[ప్రముఖ రచయిత శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ గారు రచించిన ‘నా మొదటి నేస్తం.. మా అమ్మ’ అనే నవలను కొత్త ధారావాహికగా అందిస్తున్నాము.]
3
ఇంతకూ మా అమ్మ పేరు మీకు చెప్పలేదు కదూ! అమ్మ పేరు కె. కామాక్షి బాయి. కె అంటే కానుగో. నాన్న పేరు సి. నారాయణరావు. సి అంటే చిత్తూరు. పెళ్ళయ్యాక మా అమ్మ పేరు సి.కామాక్షి బాయి అయింది. అమ్మ పుట్టిల్లు నెల్లూరు. అమ్మ తన తల్లి తండ్రులకు ఏకైక కూతురు. మా తాతగారు రంగనాథరావు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. రిటైర్ అయిన తర్వాత నేరేడుపల్లెలో పొలాలు చూసుకునేవారు. అమ్మమ్మ పేరు త్రిపుర సుందరి. అందరూ ‘అమ్మణ్ణి’ అని పిలిచేవారు. పిల్లలు పుట్టి పోతూంటే మా తాతగారు, అమ్మమ్మ- తర్వాత పుట్టబోయే బిడ్డ బ్రతకాలని జొన్నవాడ కామాక్షమ్మను మ్రొక్కుకుంటే మా అమ్మ పుట్టి బ్రతికింది. అందువల్ల మా అమ్మకు అమ్మవారి పేరు పెట్టారు.
నాకు ఊహ తెలిసినప్పటికి మేము అయిదు కుటుంబాలు కలసి గిరింపేట బజారు వీధిలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. మా పెదనాన్న కీ.శే.రాజారావుగారు (ఈయన గిరింపేట మణేగారుగా (వి.ఎమ్) పనిచేసి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మా తాత కీ.శే.శ్యామరావుగారు కూడా గిరింపేట మణేగారుగా పనిచేశారట), ఆయన భార్య, వారి అయిదుమంది కుమార్తెలు, మా మేనత్త, ఆవిడ భర్త, వారి నలుగురు పిల్లలు, మా నాన్న కుటుంబం ఆరుమందిమి (అప్పటికి మా చెల్లెలు పుట్టలేదు), మా చిన్నాన్న కీ.శే.కృష్ణమూర్తిరావు (ఈయనకు అప్పటికి పెళ్ళికాలేదు. గిరింపేట మణేగారుగా పనిచేసేవారు).. ఇలా ఇరవై మంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళము. ఇంకో చిన్నాన్న కీ.శే.శ్రీనివాసరావు మిలిటరీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆయన అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండేవారు.
కొన్నేళ్ల తర్వాత మా నాన్న ఆ ఇంటినుంచి బయటికి వచ్చి క్రొత్త సంసారం మొదలుపెట్టాలనుకున్నారు. నాన్న అమ్మనీ, నన్నూ పిలుచుకెళ్ళి ఇల్లు చూపించారు. చాలా పెద్ద ఇల్లు అది. ఇరవై అయిదు రూపాయలు ఆ ఇంటి బాడుగ. గిరింపేటలోని దుర్గమ్మ గుడి ఎదురుగా ఆ ఇల్లు ఉండేది.
మరుసటిరోజు ఉదయం పదకొండుగంటలకు నేను ఎద్దుబండి అతనికి చెప్పి వచ్చాను. నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయారు. మా అన్నయ్య సాయి స్కూలుకెళ్ళిపోయాడు. అమ్మ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి ఇద్దరు తమ్ముళ్ళతో పాటు బండిలో కూర్చుంది. లగేజ్ చాలా తక్కువ. ఓ చాప, రెండు బెడ్షీట్లు, రెండు దిండ్లు, కుంపటి, నాలుగు పాత్రలు, రెండు ట్రంకు పెట్టెల్లో బట్టలు.. అంతే. బండి వెళుతూంటే నేను వెనక నడుస్తూ అమ్మ వైపు చూశాను. అమ్మ మా పెద్దతమ్ముడు కృష్ణని ప్రక్కన కూర్చోబెట్టుకుని, నెలల బిడ్డ అయిన మా చిన్న తమ్ముడు సతీష్‌ని ఒడిలో పెట్టుకుని వాడి జుట్టు సరిచేస్తూంది. ఆ సమయంలో అమ్మ చాలా అమాయకంగా కనిపించింది నాకు.
క్రొత్త ఇంట్లో అడుగుపెట్టగానే సరకులు తేవడం, కుంపటికి బొగ్గులు తేవడం, పాలు ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవడం వంటి పనులతో బిజీ అయిపోయాను. ఆరోజు నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకోవడం నాకు అలవాటయింది.
ఆ ఇంట్లో ఒకనెలరోజులు మాత్రమే ఉన్నాము. ఇంటి సమీపంలో త్రాగుబోతుల బెడద ఉండటంతో మళ్ళీ బజారువీధిలోని ఓ ఇంటికి అద్దెకి వచ్చాము. ఆ ఇంటి వెనక పోర్షన్లో భీమసేనరావు, రమాబాయి అని మధ్వా బ్రాహ్మణులు ఉండేవారు. వారు మాకు చాలా ఆప్తులయ్యారు. వారికి అయిదుమంది పిల్లలు. మేము, వారి పిల్లలు, ప్రక్కింటి పిల్లలు కలసి వేసవి శెలవుల్లో మా ఇంట్లోనే నాటకాలు వేసేవాళ్ళం. పురాణాలకు సంబంధించిన నాటకాలైతే కిరీటాలు తయారు చేసుకునేవాళ్ళం. రోజూ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రదర్శనరోజు వీధిలోని వాళ్ళందరూ వచ్చి చూసి ఆనందించేవారు, మమ్మల్ని మెచ్చుకునేవారు. ఆ ఇంట్లోనే మా చెల్లెలు పద్మ పుట్టింది.
తర్వాత వేలూరు రోడ్డులోని ఇప్పుడు మహేంద్రశెట్టి అంగడి ఉన్న ప్రక్కసందులో ఉన్న నాలుగు పోర్షన్లలో ఓ పోర్షన్లో అద్దెకి దిగాము. సంవత్సరం తర్వాత మా పెదనాన్నవాళ్ళు గిరింపేట చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నారు. వారి ఇంటి వెనకప్రక్క స్థలం మీనమ్మ దగ్గర కొన్నారు నాన్న. అక్కడ చిన్న ఇల్లు కట్టుకున్ని అందులోకి వెళ్ళిపోయాము. ఇంటి కప్పుకు పెంకులు వేయించడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో, కొబ్బరి మట్టలతో ఇంటి కప్పు వేయించాము. ఓ హాలు, ఓ వంటగది.. అంతే ఆ ఇల్లు. పెదనాన్నవాళ్ళ బాత్రూములే వాడుకునేవాళ్ళం.
ఆ ఇంట్లో పాములతో తమాషా అయిన అనుభవాలు ఉండేవి. వర్షాలు పడి చెరువు నిండితే చెరువు నీళ్ళు మా ఇంటి వెనకవైపు మెట్లవరకూ వచ్చేవి. అందులోంచి పాములు తేలుతూ మాకు కనపడేవి. చాలా వరకు నీళ్లపాములు, కొన్నిసార్లు కట్లపాములు కనపడేవి. అవి మా ఇంటివైపు వస్తూంటే పొయ్యిలో వాడే కట్టెలతో చంపేసేవాళ్ళం. ఓ తమ్ముడు పెరట్లో పామును చూసి అరిస్తే దాన్ని చంపేలోపల బయటనుంచి మరో తమ్ముడు ‘పాము’ అని అరిచేవాడు. ఒక్కోరోజు అయిదారు పాములను చంపేవాళ్ళం. మా అమ్మ చెక్కపీట పైన కడిగిన స్టీలు డబ్బాలు ఎండకి ఆరబెట్టి, మధ్యాహ్నం మమ్మల్ని లోపలకు తెమ్మని చెబితే వెళ్లి పీట పైకెత్తితే కింద పాము పడుకుని ఉండటం కనిపించేది. పీట కిందపడేసి కర్ర అందుకునేవాళ్ళం. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమంటే రాత్రి పాములు వస్తాయేమోనన్న భయం లేకుండా హాయిగా పడుకుని నిద్రపోయేవాళ్ళం.
ఓరోజు రాత్రి ఇంట్లో నేను పడుకుని ఉన్నాను గాని నిద్రపట్టలేదు. ఇంటి పైకప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న నాకు టెంకాయ మట్టల మధ్య తెల్లగా, పొడవుగా కదులుతూ కనిపించింది. అది ఓ పెద్ద పాము క్రిందిభాగం అని అర్థమైంది. అది ఎక్కడ అమ్మ మీద, పిల్లలమీద పడుతుందో అని నాకు భయమేసింది. మా నాన్నను నిద్రలేపి విషయం చెప్పాను. ఆయన పొడుగైన సన్నటి కర్రను తీసుకుని దాన్ని తాకారు. వెంటనే అది ఆ కర్ర మీదుగా వేగంగా నాన్న చేతివైపుకు దిగింది. నాన్న గబుక్కున కర్ర వదిలేశారు. పొయ్యికి వాడే కర్రతో సిద్ధంగా ఉన్న నేను దాన్ని చంపేసాను. దాన్ని కట్లపాముగా గుర్తించాం.
1971 సంవత్సరంలో చిత్తూరులో శ్రీనివాసా థియేటర్ ప్రారంభమయింది. అందులో మొదటి చిత్రం ప్రేమనగర్. మా ఫ్రెండ్స్ అందరూ థియేటర్ చాలా బాగుందని చెబుతూంటే ఓ సాయంత్రం నేనూ, అదివరకు మా ఇంటి వెనుక పోర్షన్లో ఉండిన నా స్నేహితుడు మధు, థియేటర్ని వెలుపలినుంచే చూడటానికి బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక వెనక తిరిగి చూస్తే వివేకానంద థియేటర్ దగ్గర మా అన్న సాయి వస్తూ కనిపించాడు. అయితే అప్పుడే మా ఇద్దరికీ చిన్న గొడవ అయి ఉండటంతో మేము అతనితో మాట్లాడకుండా ముందుకెళ్ళిపోయాము. కొంతదూరం వెళ్ళి వెనకకు తిరిగి చూస్తే వాడు కనపడలేదు. థియేటరు ప్రక్కనే ఉన్న శ్రీ సుబ్రమణ్యస్వామి కొండకు వెళ్ళే మెట్ల దారి ప్రక్కన వాడి క్లాస్మేట్ హరి ఇల్లు ఉంది. వాడు అతని ఇంటికి వెళ్ళి ఉంటాడని మేము భావించాము.
తన అన్నయ్య సాయికుమార్ తో రచయిత
నేను, మధు థియేటరు చూసి, బయట అద్దాల షోకేసులో పెట్టిన సినిమా స్టిల్స్ చూసి, తిరిగి ఇంటికొచ్చాము. ముందు మధు ఇల్లు వస్తుంది కాబట్టి అతని ఇంటి దగ్గర ఆగాము. ఆ సమయంలో నా మనసు ఆందోళనగా ఉంది. మనసు పిండేసినంత బాధగా ఉంది. అయితే ఎందుకలా ఉందో నాకు అర్థం కాలేదు. మధుతో చెబితే “ఇంకో పదిరోజుల్లో క్వార్టర్లీ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి భయపడుతున్నావేమో!” అన్నాడు. నేను పరీక్షలకు ఎప్పుడూ భయపడలేదని చెప్పాను. తర్వాత ఇంటికొచ్చాను. అమ్మ ఆందోళనతో బయటే నిలబడి ఉంది. ఏం జరిగిందని అడిగాను. సాయి ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది. నాకూ భయమేసింది. వాడు ఎంత అమాయకుడంటే బాత్రూంకు వెళ్ళినా అమ్మతో చెప్పి వెళ్ళేవాడు. అటువంటివాడు రాత్రి ఎనిమిది దాటినా ఇంటికి రాలేదంటే అమ్మకు ఆందోళన కలుగుతుంది కదా! నేను అమ్మకు ధైర్యం చెప్పి, మధు ఇంటికెళ్ళి, వాడిని కూడా పిలుచుకుని సాయిని వెదకడానికి వెళ్ళాను. ముందు గిరింపేట వీధుల్లో, తర్వాత వాడి స్నేహితుల ఇళ్ళలో చూశాము. వాడు కనపడలేదు.
అప్పుడు వాడు వివేకానంద థియేటర్ దగ్గర కనిపించడం, వాడి క్లాస్మేట్ హరి ఇంటికి వెళ్ళాడని మేము భావించడం గుర్తొచ్చింది. వెంటనే అక్కడికెళ్ళాం. అయితే అక్కడంతా చీకటిగా ఉంది. మనుష్య సంచారం లేదు. పైగా అక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. పైకి వెళ్ళి విచారించడానికి ధైర్యం చాలడం లేదు. అప్పుడు నాకు ఆందోళనతో ఉన్న అమ్మ ముఖం గుర్తొచ్చింది. ‘పదరా వెళదాం’ అంటూ ముందుకు కదిలాను. ఇద్దరం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పైకెళ్ళాం. దాదాపు కొండని ఆనుకుని ఉంది అతని ఇల్లు. సాయి గురించి విచారిస్తే అసలు సాయి తమ ఇంటికే రాలేదని చెప్పాడు హరి. నిరాశగా క్రిందికి వచ్చాం. మధును వాళ్ళ ఇంటికి పంపి ‘సాయి వచ్చేసి ఉంటాడనే’ ఆశతో మా ఇంటికి వచ్చాను. సాయి ఇంకా ఇంటికి రాలేదు. ఈ లోపల మా పెదనాన్న ఇంట్లో కూడా విషయం తెలిసిపోవడంతో వాళ్ళందరూ రోడ్డుపైన నిలబడి వచ్చీపోయేవాళ్ళలో ‘సాయి’ ఉంటాడేమోనని చూడసాగారు. నేనూ వారితో పాటు రోడ్డుపై నిలబడి దూరంగా ఎవరైనా సాయి హైటు ఉన్న వ్యక్తి కనిపిస్తే ‘అతను సాయి అయి ఉండాలని’ దేవుణ్ణి వేడుకోసాగాము.
తొమ్మిదిన్నరకు దూరంగా కనిపించాడు సాయి. పరుగెత్తికెళ్ళి వాడిని దగ్గరగా చూసి మళ్ళీ వేగంగా ఇంటివైపు పరుగెత్తాను. అమ్మ హాల్లో దీనంగా చూస్తూ కూర్చుని ఉంది. ‘అమ్మా.. సాయి వచ్చేశాడు ‘ అంటూ గట్టిగా అరిచాను. అమ్మ ముఖం వికసించింది. ఇంతకూ జరిగిందేమిటంటే
సాయి కూడా మా వెనకే థియేటర్ దగ్గరికి వచ్చాడట. అక్కడ మా మణేగార్ చిన్నాన్న క్రిష్ణమూర్తిరావు తన స్నేహితులతో కనిపించారట. వీడిచేతికి డబ్బులిచ్చి ఓ టికెట్ తీసుకుని రమ్మన్నారట. వీడు ఆయన కోసమేమో అనుకుని టికెట్ కొని వెళ్ళి ఆయనకిస్తే ‘అది నీకోసమే’ అన్నారట. ‘వద్దు వద్దు. నేను అమ్మతో చెప్పలేదు. అమ్మ తిడుతుంది’ అని వీడంటే ‘ఏమీ తిట్టదు. నేను మీ అమ్మతో చెబుతానులే. లోపలికి పద’ అంటూ పిలుచుకెళ్ళారట.
వాడు అమ్మను చూడగానే పరుగెత్తుకొచ్చి “సారీ అమ్మా! ఇంకెప్పుడూ నీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళనమ్మా!” అన్నాడు ఏడుస్తూ. తర్వాత అమ్మ కన్నీళ్ళను తుడిచాడు.
అయితే మరుసటిరోజే మా అమ్మకు ఒక్క మాటైనా చెప్పకుండా అనంతలోకాలకి వెళ్ళిపోయాడు.
4
మరుసటిరోజు గాంధీజయంతి కావడంతో స్కూలుకు సెలవు. ఉదయం సాయితో మళ్ళీ థియేటర్లో జరిగిన కథ అంతా చెప్పించుకుని విన్నాను. వాడు ప్రేమనగర్ సినిమా కథ కూడా టూకీగా చెప్పాడు. అందులోని పాటల పల్లవులు పాడి వినిపించాడు. సాయి మంచి గాయకుడు. ఘంటసాలగారిలాగా పాడేవాడు. ఓ నోట్ బుక్‌లో పాటలన్నీ రాసుకునేవాడు. స్కూల్లో పాటల పోటీల్లో మొదటి రెండు బహుమతులు మా అన్నకు, మా పెదనాన్న కూతురు సాయికుమారికి వచ్చేవి. మా చుట్టుప్రక్కల ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్స్ జరిగి, ఆ ఇంటివాళ్ళు ‘పాటలు పాడమని’ వచ్చినవారిని అడిగితే వెంటనే నేను ‘మా అన్న పాడతాడు’ అనేవాణ్ణి. సినిమాలకు వెళ్ళినప్పుడు మా అన్నకోసం ఆ సినిమా పాటల పుస్తకం తప్పకుండా కొనేవాణ్ణి. అప్పట్లో సినిమా థియేటర్ లోపలే ఉన్న షాపులో బిస్కట్లు,చాక్లెట్లు, కాఫీ, టీలతో పాటు అక్కడ ఆడుతున్న సినిమా పాటల పుస్తకాలు కూడా అమ్మేవారు. ఇంటికివచ్చాక ఆ పాటల పుస్తకంపై ‘సాయికుమార్’ అని రాసేవాణ్ణి. వయసులో పెద్దవాడైన అన్నకు ఆ వయసులోనే నేను ఇచ్చిన గౌరవం అది. వాడు చనిపోయిన తర్వాత కొన్న పుస్తకాలపై కూడా వాడి పేరే వ్రాసేవాడిని. అలా కొన్న పుస్తకాలు వందకు పైగా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి.
రచయిత తన చిన్నప్పుడు కొన్న సినిమా పాటల పుస్తకాలపై ఆయన అన్నయ్య పేరు
సాయి అయిదవతరగతి వరకు నెల్లూరులో మా అమ్మమ్మ తాతయ్య దగ్గర చదివాడు. చాలారోజులవరకూ నాకు ఓ అన్నయ్య ఉన్నాడన్న విషయం నాకు తెలియదు. మా నాన్న నాకు బట్టలు కొన్నప్పుడల్లా మరో సెట్ పోస్ట్‌లో నెల్లూరికి పంపేవారు. అయితే ఆయన ఎక్కడికి పంపుతున్నారో, ఎవరికి పంపుతున్నారో నాకు తెలిసేది కాదు. నేను అడిగేవాణ్ణీ కాదు. అడిగే వయసూ కాదు. స్కూలుకెళ్ళడం, మా పెదనాన్న పిల్లలతో ఆటలూ.. ఇదే లోకం అప్పుడు. ప్రక్కప్రక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి ఆయనకీ, మాకూ సమయమూ, వీలూ దొరికేది కాదు. మూడవతరగతి శెలవుల్లో అనుకుంటా నెల్లూరుకు వెళ్ళినప్పుడు వాడిని కలిశాను. అప్పుడే నాకో అన్నయ్య ఉన్నాడని తెలిసింది నాకు.
తర్వాత వాడిని చిత్తూరులోని కణ్ణన్ హైస్కూల్లో ఆరవతరగతిలో చేర్పించారు. వాడు ప్రొద్దున స్కూలుకెళితే సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చేవాడు. స్కూల్లోనే భోజనం, ట్యూషను. తర్వాత ఇంట్లో హోం వర్క్. పాపం ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. నేను గిరింపేట మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్లో, తర్వాత మునిసిపల్ హైస్కూల్లో చదవడం వల్ల ఇంటికీ, స్కూలుకూ మధ్య తిరుగుతూ ఉండేవాణ్ణి. మా ఇల్లు స్కూలుకు దగ్గరగా ఉండేది, చాలాకాలం మా స్కూలున్న వీధిలోనే మేముండేవాళ్ళం.
గాంధీజయంతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సాయి, మధు సైకిల్‌పై ఎక్కడికో బయలుదేరారు. సాయికి సైకిల్ తొక్కడం రాదు. వాడు ముందు కూర్చుంటే మధు సైకిల్ తొక్కాడు. ఆ సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. నాన్న ఇంటికి వచ్చిన తన ఫ్రెండు శ్రీ దొరస్వామిరెడ్డిగారితో మాట్లాడుతున్నారు. అప్పుడు రోడ్డు వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించింది. నేను వేగంగా రోడ్డు వైపు పరుగెత్తాను. ఓ లారీ రివర్స్‌లో వస్తూ నా ముందు ఆగింది. అందులోంచి ఒకడు “అక్కడ ఇద్దరు పిల్లలు లారీ క్రిందపడి చనిపోయారు. వాళ్ళు మీ ఇంటినుంచే వచ్చారు” అన్నాడు. నేను రోడ్డు వైపు చూస్తే కాస్త దూరంలో సైకిలు క్రింద పడి ఉండటం, ఇద్దరు మనుషులు కూడా పడిఉండటం లీలగా కనిపించింది. నాకు విషయం అర్థమైంది. వెంటనే ఇంటివైపు పరుగెత్తాను. అప్పుడు అమ్మ అల్మైరాలు క్లీన్ చేస్తూంది.
సాయికి ఏక్సిడెంటైనదని అమ్మకు చెప్పాను. అమ్మ నిశ్చేష్టురాలై నావైపు చూసింది. మా నాన్న అప్పటికే దగ్గరికి వెళ్ళి చూసి, ఏడుస్తూ ఇంట్లోకి వస్తున్నారు. అప్పుడు సాయి చనిపోయాడని కన్ఫర్మ్ అయింది. వాళ్ళిద్దరినీ ఓదార్చడం నా వల్ల కాలేదు. ఒకప్రక్క నేనూ ఏడుస్తున్నాను. మమ్మల్ని చూసి తమ్ముళ్ళు, చెల్లెలూ ఏడుపు మొదలుపెట్టారు. కొంతసేపట్లోనే ఇల్లంతా బంధువులతో, స్నేహితులతో నిండిపోయింది. స్నేహితుల ద్వారా మధు బ్రతికే ఉన్నాడని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని నాకు తెలిసింది.
మరుసటి ఉదయం మద్రాసు నుంచి జానకిమామి (ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్. జానకిగారు), ఆవిడ భర్త రామప్రసాద్ మామ వచ్చారు. జానకిమామి ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నేను మా అన్నకు ఆ విషయం పరుగెత్తికెళ్ళి చెప్పేవాణ్ణి. ఆరోజు అవిడని చూడగానే అలవాటు ప్రకారం సాయికి చెప్పాలని ఇంటివైపు పరుగెత్తాను. ఆ సమయంలో అమ్మ, నాన్న- పెదనాన్న ఇంట్లో ఉండటం వల్ల మా ఇంటికి తాళం వేసి ఉంది.. అప్పుడు గుర్తొచ్చింది ఆవిడ వాడి మరణవార్త వినే వచ్చారని. వాడు లేడన్న బాధ మరింత ఎక్కువైంది. ఇంటిముందు కూర్చుని భోరున ఏడ్చేశాను. జానకిమామి భర్త రామప్రసాద్ మా అమ్మకు మేనమామ కొడుకు కావడం, వారిదీ నెల్లూరే కావడం, ఆవిడ నెల్లూరుకు తరచుగా వెళ్తూండటం వల్ల సాయితో ఆవిడకి అనుబంధం ఉండేది.
మా నాన్నతో ఆయన స్నేహితులు “నీకేమయ్యా నారాయణరావ్! నీ కొడుకు టెంత్ క్లాస్‌కి వచ్చేశాడు. త్వరలోనే నీ కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తాడు” అనేవారట. చెట్టంత కొడుకును కోల్పోవడం ఆయన్ను బాగా క్రుంగదీసింది. ఇక అమ్మ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె ఈ లోకంలో లేనట్టే ప్రవర్తించసాగింది.
కార్యక్రమాలన్నీ ముగిశాక ఇంట్లో మేము ఆరుగురం మిగిలాము. వచ్చినవాళ్ళందరూ “శేఖరా! ఇక నువ్వే ఈ ఇంటికి పెద్దకొడుకువి కాబట్టి మీ అమ్మానాన్నల్ని నువ్వే చూసుకోవాలి” అన్నారు నాతో. కళ్ళనీళ్ళతో తలూపాను. అప్పటికే నేను ఎన్నో బాధ్యతలు పంచుకుంటున్నా ఆ రోజు నుంచీ ‘పెద్దకొడుకు’ అనే డెసిగ్నేషన్- బాధతో స్వీకరించవలసివచ్చింది. అయితే ఈ క్రొత్త బాధ్యతతో సంబంధం లేకుండా ప్రతిక్షణం అమ్మానాన్నల కోసం, తోబుట్టువుల కోసం తపించాను. నన్ను నేను దిద్దుకుని, తోబుట్టువులనూ మంచి దారిలో నడిపించాను. మా కుటుంబం వృద్ధి చెందాలని, నలుగురిలో మేమందరం మంచిపేరు తెచ్చుకోవాలని ఆశించి, అందుకోసం కృషి చేశాను. నా కృషి ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా మా అమ్మ మాత్రం గుర్తించింది. పలుసార్లు తన మాటల్లో వ్యక్తం చేసింది. అది చాలు నాకు.
చాలా ఏళ్ళ తర్వాత ఓరోజు తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్లో అమ్మకు హార్ట్ చెకప్ చేయించుకుని కార్లో తిరిగి వస్తున్నప్పుడు మా పెద్దమ్మ కీ.శే.లలితాబాయి గారు “కామాక్షీ! ఏదో వూరు వెళ్తున్నావని విన్నాను. ఏ వూరు వెళ్తున్నావు?” అని అడిగారు. అప్పుడు అమ్మ “ఇంక ఏవూరికీ వెళ్ళను అక్కా! ఇక బ్రతికినన్నాళ్ళూ శేఖర్ ఇంట్లోనే ఉంటాను” అంది. నామీద, నా భార్య రాధిక మీద అమ్మకు ఎంత నమ్మకం? నేను బ్రతికినన్నాళ్ళూ నాకు గుర్తుండిపోయే మాట అది. ఆమె పట్ల నా ప్రేమకు, కుటుంబం పట్ల నేను చూపిన శ్రద్ధకు ఆమె ఇచ్చిన గుర్తింపు అది. నాకు ఎంతో సంతృప్తినీ, కాసింత గర్వాన్నీ కూడా ఇచ్చిన మాట అది.
అయితే ఆ ‘బ్రతికినన్నాళ్ళూ’ అనే పదాన్ని నేను ‘కొన్ని సంవత్సరాలుగా’ భావిస్తే, భగవంతుడు ‘పదిహేను రోజులుగా’ కుదించాడని ఆ రోజు నాకు తెలియలేదు.
(సశేషం)
