[రేవిణిపాటి రమాదేవి గారి ‘నా కథతో నేను’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
నా మనసులో ఉన్న మాటకు రూపకల్పన చేసి కథగా రాశాను.
తప్పా అండి మీరే చెప్పండి పాఠక లోకం?
బాధ్యతలు తీరిపోయాయి. ఇద్దరు కొడుకులు కోడళ్ళు, పిల్లలు, ఇద్దరు కూతుళ్లు అల్లుళ్లు పిల్లలు అందరూ ఎవరి పనులలో వారు. నాకు ఎక్కువగా పని లేదు.
మా వారు ఫోటో లోంచి గుడ్లు పెద్దవిగా చేసుకుని ఉరిమి చూస్తూ ‘పనిలేని మంగలాడు పిలిచి తల గొరిగగేడట. నీకు ఖాళీ సమయం ఉందని అవాకులు చవాకులు రాస్తావా? నన్ను అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నీకు మరో మొగుడు కావాల్సి వచ్చిందా? సిగ్గులేని దానా నా పరువు తీసేవు కదుటే’ అంటున్నట్టు అనిపిస్తోంది.
విన్నారు కదా, మీరే చెప్పండి. మంచినీ చెడును పంచుకోడానికి ఆప్తులు అంటూ ఉండాలి కదండి?
నాకు కూడా బాధలు మంచి చెడు ఉంటాయి కదా.
చర్చించుకుని మాట్లాడుకోడానికి ఒక తోడు కావాలని అనుకోవడం తప్పా?
నేను రాసానండి కథ.
అది ఒక కథండి.
నేను నిజంగా కావాలనుకోవడం లేదు.
అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా?
కథగా రాసేను ఆ కథ పబ్లిష్ అయితే కోడళ్ళు అల్లుళ్ళు కిసుక్కున నవ్విపోతారు.
కొడుకులు కూతుళ్లు అమ్మకి ఈ ఏజ్‌లో ఏమిటీ వికారాలు అని ఆశ్చర్యపోతారు.
పని మనుషులు పెద్దమ్మ గారికి ఇదేం పోయేకాలం అనుకుంటారు
పిల్లలా పెద్దవాళ్ళు అయిపోయారు. నా సమస్యలు విన్నవించుకోవడానికి ఒక తోడు కావాలి కదా
అలా అని మేము స్నేహితులమే అంటే లోకం ఒప్పుకోదు కదా పాడు లోకం!
అందుకు ఒకరికి ఒకరు తోడుగా పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పా అండి?
అదిగో మా ఆయన ఫోటోలో నుంచి ఎలా చూస్తున్నారో?
నేను కాదయ్యా బాబూ, దెయ్యం గుడ్లులా గుడ్లు పెట్టుకొని చూస్తారెందుకు?
పిల్లలు ‘మా అమ్మ చెప్పింది మామ్మకి కొత్త తాతయ్య వస్తాడట బాగుంది కదురా. ఫొటోలో వున్న ఆ తాతయ్యాలా కాకుండా మంచిగా కథలు చెప్తూ అన్నిచోట్లకు సరదాగా తిప్పుతూ జ్యూసులు ఇప్పిస్తూ వుంటే బాగుంటుంది కదా’ అనుకుంటున్నారు.
‘చూడరా ఫొటోలోంచి తాతయ్య గుర్రుగా ఎలా చూస్తున్నాడో కొడతాడురా పదండి పోదాము’ అనుకుంటారు.
ఇదేమి కర్మరా బాబూ. నమ్మరేమిటి అందరూ.
అందరూ నమ్మాలి.
అయ్యో నా చాదస్తం కానీ వీరందరి మెప్పు కావాలా కథ రాయడానికి?
నాకు స్వతంత్రం లేదా? నేను ఇలాగే భయపడుతూ బతకాలా చెప్పండి మీరు?
నా మనసులోని మాట కథగా రాయవద్దా? ఏమి చేయాలండి?
ఏమిటో నా జీవితం? చదువుకున్నాను. టీచర్‌గా పని చేశాను. నలుగురు బిడ్డల్ని కన్నాను పెంచి పెద్ద చేశాను.
ఏమిటో ఈ కర్మ. కథ రాయడానికి కూడా అందరి సలహాలు కావాల్సి వస్తోంది.
ఏం చేస్తానని మరి?
అలాంటి కథలు రాయను.
ఇంక మా ఆయన ఫోటో చూడొచ్చు.
రేవిణిపాటి రమాదేవి గారి జన్మ స్థలం బరంపురం, ఒడిశా. పెరిగింది చదివింది ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళంలో కాలేజీ చదువు. తరువాత మెట్టినిల్లు బీహార్. ఇప్పటి ఝార్ఖండ్ లోని జెంషెడ్‌పూర్‌లో నివాసము. కథలు, వ్యాసాలు, కవితలు రాస్తు వుంటారు. రెండు సాంఘిక నవలలు, సుందరకాండము అను పౌరాణిక కావ్యము రచించారు. హిందీ నుండి తెలుగులోకి అనువాదాలు చేశారు. ప్రస్తుతం బొంబాయిలో వుంటున్నారు.
