Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నాగలి కూడా ఆయుధమే..!’ లో పరిమళించిన మట్టి కవిత్వం

[శ్రీ విల్సన్‍రావు కొమ్మవరపు రచించిన ‘నాగలి కూడా ఆయుధమే..!’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు గౌతమ్ లింగా.]

వును నాగలి కూడా ఆయుధమే, దేశాన్ని దున్ని అభివృద్ధిని మొలిపిస్తుంది, కవిత్వం కూడా ఆయుధమే, దేహాన్ని దున్ని ఆలోచనల్ని మొలిపిస్తుంది. ఈ రెండింటికీ సమానమైన ఆశ్రయమిచ్చి మంచి అభివ్యక్తితో ఆలోచనామృతాన్ని కురిపించిన కవి విల్సన్‌రావు కొమ్మవరపు.

నాగలి కూడా ఆయుధమే కవిత్వం చదువుతున్నంత సేపూ మంచి కవిత్వంతో కరచాలనం చేసిన అనుభూతి కలిగింది. వస్తు వైవిధ్యం, ధర్మాగ్రహం, అన్నం పెట్టిన నేలకి దూరంకానితనం ఈ కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడా అల్లరిచేసే పదబంధాలు, అడ్డుకట్టలేసే భావావేశాలు, అర్థంకాని పదచిత్రణలు అగుపించవు. చాలా సాఫీగా హాయిగా విల్సన్‌రావు గారి చిరునవ్వులాగా సాగిపోతుంది.

నాగలి కూడా ఆయుధమే!’అనే టైటిల్ కవితలో:

సంఘర్షణ మాకేమీ కొత్త కాదు/ శ్రమకు ప్రతిఫలంగా/కలలే మిగులుతున్నప్పుడు/కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు/నిత్యం మట్టికి మొక్కడమొక/సహజాతం మాకు.

~

భూమికీ ఒక గుండె ఉందని/ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక/దాని ఊపిరితో ఊపిరి కలిపి/ఒక జ్వలనచేతనలో/నాలుగు చెమట చుక్కలు/ధారపోయకుండా ఉండలేము.

ఇలా సాగుతుంది ఈ మట్టి కవిత్వం. పుట్టిన ఊరిలో, నడచిన నేలలో పుట్టిన గట్టి కవిత్వం, నాగలి పట్టుకున్న హాలికుడి పక్కన కవి ఖచ్చితంగా నిలబడాలి. నాగలి సాళ్లల్లో రైతు విత్తనాలు గుచ్చుతుంటే కవి అక్షరాలు మొలిపించాలి. ఆ కష్టజీవి చమట చుక్కలే కవిత్వపు పైరుకు తడి. నాగలంటే ఎత్తు పొడవూ వంకర్లు తిరిగి ఉన్న కర్ర ముక్క కాదు ఈ దేశపు ముఖచిత్రం. నాగలంటే నాలుగు మెతుకులు నోట్లోపెట్టే అమ్మ అరచేయి. నాగలంటే నువ్వు కాకుండా నాన్న భుజానికి ఎక్కే ఇంకో బిడ్డ. అలాంటి నాగలి పక్కన కవి ఖచ్చితంగా ఉండాలి. అందుకే విల్సన్ రావు కుర్చీవేసుకొని కూర్చున్నాడు. రైతుది ధర్మయుద్ధం, విల్సన్‌రావుది ధర్మాగ్రహం. రెండూ రాజ్యం మీదనే, అన్యాయం మీదనే, ఇది ఆక్రోశం కాదు ఈరోజు కోసం ఆరాటం, రేపటికై పోరాటం. భూమి పొరల్లోంచి మానవోద్వేగాలని పెకలించి తీసే చిన్న ప్రయత్నం, రైతుని రాజుని చేసే యత్నం.

ఇప్పుడు నాగలి ఒంటరి కాదు./నాగలి ఒక సమూహం/నాగలి ఈ దేశపు జీవితం/నాగలి ఉత్పత్తికి జీవం/నాగలే మా సర్వస్వం/ఇప్పుడు నాగలే మా ఆయుధం..

అవును నాగలి నిజంగా ఆయుధమే హాలికుడికి, కవితా హాలికుడికి కూడా.

ఈ సంపుటిలో మంచి కవితా వాక్యాలు ప్రతీ కవితలో కనిపిస్తాయి, కవిత్వాన్ని కలవరిస్తూ, పలవరిస్తూ జీవితాన్ని అనుభవిస్తూ విల్సన్‌రావు కొత్త ఉదయాల్లోకి ప్రవేశిస్తాడు, ఈ కవిత్వం చదువుతుంటే చాలాసార్లు ఆ వాక్యాలు తన మాటలుగా చెబుతున్నా మనందరికీ, మానవులందరికీ సరిపోతాయనిపించింది

ఉదాహరణకి ‘అన్ని ఋతువులూ..’ కవితలో:

ఇప్పుడు నాకు జీవితమంటే/దుఃఖాన్ని పొరలుపొరలుగా/ఒలుచుకుంటూ/రెక్కలల్లారుస్తూ విచ్చుకుంటున్న/వెలుతురు పిట్ట..

ఇప్పుడు నాకు జీవితమంటే/నా చెమట చుక్కతో/మొలిచిన పాటకు బాణీ/నా కన్నీటి చెమ్మతో పదునెక్కిన/ ఋతుసంగీతం..

ఉద్రిక్తోద్విగ్న జీవన్మరణ/సందర్భాలనధిగమిస్తూ/నా కనులు చెమ్మగిల్లుతున్నాయి./ఆశ ఆకాంక్షల భరోసానిస్తూ/ఈరోజు ఋతువులన్నీ వరసలో వచ్చి/నా వాకిలిముందు ఆహ్వానం/పలుకుతున్నాయి

ఇలా సాగుతుందీ కవితా ఋతువు.

జీవితానికి అర్థాలు వెతుక్కునే పని కవి ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు, ఆ అర్థాల గుండా కవిత్వాన్ని, జీవితాన్ని నిత్యం కొత్తగా కలగంటాడు. మంచి కవిత్వం దానివెనుక అత్యద్భుతమైన భావం ఎప్పుడూ బాగుంటుంది. ఇలా బాగుండే కవితలు ఈ సంపుటిలో చాలానే ఉన్నాయి. అయితే ఆ కవిత్వానికి కొంచం బాధ్యతని పులిమిన కవి విల్సన్‌రావు, ‘మహా సంకల్పం’ శీర్షికతో ఉన్న కవితలో బాధ్యతతో ఎలాంటి ఒళ్ళు గగుర్పొడిసే కవిత రాసాడంటే:

ఏ తరగతికి ఏ బడిలో చేర్పించాలో/ఏ వయసువాడు ఎలా స్పర్శిస్తాడో/ఎవడి స్పర్శలో/ఏమేమి అర్థాలుంటాయో/నా బిడ్డకు అర్థమయేలా చెప్పే/ఉపాధ్యాయుడెవరో వెతకాలిప్పుడు.

ఏ తోడేలు స్పర్శ ఎలాంటిదో/ఏ గుంట నక్క ఎక్కడ నక్కి/కామంతో ఊళ వేస్తుందో/నా బిడ్డకు జాగ్రత్తలు నేర్పి మరీ/బడికి పంపాల్సిన రోజులివి.

జన సమూహంలో ప్రవహిస్తున్నప్పుడు/ఏ రాక్షస హస్తం నా బిడ్డని ఎలా చిదిమేసి/బతుకుగింజను రాల్చేస్తుందో/అంతుపట్టక సతమతమవుతున్నాను

వెచ్చని లాలింపుతో/నా బిడ్డ జీవితాన్ని పరిమళభరితం చేస్తూ/తల్లి ఋణం తీర్చుకునే/మహా సంకల్పం నేర్పాలి

నేనిప్పుడు/నా బిడ్డలాంటి బిడ్డల కోసం/ఇంగిత జ్ఞానం బోధించే/అనేకానేక మహా విశ్వవిద్యాలయాలు/నిర్మించాలి..

ఇలా సాగుతుందీ కవితా సంకల్పం. ఇది నిజంగా మహా సంకల్పం.

జాగ్రత్త తల్లీ! ఇది బతకాల్సిన కాలం’ కవితలో కొన్ని పంక్తులు.. చాలా జాగ్రత్తలు చెప్పాక కవి ఇలా అంటాడు:

నిలవ నీడలేని జాగాల్లో నిలబడకు/నిలబడినా జాగ్రత్త!/ఒక్కొక్కసారి చెట్టు కొమ్మల్లోంచి చూసే/ఆ సూర్యుడే కామోష్ణోగ్రత పెరిగి/సన్నజాజి తీగల్ని మాడ్చి మసి చేసినట్టు/నీ జీవితాన్ని చిదిమేయవచ్చు..

ఒక్కొక్కసారి నీ నీడే/నిన్ను నీకు తెలీకుండానే/వెంటాడి, వేధించి కామంతో కాగిపోతూ/కాలనాగై కాటేయవచ్చు..

రద్దీ రహదారుల్లోనూ/రద్దీ కూడళ్ళలోను నిలబడకు/ఆకాశంలో తిరిగే గద్దలు కూడా/కామవాంఛలతో తమ నీడల్ని/నీమీద ఉసిగొల్పవచ్చు..

ఎంత గొప్ప మాటలు ఇవి, చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచి, దుఃఖం ఉబికివస్తుంది. ఇలాంటి కవిత్వం సమాజాన్ని యథాతథంగా చూపిస్తుంది. అద్దాలు బద్దలు కొట్టి ఉన్నది ఉన్నట్టు, విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు ప్రశ్నలు విసిరినట్టు కవిత్వం పుట్టాలి. ఇదే ఇప్పుడు నిజంగా అవసరం.

అప్పుడెప్పుడో ఒక కవి “ఈ జాతి మగతనాన్నంతా విచ్ఛిన్నం చేసి బంగాళాఖాతంలో విసిరేయాలి” అన్నట్టు, నిత్యం ఎప్పటినుంచో అందరం కవిత్వమై మొత్తుకుంటున్నట్టు ఈ కవి కూడా కొంచం ఇంగితజ్ఞానం కోరుకుంటున్నాడు. అంతే ఇంకేం లేదు, ఇది నిజంగా కొత్తదేమీ కాదు. అవసరమైనది అంతే. అన్ననీ, తమ్ముడినీ చివరకు నాన్నని కూడా జాగర్తగా చూసి ఆలోచించి చేయి పట్టుకోమ్మా, దగ్గరగా ఎవ్వరి దగ్గరా ఉండకమ్మా అని చెప్పే రోజులనుంచి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, ఇది చెప్పడానికి నేను కొంచం కూడా సిగ్గు పడట్లేదు, ఎందుకంటే నేను సిగ్గు తప్పిన సమాజం మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాను. బాధతో ఆవేశంతో కాదు చాలాసార్లు సిగ్గుతో కోపంతో కన్నీళ్లు కార్చిన వాడిగా చెపుతున్నాను. చాచి చెంపదెబ్బలు కొట్టే కవిత్వం కావాలి ఇప్పుడు, మాట వినకపోతే చెవులు మెలితిప్పే కవిత్వం రావాలి ఇప్పుడు, అదే అవసరం, అత్యవసరం, నిత్యావసరం. సరిగ్గా అలాంటి ప్రయత్నమే ఈ కవిత, ఇది కవిత్వం మాత్రమే కాదు ఇదొక నినాదం. ఇది కవిత్వం మాత్రమే అసలే కాదు మార్పుకోసం ఇదొక ప్రయాణం.

కొంచం ముందుకెళ్తే, “ఒకళ్ళకొకళ్ళం రాపిడి చేసుకోనైనా/స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించే/సునామీని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి” అంటూ ప్రభోదిస్తాడు ఓ కవితలో.

ఒక దీనుడి యుద్ధగీతం’ కవితలో:

నిలదీయ్.. నిలదీయ్/నిలదీయాల్సిన వాళ్లను నిలదీయ్/ఒంటినిండా కప్పుకోవడానికి/వస్త్రం కావాలని నిలదీయ్..

ఇక ప్రశ్నించడానికి దారులన్నీ మూసుకుపోయి/నువ్వు పాలుకుడిపిన చేతులే/నీకు సంకెళ్లు వేసినప్పుడు ఒట్టిపోయిన ఈ ప్రపంచం/వేళ్ళు తెగిన మొండి చెయ్యి అని ప్రకటించు

అంటాడు. ఇలాంటి కవిత్వం రాయడానికి చాలా సామాజిక బాధ్యత అవసరం. అక్షరం అక్షరంలో సమాజాన్ని కుటుంబంలా భావించి ప్రేమించగలిగితేనే ఇలాంటి వాక్యాలు రాయగలం. కవిత్వం మార్పుని కోరాలి, ఆలోచనని పెంచాలి, కొత్తదనాన్ని స్వాగతించాలి, పాతని గౌరవించాలి, అప్పుడే కవిత్వం పరిపూర్ణమవుతుంది. ఆవేశం, పదాడంబరం వాక్యాలుగా మిగిలిపోతాయి. చాలాసార్లు కవిత్వం చదవడం పూర్తయ్యాక ఆలోచన పుడుతుంది. అలాంటి కవితా వాక్యాలు ఈ సంపుటిలో కోకొల్లలు. ఇది భాషని జాగర్తగా వాడి రాసిన కవిత్వం. అవకాశం ఉన్నా కూడా ఎక్కడా దారి తప్పకుండా, పదాల పగ్గాలు చేతుల్లో గట్టిగా పట్టుకొని పొందికగా, ఒడుపుగా దిద్దిన కవితాచిత్రం. అందుకే దీనికి జీవనకాలం ఎక్కువ. సామాన్యుడి గురించి సామాన్యుడి భాషలో రాసిన కవిత్వం.

వంశీకృష్ణ గారు అన్నట్టు, “విల్సన్‌రావు గారి కవిత్వమంతా స్త్రీలపట్ల గౌరవం, రాజ్యం పట్ల అసహనం, దళిత బహుజన ఐక్యత పట్ల ఆశావహ దృక్పథమూ మొత్తంగా సమాజం పట్ల ఒక బాధ్యతా కనిపిస్తాయి. ఒక కవిగా దుఃఖితుడి పక్కన నిజాయితీగా నిలబడాలి అనుకుంటారు. కవిత్వంలో అలాగే నిలబడ్డారు”.

ఇంకొంచం దూరం విల్సన్‌రావు గారితో కలిసి నడిస్తే, ‘సరికొత్త పాట’ కవితలో ఇలా వినబడతాడు:

కొన్ని పదాల్ని చనుబాలలో తడిపి/గుదిగుచ్చి మాలకట్టి/పాటకు శ్వాసనూది/ఆకాశంలోకెగరేశా!

కాంతిని పీల్చుకున్న/మనిషి ప్రాణంలాంటి గానం/విశ్వంలా నిలబడింది..

పిల్లా, జెల్లా, ముసలీ, ముతకా/అందరూ చెవులు రిక్కించి/పాట వింటూనే ఉన్నారు..

అంటూ మొదలైన కవితా ప్రవాహం…

ఘనీభవించిన మౌనాన్ని చీలుస్తున్న/నిశ్చల నిశీధిలోని/పాలపుంతల సమూహం/చిక్కటి చీకటి రాత్రిని వెలిగిస్తూ/నా పాటకు/స్వాగతగీతం పాడుతున్నాయి/ఇప్పుడు/నా పాట జాతీయ గీతం

అంటూ ముగుస్తుంది. ఇలా సరికొత్త పాటలు వినిపిస్తాడు ఈ కవితలో. ఈ సంపుటిలో వస్తు వైవిధ్యం ముచ్చటేస్తుంది. ప్రతీ సామాజిక ఉన్మాదం, సామూహిక ఉత్పాతం ఇక్కడ కవిత్వమవుతుంది. కరోనా, పుల్వామా, యూరి మొదలుకొని పఠాన్‌కోట్‌లు, నోటాలు, చెల్లని నోట్లు, చెల్లే నోర్లు అన్నీ కవితా వాక్యాల్లోకి ప్రవహిస్తాయి, ఇది సమాజాన్ని తనలోకి ఒంపుకొని రాసిన కవిత్వం.

ఇంకో కవితలో ఇలా మ్రోగుతాడు:

కవులంటే కణకణమండే అగ్నికణాలు కదా!/కవితో మాట్లాడటమంటే సూర్యుడితో మాట్లాడటం కదా!

మత్తును వదిలించే పసరాకు పూసుకుని/భగభగ మండే అగ్నిసరస్సుల్ని/కలాల కల్లాల్లో పొలిపొద్దాం

వాళ్ళ పాపాల పుట్టలుపగిలి/చలిచీమలు బారులు తీరి/మృగమదాల అహాన్ని గెలిచేరోజులు ఎదురుగానే ఉన్నాయని/నిష్కర్షగా హెచ్చరిద్దాం.

కవులెలా ఉండాలో, కవిత్వమెలా నినదించాలో సూటిగా నిక్కచ్చిగా ‘అహాన్ని గెలిచే రోజుకోసం’ కవితలో చెప్పిన వాక్యాలివి. ఇవి కేవలం మాటలు కావు ఆచరించి చూపిన బాటలు. తాను పాటించిన కవితాదారులు. రేపటి కవితరానికి అడుగుజాడలు. ఆకాశాన్ని చూడాలంటే ఎంత పెద్ద మేడలైనా, మిద్దెలయినా, హంగులైనా, ఆర్బాటాలైనా దాటి బయటకొచ్చి మైదానంలో నిలబడాలి. ఆకాశం నీకోసం ఇంటి చూరుకు వేలాడదు. అలాగే విల్సన్‌రావు కవిత్వం కూడా అంతే. పాఠకుడిని తనలోకి తీసుకెళ్తుంది లోకాన్ని మరో కోణంలో చూపించి మైమరపించి మంచి అనుభూతుల్ని మిగుల్చుతుంది. పాఠకులు తయారుగా ఉండాలి అంతే!.

“కాలం ఇప్పుడు ఇంకిన నదిలా తనలోకి తాను ముడుచుకుపోతుంది” అంటాడు ఒక కవితలో. నాకు చాలా బాగా నచ్చిన మాట ఇది. కాల ప్రవాహాన్ని నదీ ప్రవాహంతో చాలామంది కవులు పోల్చినా, కాలం ఇంకి తనలోకి తాను ముడుచుకుపోవడం ఇక్కడ మంచి భావన. కవిత్వం కొన్నిసార్లు మనిషికి సంబంధించిన విషయం. కానీ అన్నిసార్లూ మనసుకు సంబంధించిన విషయం.అలా మనసు నుంచి మాట్లాడే మాటలెన్నో ఈ కవిత్వంలో కనిపించి మైమరపిస్తాయి

అలాంటిదే ‘ప్రియ సఖీ!నీ రాకతో..!!’. కవితలో ఈ కవితా పాదాలు చదవండి.

భరోసా బతుకు కోసం/సిగ్గుతెరల చిరుగుల్లోంచి/ప్రేమకు పట్టాభిషేకం చేసి/జీవితానికి సరిపడా/నువ్విచ్చిన మొదటి ముద్దుకు/ ఏమిచ్చి నీ బాకీ తీర్చగలను..!

అంటూ తొలిముద్దుకు ప్రేమాభిషేకం చేస్తాడు కవి. తొలిముద్దు తీపినీ, గాఢతనీ రాయని కవీ, తలచుకోని మనిషీ బహుశా ఉండడేమో! అందమైన కవితా వాక్యాల్లోకి అధరాల్ని తీసుకొచ్చి ముద్దులొలికే కవితై ముగిస్తాడు. అయితే విల్సన్‌రావు గారి జీవన సహచరితో చేసిన ప్రేమసంభాషణ, కవితా భాషణ కూడా నాకు బాగా నచ్చింది.

మంచి కవిత్వాన్ని నిత్యం యుద్ధంలాగా రాస్తున్న విల్సన్‌రావు గారికి శుభాకాంక్షలు.

***

నాగలి కూడా ఆయుధమే..! (కవిత్వం)
రచన: విల్సన్‌రావు కొమ్మవరపు
పేజీలు: 182
వెల: ₹200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
కె. విల్సన్‌రావు
5-2-396/SS/P42,
సౌభాగ్యనగర్ కాలనీ,
సాహెబ్ ఖాన్ నగర్, వనస్థలిపురం,
హైదరాబాద్ 500070
ఫోన్: 8985435515
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/naagali-kooda-aayudhame

~

విల్సన్‍రావు కొమ్మవరపు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-wilson-rao-kommavarapu/

Exit mobile version