[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్ కుమార్.]
~
ఎన్ని మకుటాలో నీ బుగ్గల కెంపులకేం తెలుసు
ఎంత వేడానో నీ చుబుకపు చరణముకేం తెలుసు
నా గుండె గదిలో పూజలందుకొను దేవేరి నీవు
ఎట్టి మధువుల గనియో నీ అధరాలకేం తెలుసు
మల్లియ నీతో మాటాడుతుంది చూడు
మేఘము నా తప్పును అడుగుతుంది చూడు
నువు పలుకనపుడు ఊసులెన్నో చెప్పాను
పూడ్చేసినాక నను చూపుతుంది చూడు
ఇంతి, నీతో కేరింతలాడు అంబువు నేను
ఇంకా స్వచ్ఛమై తిరిగొచ్చు అంబుదము నేను
నీ నీలి కనుల ఓలలాడి నోరెళ్లపెట్టి
ఏముంది నా మోమునకనెడి అంబుజము నేను
మల్లియకు చెప్పాను రేపిక నిను చూడనని
వెన్నెలకు సెలవన్నా నిన్నింక వేడనని
మేఘాల బాటలో నాకై చెలి వస్తుంది
సోయగాల మూట తను నేను తన నీడనని
స్నేహితుడు ఓ పగవాడని ఒక్కడైనా చెప్పాడా
స్నేహమే ప్రమాదకరమని ఒక్కడైనా చెప్పాడా
గుడ్డిగా నమ్మతగినది ఒక్క స్నేహమే అనుకున్నా
ఒరేయ్ పెళ్లి చేసుకోకని ఒక్కడైనా చెప్పాడా
గంగ లోకాలు దాట ఝరిని తలపైన పెట్టాడు
దేవతలు హడలిబోవ విషము కంఠాన పెట్టాడు
అలనాటి నుండి ఇలలో ఏమేమడిగిరో జనులు
అలసిన శంకరుడు రిసీవర్ పక్కన పెట్టాడు
ఓపిక అంచులు తాకాలనుంది నేనొక్కడినే
అందరి బాధలు తీర్చాలనుంది నేనొక్కడినే
మానవ సేవే మాధవసేవని నమ్ముతాను నేను
కొత్త లోకం నిర్మించాలనుంది నేనొక్కడినే
అల్లంత ఝరినాపగ ఆనకట్ట నీవు
తనువంత దాడిచేయ తేనెతెట్ట నీవు
కుసుమమొక్కటి చాలు కట్టడి చేయ మదిని
ఒకమాటలేమి చెప్ప పూలబుట్ట నీవు
రెక్కలు ఎర్రబడేంత చెదిరింది కుసుమం
సుకుమారం తగ్గిందని బెదిరింది కుసుమం
చెలి బుగ్గల నిగ్గులు చూసి నోరెళ్ళబెట్టి
రెండవ స్థానం తనదని అదిరింది కుసుమం
పైనే కాదు పక్కనుండీ వర్షమొస్తే కష్టం
డాలు లేకుండా కత్తినెదుర్కొనదలిస్తే కష్టం
విరబూసిన చెలి పదహారణాల సోయగాల తనువు
ఆపాదమస్తకం తూటాలు పేలిస్తే కష్టం
(మళ్ళీ కలుద్దాం)
రెడ్డిశెట్టి పవన్ కుమార్ భారతీయ రైల్వేలో ఉద్యోగి. పువ్వులంటే ఇష్టం. రుబాయీలు, కవితలు, ఆర్టికల్స్, పాటలు, ప్రకటనలు, స్క్రీన్ ప్లే ఇవి వారి కొమ్మకు కుసుమాలు. వీటిని ఏ కొమ్మన చూసినా, తన మనసు తుమ్మెద అవుతుందనే పవన్ కుమార్ తేనెలొలుకు తెలుగు భాషకు ప్రణమిల్లుతారు. ఫోన్:9392941388