[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు గారి గురించి వివరిస్తున్నారు శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం.]
మా గురువు గారైన కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు (జీవన కాలము: 1902 – 1983) ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉన్న చిరువోలు గ్రామ నివాసి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. Jack of all trades and master of many – అన్న నానుడి ఆయనకి చాలా బాగా సరిపోతుంది. ఆయన చదివింది మెట్రిక్ (Matric), ఆ తరువాత టీచర్ ట్రైనింగు (Teacher training) అయినా, స్వయంకృషితో చాలా రంగాలలో జ్ఞానం సముపార్జించారు. దేశకాలమాన పరిస్థితులకి అతీతంగా, ముందుచూపుతో ఆచరణాత్మకంగా ప్రబోధాలిచ్చిన వాళ్ళలో మా గురువు గారొకరు. ఆయన ఎప్పుడూ తన స్వార్థం చూసుకోలేదు. ఏ ప్రలోభాలకీ లొంగకుండా నమ్మింది చెప్పారు, చెప్పింది చేశారు. తన తరమే కాకుండా, ముందు తరాల గురించి కూడా ఆలోచించారు. వివిధ రంగాలలో ఆయన కృషి (contribution) ఎలా జరిగిందీ చెప్పే ప్రయత్నం చేస్తాను.
ప్రసాదరావు గారు నాకు మాతామహులు. మా అమ్మ అనారోగ్య కారణాల వల్ల నేను పుట్టినప్పటి నుండి చిరువోలులో ఆయన దగ్గరే ఉండి పెరిగాను. ఆయనే నా తొలి గురువు. అప్పటికే ఆయన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. రిటైరు అయిన తరువాత కూడా, ఆయన ఆ వ్యాపకాన్ని కొనసాగించారు. మా గురువు గారు చదువు చెప్పే పద్ధతి చాలా విలక్షణంగా ఉండేది. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. నిరక్షరాస్యులు, కూలీలు, బీదవారు ఉన్న కుటుంబాలలో, పిల్లల్ని చదువుకి పంపడం కన్నా పనికి పంపడం ఇష్టపడేవారు. అలాంటి తల్లిదండ్రుల్ని నయానో భయానో ఒప్పించి, పనితో పాటు చదువు కూడా నేర్పుతాను అని చెప్పి వాళ్ళ పిల్లలని తన దగ్గరకు రప్పించుకునే వారు మా గురువు గారు. పగలు చదువుకోవడం కుదరని పిల్లలకి రాత్రి పూట చదువు చెప్పేవారు. ఆ క్రమంలోనే, చిన్నప్పుడు చదువుకోకుండా పెద్దయిన వాళ్ళకి ఓనమాలు దిద్దించడం నేను చూశాను. ఈ విధంగా, నేను చిరువోలులో ఉన్న కేవలం 14 ఏళ్ళ (1958 – 1972) కాలంలో, మా గ్రామంలోను, చుట్టుపక్కల గ్రామాలలోను, చాలా మందిని మా తాతగారు అక్షరాస్యులను చేశారు.
మా గురువుగారు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం కలవారు. ప్రతి విద్యార్థికి వివిధ దశల్లో మూడు భాషలు (తెలుగు, ఇంగ్లీషు, హిందీ) నేర్పేవారు. ఓనమాలుతో మొదలు పెట్టించి, చిన్న చిన్న లయబద్ధమైన పదాలు (అల, తల, కల, వల లాంటివి), తరువాత కొంచెం పెద్ద పదాలు, క్రమ పద్ధతిలో నేర్పించేవారు. దాని కోసం ప్రతి ఒక్క విద్యార్థికి ఒక పుస్తకం తానే, ఆ పదాలతోనూ ఒక్కొక్క పదం ప్రక్కన దాన్ని సూచించే బొమ్మ తోనూ, స్వహస్తాలతో తయారు చేసి ఇచ్చేవారు, మా గురువు గారు. మామూలుగా పిల్లలకి మాటలు నేర్చే కాలానికి 100 – 150 పదాలు తెలుస్తాయని అంటారు. వాటిల్లో చుట్టూ ఉన్న వస్తువుల పేర్లు, సంబంధాల పేర్లు (అమ్మ, నాన్న, అక్క, తాత లాంటివి) ఎక్కువగా ఉంటాయి. మా గురువు గారు తయారు చేసిన పుస్తకంలో అలాంటివి, పిల్లలకి అప్పటికే తెలిసిన పదాలు, ఎక్కువగా ఉండేవి. అట్లా చెయ్యడం వల్ల, పిల్లలకి చదువంటే ఆసక్తి చిన్నప్పటి నుండే ఏర్పడేది. ముఖ్యంగా, చదువు రాని తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలలో, పిల్లలు ఉత్సాహంగా వాళ్ళు రోజూ మాట్లాడుకునే పదాలు వ్రాసి పెద్దలకి చూపించే వారు. అలా, ఆ కుటుంబాల లోనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల కూడా, ఆ పద్ధతి పిల్లల్ని చదివించడానికి ప్రేరణగా (motivation) పని చేసింది. తరువాతి దశలో చిన్న చిన్న వాక్యాలు, కొంచెం వ్యాకరణం నేర్పేవారు. ఆ తర్వాత ఒక్కొక్క పిల్లవాడి శ్రద్ధని బట్టి కవిత్వము, వ్యాసాలు, గ్రంథాలు చదవడం నేర్పేవారు. ఇదే పద్ధతిని, కొంచెం పెద్ద పిల్లలకి ఇంగ్లీషు, హిందీ నేర్పించడానికి కూడా పాటించేవారు. ఈ విధంగా, మూడు భాషలూ నేర్పేవారు.
మాకు మా గురువుగారు, తన పద్ధతి ప్రకారం చెప్పే చదువు కాక ప్రభుత్వం ప్రచురించిన పాఠ్య పుస్తకాలలో ఉన్న విషయాలు కూడా నేర్పేవారు. ఆయన సిలబస్ (syllabus) ప్రకారం చదుకున్న వాళ్ళకి ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నది నేర్చుకోవడం చాలా తేలికగా ఉండేది. ఎందుకంటే, ఆయన చెప్పే చదువు ఒక ఆకు ఎక్కువ ఉండేది. మా గురువుగారు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో ఒక్కొక్క పదానికి అర్థం చెప్పేటప్పుడు, ఆ పదానికి ఉన్న పర్యాయపదాలు, వాటిని వాక్యాలలో ప్రయోగించే పద్ధతి (usage) చెప్పేవారు. 8-9 ఏళ్ళ వయసులో తెలుగులోనే కాదు ఆంగ్లంలో కూడా చిన్న చిన్న పదాలతో నేను మా నాన్నకి ఉత్తరం వ్రాయగలిగేవాణ్ణి. కొంచెం పెద్ద పిల్లలకి, భాషకి సాహిత్యానికి ఉన్న అంతరం (difference) వివరించేవారు. పర్యాయపదాలు భాషలో ఉంటాయి కానీ, సాహిత్యంలో ఉండవని చెప్పేవారు. పర్యాయపదాలు అనబడే వాటిల్లో ప్రయోగ పద్ధతుల్లో అంతరం ఉంటుంది, ఆ వివరాలు మహాకవుల, పెద్దల ప్రయోగాల నుండి మీరు పెద్దయిన తరువాత శోధించి తెలుసుకోవాలని చెప్పి, పదాల పరిణామం (evolution) గురించి మాలో ఆలోచనలు రేకెత్తించేవారు.
చదువుకున్న వాళ్ళకి శ్రమపై గౌరవం ఉండడం లేదని గుర్తించిన మా గురువుగారు, పని చేస్తూ చదువు నేర్చుకోవడం అనే పద్ధతిని పాటించేవారు. మా చిన్నప్పటి చదువులో కొంత భాగం పొలంలోనో, పెరట్లోనో, గుడి/బడి ప్రాంగణంలోనో, పనిచేస్తున్నప్పుడు సాగేది. మాకు పని నేర్పుతూ మా గురువుగారు అక్కడే మట్టిలో అక్షరాలు, అంకెలు, లెక్కలు, దూరం కొలవడాలు – ఇలాంటి వన్నీ నేర్పేవారు. ఒకట్లు, పదులు, వందలు – వీటి గురించి చెప్పడానికి చింత గింజలు లెక్కించడం, చిన్న చిన్న సంచులలో పది – పది గింజలు చొప్పున గింజలు పెట్టించి పదులు, వందలు అంటే ఏమిటో చెప్పడం చేసేవారు. కూడికలు, తీసివేతలు కూడా అలాగే నేర్చుకున్నాము. ఎక్కాలు బట్టీ పట్టించడం మా గురువుగారికి ఇష్టం ఉండేది కాదు. మనస్సులోనే మననం చేసుకుంటూ హెచ్చవేతలు, భాగహారాలు చేయడం అభ్యాసం చేయించేవారు. పద్యాలు, గేయాలు వల్లె వేయించడం, మొక్కలు పెంచడం నేర్పించడంతో పాటే సాగేది. ఇలా చెయ్యడం వల్ల శ్రమ అంటే గౌరవం (dignity of labour) మా నరనరాల్లో చిన్నప్పటి నుండే జీర్ణించుకు పోయింది.
వ్యవసాయ పద్ధతులు, నార (తాటినార, జనప నార, గోగు నార) తీయడం, నారతో తాళ్ళు మోకులు పేనడం, చాపలు తడికెలు అల్లడం, మట్టితో ఇంటి గోడలు మెత్తడం, చిన్న చిన్న పాకలు పందిళ్ళు వెయ్యడం, పశు సంరక్షణ, నీళ్ళలో ఈత కొట్టడం (ముఖ్యంగా మునుగీత), ధాన్యం భద్రపరచడానికి పురి కట్టడం, గడ్డివామి ఏర్పాటు చెయ్యడం, పిడకలు చెయ్యడం, పొలాల్లో జల్లడానికి పేడ ఆకుపొట్టులతో సహజ ఎరువులని తయారు చెయ్యడం, నుయ్యి తవ్వడం, తాపీ పనులు, చిన్న చిన్న వడ్రంగం పనులు, ఒకటేమిటి, పల్లెటూరిలో బ్రతకడానికి కావాల్సిన పనులన్నీ నేర్పేవారు. కులవృత్తులకి అవసరమైన చదువు కూడా నేర్పేవారు. పెద్ద పిల్లలకి చుట్టుకొలత, వైశాల్యం లెక్కలు, దిగుబడిని కొలిచే లెక్కలు (కుంచం, మరకం లాంటివి), వడ్డీ లెక్కలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు, అంటే, ఉదాహరణకి ఎకరానికి ఎన్ని మరకాల గింజలు చల్లించాలి, నారుమడి వేస్తే ఎరువు (సహజ) ఎంత వెయ్యాలి, నీళ్ళు ఎప్పుడెప్పుడు పట్టాలి, వేరే పంటలయితే మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం ఉంచాలి, నాట్లకి ఇతర వ్యవసాయపు పనులకి ఎకరానికి ఎంతమంది మనుషులని పెట్టాలి, ఇలాంటివి నేర్పేవారు. ఇలా, చదువుతో పాటు, పనులు కూడా నేర్చుకున్నాము.
మరో విచిత్రమైన విషయం చెబుతాను. ఒక పొలం రూపు ఎంత వంకరటింకరగా (irregular shape) ఉన్నా దాని వైశాల్యం ఎలా కొలవాలో మాకు పురికొస, కట్టుకొయ్యల సాయంతో నేర్పేవారు. ఉన్న రూపాన్ని చతురస్రాలుగా (squares), దీర్ఘచతురస్రాలుగా (rectangles), త్రిభుజాలుగా (triangles) విభజించి విడివిడిగా వాటి వైశాల్యాలు గణించి కూడడం వల్ల మొత్తం పొలం వైశాల్యం వస్తుందని మాకు నేర్పారు. పెద్దయిన తర్వాత, బహుశా డిగ్రీ (degree) కోర్సులో (course) అనుకుంటా, న్యూమరికల్ ఎనాలసిస్ (Numerical Analysis) అనే సబ్జెక్ట్ (subject) లో ట్రెపీజాయిడల్ రూల్ (Trapezoidal rule) అనే టాపిక్ (topic) లో ఇదే నేర్పారు.
మా చిన్నప్పుడు, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి మా గురువుగారు మాతో ప్రయోగాలు చేయించేవారు. మాకు చదవడం, వ్రాయడం రాని రోజుల్లోనే, పద్యాలు, శ్లోకాలు, అంటే లయబద్ధంగా ఉండేవి, మాకు చెప్పి మా చేత చెప్పించేవారు. ఒక పెద్ద పళ్ళెంలో రకరకాల వస్తువులు పెట్టి ఒక గుడ్డతో కప్పి ఉంచేవారు. మమ్మల్ని పళ్ళెం ఎదురుగా కూర్చోపెట్టి, ఒక్క సారి గబాల్న ఆ గుడ్డ తీసేసి మళ్ళీ కప్పేవారు. తర్వాత, మమ్మల్ని పళ్ళెంలో ఏ ఏ వస్తువులు చూశామో జాబితా (list) వ్రాయమనేవారు. ఇలా ప్రయోగం రిపీట్ (repeat) చేసేవారు. ఈ ప్రయోగాల ఫలితంగా, మనం కళ్ళు మూసుకుని కొంచెం ఏకాగ్రత వహిస్తే, అదివరకు చూసిన వస్తువుల్ని, మనుషుల్ని మనోనేత్రంతో చూడవచ్చునని తెలిసింది. ఈ సామర్థ్యం వివిధ వస్తువులని, సంఘటనలని, మనుషులని (గతించిన వారిని కూడా) కళ్ళు మూసుకొని కూడా చూడడానికి పనికొచ్చింది. ముఖ్యంగా చదువుల్లో ఇది చాలా ఉపయోగపడింది.
ఈ విధంగా మాకు మూడు భాషలతో మంచి చదువు, వ్యవసాయము, పశు సంరక్షణ అన్నిటి కన్నా ముఖ్యంగా శ్రమైక జీవన సౌందర్యం అబ్బాయి. ఏ పని చెయ్యడానికైనా సిగ్గు పడకపోవడం, పనుల్లో పెద్ద పని – చిన్న పని అన్న తేడా చూపించక పోవడం, మాకు చిన్నప్పటి నుండే అలవడ్డాయి.
మా గురువు గారు చరిత్ర పాఠం చెప్పేటప్పుడు తన నాటకానుభవం అంతా ఉపయోగించి, పాత్రలు సజీవంగా మన కళ్ళ ఎదుట కదలాడుతున్నట్లే చెప్పేవారు. పురాణ కథలు చాలా ఆసక్తికరంగా క్రొత్త విధంగా చెప్పేవారు. ఆయన వివరణ (interpretation) చాలా భిన్నంగా ఉండేది. కొన్ని ఉదాహరణలు చెబుతాను.
రామాయణంలో శ్రీరాముడు పితృవాక్యాన్ని పాలించాడంటే, ఆయన సాంతం నిజం కాదని చెప్పేవారు. రాముడు అడవికి వెళ్ళే ముందు అసలు దశరథుడు రాముణ్ణి అడవికి పంపాలన్న మాటే మాట్లాడ లేదు. ఎప్పుడో తనకి ఇచ్చిన వరాలని కైక ఆ విధంగా వివరిస్తే (interpret), అది ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్నట్లుగా రాముణ్ణి అడవికి పంపాలన్న విషయం బయటి కొచ్చింది. దీని కంతటికీ మూలం దశరథుడు కాబట్టి, ఆ అడవికి పంపడం అనేది పితృవాక్య మయ్యింది. ఇలా చెబుతూ, మా గురువుగారు ఆవేశంగా ఇంకో విషయం, మనస్తత్వానికి సంబంధించినది, చెప్పేవారు. రాముడు అడవికి వెళ్ళే ముందు దశరథుణ్ణి ఏమీ నిందించ లేదు. అంత చిన్న వయస్సున్న తన కొడుకు రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా తలచి ఒక్క మాట కూడా తనని అనకుండా అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు, తాను బహు భార్యలతో రాజ్యం ఏలి సర్వ సౌఖ్యాలు అనుభవించి కూడా ఇంకా కాంక్షలు తీరక పట్టుకు వేళ్ళాడం ఏమిటన్న సిగ్గుతో తనలో తానే మథనపడి దశరథుడు కన్నుమూశాడు. రాముడు తిట్టి ఉంటే బహుశా దశరథుడు బ్రతికేవాడు అని చెప్పేవారు మా గురువుగారు.
పురాణాలు ప్రతీకాత్మకం (symbolic) అని చెబుతూ, కొన్ని ఘట్టాలకు చాలా గొప్ప వివరణ ఇచ్చేవారు. నేను ఒకసారి శివుడి వేషధారణ గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమిటీ తత్వం అని అడిగాను. దానికి, ఆయన ఎదురుగా ఉన్న ఒక మానసిక రోగిని చూపించి, అతనికి ఉన్న సమస్య అందరికీ సమానంగా తగులుకుంటే ఎట్లా ఉంటుందో ఊహించు, అన్నారు. దాన్ని ఇంకా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారు. సంఘంలో ఉన్న సమస్యలు అందరికీ సమానంగా పంచిపెట్టబడితే ఎవ్వరూ ఎందులోనూ ఔన్నత్యాన్ని సాధించక పోవచ్చు. అలా కాకుండా, ఆ సమస్యలు కొందరికే ఉంటే, మిగిలిన వాళ్ళు ఎక్కువ ప్రగతి సాధించగలరు. అంటే, ఆ కొందరు చేసే పని, శివుడు విషం తాగడం లాంటిది. అవతల మనిషి కష్టాలలో ఉన్నప్పుడు, అంటే ఏదో ఒక ఒత్తిడి (tension) లో ఉన్నప్పుడు, ఆ ఒత్తిడిని మీరు ఏదో విధంగా తీసేసుకుంటే, అది శివ తత్త్వాన్ని ఆచరించడంతో సమానం. క్షీరసాగర మథన వృత్తాంతములో విశ్వాన్ని విషం నుండి రక్షించడానికి శివుడు విషం త్రాగాడని చెప్పడం, దీనికే ప్రతీక అని చెప్పారు, మా గురువుగారు. క్షీర సాగర మథనం గురించి ఇంకొక వివరణ ఇచ్చేవారు, వారు. మనం ఏ కార్యం మొదలుపెట్టినా, ముందు వ్యతిరేక ఫలితాలు (విషం) వస్తాయి. నిరాశ పడకుండా, వాటిని సంయమనంతో నిర్వహిస్తే (manage), తరువాత మంచి ఫలితాలు (అమృతం) వస్తాయి అని చెప్పేవారు.
మా గురువుగారు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ పాదాలని తన నుదుటికి అద్దుకునేవారు. అదేమిటి, చిన్నవాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళకి ఆయుక్షీణం కాదా అని నేను అడిగాను. అప్పుడు, వామనావతార ఘట్టంతో దాన్ని అనుసంధించి నాకు వివరణ ఇచ్చారు. పెద్దవాళ్ళు ఏ స్థితిలో ఆలోచించడం మానేస్తారో చిన్న వాళ్ళు ఆ స్థితి నుండి ఆలోచించడం మొదలు పెడతారు. అది తెలిసిన పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళ ముందు తమ అహంకారం ప్రదర్శించడం, చేయరు. అది తెలియని బలిచక్రవర్తి లాంటి పెద్ద వాళ్ళని తరువాతి తరానికి చెందిన వామనుడి లాంటి వాళ్ళు పాతాళానికి తొక్కుతారు, అంటే, వాళ్ళ అహంకారాన్ని పోగొడతారు. నా తరువాతి తరం వాళ్ళు నాకన్నా బాగా ఆలోచించడం నేర్చుకుంటే వాళ్ళ ముందు నా అహంకారం వదిలి పెట్టడానికి నేను సిద్ధం, చిన్న పిల్లలలో నేను వామనుణ్ణి చూస్తాను, అని మా గురువుగారు చెప్పేవారు.
అందరితో పాటు చెప్పే చదువు కాక, నాకున్న శ్రద్ధను గుర్తించి మా గురువుగారు నాకు భగవద్గీత, మంత్రపుష్పం లాంటివి బట్టీ పట్టించేవారు. నాకు భగవద్గీత గురుకులం పద్ధతిలో నేర్పారు. అంటే, ఇవాళ ఒక శ్లోకం నేర్పాలంటే నిన్న నేర్పిన శ్లోకం అప్పచెప్పాలి. మర్నాడు ఇంకో శ్లోకం నేర్పాలంటే, మొన్న నేర్పినది నిన్న నేర్పినది అప్పజెప్పాలి. ఈ విధంగా సాగేది నా శిక్షణ. అలా, ఒక అధ్యాయంలోని ఆఖరి శ్లోకం చెప్పిన మర్నాడు ఆ అధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకాలు అప్పచెప్పాల్సి వచ్చేది. ఈ అభ్యాసం నా జ్ఞాపక శక్తి పెంపుదలకి చాలా ఉపయోగపడింది.
భగవద్గీత శ్లోకాలకి మా గురువుగారు చెప్పే వ్యాఖ్యానం చాలా వివరంగా భిన్నంగా ఉండేది. ఉదాహరణకి, ఆయనకి “యద్యదాచరతి శ్రేష్ఠః, తత్తదేవేతరో జనః, స యత్ప్రమాణం కురుతే, లోకస్తదనువర్తతే” అన్న శ్లోకం చాలా ఇష్టం. జీవితంలోను, సంఘంలోను ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు (శ్రేష్ఠులు) ఏ విధంగా నడుచుకుంటారో, మిగిలిన వాళ్ళు దాన్ని ఒక ప్రమాణంగా స్వీకరించి, ఆ విధంగా నడుచుకోవాలని చూస్తారు, అని దీని కర్థం. ఇలాంటి వ్యవస్థ ఒక రకంగా శ్రేష్ఠులుగా చూడబడే వాళ్ళకి అలాంటి స్థానంలో (position) ఉన్న వాళ్ళకి హెచ్చరిక, అని మా గురువు గారు చెప్పేవారు. మనకి తెలియకుండా చాలా కళ్ళు మనని శ్రద్ధగా చూస్తూ ఉంటాయి. అంటే, మనం మన పై తరం (generation) వాళ్ళ నుండి, మన నుండి మన తరువాతి తరం వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోవాలని చూస్తారు. అందుచేతనే, మనకి మన పై తరం వాళ్ళ కన్నా మన తరువాతి తరం వాళ్ళు ముఖ్యం. అలా, అడుగడుగునా ఎవరో ఒకరు మనని అనుసరించాలని చూస్తారు కనుక, మనం చాలా అప్రమత్తంగా (alert) ఉండాలి. ఎప్పటికప్పుడు, మన నడవడి గురించి ఆత్మపరిశీలన (introspection) చేసుకుని తప్పులుంటే దిద్దుకోవాలి. మన తరువాతి తరం వాళ్ళు మన నుండి ఏమీ చెడు నేర్చుకోకుండా జాగ్రత్త పడాలి. వివిధ సందర్భాలలో మనం నడుచుకునే తీరు, ఆయా సందర్భాలలో మన ప్రవర్తన (behaviour), మన తరువాతి తరం వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మనం తప్పుగా ప్రవర్తించినా, మాట్లాడాల్సిన విషయాల్లో మౌనం వహించినా, కర్ణుడు భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళకి పడినట్లు శిక్ష పడుతుంది అని చెప్పేవారు మా గురువు గారు.
మా గురువుగారు కావ్యాలలో ఉన్న మంచి మంచి పద్యాలు వ్యాఖ్యాన సహితంగా మాకు చెప్పేవారు. ఉదాహరణకి, ఆయనకి ఆంధ్ర మహాభారతం లోని “ఒరు లేయవి యొనరించిన..” అన్న పద్యము, “సారపు ధర్మమున్ విమల సత్యము..” అన్న పద్యము చాలా ఇష్టం. ఇతరులు మీకు ఏం చేస్తే, మీ పట్ల ఎలా ప్రవర్తిస్తే మీకు నచ్చదో, ఆ పని గాని ఆ ప్రవర్తన గాని ఇతరుల నుద్దేశించి మీరు చెయ్యకుండా ఉండడమే సత్ప్రవర్తన (ethics, good manners), మీకు మీ ప్రవర్తన మీద ఎప్పుడు సందేహం వచ్చినా, ఈ standard apply చేసుకుని చూడండి, అని చెప్పేవారు మా గురువుగారు. అన్యాయాన్ని ఎదిరించడంలో ఎప్పుడూ వెనకంజ వేయవద్దని “సారపు ధర్మమున్..” అన్న పద్యం సారాంశాన్ని బోధించేవారు.
జాతకాలు, దోషాలు, పరిష్కారాలు అన్న విషయం గురించి చెప్పేటప్పుడు, పురాణ కథలలోని ఉదాహరణలతో అవి అనవసరం అని చెప్పేవారు. బోలెడు వరాలు పొంది విర్రవీగిన వాళ్ళకి ఏ గతి పట్టిందీ తెలుసుకోండి, జరగ వలసిన వాటికి ఏదో పరిష్కారం ఎవరో చెప్పినంత మాత్రాన ఏమీ ఒరగదు అని చెప్పేవారు. “కష్టే ఫలి” అన్న దొక్కటే నమ్ముకోమని అనేవారు.
మా గురువుగారు మంచి కవి. నేను పుట్టక ముందు, వారు కామేశ్వరీ శతకం రచించారు. తరువాత కూడా కొన్ని శతకాలు రచించారు. నేను చదువుకునే రోజుల్లో కూడా ఆయన అప్పుడప్పుడు పద్యకవిత్వం చెప్పేవారు. సామాజిక సమస్యల మీద, విభిన్న రంగాలలో జరుగుతున్న అవకతవకలను గురించి పద్యాలు, శతకాల రూపంలో, అంటే ఆత్మాశ్రయ కవిత్వము ఎక్కువగా చెప్పేవారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం, అన్యాయాన్ని ఎదిరించడం మామూలుగా మాట్లాడేటప్పుడే కాకుండా పద్యాలలో కూడా చేసేవారు. ఆయన ఆశువుగా పద్యాలు చెబుతుంటే, నేను డిక్టేషన్ (dictation) వ్రాసేవాడిని. పద్యం వ్రాసేటప్పుడు ఛందస్సు సరిగ్గా ఉందో లేదో చూసుకుని, సరిగ్గా లేకపోతే ఆయనకి చెప్పాలి. ఆ క్రమంలో, ప్రతి వృత్తానికి ఉండే లయ (rhythm) నాకు నేర్పారు. ఒక పద్యం చెప్పేటప్పుడు, గణ విభజన చేస్తూ కూర్చోకుండా, లయకి అనుగుణంగా ట్యూన్ (tune)ని అనుసరిస్తూ పదాలు వెయ్యడం, యతిస్థానం దగ్గర ఆటోమాటిక్ (automatic) గా ఆపి యతి వేసుకోవడం నాకు నేర్పారు. ఈ విధంగా, నాకు పద్య నిర్మాణం, సాహిత్యాభిలాష అబ్బాయి. ఇప్పటికీ, ఆ శిక్షణే (training) నా చేత పద్యాలు వ్రాయిస్తోంది.
మా గురువుగారికి నాటకానుభవం ఉంది. రాగయుక్తంగా పద్యాలు పాడడం వారికి వచ్చు. గయోపాఖ్యానం లోని “ధరణీ గర్భము దూరు గాక” అన్న పద్యం వారు పాడుతుంటే చాలా శ్రావ్యంగాను, గంభీరంగాను, ప్రక్క ఊరికి వినబడే అంత బిగ్గరగాను ఉండేది. ఆయనకి ఈలపాట రఘురామయ్య గారంటే చాలా ఇష్టం. వారు పద్యం ఆలాపించే పద్ధతి, once more అని ప్రేక్షకులడిగితే రాగం మార్చి పద్యం ఎలా పాడేవారో మాకు పాడి వినిపించేవారు, మా గురువుగారు. గుడివాడలోని గురురాజు హోమియో కళాశాల స్థాపకులలో (founders) మా గురువు గారు ఒకరు. దానికి కావలసిన ధనం కోసం, ‘కన్యాశుల్కం’ నాటకం వేశారు. అందులో మథురవాణి పాత్రని స్థానం నరసింహారావుగారు, అగ్నిహోత్రావధానులు పాత్రని మా గురువు గారు వేశారు. మా గురువు గారికి రాగతాళ జ్ఞానం ఉన్నాయి. కొన్ని కీర్తనలు స్వయంగా రచించి, వాటికి సంగీతం సమకూర్చి, భజనలుగా గుళ్ళో తాను పాడి మా చేత పాడించేవారు. అవి కాక, రామదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, తరంగాలు కూడా గుళ్ళో ఆయనతో పాటు మేము కూడా పాడే వాళ్ళం. ఆ విధంగా మాకు కొంచెం భక్తి, కొంచెం సంగీతం, కొంచెం లయజ్ఞానం, అన్నిటికీ మించి సామూహిక కార్యక్రమాలలో పాల్గొనే ఉత్సాహం, అబ్బాయి.
మా గురువుగారు మంచి హోమియో వైద్యుడు. చిన్న చిన్న దెబ్బలకి కట్టుకట్టడం, సామాన్య ఆరోగ్య సమస్యలకి ఏ మందులు వాడాలో నాకు నేర్పారు. చిరువోలులోను, ఆ చుట్టుపక్కల గ్రామాలలోను ఉన్న జనాలకి దాదాపుగా ఉచిత వైద్యం చేసేవారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలకి ఆరోగ్య సమస్యలకి మంచి వైద్యం చేసేవారని బాగా ప్రసిద్ధి. ఆయన సేవాభావం, రోగులపై ఆయన చూపించే కరుణ, ఓర్పు నాకు చాలా పాఠాలు నేర్పింది.
క్రొత్త విషయాలు, క్రొత్త భాషలు నేర్చుకోవడం మీద ఆయన కున్న జిజ్ఞాస మాకు అనుసరించదగినది. ఆయన తన స్వయంకృషితో నేర్చుకున్న తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలు, హోమియో వైద్యము, కొంచెం సంగీతం, కొంచెం తాళ జ్ఞానంతో పాటు, వయసు మీరిన తరువాత రష్యను, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు. ఆయన చదివింది మెట్రికే అయినా, ఆయన మాట్లాడే ఇంగ్లీషు భాష చాలా పై స్థాయిలో ఉండేది. BA, MA విద్యార్థులకి కూడా ఇంగ్లీషు బోధించగలిగే స్థాయిలో వారి జ్ఞానం ఉండేది. నేను దాని వల్ల చాలా లాభం పొందాను.
మా గురువు గారు సామాజిక బాధ్యతలని (social responsibility) నిర్వహించే పద్ధతి వాటిల్లో పాలుపంచుకోవడానికి మాకు అవకాశం కలిగించిన తీరు చాలా ముఖ్యమైనది. సంఘానికి పనికొచ్చే పనులు చెయ్యడంలో మా గురువుగారు ఎప్పుడూ ముందుండేవారు. చిరువోలు గ్రామంలో ఒక గుడి, ఒక బడి కట్టించారు. వాటి నిర్మాణంలో తన విద్యార్థులు పాల్గొనేటట్లుగా చేశారు. బడిలో పిల్లలు కూర్చోడానికి నేల బల్లలు (పొడుగాటి పీటలు), మాష్టారికి కుర్చీ, మేజా (table) ఆ రోజుల్లో విద్యార్థులే తయారు చేశారు. అప్పటి నేల బల్లలు ఇప్పటికీ వాడుతున్నారు ఆ బడిలో.
గుడిలో మొక్కలు పెంచడం, కొబ్బరి మొక్కలకి ప్రత్యేక సేవ (అంటే, ప్రతి ఆదివారం ఒక్కొక్క మొక్కకి పెద్దగా పాదు తవ్వి అందులో రక్కెస తాటాకులు కొట్టి వెయ్యడం, మొవ్వులో కప్పలు రాకుండా ఉప్పు మూట పెట్టడం, వంద కడవలు నీళ్ళు పొయ్యడం) చేసే వాళ్ళం. వేసం కాలంలో చెరువులోను పంట కాలువలోను పూడిక తీయించే వారు. తొలకరి వాన మొదలయితే, ఇద్దరిద్దరు పిల్లలని జట్లుగా చేసి, కంచెలలోనూ, ఇవతలా ఒకడు పలుగుతో గాత వెయ్యడం రెండవ వాడు గింజలు పాతడం, చేయించేవారు. కంచెల్లో కర్రతుమ్మ (poor man’s fuel) విత్తనాలు నాటించేవారు. వానలో తడవాలన్న మా ఇష్టాన్ని ఈ విధంగా పనికొచ్చేటట్లుగా చేసేవారు, మా గురువు గారు.
సంఘానికి మనం చేసింది చేయంది ఏమిటని ఆలోచించక పోగా వేరే వాళ్ళ తప్పొప్పులు ఎంచడం, మన వరకు మనం ఏం చేసినా అది సబబే అనుకోవడం, అందులో అవినీతి ఉన్నా అది పరిస్థితుల ప్రభావం అని సరిపెట్టుకోవడం, అంతకు మించి ఎవరైనా చేస్తే అది మాత్రమే తప్పనడం – ఇలాంటి వన్నీ నిశితంగా ఖండించేవారు మా గురువుగారు. చేసే ప్రతి పనీ మన సంఘానికి, ముఖ్యంగా ముందు తరాల వారికి, పనికొస్తుందా అని చూడడం, అన్ని విషయాలలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని చెప్పేవారు. సాంఘిక జీవనం లోను లక్ష్యం నిర్దేశించుకోవడం లోను సప్త సంతానాల ప్రాశస్త్యం గురించి చెప్పేవారు మా గురువుగారు. ఆ ఏడు సంతానాలు ఏమిటంటే, తమకు పుట్టిన సంతానం, తాము వ్రాసిన కృతి, తాము తవ్వించిన చెరువు, తాము కట్టించిన దేవాలయం మొదలైనవి. మనిషి మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉండడానికి ఈ సంతానాలే కారణం. జీవిత గమనంలో సప్త సంతానాల మీద దృష్టిని పెట్టి సాధించడమే సామాజిక బాధ్యతను (social responsibility) నిర్వర్తించడం అవుతుంది, అని చెప్పేవారు మా గురువుగారు.
పండుగలు (శ్రీరామ నవమి, దీపావళి లాంటివి) సామూహికంగా అన్ని కులాల వారు కలిసి గుడి ప్రాంగణంలో జరుపుకునేటట్లు చేశారు మా గురువు గారు. బంతి భోజనాలు కూడా ఉండేవి. దసరా పండగకి మా పిల్ల లందరం కలిసి మా గురువు గారితో ఊరేగింపుగా వెళ్ళే వాళ్ళం. “ధర సింహాసనమై..” మొదలైన పద్యాలు, “..అయ్య వారికి చాలు ఐదు వరహాలు, పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు,..” మొదలైన గేయాలు పాడేవాళ్ళం ఊరేగింపులో. అది వెనుకటి గురుకుల వ్యవస్థ నాటి కాలంలో ఉన్న సామాజిక బాధ్యతను (గురుకులం ఖర్చు సమాజం భరించడం, గురువులు సంపాదన కోసం వేరే మార్గాలు వెతక వలసిన అవసరం కలిగించక పోవడం) గుర్తు చేసేది.
ఊళ్ళో ఏమన్నా తగువు లొస్తే మా గురువుగారిని న్యాయం చెప్పమని పిలిచేవారు. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి రెండు పక్షాలలో ఒక పక్షం బంధు వర్గం నుండి ఉండేవారు. అయినా సరే మా గురువు గారు, తన-మన చూసుకోకుండా న్యాయం నిష్పాక్షికంగా నిర్భయంగా చెప్పేవారు. తప్పు చేసిన వాళ్ళని దండించడం కన్నా సంస్కరించాలని ఎక్కువగా చూసేవారు. ఒక సారి మా ఇంట్లో ధాన్యం దొంగతనం జరిగితే, ఆ దొంగలని చాకచక్యంగా పట్టుకొని, వాళ్ళు నిరక్షరాస్యులు బీదవాళ్ళు అని తెలుసుకొని, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం రిక్షాలు కొని ఇచ్చారు. అంతటి కరుణామూర్తి ఆయన.
మా గురువు గారు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. అప్పట్లో కృష్ణా జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఘట్టాలలో వారు పాలుపంచుకున్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ సంఘటనలు మాకు పూస గుచ్చినట్లు చెప్పేవారు. స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన పింఛను (pension), భూమి లాంటి సదుపాయాలేవీ వారు స్వీకరించ లేదు. అంతటి విరాగి ఆయన. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సామాజిక రాజకీయ సమస్యల మీద తన సూచనలు ప్రధాన మంత్రికి, ముఖ్య మంత్రికి, ప్రాంతీయ స్థాయిలో సంబంధిత అధికారులకి, లిఖితపూర్వకంగా పంపేవారు. వాటిల్లో కొన్ని ఆచరణలో పెట్టబడ్డాయి. ఉదాహరణకి, విద్యార్థుల చేత తాను చేయించే శ్రమదానం, రాష్ట్రవ్యాప్తంగా సంఘానికి కావలసిన పనులు చేయడానికి అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు చేస్తే, అందుకు అర్థికపరమైన పాలనాపరమైన ఆసరా ప్రభుత్వం ఇస్తే, చాలా మంచి జరుగుతుందని భావించి ఆ విధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు.
దేశభక్తి అణువణువునా మూర్తీభవించిన మా గురువు గారు, మాకు దేశభక్తి గీతాలు నేర్పడమే కాకుండా, రేడియోలో ‘వందే మాతరం’, ‘జనగణమన’ గీతాలు వినబడితే గౌరవంగా లేచి నిలబడాలని చెప్పేవారు. 1965వ సంవత్సరంలో పాకిస్తానుతో యుద్ధం వచ్చినప్పుడు దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పూట పస్తులుండాలని దేశ ప్రజలకి చేసిన విజ్ఞప్తిని తూచా తప్పకుండా మా ఇంట్లో పాటించేటట్లు చూశారు మా గురువు గారు. మా కళ్ళ ఎదురుగా బాల్యంలో జరిగిన ఈ సంఘటనలు మాలో దేశభక్తిని, సంఘం పట్ల బాధ్యతగా ఉండాలన్న సందేశాన్ని నింపాయి.
ఒక మనిషి తనని ధనం, విద్య, ఆస్తి, పొజిషన్ (position) లాంటి విషయాల్లో ఇంకోళ్ళతో పోల్చుకోవడం సరియైన పద్ధతి కాదని, మా గురువుగారు పోటీ (competition) అంటే ఏమిటో చెప్పారు. ఒక మనిషి తన కోసం తనే పెట్టుకున్న కొన్ని విలువలు, ప్రమాణాలు, ధ్యేయాల ననుసరించి, ప్రతి రోజూ ఆ ముందు రోజు కన్నా మెరుగ్గా ఉండటానికి ఏమేం చేయాలో, అవన్నీ చేయాలి. ఇలా చేస్తూ ఉన్న పక్షంలో కొన్ని కొన్ని సార్లు, మొన్నటి తన కన్నా నిన్నటి తాను ఓటమి పాలు అవచ్చు. కొంచెం కటువుగా చెప్పాలంటే, తన దృష్టిలో తానే దిగజారడం, జరగచ్చు. దాన్ని పట్టించుకోకుండా, నిన్నటి తన కన్నా ఇవాల్టి తనని సరియైన దారిలో పెట్టడం ఎలాగ అన్న దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు, మొన్న- నిన్నల మధ్యన జరిగిన పోటీ మర్చిపోయి, నిన్న- ఇవాళల మధ్య ఉన్న పోటీలో గెలవడానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన కాంపిటీషను అని మా గురువుగారు చెప్పేవారు.
నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Union Public Service Commission) నిర్వహించిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (Indian Statistical Service) 1982 పరీక్షలో దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సంపాదించి సర్వీసులో చేరిన తరువాత, నవంబరు 1982లో ఆఖరి సారిగా వారు నాకు వ్రాసిన ఉత్తరంలో నాకు బోధించిన దాన్లో ఒక చిన్న భాగం క్రింద ఇస్తున్నాను:
“Stand like a mighty rock facing all tough and rough weather, making your way boldly through the path of life. Uphold and bring success to the needy, kicking the greedy in its face. I think you will not hesitate nor be afraid of putting down the culprit even though he may belong to higher cadre and treat kindly and tenderly the weaknesses of subordinates, but only with a severe threatening (warning).”
నా లాంటి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవ్యాజమైన ప్రేమతో అంకిత భావంతో అవిరళ కృషి చేసి మా జీవితాల మీద చెరగని ముద్ర వేసిన మా గురువు గారికి, వారు నేర్పిన విద్యతోనే అక్షరాక్షతలు క్రింది పద్యాలతో సమర్పిస్తున్నాను:
ఉ.
విద్యలు నేర్పి శిష్యులను విజ్ఞుల జేయుటె వృత్తి, హోమియో
వైద్యము జేసి బీదలకు బాధలు తీర్చుటె సేవ, ధాటిగా
పద్యములందు వ్యాసముల భాషణలం దవినీతి నేకుటల్,
సేద్యము, దైవభక్తి, కడు చిత్రపు భాష్యములన్ పురాణముల్
హృద్యముగా వచించుటయు, రేవగలున్ జన భవ్యమే జపం
బుద్యమమై తలిర్చిన గురూత్తముడున్, బహు త్యాగశీలి, సౌ
హృద్యము రూపుగొన్న ఘనుడే చిరువోలు ప్రసాదరావగున్.
(అన్ని రకాల చదువులు నేర్పి శిష్యులను సమర్థులుగా చేయడమే వృత్తిగా, హోమియో వైద్యము చేసి పేదవాళ్ళ బాధలు తీర్చడమే సేవగా, తన పద్యాలలో వ్యాసాలలో మాటలలో ధాటిగా అవినీతిని తూర్పారబట్టడం, వ్యవసాయము, దైవభక్తి, పురాణాలకి అతి మనోహరమైన వ్యాఖ్యానము చెప్పడం, అహోరాత్రము జనశ్రేయస్సే జపంగా ఉద్యమంగా విలసిల్లిన గురూత్తముడు, గొప్ప త్యాగశీలి, స్నేహము మూర్తీభవించిన మహనీయుడే, మా గురువుగారైన కీర్తిశేషులు శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారవుతారు.)
~
కం.
తన వారని, పెర వారని,
మనమున భేదంబు లేక, మసలిన మహితా
త్ముని, నా గురువును, మది తల
తు నెపుడు, యహమును, మమత్వ ధోరణి వీడన్.
(అహంకారాన్ని, మమత్వాన్ని విడిచిపెట్టడానికి, తనవారు, అన్యులు అన్న భేదం మనస్సులో లేకుండా నడయాడిన నా గురువును ఎప్పుడూ మనసులో తలుచుకుంటాను.)
~
సీ.
అన్యాయ మన్నది యణు మాత్రమైనను
యెదురు బెదురు లేక యెగయు చేయి,
పాండితీ విభవమ్ము పక్కదోవలు పట్ట
కంటకమ్ముల తుంచి కాచు చేయి,
సత్కార్యములు చేయు సన్మార్గు లందర
నొక తాటిపై తెచ్చి యొడియు చేయి,
భిన్నత్వ మందున యేకత్వ ముందంచు
సమతా నినాదంబు సలుపు చేయి,
తే. గీ.
నాకు మార్గదర్శకముగ, నాకు నండ
దండ, నాకు నన్ని విధాల ధైర్య మొసగి
తీర్చి దిద్దిన ఘనమైన తీరు జూడ,
గుర్తు కుచ్చెను, యదియె నా గురువు చేయి.
(అన్యాయం కొంచెమైనా ఎదురు బెదురు లేకుండా పైకి లేచే చేయి, పాండిత్య సంపద పనికిరాకుండా పక్కదోవలు పట్టినప్పుడు ఆటంకంగా వున్న ముళ్ళు తొలగించి రక్షించే చేయి, మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో నడిచే వాళ్ళని ఒకే తాటి పైకి తెచ్చే చేయి, భిన్నత్వంలో ఏకత్వమున్నదను సమతా నినాదాన్ని చేసే చేయి, నాకు దారి చూపుచు, నాకు అండదండ, నాకు అన్ని విధాల ధైర్యమిచ్చి తీర్చిదిద్దిన ఆ గొప్ప తీరు చూస్తుంటే గుర్తు కొచ్చింది, అదే నా గురువు చేయి.)
~
కం.
భగవద్గీతా పఠనము
సుగమంబుగ స్మరణ పెంచు సొబగగు కవితల్
జగతికి చెందిన జ్ఞానము
ఒగి బోధన జేసి నట్టి గురువుకు ప్రణతుల్.
(భగవద్గీత చదవడం, తేలికగా జ్ఞాపకశక్తిని పెంచే అందమైన కవిత్వం, లోకజ్ఞానము, యథాక్రమముగా బోధించిన గురువుకు నమస్కారాలు.)
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.