Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరవశాలు, పదనిసల ప్రయాణాలు – ‘నా విహంగయానం విదేశీ విహారం’

[శ్రీమతి నాగేశ్వరి రూపాకుల గారి ‘నా విహంగయానం విదేశీ విహారం’ అనే ట్రావెలాగ్‌ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

తెలియని వాటిని తెలుసుకోవాలని, ప్రకృతిని ఆరాధించాలని, ఒక ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను, సంస్కృతిని, చరిత్రను అవగాహన చేసుకోవాలని కోరుకున్నవారికి ప్రయాణం ఒక గొప్ప సాధనం!

ప్రయాణాల గురించి ‘సుభాషిత మంజరి’లో ఒక శ్లోకం ఉంది.

విదేశేషు చ దేశేషు దేశాటనాత్ పండితానాం సమాగమాత్।
బుద్ధిర్వికసతే తైలం బిందువత్ ప్రసరత్యపి॥

వివిధ దేశాలు తిరగడం (దేశాటనం చేయడం) వల్ల, అలాగే విద్వాంసులు, జ్ఞానులైన పండితుల సాంగత్యం వల్ల మనిషి యొక్క బుద్ధి మరియు విజ్ఞానం ఎంతో వికసిస్తాయి. నీటిపై పడిన ఒక చిన్న నూనె చుక్క ఎలాగైతే వేగంగా విస్తరిస్తుందో, అలాగే దేశాటనం వల్ల మనిషి ఆలోచనా పరిధి కూడా అంతలా విస్తరిస్తుందని పై శ్లోకం తాత్పర్యం.

ఐతరేయ బ్రాహ్మణం (7వ అధ్యాయం, 15వ ఖండం) లో రోహిత మహారాజుకు ఇంద్ర దేవుడు ఉపదేశించిన ప్రసిద్ధ ‘చరైవేతి’ శ్లోకాలు కూడా ప్రయాణాల ప్రాధాన్యతని వివరిస్తాయి.

దేశవిదేశాల పర్యటన వల్ల కేవలం వినోదమే కాకుండా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

1. కొత్త సంస్కృతులను తెలుసుకోవడం:

వివిధ దేశాల ప్రజల జీవనశైలి, ఆచారాలు, సాంప్రదాయాలు మరియు వారి ఆహార అలవాట్లను నేరుగా చూసి తెలుసుకోవచ్చు. ఇది మన ఆలోచనా పరిధిని పెంచుతుంది. ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.

2. మానసిక ఉల్లాసం, ఒత్తిడి నివారణ:

దైనందిన జీవితంలో ఉండే ఒత్తిడి నుండి ప్రయాణాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కొత్త వాతావరణం, ప్రకృతి అందాలు మనస్సుకు సరికొత్త ఉత్తేజాన్ని, ప్రశాంతతను అందిస్తాయి.

3. వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మవిశ్వాసం:

కొత్త దేశంలో భాష తెలియకపోయినా, అక్కడి పరిస్థితులకు అలవాటు పడటం వల్ల మనలో సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఒంటరిగా లేదా జంటగా కొత్త ప్రదేశాలను అన్వేషించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

4. సరికొత్త దృక్పథం:

ప్రపంచం ఎంత పెద్దదో, అందులో మన పాత్ర ఎంత చిన్నదో అర్థమవుతుంది. జీవితాన్ని, సమాజాన్ని చూసే కోణం పూర్తిగా మారుతుంది.

5. చారిత్రక, భౌగోళిక జ్ఞానం:

పుస్తకాల్లో చదవడం కంటే, ప్రపంచ అద్భుతాలను (ఉదాహరణకు: ఈఫిల్ టవర్, పిరమిడ్లు) నేరుగా చూడటం వల్ల చరిత్ర మరియు భౌగోళిక విషయాలపై ప్రాక్టికల్ జ్ఞానం లభిస్తుంది.

6. సరికొత్త పరిచయాలు:

ప్రయాణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల వ్యక్తులు స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో వ్యాపార లేదా వృత్తిపరమైన అవకాశాలకు కూడా దారి తీయవచ్చు. చివరగా చెప్పాలంటే, విదేశీ ప్రయాణం అనేది మనం మన కోసం కొనుక్కునే అత్యంత విలువైన “జ్ఞాపకాల సంపద”.

ఇలా, దేశవిదేశాలలో ప్రయాణించడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈ సమీక్ష ‘నా విహంగయానం విదేశీ విహారం’ అనే ఒక ట్రావెలాగ్‌ది. రచన శ్రీమతి నాగేశ్వరి రూపాకుల.

~

నాగేశ్వరి రూపాకుల గారు సంగీత విద్వాంసురాలు, గాయని, రచయిత్రి, యూట్యుబర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 28 ఏళ్ళు ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం సంగీత గురువుగా వ్యవహరిస్తున్నారు. వీరు పలు దేశాలు సందర్శించి, తమ అనుభూతులను, అనుభవాలను గ్రంథస్థం చేశారు. భావుకురాలైన నాగేశ్వరిగారు ఆయా దేశాల లోని పర్యాటక ప్రదేశాల సందర్శనను ఆస్వాదించి, ఆ ఆస్వాదనను మనకీ పంచారు.

తాను చూసిన ప్రదేశాలలోని వింతలు విశేషాలు, సంస్కృతి, స్థానికుల జీవన విధానం, చరిత్ర, వాటి గత వైభవాలు వంటి వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ ట్రావెలాగ్‌ వివిధ దేశాలలో వారికెదురైన రమణీయమైన అనుభూతులు, మిశ్రమ అనుభవాలను ప్రస్తావిస్తుంది.

రచయిత్రి గాయని కావడం వల్ల, ఆయా పర్యాటక స్థలాలను సందర్శించినప్పుడు, సందర్భోచితంగా ఆమె నోటి వెంట కొన్ని చక్కని పాటలు వెలువడ్డాయి. పరవశాలు పదనిసలయ్యాయి, పాటలయ్యాయి.

మాల్దీవుల సందర్శనలో భాగంగా విమానం దిగి, రాజధానికి మాలేకి పడవలో వెళుతూ, ‘కలల అలపై తేలేను మనసు మల్లెపూవై’ అని గులేబకావళి సినిమాలోని పాడుకుంటారు. మాలే నుంచి జితాలీ వెళ్తూ, ఫెర్రీలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనంత జలరాశిని చూసినప్పుడు ‘భక్తప్రహ్లాద’ సినిమాలోని ‘జీవము నీవే కదా’ పాట గుర్తొస్తుంది రచయిత్రికి. ‘భవజలధిని పడి తేలగ లేని జీవుల బ్రోచే పరమ పురుష’ అని పాడుకుంటారు. మాల్దీవ్స్ లోని పలు దీవులకు, అక్కడి ప్రజల జీవన విధానాన్ని పరిచయం చేస్తారు. ఈత రానివాడు మాల్దీవియనే కాదంటారు. జితాలీలో ఉన్నన్ని రోజులు, స్వర్గంలో ఉన్నట్టు తోచిందట. మాల్దీవులలో కలిగిన ఒక గొప్ప అనుభూతి గురించి నాగేశ్వరి గారు ఏం చెప్పారో, ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవండి.

మాలే నుంచి శ్రీలంక వెళ్ళారు. శ్రీలంక పర్యటనకి ఏది ప్రేరేపించింది అంటే, రామాయణమే! లవకుశ సినిమాలోని ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’ అనే పాట వారి శ్రీలంక యాత్రకి స్ఫూర్తి. కొలంబో నుంచి దంబుల్లాకి సెవెన్ సీటర్ ఆటోలో వెళ్తారు రచయిత్రి కుటుంబం. అక్కడ గోల్డెన్ కేవ్ టెంపుల్ చూస్తారు. దంబుల్లా నుంచి హబరానా వెళ్ళి, అక్కడ ఏనుగులపై స్వారీ చేస్తారు. రచయిత్రి ఎక్కిన ఏనుగు పేరు మోనిక అట! అంతే, రచయిత్రికి ఓ పాట గుర్తొస్తుంది, ‘మోనికా, ఓ మై డార్లింగ్’ అంటూ ‘కారవాన్’ సినిమా పాటని పాడుకుంటారు. ఇక్కడ ఏనుగుల మీద విహరించడం జంతుహింస క్రిందకి రాదట! సీతా ఎలియా దర్శించినప్పుడు సీతాదేవిని తలచుకుని దుఃఖిస్తారు రచయిత్రి. హిందూవులకు, హిందూ సంస్కృతికి ఒక నిగూఢ పేటిక శ్రీలంక అని వ్యాఖ్యానించారు.

సింగపూర్, మలేసియా ట్రిప్‌లో సింగపూర్ లోని పరిశుభ్రత గురించి, క్రమశిక్షణ గురించి వివరిస్తారు. సింగపూరులో సాంబార్ రైస్ దొరికితే, ఆనందిస్తారు. తమిళ హోటల్స్ కనబడేసరికి అమ్మయ్య అనుకుంటారు. మొదటి రోజు స్థానికంగా పర్యాటక ప్రాంతాలు చూసివస్తారు. మణిరత్నం ‘దళపతి’ సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి/నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి’ పాట పాడుకుంటారు. సింగపూర్ ఫ్లయర్, మెరిలియన్, చైనా టౌన్, సెంటోసా ఐలాండ్స్‌ని ఆస్వాదిస్తారు. అక్కడ్నించి రోడ్డు మార్గంలో మలేసియా చేరుతారు. అక్కడ కౌలాలంపూర్ సిటీ టూర్ పూర్తి చేసుకుని, మర్నాడు బటు కేవ్స్ వెళ్తారు. అక్కడ్నించి జెంటింగ్ హైట్స్, చిన్ స్వీ కేవ్స్ చూస్తారు. చిన్ స్వీ కేవ్స్ లోని బంగారు బుద్ధుని విగ్రహం అబ్బురపరుస్తుంది.

ఐరోపా యాత్రలో భాగంగా, జూరిక్, లండన్, పారిస్, బ్రస్సెల్స్, నెదర్‌ల్యాండ్స్, కొలోన్, లైచెన్‌స్టైన్ వంటి నగరాలను సందర్శిస్తారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూస్తారు, మనకు చూపిస్తారు. ఒక్కో దేశంలో ఒక్కో అనుభూతి. అక్కడ్నించి ఇటలీ వెళ్తారు. రోమ్, వాటికన్ సిటీ చూస్తారు. ఎన్నెన్నో మధురానుభూతులను మూట కట్టుకుని హైదరాబాద్ చేరుతారు.

కంబోడియాలోని అంకోర్‌వాట్ వెళ్ళేందుకు ముందుగా సియామీ రీవ్‌ అనే ఊరిలో ఆగుతారు. ఒక టుక్ టుక్ ఆటో ఎక్కి, ఆ పూట ఆ ఊరిలోని ముఖ్యమైన ప్రదేశాలు చూస్తారు. అక్కడ ఓ దేవాలయంలోని విగ్రహాలలో ఒక వైచిత్రిని గమనిస్తారు. అదేమిటో, నాగేశ్వరి గారు ప్రత్యేక ఇంటర్య్వూలో చదవవచ్చు. అంకోర్‌వాట్‌ ఆలయాన్ని సూర్యోదయ సమయంలో వీక్షించడం అద్భుతంగా ఉంటుందని తెలుసుకుని, అలాగే సందర్శిస్తారు. ఆ అద్భుతాన్ని అంతే అందంగా అక్షర రూపం కల్పించి మనకందించారు. అంకోర్ వాట్ ఆలయ చరిత్ర, కంబోడియా రాజుల వివరాలు సమగ్రంగా తెలియజేశారు. అక్కడ్నించి థాయ్‌ల్యాండ్, అండమాన్‌లు వెళ్ళి ఎన్నెన్నో దర్శనీయ స్థలాలను చూస్తారు.

అబూదాబీలో పర్యటించినప్పుడు, హోటల్‌లో కాకుండా తమ కుమారుడి ఇంట్లో ఉండడం రచయిత్రికి ఆనందం కలిగిస్తుంది. అక్కడ్నించి దుబాయ్ వెళ్తారు. అక్కడి ‘మిరకిల్ గార్డెన్’ చూసి అచ్చెరువొందుతారు. చుక్క నీరు లేని ఎడారి ప్రదేశంలో అంత పూలవనం ఎలా సాధ్యమైందా అని ఆలోచిస్తారు. తర్వాతి రోజు బుర్జ్ ఖలీపా టవర్, బాలీవుడ్ థీమ్ పార్క్ చూస్తారు. అబూదాబిలో ఇరవై రోజులుండి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శిస్తారు. పాలకులు బాగుంటే, పాలన, దేశం ఎలా ఉంటుందో అబూదాబిని చూసి తెలుసుకోవచ్చని అంటారు.

బంగ్లాదేశ్ లోని ఢాకా వెళ్ళేందుకు రచయిత్రి ఎక్కిన విమానం నిండు కుండలా ఉందట. అంతమందిని ఆ విమానం మోయగలదా అని అనిపించిందట. ‘ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దెయ్యానివే’ అని పాడుకుంటారు. ఢాకాలో దిగి, తమకు కేటాయించిన అపార్ట్‌మెంట్‍కి వెళ్తారు. ఢాకా నుంచి బోగ్రో వెళ్తారు. అక్కడ హుస్నె అరా బేగమ్ ఎస్టేట్ చూస్తారు. ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుంటారు. అక్కడ్నించి భవానీపూర్ వెళ్తారు. ప్రతి ఇంటి ముందు పనస చెట్లు ఉండడం ఇక్కడి విశేషం. పనసపండు బంగ్లాదేశ్ జాతీయ పండట. అక్కడ అపర్ణ శక్తిపీఠ భవానీమాత ఆలయం సందర్శిస్తారు. ‘హిమగిరి తనయే హేమలతే’, ‘కామాక్షి కామకోఠి పీఠవాసిని’ అనే కీర్తనలు పాడతారు. మళ్ళీ ఢాకా చేరి, తర్వాతి రోజున చిట్టగాంగ్ ప్రయాణమవుతారు. చిట్టగాంగ్‌లోని శక్తిపీఠాన్ని, అక్కడున చంద్రనాథ్ చంద్రశేఖర ఆలయాన్ని దర్శిస్తారు. ఆ ఆలయానికి వెళ్ళే మార్గం దుర్భరంగా ఉంటుంది. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘చిన్నమ్మ’ కవితలోని పాదాలు, ‘దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం’ గుర్తు చేసుకుంటూ, గుడికి చేరుకుంటారు. గుడి ప్రశాంతంగా ఉంటుంది. ‘శంభో మహాదేవ శంకర గిరిజా రమణ’ అనే త్యాగరాజ కీర్తన పాడితే, పూజారి గారు అభినందిస్తారు.

ఇండోనేసియాలోని బాలి పర్యటనలో బడంగ్ ప్రాంతంలోని అద్భుతమైన గరుడ విష్ణు కెంచన విగ్రహం చూస్తారు. బాలి లోని బాతిక్ పెయింటింగ్ విలేజ్, గోల్డ్ అండ్ సిల్వర్ మేకింగ్ విలేజ్, ఉబుద్ స్వింగ్స్, కింటామని తదితర దర్శనీయా ప్రాంతాలను చూస్తారు. స్థానికుల జీవన విధానాన్ని అవగతం చేసుకుంటారు. చరిత్రని తెలుసుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా చేసిన బైసాకీ ఆలయ దర్శనం అత్యంత ప్రశాంతతని కల్గించిందనీ, ఏదో మార్మిక అనుభూతిని తనలో మిగిల్చిందని అన్నారు రచయిత్రి.

“జీవితం సప్తసాగర గీతం/వెలుగునీడల వేదం/సాగనీ పయనం” అంటూ ‘చిన్నికృష్ణుడు’ సినిమాలోని పాటతో పుస్తకాన్ని ముగించారు.

ప్రత్యేక గమనింపులు:

రచయిత్రి వివిధ దేశాలలో కొన్నింటిని ప్రత్యేకంగా గమనించారు. మాల్దీవ్స్‌ లోని గోడల మీద గ్రాఫిటీ; బంగ్లాదేశ్ గ్రామీణ జీవితం, ఇస్కాన్ ఆలయం బంగ్లాదేశ్‌లోని ఇంటీరియర్ ప్రాంతాలకి కూడా చేరడం, బాలినీయులు భలే మర్యాదరామన్నలు వంటివి. చివరగా, ఇంత సాంకేతిక ఉన్న రోజుల్లో, మన వ్యక్తిత్వాలు ఎందుకు మసకబారి ఉన్నాయి? అని మనకు మనమే విశ్లేషించుకోవాలని అంటారు.

~

“మనం చూసినవి అనుభూతితో రాస్తే ఇంత బాగుంటుందా?” అని అనుకున్నారు డా. తెన్నేటి సుధ, తమ ముందుమాటలో. ఈ పుస్తకం చదివాకా, ఆవిడ అభిప్రాయంతో పాఠకులు తప్పక ఏకీభవిస్తారు.

***

నా విహంగ యానం – విదేశీ విహారం (ట్రావెలాగ్)
రచన: నాగేశ్వరి రూపాకుల
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 112
ధర: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు బుక్స్, హైదరాబాద్
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
నవోదయ బుక్స్, కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 9000413413
రచయిత్రి: 9885185876

 

~
శ్రీమతి నాగేశ్వరి రూపాకుల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-nageswari-rupakula/

Exit mobile version