఏర్పాటు చేసి ఇండియా పంపే ఏర్పాటు చెయ్యాలి అని మా మిల్లు జనరల్ మేనేజర్ గారిని లిఖిత పూర్వకంగా కోరాను.
మార్చి 25,1996 న నేను ఇండియాకి తిరిగి రావడం జరిగింది.
ఇరగవరం సిద్ధాంతి గారి వద్దకు మా దంపతులు కలిసి వెళ్లి “ఉద్యోగంలో చేరి, స్థిరంగా పని చేయడానికి ముహూర్తం పెట్టండి” అని అడిగాము.
అయన నా జాతకం చూసి “ఏప్రిల్ 6వ తారీకు ఉదయం 11.27 గంటలకు చేరండి, అంతా బాగుంటుంది” అని చెప్పారు. “సరే నండి” అని వారికి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలు ఇచ్చి మా దంపతులు వారికీ నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చాము.
ఏప్రిల్ 6 ఉదయం రాజమండ్రికి ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లి పర్సనల్ డిపార్ట్మెంట్‌లో నేను తగిన వివరాలు ఇచ్చి ‘చేరే ఉత్తర్వు’ (జాయినింగ్ ఆర్డర్) లో సిద్ధాంతి గారు చెప్పిన సమయానికి సంతకాలు చేసి ఉత్తర్వులు అందుకున్నా.
ఇది నా జీవితంలో ఉద్యోగపర్వంలో 7వ ఉద్యోగం.
నాకు ఇచ్చిన నివాసంలో ఓ పడక గదిలో ఓ అలమర పూజ మందిరానికి కేటాయించి, లలిత అమ్మ వారి ఫోటో మంచిది కొని ఉంచి పూజలు చేయడం ఆరంభం చేశాను.
పిల్లలను పేపర్ మిల్ వారి పాఠశాలలో చేర్చాను. దుబాయ్ జీతంతో పోలిస్తే ఇక్కడ జీతం చాలా తక్కువ.
అమ్మ అన్ని చూసుకుంటుంది అనే నమ్మకంతో సంసారరధం లాగడం మొదలు పెట్టాను.
మిల్లుకు దగ్గరలో షిరిడీ సాయి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయం ఒకాయన స్తోత్రాలు పారాయణం చేస్తూ కనబడ్డారు.
వారి పరిచయంతో ఇంట్లో పూజలు తరువాత గుడిలో స్తోత్రపారాయణం వారితో సాగుతుంది.
దసరా కార్తీక మాసాల్లో మధ్యాహ్నం లలిత పారాయణం జరిగేది. సుమారు 40మంది మహిళలు మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటలకు వచ్చి చక్కగా లలిత 3 సార్లు తరువాత శివ అష్ట్తోత్తర నామ స్తోత్రం, మహిషాశురమర్దని స్తోత్రం చదివేవారు.
అందులో సభ్యుడిగా నేను చదివేవాడిని.
దసరాల్లో నవరాత్రులు అమ్మని నిలబెట్టి చక్కగా రెండు సంధ్యల కుంకుమ పూజలు లలితా సహస్రముతో చేసే వారు. నేను నా ఉద్యోగానికి ఆ పది రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉదయం పూజలు చేసి 5 సార్లు లలిత చదివి 9 గంటలకు గుడి దగ్గర పూజకు వెళ్లే వాడిని.
నవరాత్రులలో ఇంట్లో రోజు 11సార్లు లలిత చదివి గుడిలో 3 సార్లు చదివే వాడిని.
ఉదయం ప్రసాదంగా ఆ రోజు నైవేద్యం కొద్దిగా మడిగా చేసి, సాయంత్రం రవ్వ కేసరి ప్రసాదం చేసి అదే ప్రసాదంగా స్వీకరించే వాడిని.
ఆలా దేవి నవరాత్రుల్లో అమ్మని సేవించుకునే వాడిని.
ఓ సంవత్సరం నడుము నొప్పితో మంచానికే పరిమితం అవడంతో లలిత పారాయణం, గుడిలో పూజలు చెయ్యలేక పోయాను. నా పేరు మీద గుడిలో పూజలు చెయ్యడానికి డబ్బులు కట్టాను. సరస్వతి దేవి పూజ రోజున (మూల నక్షత్రం ఉన్న రోజు) మా ద్వితీయ పుత్రుడిని గుడిలో పూజకి పంపాను.
(సశేషం)