Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా మొదటి నేస్తం.. మా అమ్మ-3

[ప్రముఖ రచయిత శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ గారు రచించిన ‘నా మొదటి నేస్తం.. మా అమ్మ’ అనే నవలను కొత్త ధారావాహికగా అందిస్తున్నాము.]

5

మా అన్న చనిపోయిన తర్వాత కొన్నిరోజులు స్కూలు ఎగ్గొట్టినా, తర్వాత మారి, బుద్దిగా చదువుకోసాగాను. ప్రతి సంవత్సరం స్కూలు తెరచిన మొదటిరోజు సాయంత్రం మా తమ్ముళ్ళను, చెల్లెల్ని చర్చివీధిలోని ‘పద్మశ్రీ అండ్ కో’ అనే స్టేషనరీ షాపుకు పిలుచుకెళ్ళి, పాఠ్యపుస్తకాలు, వాళ్ళ క్లాస్ టీచర్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం నోట్ బుక్స్ కొనిచ్చేవాడిని (నాన్న ఇచ్చిన డబ్బులతోనే). అప్పట్లో ఆటోలు లేవు, రిక్షాలో వెళ్ళమని నాన్న డబ్బులిచ్చినా దాన్ని ఖర్చుపెట్టడానికి మనసొప్పేది కాదు. కిలోమీటర్ దూరం నడిచేవెళ్ళి, నడచి వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు వీలైనంత ఎక్కువ బరువు నేనే మోసేవాణ్ణి. ఇంటికొచ్చాక వాళ్ళ పుస్తకాలకు బ్రౌను షీటు అట్టలు వేసి, లేబుల్స్ అతికించి, వాళ్ళ పేర్లు, క్లాసు మొదలైనవి అందంగా రాసిచ్చేవాడిని. పుస్తకాలకు అందంగా అట్టలు వేయడంలో నేను ఎక్స్‌పర్ట్‌ని. నా దస్తూరీ కూడా చాలా అందంగా ఉండేది.

సాయి బ్రతికున్నప్పుడు నేను చాలా గట్టివాణ్ణి. దేనికీ భయపడేవాణ్ణి కాను. సాయి అమాయకుడు. మేమిద్దరం సినిమాకు వెళితే, అక్కడ విపరీతంగా రష్ ఉంటే సాయి క్యూలైన్లో రావడానికి భయపడేవాడు. నేను ఆ గుంపులో దూరి, టికెట్లు సాధించుకుని వచ్చి చూపిస్తే వాడు నన్ను ఓ హీరోని చూసినట్లు చూసేవాడు.  ఆరోజుల్లో మేము ఎప్పుడూ నేల టికెట్కే వెళ్ళేవాళ్ళం. నాన్న ఫస్ట్ క్లాస్ టికెట్టుకు డబ్బులిచ్చి “నేల టికెట్కు వెళ్ళకండి. నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నాకు అవమానంగా ఉంటుంది” అనేవారు. మేము అలాగేనని చెప్పి ఆ డబ్బులతో నేలటికెట్లు కొని మూడు సినిమాలు చూసేవాళ్ళం. పేరుకే నేల టికెట్ గాని మిగతా క్లాసుల్లాగే అక్కడా కుర్చీలు ఉండేవి. కాస్త స్క్రీనుకు దగ్గరగా కూర్చోవాలి. అంతే! సినిమానుంచి వచ్చాక ‘ఏ టికెట్ కొన్నారని’ ఆయన అడిగితే నిజాయితీగా నిజం చెప్పేసేవాళ్ళం. ‘మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరు’ అని విసుక్కునేవారు. నేను నేల టికెట్టు కొనడం మొదలుపెట్టినప్పుడు 25 పైసలు, తర్వాత 40 పైసలు, 50 పైసలు అయ్యింది. 70 పైసలున్నప్పుడు నేను చివరిగా నేల టికెట్లు కొన్నాను. ఉద్యోగం వచ్చాకే ఫస్ట్ క్లాస్ టికెట్టు కొనడం మొదలుపెట్టాను.

సాయి చనిపోయాక నేను సున్నిత మనస్కుడిగా మారిపోయాను. రోడ్డుమీద వెళుతున్నప్పుడు ఎక్కడైనా ఏక్సిడెంట్ జరిగి జనం గుంపుగా కనపడినా లేదా ఎవరైనా సైకిల్‌పై నుంచి క్రిందపడి కాలు చక్రంలో ఇరుక్కుపోయి ఇబ్బండి పడుతున్నారని తెలిసినా దగ్గరికి వెళ్ళి చూసే ధైర్యం ఉండేది కాదు. అయితే నాలో ఆందోళన పెరిగిపోయేది. వెంటనే వేగంగా సైకిల్‌పై ఇంటికి వెళ్ళేవాడిని. నా తమ్ముళ్ళు ఇద్దరూ ఇంట్లో క్షేమంగా ఉన్నారన్న విషయం నిర్ధారించుకున్నాక స్థిమితపడేవాణ్ణి.

పదవ తరగతి ఫలితాలు వచ్చాయి!

ప్రతి సంవత్సరం పది ఫలితాలు వచ్చినప్పుడు మా పెదనాన్న – వాళ్ళింట్లో పేపరు పట్టుకుని కూర్చుని, నన్ను పిలిచి “మనకు తెలిసినవాళ్ళు ఎవరైనా రాశారా?” అని అడిగేవారు. నేను ఫలానావాడు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడని చెప్పేవాడిని. అప్పుడు ఆయన “నువ్వు కూడా ఫస్ట్ క్లాస్‌లో పాసవ్వాలిరా!” అనేవారు. నేను అలాగేనని చెప్పేవాణ్ణి. నా టెంత్ పరీక్ష ఫలితాలు వచ్చినరోజు ఆయన ముందే నా నంబర్ చూసి ఆయనతో “నేను ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను” అని చెప్పాలని ఆశపడ్డాను.

అయితే ఆ సంవత్సరం (1974)  మే, జూన్ నెలల్లో  రాష్ట్రంలో కరెంటు కొరత వచ్చింది. న్యూస్ పేపర్లు వచ్చేవి కావు. నాకు గుర్తుండి సినిమా థియేటర్స్‌లో జనరేటర్లు వాడటం అప్పుడే మొదలైంది.  లక్ష్మీ థియేటర్ దగ్గరున్న ఓ లోకల్ న్యూస్ పేపర్లో పది ఫలితాలు వచ్చాయని తెలుసుకుని అద్దె సైకిల్పై ఆ పత్రికాఫీసుకు వెళ్ళాను. వాళ్ళూ ఒకటో రెండో కాపీలే ప్రింట్ చేసి, వాళ్ళ ఆఫీసులో పెట్టి, ఒక్కొక్కరినీ వచ్చి తమ నంబరు చూసుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల అక్కడ పెద్ద క్యూ ఉంది. నేను క్యూలో నిలబడ్డాను. అంతలో ఫలితాలు చూసుకున్న మా ఫ్రెండ్ ఒకడు నా దగ్గరికి వచ్చి “నీది ఫస్ట్ క్లాస్‌” అని చెప్పాడు.  ఆనందంగా అతనికి ధన్యవాదాలు చెప్పి అతను సెకండ్ క్లాస్‌లో పాసయ్యాడని తెలుసుకుని అభినందించాను. క్యూలోంచి బయటికి రాబోతూంటే నా నంబరు నా కళ్ళతో చూసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అందువల్ల క్యూలోనే నిలబడిపోయాను. తర్వాత పేపర్లో నా నంబర్ చూసుకుని ఎక్సైట్మెంట్ ఫీలయ్యాను. తర్వాత ఇంటివైపు సైకిల్ తిప్పాను. ఇంట్లోకి వెళితే అమ్మ వంట చేస్తూంది. నేను ముఖంపై చేతులు పెట్టుకుని ఏడుస్తున్నట్టు నటించాను. అమ్మ “ఏమైందిరా?” అని గాభరాగా అడిగింది. “టెంత్ రిజల్ట్స్ వచ్చాయి” అన్నాను బొంగురు గొంతుతో. అమ్మ ముఖంలో ఆందోళన, నిరుత్సాహం. “ఏమైంది” అని అడిగింది సన్నటి గొంతుతో. “ఫస్ట్ క్లాస్‌” అదే ఏడుపు గొంతుతో చెప్పాను.

ఆమె ముఖంలో ఆశ్చర్యం, సంతోషం. “ఏదీ.. ఇంకోసారి చెప్పు” అని అడిగింది.

నేను నవ్వుతూ “ఫస్ట్ క్లాస్‌ అమ్మా!” అన్నాను.

“అబ్బ.. భయపెట్టేశావు కదరా! రా ఇలా” అంటూ నన్ను గట్టిగా కౌగలించుకుంది. ఫస్ట్ క్లాస్‌ వచ్చినదానికంటే అమ్మ సంతోషం నన్ను ఎక్కువ తృప్తినిచ్చింది.

తర్వాత తోబుట్టువులకూ, మా పెదనాన్నకూ, వారింట్లోవాళ్ళకు చెప్పాను. ఇంటికొచ్చి “నాన్నకు చెప్పి వస్తాను” అని అమ్మకు చెప్పి అద్దె సైకిల్‌పై తాలూకాఫీసుకు బయలుదేరాను. నాన్న ఆఫీసులో పనిచేసుకుంటున్నారు. విషయం తెలియగానే చాలా సంతోషించారు. జేబులోంచి పదిరూపాయలు తీసి నా చేతికిచ్చి “మీ ఫ్రెండ్స్‌కు చాక్లెట్లు పంచు” అన్నారు. నాన్న ప్రక్కనే ఉన్న నాన్న ఫ్రెండు మరియు కొలీగు శ్రీ కృష్ణారెడ్డి మామ తను కూడా ఓ పదిరూపాయలు ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తూంటే నా మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది.  జీవితంలో మొదటిసారి ఏదో సాధించానన్న అనుభూతి కలిగింది నాకు.

ఎస్.ఎస్.సి.లో నాలుగువందల పదునెనిమిది మార్కులు వచ్చాయి కాబట్టి పి.సి.ఆర్.జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎం.పి.సి.సీటు దొరికింది. కాలేజీ ఇంటినుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి నాన్నను సైకిల్ కొనివ్వమని అడిగితే అలాగేనన్నారు. మొదటి రెండురోజులూ నాతోపాటు స్కూల్లో చదివిన అన్నామలై మరియు శ్రీరామచంద్రమూర్తి సైకిళ్ళలో వెనకసీట్లో కూర్చుని కాలేజీకి వెళ్ళాను. మూడవరోజు కూడా మా నాన్న సైకిల్  కొనివ్వలేదు. అందుకు నిరసనగా నాలుగవరోజు ఫ్రెండ్స్ పిలిచినా వాళ్ళతో వెళ్ళకుండా కాలేజీకి నడచి వెళ్ళాను. విషయం తెలుసుకున్న మా నాన్న నాకు కోపం వచ్చిందని గ్రహించారు. ఆ రోజు సాయంత్రం నన్ను టౌనుకు పిలుచుకెళ్ళి రాములవారిగుడి వీధిలో ఉన్న ఓ షాపులో నాకు హెర్క్యులస్ సైకిల్ కొనిచ్చారు. అప్పట్లో చాలా ఖరీదైన సైకిల్ అది. దాని ఖరీదు రెండువందల యాభై రూపాయలు. నా ఆనందానికి అంతులేదు. నిజానికి నేను సైకిల్ నేర్చుకున్నదే పదవతరగతి సెలవుల్లో. నేర్చుకున్న కొద్దిరోజుల్లోనే ఓ క్రొత్త సైకిల్ నా సొంతమవడం నాకు ఆనందాన్నీ, గర్వాన్నీ కలిగించింది.

సైకిల్ కొన్న ఎగ్జైట్మెంట్ చల్లారగానే నాన్నపై కోపగించుకోవడం తప్పని రియలైజ్ అయ్యాను. చాలా సిగ్గుపడ్డాను కూడా. ఎన్నో విషయాల్లో అమ్మానాన్నల్ని అర్థం చేసుకుని వారి మనసులకు తగినట్లు నడచుకుంటున్న నేను సైకిల్ విషయంలో ఎందుకలా బాధ్యతారహితంగా ప్రవర్తించానో నాకు అర్థం కాలేదు. ఓ రోజు రాత్రి నాన్న ప్రక్కన కూర్చుని అదే విషయం ఆయనతో చెప్పాను. ఆయన నవ్వారు. ‘అయితే నన్ను క్షమించేశారన్నమాట’ అనుకుని తృప్తిగా నిట్టూర్చాను.  అప్పుడు నాన్న “నీకు వచ్చిన మార్కులు చూశాక, ఇప్పుడు నీవు మాట్లాడిన మాటలు విన్నాక నీవు బాధ్యత తెలిసినవాడవని నాకు అర్థమైంది. ఇకపై నువ్వు సినిమాలకెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా నాకు చెప్పనక్కరలేదు. మీ అమ్మతో చెప్పి వెళుతూండు. నీవు దారితప్పి ప్రవర్తించవని నాకు నమ్మకముంది” అన్నారు. నేను అలాగేనని తలూపాను. నాన్న నాకు ఇచ్చిన ఆ స్వాతంత్ర్యం  మంచి వ్యక్తిత్వం అలవరచుకోవడంలో నాకు ఎంతో ఉపయోగపడిందని నేను భావిస్తాను.

నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉండగా మా నాన్నకు మదనపల్లి ట్రాన్స్‌ఫర్ అయింది. మంచి కాలేజీలో చదువుతున్నాను కాబట్టి నన్ను చిత్తూరులోనే ఉండమని చెప్పి వాళ్ళు లారీలో లగేజ్ వేసుకుని వెళ్ళిపోయారు. నేను భోజనం మా పెదనాన్న ఇంట్లో చేస్తూ, శేఖర్, ఆనంద్ అనే ఇద్దరు స్నేహితులతో కలసి మా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఆ రెండేళ్ళు గడిపాను.

ఓ ఆదివారం మావాళ్ళందరినీ చూడటానికి మదనపల్లి వెళ్ళాను. వాళ్ళు అక్కడ కాలనీలో అద్దె ఇంటిలో ఉండేవారు. ఆరోజు సాయంత్రం ఊరంతా తమ్ముళ్ళతో తిరిగి, రాత్రి ఇంటికొచ్చాను. భోజనాలు అయ్యాక వరాండాలో అందరం పడుకుని నిద్రపోయాము. ఊర్లో దొంగలభయం ఉండటంతో నాన్న ఇంటికి తాళం వేసి, తాళంచెవి తనప్రక్కన పెట్టుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి పెద్దవర్షం మొదలైంది. ఇంట్లోకి పోదామంటే కరెంటు లేకపోవడంతో తాళంచెవి నాన్నకు, మాకు ఎంత వెతికినా కనిపించలేదు. అక్కడ చిన్న షేడ్ ఉన్నా గాలితో కూడిన వర్షం కాబట్టి మా తమ్ముళ్ళు, చెల్లెలు పూర్తిగా తడిసిపోయి చలికి వణకిపోతున్నారు. వాళ్ళకు ఎక్కడ జలుబు, జ్వరం వస్తుందో అని నాలో ఆందోళన మొదలైంది. “తాళంచెవి ఎక్కడ పెట్టారో త్వరగా  గుర్తుతెచ్చుకోండి నాన్నా! పిల్లలు తడిసిపోతున్నారు!” అన్నాను ఆందోళనతో కాస్త గట్టిగా. అప్పుడు నేనూ తడిసిపోయి చలికి వణకుతున్నానన్న విషయం నాకు గుర్తురాలేదు. నాన్నకు కొంత కోపం వచ్చింది. తాళంచెవి  ఎలాగో వెతికి పట్టేశారు. తర్వాత అందరం ఇంట్లోకి వెళ్ళి తల తుడుచుకుని, దుస్తులు మార్చుకున్నాం. మరుసటిరోజు నాన్న  “వీడు ఎందుకు నిన్న అంత టెన్షన్ పడ్డాడో నాకు అర్థం కాలేదు” అన్నారు అమ్మతో. అమ్మ నావైపు చూసింది. తర్వాత అమ్మ “పిల్లలకు జ్వరం వస్తుందని భయపడినట్లున్నాడు” అంది. నాన్న “వస్తే వస్తుంది. జలుబులూ జ్వరాలూ రాకుండానే మేమంతా పెరిగామా?” అన్నారు. ‘నిజమే కదా!’ అనుకుని అలా అందోళన పడినందుకు సిగ్గుపడ్డాను. అయితే ‘తోబుట్టువల పట్ల నా అంతట నేను తీసుకున్న బాధ్యత వల్ల వారి గురించి నేను ఆందోళన పడ్డానని’ తర్వాతి రోజుల్లో నాకు అర్థమైంది.

6

మా నాన్న మా అమ్మను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమెని ‘కాముడూ’ అని పిలిచేవారు.  నాన్నకు మేనమామ కూతురే మా అమ్మ. నాన్న చిన్నతనంలోనే తల్లితండ్రుల్ని కోల్పోయారు. ఓ అన్న, ఓ అక్కయ్యా, ఇద్దరు తమ్ముళ్ళు.. మొత్తం అయిదుమంది దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. అయిదుమందిలో నాన్నే బాగా చదువుకుని ఎస్.ఎస్.ఎల్.సి. మంచి మార్కులతో పాసయ్యారు. వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చి నెల్లూరు తాలూకాఫీసులో జాయిన్ అయ్యారు. మొదటిరోజు ఆఫీసుకు చొక్కా, నిక్కరు ధరించి వెళితే అక్కడి అధికారి “రేపటినుంచీ ప్యాంటు ధరించి రావాలి” అని నాన్నతో చెప్పారట. అప్పుడు మా అమ్మ మేనమామ కీ.శే. వి.జి.కృష్ణమూర్తిగారు ఆ రోజు సాయంత్రమే నాన్నకు ప్యాంటు క్లాత్ కొనిచ్చి, దాన్ని టైలర్‌కి ఇచ్చి, ఆ రాత్రే అతను కుట్టి ఇచ్చేలా ఏర్పాటు చేశారట.

నాన్న ఉద్యోగంలో వ్యక్తిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. పనిలో ‘జెమ్’ అని పేరుపొందారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తహశీల్దార్ అయ్యారు. అయితే ఆయన తన గతంలో తాను అనుభవించిన కష్టాల్ని మర్చిపోలేదు. ఆఫీసులోగాని, ఇరుగుపొరుగు ఇళ్ళలోగాని, బంధువుల్లోగాని ‘బియ్యానికి డబ్బులు లేవు’ అని ఎవరైనా చెబితే జేబులో ఎంత ఉంటే అంత వారికి ఇచ్చేసేవారు. తను పడిన కష్టం తన పిల్లలు పడకూడదని మాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నారు.

నాన్న పేరు డిప్యూటీ కలెక్టర్ ప్రొమోషన్ లిస్ట్‌లో ఉందని నాన్న చెప్పేవారు. అప్పటికి జిల్లాలో సీనియర్ మోస్ట్ తహశీల్దార్ ఆయన. అప్పుడు ఆయన కడప జిల్లాలో పనిచేసేవారు. మేమంతా చిత్తూరులో ఉండేవాళ్ళం. హోటల్ భోజనం ఆయన ఒంటికి పడేది కాదు.  పైగా ఆయనను ఆస్మా జబ్బు ఇబ్బంది పెడుతూండేది. అందువల్ల  మేము ఆయన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పాము. అప్పటికి నాకూ, మా పెద్ద తమ్ముడికీ బ్యాంకులో ఉద్యోగాలు వచ్చేసాయి. అయితే డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్ కావాలన్న్నది తన కోరికని చెప్పి, ఆర్డర్స్ కోసం ఎదురుచూడసాగారు ఆయన. అయితే ఆయన ఆశించిన ప్రమోషన్ రాలేదు. చాలాకాలం ఓపికతో ఎదురుచూసి, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తాను డిప్యూటీ కలెక్టర్ కాలేదన్న అసంతృప్తి ఆయనకు చాలా కాలం ఉండేది.

కడప జిల్లా గురించి తలచుకున్నప్పుడు ఓ తమాషా సంఘటన గుర్తొస్తూంది నాకు. నేను స్టేట్ బ్యాంక్‌లో చేరకముందు కడప జిల్లా జమ్మలమడుగులో సిండికేట్ బ్యాంకులో పనిచేశాను. అప్పటికి నాకు పెళ్ళయి ఆరు నెలలయింది. చిత్తూరులో కాకుండా మేము సంసారం పెట్టిన మొదటి ఊరు, చివరి ఊరు జమ్మలమడుగే. మాచే సంసారం పెట్టించడానికి కావలసిన సామగ్రితో అమ్మా, నాన్నా, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ కారులో జమ్మలమడుగుకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం నాన్న ఊరు చూడటానికి వెళ్ళారు. తిరిగి ఇంటికి రాగానే “ఏం ఊరు, ఏం మనుషులురా బాబూ? నడుస్తూంటే తోసేస్తున్నారు!” అన్నారు ఆయన. కొన్ని నెలల తర్వాత నేను చిత్తూరు స్టేట్ బ్యాంకులో జాయిన్ అయితే నాన్న తహశీల్దారుగా జమ్మలమడుగులో జాయిన్ అయ్యారు. ఆయన ఎవరి గురించైతే విసుక్కున్నారో ఇప్పుడు వారి కోసం పనిచేయాలన్నమాట. అయితే తర్వాత అక్కడి మనుషుల గురించి చాలా గొప్పగా చెప్పేవారు. కల్మషం లేని మనుషులని వారిని పొగిడేవారు.

నాన్న నాకు ఎప్పుడూ అవసరానికి మించి డబ్బులు ఇచ్చేవారు. వాళ్ళ అన్న గాని, తమ్ముళ్ళు గాని ఆయన్ని ఎప్పుడు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేవారు.  దూరప్రాంతాలనుంచి ఆఫీసుకు ఆర్జీలు ఇవ్వడానికి వచ్చిన గ్రామస్తులను ‘భోజనం చేశారా?’ అని అడిగి లేదంటే డబ్బులు ఇచ్చి భోజనం చేసి రమ్మనేవారని ఆయన స్నేహితుడు, నటుడు శ్రీ కృష్ణంరాజుగారు ఈమధ్యే ఆయన్ని నేను సన్మానించిన సభలో చెప్పారు.

ఆయన కడప జిల్లా ముద్దనూరులో తహశీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు ఉదయం ఇంటికి చుట్టుప్రక్కల ఉన్న తహశీల్దార్లందరూ వచ్చి పనిలో తమకు వచ్చిన సందేహాలను తీర్చుకుని వెళ్ళేవారు. ఆఫీసులో ఆయన ఎవరినీ అనవసరంగా ఒక మాట అనేవారు కారు. ఆయనలో నేను గమనించిన మరో గొప్ప లక్షణమేమంటే ఆఫీసు జవాన్లను ఇంటిపనులకు వాడకపోవడం. నేను అంగడికీ, రేషన్ షాపుకీ, మార్కెట్కీ తిరుగుతూంటే నాన్న ఫైల్స్ తీసుకువెళ్ళడానికి వచ్చిన బంట్రోతు “అవన్నీ మీరు ఎందుకు చేస్తారు సామీ? నాకు చెప్పండి.. నేనున్నానుగా!” అనేవాడు. నేను నాన్నవైపు చూస్తే ఆయన నాతో “నువ్వెళ్ళి తీసుకురా” అనేవారు. ఆఫీసు జీపుకూడా ఇంట్లోని మనుషులకోసం ఆయన వాడలేదు. ఆ విషయంలో నాన్నను తలచుకున్నప్పుడల్లా ఎంతో గర్వపడుతుంటాను. నాలో ఈ మాత్రం నిజాయితీ ఉందంటే అది మా నాన్న నుంచి అలవరచుకున్నదే.

నాన్న పుస్తకాలు బాగా చదివేవారు. చందమామ, బాలమిత్ర మొదలైన చిన్నపిల్లల పుస్తకాల దగ్గర్నుంచీ నవలల వరకూ (తెలుగు మరియు ఆంగ్లం) ఇంటికి తెచ్చి చదివేవారు. మ్యాగజైన్స్ కొని తెచ్చేవారు. నవలలు లైబ్రరీ నుంచి, స్నేహితులనుంచీ తెచ్చేవారు. ఆయన చదివాక వాటిని నేనూ చదివేవాడిని. ఏడవతరగతి నుంచే నవలలు చదవడం అలవాటయింది. అలా నాకు సాహిత్యం పరిచయం చేసింది మా నాన్నే. అయితే ఆయన నన్ను ‘ఆ పుస్తకాలు చదవొద్దని, పాఠ్యపుస్తకాలే చదవమనీ’ ఎప్పుడూ అనలేదు. ఆంగ్లంలో జేంస్ హాడ్లీ చేజ్ నవలలు అయితే దాదాపు ఆయన రాసినవన్నీ చదివాను. ప్రముఖ కవి, రచయిత శ్రీ ఎం.ఆర్.చంద్రగారితో నాన్నగారికి మంచి స్నేహం ఉండేది. నాన్న రోజూ ఆఫీసునుంచి రాగానే కాఫీ త్రాగి, చంద్రగారు నడుపుతున్న ‘పల్లెసీమ’ పత్రిక ఆఫీసుకు వెళ్ళి, అక్కడ వారితో కలసి చాలాసేపు సాహిత్య విషయాలు మాట్లాడుకుని, రాత్రి ఇంటికి వచ్చేవారు.

అమ్మ కూడా వారపత్రికలు చదివేది. ఆమెకి బాగా నచ్చిన కథలని నాకు చెప్పేది.

నేను బి.ఎస్.సి. పూర్తయ్యాక కొద్దిరోజులు నిరుద్యోగపర్వంలో ఉన్నాను. అప్పుడు పదవతరగతి అమ్మాయిలకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్ అమ్మాయికి ఫిజిక్స్ ట్యూషన్ చెప్పేవాడిని. మిగతా సమయంలో ఉద్యోగాలకు అప్లై చేయడం, పరీక్షలకు వెళ్ళడం, ఇంటర్వ్యూలకు వెళ్ళడం చేసేవాణ్ణి. ఇంకా సమయం మిగులుతూంటే ఓపికగా కూర్చుని ఏడు నవలలు రాశాను. అన్నీ అప్పటి వయసుకు తగ్గట్టుగా ప్రేమ కథలు, ఫ్యామిలీ సెంటిమెంట్తో రాసినవి. వాటిని బంధుమిత్రులకు చూపిస్తే వారు చదివి మెచ్చుకునేవారు. నేను వారిని చివరి పేజీల్లో కామెంట్స్ రాయమని కోరేవాణ్ణి. ఇప్పటికీ ఆ పుస్తకాలు నా దగ్గర భధ్రంగా ఉన్నాయి.

రచయిత ఉద్యోగంలో చేరక ముందు రాసిన నవలలు

అమ్మానాన్నలు నేను రాసిన ఆ నవలలు మాత్రం చదివారు. నా కథలు పత్రికల్లో రావడం, నేను రచయితగా మారడం, పుస్తకాలు ముద్రణ అవడం, పురస్కారాలు అందుకోవడం వాళ్ళు చూడలేదు. ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ బాధగానే ఉంటుంది నాకు.

(సశేషం)

Exit mobile version