[పాణ్యం నాగార్జున గారు రచించిన ‘నా కోవెలకుంట్ల ధరిత్రి’ అనే పుస్తక సమీక్షని అందిస్తున్నాము.]
అక్క, జర్నలిస్టు, రచయిత్రి నంద్యాల సుధామణి రాసిన కవిత ‘నా నేల – నా మనుషులు’ – తనలో కలిగించిన జ్ఞాపకాల వెల్లువ ఫలితంగా, పాణ్యం నాగార్జున రచించిన వ్యాసాల పుస్తకం రూపం ‘నా కోవెలకుంట్ల ధరిత్రి’ అన్న పుస్తకం.
‘నా కోవెలకుంట్ల ధరిత్రి’ ఒక విశిష్టమైన పుస్తకం. ఈ పుస్తకంలో రచయిత ‘కోవెలకుంట్ల’ ప్రాంత చరిత్ర, విశేషాలు, ప్రముఖుల విశేషాలు పొందుపరచటంతో ఆగలేదు. అక్కడి ప్రజల జీవన విధానం, గ్రామ దేవతలు, సంతలు, పండుగలు, పెళ్ళి పిలుపులు, పెళ్ళిళ్ళు జరిగే విధానం, రైతుల ఇండ్లు, వారు వ్యవసాయం చేసే విధానం, వైద్యులు, వైద్యశాలలు, పాఠశాలలు, గ్రంథాలయాలు, కోవెలకుంట్లను దర్శించిన మహనీయులు.. ఇలా ఈ పుస్తకాన్ని కోవెలకుంట్ల విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దారు. వీటికి తోడుగా కోవెలకుంట్లలో జరిగిన ప్రధాన సంఘటనలు, వర్షాల కోసం అక్కడి ప్రజలు పడే పాట్లు, వర్షం కోసం వారు చేసే పూజలు, క్రీడా మైదానాల వివరాలు, సినిమా హాళ్ళు, చర్చిలు వంటి వివరాలతో పాటు కోవెలకుంట్ల సమాజంలో ఉన్న పలువురి జ్ఞాపకాలు, అనుబంధాలనూ పొందుపరిచారీ పుస్తకంలో.
పుస్తకానికి ముందుమాటలో ప్రముఖ అవధాన కవి, కోవెలకుంట్ల అల్లుడు, డా. నరాల రామారెడ్డి ‘పుట్టిన ఊరు మీద పట్టెడు ప్రేమ పెంచుకుని మాతృభూమి మీద మమకారం పంచుకుని తాను పొందిన అనుభవ సంపుటిని అక్షర రూపంలో ఆవిష్కరించడానికి పూనుకుని అనితర సాధ్యంగా ‘నా కోవెలకుంట్ల ధరిత్రి’ అనే 450 పేజీల పుస్తకాన్ని ప్రచురించి జన్మస్థల ఋణం తీర్చుకుంటున్న’ రచయితను ఆయన అభినందించారు.
మరో ముందుమాట రాసిన కొప్పర్తి వెంకటరమణ మూర్తి ‘సామాన్య ప్రజలే చరిత్ర నిర్మాతలనే అభివ్యక్తికి వాస్తవ వ్యక్తీకరణ జరుగుతున్న కాలంలో నాగార్జున, కోవెలకుంట్ల పట్టణానికీ, పరిసర ప్రాంతాలకీ చెందిన దాదాపు యాభై ఏళ్ళ పరిణామాలను, కొన్ని చారిత్రిక ఆధారాల నుంచి, మరికొన్నింటిని ప్రజల జ్ఞాపకాల నుంచి సేకరించి తన జ్ఞాపకాలతో అనుభవాలతో జోడించి నిక్షిప్తం చేస్తున్నాడీ పుస్తకంలో. ఈ ప్రయత్నంలో నాగార్జున తన ప్రాంతపు oral history ని written history గా మారుస్తున్నాడ’ని ప్రశంసించారు.
శ్రీశైలం అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, ఈ పుస్తకం తన జ్ఞాపకాలను తట్టి లేపిందని రాస్తూ, ‘ఈ పుస్తకంలో కోవెలకుంట్ల లోని పాండురంగస్వామి దేవస్థానం విశేషాలతో మొదలై అప్పటి ప్రాంత చరిత్ర, అక్కడి ఊరి పేర్లు ఎలా వచ్చాయి అనే విశేషాలు చదువుతుంటే ఆసక్తికరంగా ఉంద’న్నారు.
పుస్తకం ఆరంభం నుంచీ ఆసక్తికరంగా సాగుతుంది. ‘కోయిల’ అను మహిళ సహాయంతో ‘కుంట’ (చెరువు)లో లభించిన సాలగ్రామాన్ని ప్రతిష్థించి, దేవాలయాన్ని నిర్మించినందుకే ఈ గ్రామం ‘కోయిలకుంట్ల’ గా వ్యవహరించబడింది. ఆ తర్వాత ‘కోవెలకుంట్ల’గా మారింది అని వివరిస్తారు, ‘కోవెలకుంట్ల’కు ఆ పేరెలా వచ్చిందో చెబుతూ. పుస్తకం ఆరంభంలోనే పాండురంగస్వామి దేవస్థానం గురించి సంపూర్ణ వివరాలు, ఆసక్తికరమైన సంఘటనలు అందించారు. ఇక్కడి నుంచి ‘కోవెలకుంట్ల’కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్షరాలలో కోవెలకుంట్ల దర్శనం కావిస్తారు.
కోవెలకుంట్లకు చెందిన ప్రముఖుల వివరాలు ఈ పుస్తకానికి హైలైట్. కోవెలకుంట్ల దేవాలయల వివరాలిస్తూ మత సామరస్యానికి ప్రతీక అయిన ‘నూర్షా వలీ’ గురించి చక్కగా రాశారు. ఓ వైపు శివలింగం, మరో వైపు నూర్షా వలీ సమాధి ఉండడం, శివరాత్రి రోజు నూర్షా వలీ ఉర్సు జరిగినా ఎలాంటి ఉద్విగ్నతలు లేకపోవడం వివరిస్తారు.
ఈ పుస్తకాన్ని ఖరీదైన గ్లాసీ కాగితంపై అందమైన రంగుల బొమ్మలతో ముద్రించారు. ముఖచిత్రం చాలా అందంగా ఉంది. కోవెలకుంట్లకు చెందినవారే కాదు, ఇతరులు కూడా కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం ఇది. ఇందుకు పాణ్యం నాగార్జునకు అభినందనలు. ఈ పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు రాష్ట్రాలలలోను ఇలాంటి స్థానిక చరిత్రను, జీవన విధానాన్ని, అక్కడి సామాజిక, ఆర్థిక, ధార్మిక జీవన విధానాలకి సంబంధించిన పుస్తకాలను రూపొందిస్తే, మరుగున పడిన అనేక స్థానిక చరిత్ర అంశాలు వెలికివస్తాయి. ఇవన్నీ కలిపి సమగ్ర చరిత్ర రూపొందించే వీలూ లభిస్తుంది.
***
రచన: పాణ్యం నాగార్జున
పేజీలు: 452
వెల: ₹ 400/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. 500027.
ఫోన్: 9000413413
~
రచయిత
బ్లాక్-1, ఫ్లాట్-2
MIG (04)
బాగ్ లింగంపల్లి,
హైదరాబాద్-500044.
ఫోన్ 9246272581
~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/na-kovelakuntla-dharithri-maavoori-gnapakalu

