[శ్రీ వేముల శ్రీమాన్ రచించిన ‘నా కోసం..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నా కోసం నేను
ఒక్కరోజైనా జీవించాలనివుంది
ఎవరి కోసం కాదు
ఎవరో, ఏమనుకుంటారో అన్న భయంతో కాదు
ప్రపంచం పెట్టిన కొలతల్లో, నన్ను నేను ఇముడ్చుకోకుండా
నాకు నచ్చినట్టుగా.. నన్నుగా
నా చేతులతో కలిపిన టీ పొడి పరిమళంతో, చేసుకున్న కప్పు టీని
నెమ్మదిగా, ప్రశాంతంగా ఆస్వాదించాలనుంది.
ఆ కప్పులో
నా అలసటనంతా కరిగించుకుని,
నా మనసుకు నేనే తోడుగా ఉండాలనుంది.
నాకు నచ్చిన దుస్తులు ధరించాలి.
అవి ఎవరికైనా నచ్చుతాయా?
ఎవరు ఏమనుకుంటారు?
అన్న ప్రశ్నలకు
ఆ రోజైనా తలుపులు మూయాలి.
ఎలాంటి ఆర్భాటం లేని
నాకు నచ్చిన చెప్పులు వేసుకుని,
ఎవరినీ అనుకరించకుండా,
ఎవరి చూపులనూ లెక్కచేయకుండా,
నా అడుగులకు నేనే దారి చూపిస్తూ
నా సహజమైన నడకలో నడవాలనుంది.
నన్ను నేను దాచుకోకుండా,
నా సహజత్వాన్ని, సిగ్గుపడకుండా,
ఎలాంటి ముసుగూ లేకుండా
అందరితో కలిసిపోవాలనుంది.
మనసులో ఒకటి పెట్టుకుని
మాటల్లో మరొకటి చెప్పే
ఆ భేషజం వద్దు.
నచ్చితే నచ్చిందని,
నచ్చకపోతే నచ్చలేదని,
మాటను తిప్పకుండా,
మొహమాటపు అంచుల దగ్గర ఆగకుండా,
ముక్కుసూటిగా మాట్లాడాలనుంది.
ఇష్టం లేని పనులకు
‘అవును’ అని తల ఊపడం మానేయాలి.
మనసు వద్దన్న చోట
నా అడుగులు ఆపేయాలి.
నాకు నచ్చిన పనులు చేయాలి.
నా మనసు పిలిచిన దారిలో నడవాలి.
ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా,
ఎవరూ మెచ్చుకోకపోయినా –
నాకు నచ్చిందనే ఒక్క కారణంతో
ఏదో ఒకటి చేయాలనుంది.
నా ఆలోచనలకు
ఎవరి అనుమతీ అవసరం లేని రోజు కావాలి.
నా అభిప్రాయాలను
భయపడకుండా,
దాచకుండా,
నిర్భయంగా.. నిర్మొహమాటంగా
చెప్పాలనుంది.
ఎప్పుడూ అందరి అంచనాలకు
తగినట్టుగా మారుతూ,
అందరి మనసులను గెలవాలని చూస్తూ,
నన్ను నేను నెమ్మదిగా కోల్పోతున్న
ఈ ప్రయాణానికి
ఒక్కరోజైనా విరామం కావాలి.
ఒత్తిళ్లు లేని రోజు కావాలి.
అంచనాలు లేని రోజు కావాలి.
ఎవరి తీర్పులూ లేని రోజు కావాలి.
ఒక్కరోజు..
నాకు నేనుగా బతకాలనుంది.
మొహమాటం అనే ముసుగును
మెల్లగా తొలగించాలి.
భేషజాలన్నింటినీ
ఒక్కొక్కటిగా వదిలేయాలి.
ప్రపంచం ముందు కాదు –
నా ముందు
నిజంగా నేను నిలబడాలి.
