Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాకూ ఒక మనసున్నాదీ..!!

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘నాకూ ఒక మనసున్నాదీ..!!’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము.]

1.

(ఈ కథాకాలం 1980 ప్రాంతానికి చెందినది. ప్రదేశం కర్నూలు జిల్లా లోని ఓ నీటియెద్దడి ఊరు.)

అప్పటికింకా తొలి కోడి కూడా కూయలేదు. వీథిలో చిన్నపాటి సంచలనం బయల్దేరింది. ప్లాస్టిక్ బిందెల చప్పుళ్లు, “కుమ్మరోళ్ల బజారులో నీళ్లు వస్తాన్నాయంట. పోదాం పాండి. అందరూ లేచే పాటికి రెండు బిందెలైనా పట్టుకుందాం” అని తగ్గుస్వరంలో ఆడుతున్న మాటలూ, వాకిళ్లు మూస్తూన్న, తెరుస్తున్న చప్పుళ్లు, గబగబ సాగే అడుగుల శబ్దాలూ వినిపించనే వినిపించినాయి వీరారెడ్డికి.

అంత నిద్దట్లోనూ ‘నీళ్లు వస్తాన్నాయంట’ అనే మాటకు దిగ్గున లేచి కూర్చున్నాడు అతడు. వాకిలి గడియ తీసుకుని బయటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. విసవిస నడుస్తూ ఇంట్లోకొచ్చి..

“అమ్మే! నాగులక్కా! తొరగా లెయ్యే.. కుమ్మరోళ్ల బజార్లో నీళ్లొస్తన్నాయంట!” అని గట్టి స్వరంతో లేపాడు, నాగులక్కను.. అదే నాగలక్ష్మిని.

నాగులుకు విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడే మంచి కల వస్తా వుంది. కలలో తాను, తన కలల నేస్తం సామిరెడ్డీ పెళ్లి చేసుకున్నట్టూ, తన తలపై అతనూ, అతని తలపై తనూ తలవాలు పోసుకున్నట్టూ, అతను తన మెడలో తాళిబొట్టు కట్టినట్టూ, తన అన్నా ఒదినా తనకు ఒడిబియ్యం పోసినట్టూ, కాళ్లనిండా పులిమిన పసుపుతో, మెడలో మంగళ సూత్రాలతో, మొహాన పెద్ద కుంకుమబొట్టుతో, మంచి చీరగట్టుకోని, తలనిండా పూలతో తాను అత్తగారింటి గడప పైన పెట్టిన ఇత్తడి లోటాలోని బియ్యాన్ని కుడికాలి బొటనవేలితో లోపలికి తోసి.. వాళ్ల ఇంటి లోపలికి అడుగు పెడుతున్నట్టూ.. ఎంత బాగుంది కల! మధ్యలో కలను చెదర గొట్టేసినాడు ఈ పాపిష్టోడు!

గుంతపడి పోయి, ఉయ్యాల లాగా మారిన నులక మంచంలో మత్తుగా ఇటు నుంచి అటు పొర్లింది నాగులు మూలుగుతూ.

“లేస్తన్నావా లేదా? లేచి బిందె తీసుకో!” గద్దించినాడు వీరారెడ్డి.

అరకాలి మంట నెత్తిపైకెక్కింది నాగులుకు.

“యేందిరా.. నేను పండుకుంటే సూడలేవా? నువ్వు పోయి తెచ్చుకోపో ఆ పాడు నీళ్లు! నీ నీళ్ల మీద బండ పడ! నీళ్లకు రాత్రీ పగులూ లేదా? పాడు ఊరు.. పాడు నీళ్లు.. పాడు మనుసులు..” తిట్లకు మొదలుపెట్టింది నాగులు.

అన్నను ‘ఒరే’ అనడం ఆ ప్రాంతాల్లో అపరాధమే! అయితే అలాంటి మర్యాదను వీరారెడ్డి నిలబెట్టుకోలేదు. నాగులూ లెక్క జెయ్యలేదు. అక్కచెల్లెళ్లనూ ‘యేమే.. ఒసే’ అని అన్నదమ్ములు అనడమూ నిషేధమే అక్కడ! అయితే వీరారెడ్డికీ, నాగులక్కకూ అలాంటి విధినిషేధాల పట్టింపేమీ లేదు.

“చెప్తాంటే తమాషాలుగా వుందా? లేయ్! నీళ్లు తే పో. పండుకుంటా దంట పాపం! రాజకుమార్తె! నువ్వు యేలే రాజ్జాలేం లేవులే యిక్కడ!” ఇలా రెట్టిస్తూనే వున్నాడు.

“నువ్వు నీళ్లకు పోవు! నీవొక మగారాజువు! నీ పెండ్లాం బోదు.. ఆయమ్మ ఒక రాణి స్త్రీ. నేనొక్కదాన్నే అంత అదవ (అధమంగా, తేలిగ్గా)కు దొరికినానా? అయినా యేమి అన్నవురా.. చెల్లెల్ని అద్ధమ్మ రాత్రి (అర్ధరాత్రి)లో ఒక్కదాన్ని ఈదులెంట తిప్పుతావు. సిగ్గూశరం లేని నాయాలా!” తిట్లకు లంకించుకుంది నాగులు.

“యేమ్మే! నోరు శానా లేస్తాందే! పెండ్లీపెటాకులూ లేకుండా మా నెత్తి మీద శనేశ్వరం మాదిరి కూకున్నావు.. ఇంట్లో పనులు నువ్వు సెయ్యకుంటే ఎవరు సేస్తారు? దేవర దున్నపోతు మాదిరి సాకుతా వున్నాము కదా? లేస్తావా లేదా?” అని మంచానికున్న దోమతెర కట్టెలు పీకి అవతల పారేసినాడు వీరారెడ్డి.

(ఆ ప్రాంతాల్లో దోమలు విపరీతం కావడంతో అందరూ మంచాలకు దోమతెరలు కట్టుకుంటారు. ఇటు రెండు, అటు రెండు ముల్లుగర్రలకు దోమతెరను బిగించి, వాటిని వ్యతిరేకదిశలో మంచం కోళ్లకు అమరుస్తారు.)

ఆ మాటలకు ఎక్కడో తగలకూడని చోటే తగిలింది దెబ్బ నాగులుకు.

“నువ్వు నాకేమన్నా వుట్టి పున్యానికి బువ్వ పెడతా వున్నావా? నాయన నా పేరు మీద పెట్టిన రెండెకరాల సేను లేదా? నేను రోజల్లా నీ కొంపలో శాకిరీ సెయ్యలేక సస్తావున్నానే! నువ్వు పెట్టే బువ్వకు పదింతల శాదానం (పని, పనిచేసే విధానం) సేస్తా వున్నా.. ఇంకా నీకు సాల్లేదా?” అని రయ్యిన మంచం మీది నుంచి లేచింది నాగులు.

అసలే తన కల చెదరినందుకు చాలా బాధగా వుంది ఆమెకు. పైగా మాటలొకటి!

“ఇంగ మాట్లాడింది సాలు గానీ, బిందె తీసుకోనిపో! బలే చేస్తున్నావులే పనులు! చూసినాములే నీ శాదానం! పోపో.. తొందరగా పోకుంటే ఆ ఒక్క బిందెడు నీళ్లు కూడా దక్కవు. పని సేసేది తక్కువ. మాటలెక్కువ!” అని ఆర్డరు వేసింది వదిన తులిశమ్మ మంచం మీది నుంచి లేవకుండానే.

‘ఆమె నోరు లేచిందంటే ఇంక ఆపదు’ అనుకొని ఇక చప్పుడు చెయ్యలేదు నాగులక్క.

ఈ సన్నివేశం రోజులో రెండు మూడు సార్లయినా చోటు చేసుకుంటుంది ఆ ఇంట్లో.

ఇక తప్పదన్నట్టుగా, నిద్రమత్తులో తూగుతూ, మెల్లగా అడుగులు వేసుకుంటూ పోయి రెండు ప్లాస్టిక్ బిందెలు అందుకుంది ఆమె. ఇంత పనికిమాలిన అన్ననూ, గయ్యాళి గంప లాంటి వదినెను, దయా దాక్షిణ్యం లేకుండా తనను అనాథలుగా చేసి వదిలి పెట్టిపోయిన అమ్మా నాయనలను, అందరి వలె తనకు పెండ్లికాకుండా పోవడానికి కారణమైన తన అనాకారితనాన్ని పైకి కాస్సేపు తిడుతూ, లోలోపల తిట్టుకుంటూ నీళ్లకు బయలు దేరింది నాగులక్క.

ఈ రచ్చ అంతా ఆ చుట్టుపక్కల వాళ్లకూ అలవాటైన విషయమే! ‘కొత్తేముందీ? నిత్తెకృత్తెం..(నిత్యకృత్యం) రామనామం.. ఎప్పుడుండే బాగవతమే!’ అనుకుని మళ్లీ నిద్రకు ఉపక్రమించినారు చుట్టుపక్కల వాళ్లు. తెల్లవారుజామున ఇంట్లో ఒకరో ఇద్దరో నీళ్ల కోసం పోయాక నిద్రపోగలిగిన అదృష్టం వున్నవాళ్లు వాళ్లు!

కోపంతో ధనధనా కాళ్లను నేలకేసి బాదుతూ బయలుదేరింది నాగులక్క. వీథి కుక్కలు మొరుగుతూ మీది కొచ్చినాయి.

“నీయమ్మ! మీకు కూడా సులకనై పోయినానేమే నేను?” అంటూ బిందెలతో బెదిరించింది నాగులు. అవి పక్కకు తప్పుకున్నాయి.

బాపనోళ్ల ఇళ్లు దాటి, కాపోళ్ల బజారు దాటి, జంగమోళ్ల ఇళ్లు దాటి కుమ్మరోళ్ల వీథికి చేరుకుంది. అప్పటికే చాలామంది పోగయి వున్నారు అక్కడ!

“వచ్చిందిరా నాయనా గంగా బవాని! ఊళ్లో యే కొళాయిలో నీల్లచుక్క పడినా దీనికి తెలిసి పోతాది. ఔ.. నాగులక్కా! పలానా ఈదిలో నీళ్లొస్తన్నాయని కలేమైనా పడతాదా నీకు? ఈమె బతుకంతా నీల్లబిందెతోనే సరిపోతుంది” అనింది కుమ్మరోళ్ల ఎల్లమ్మ నాగులక్కను చూసి వెటకారంగా.

“పెండ్లీపేరంటం లేకుండా బరెగొడ్డు మాదిరి తిప్పుతున్నాడు ఈమె అన్న. సిగ్గూశరం లేనోడు. గంతకు తగ్గ బొంతను చూసి కన్నెసెర ఇడిపిచ్చకుండా.. ఇంట్లో శాకిరీకి దింపినాడు” ఈసడించింది చాకలి తిమ్మక్క.

“అనాకారిదాన్ని ఎవరు చేసుకుంటారులే అక్కా? ఆయన్న మాత్రం యేమి చేస్తాడులే!” వీరారెడ్డిని సమర్థించినాడు ముల్లా వాళ్ల చాంద్ బాషా.

చీకటి రాత్రి వేళ నాగులు నీళ్ల కొస్తుంటే బాషా చెయ్యి పట్టు కోవడానికి ప్రయత్నించాడొకసారి. నాగులు వాణ్ని బిందెతో చావబాదింది. ఊరంత నోరు పెట్టుకోని రచ్చారాజ్యాంతం చేసింది. కాళ్లు పట్టుకొని ‘తప్పయిందని’ ఒప్పుకునే వరకూ వదల్లేదు. అప్పటినించీ ఆమె అంటే భయం అతనికి. ఏదో అనాలనుకుంటాడు గానీ, నాగులక్క నోరన్నా, చెయ్యన్నా దడుపే అతనికి.

“మొదటి పెండ్లివోడు దొరక్కపోతే, రెండో పెండ్లోడినయినా చూడొచ్చు కదా? పెండ్లిచేస్తే దాని పేరు మీద వున్న రెండెకరాలు దానికి ఇయ్యాల్సి ఒస్తాదని సచ్చిపోతా వున్నాడు ఈరారెడ్డి” అని తేల్చింది రెడ్డిగారి పాపమ్మ.

ఇవన్నీ వింటున్న నాగులుకు కోపం నాగుపాము వలె బుసకొట్టి పైకి లేచింది.

“మీకందరికీ పనులూ పాటలూ యేం లేవా? నా కత మీకెందుకు? నాకు పెండ్లి అయితే మీకెందుకు? కాకపోతే మీకెందుకు? నేనేమన్నా మిమ్ముల్ను అడిగితినా పెండ్లి సెయ్యమని! మీరెట్లా నీల్ల కోసం ఒచ్చినారో.. నేనట్లే ఒచ్చిన. మీకు నీల్లొచ్చినట్టు ఎట్టా కలబడిందో నాకూ అట్టనే వొచ్చింది. నా జోలికి గిన ఎవురైనా వొస్తిరో.. మరేద (మర్యాద) దక్కదు జాగరత్త..” ఇట్లా నాగులక్క రెచ్చిపోయి మాట్లాడతానే వుంది.

దాని కథకు ఎవరైనా వొచ్చి నారంటే వాళ్ల పీడా జెష్టా విడిపిస్తుంది. తిట్టీ తిట్టీ గొంతు బొంగురు పోయేవరకూ అరుస్తూనే వుంటుంది. మొత్తం తననెవరైతే మాటలు అన్నారో.. వాళ్ల వంశంలో అటు యేడు తరాలు, ఇటు యేడు తరాల చరిత్రలన్నీ తిరగేస్తుంది. మొత్తం అందరినీ కడిగిపారేస్తుంది. వాళ్లు చేసిన తప్పులన్నింటినీ బజార్లో పెట్టి నిలదీస్తుంది.

అంత సన్నటి శరీరంలో అంత వాగ్ధాటికి సరిపడే శక్తి ఎక్కడినించి వస్తుందో అర్థం కాదు. అందరూ నోరుమూసుకున్నారు.

నాగులక్క వయసు ముప్ఫయి దగ్గరగా వుంటుంది. ఆ రోజుల్లో ఇంక పెండ్లి కాదని నిర్ణయించే వయసు అది!

విల్లు వలె వంగిన వీపు, పొడు గాటి సన్నటి శరీరం, నల్లటి నలుపు, చమురు లేక ఎర్రబారిన జుట్టు, మొహం పొడుగ్గా వుండి, కళ్లు చైనా వాళ్ల కళ్లలాగా చిన్నగా, సోగగా కనీకనిపించనట్టు వుంటాయి. మొహమంతా ఒక వికారం పుట్టించే నునుపుతో వుంటుంది.

కొత్త చీర కట్టి ఎన్నాళ్లయిందో.. యేమో.. ఆమెకే గుర్తు లేదు. వదినగానీ, చెల్లెలు గానీ కట్టివిడిచిన చీరలే గతి ఆమెకు!

కానీ ఇద్దరు మనుషుల పని చేయగల చేవ, చెక్కుచెదరని ఆరోగ్యం ఇంత దురదృష్టంలోనూ ఆమెకు దేవుడిచ్చిన వరం!

చిన్నప్పటి నించీ, ఇంటా బయటా అందరూ హేళన చెయ్యడంతో తనను తాను కాపాడుకోవడానికి అందరినీ తిట్టడం, కొడ్తానని వెంటపడటం, ఎట్లా జవాబు చెప్పాలో తెలియక ఒక్కోసారి భోరుమని యేడవడం, ఒక్కోసారి తనను యేడిపించినకొద్దీ పకపకా నవ్వడం.. చేసేది.

దీంతో ‘తిక్క నాగులక్క, గూని నాగులక్క, ఎర్రినాగులక్క’ అని పేర్లు పెట్టడం మొదలు పెట్టినారు ఊళ్లోవాళ్లు.

తన కళ్ల ముందే తన చెల్లెలికి పెండ్లి చెయ్యడం, ఆమె పిల్లా పాపలతో కళకళలాడుతూ వుండటంతో, ఇంక తనకా అదృష్టం లేదనీ, పెండ్లి కాదనీ, అన్నకు తనకు పెండ్లి చెయ్యడం ఇష్టం లేదనీ, తనను ఇంట్లో పనిమనిషి మాదిరి ఉపయోగించుకుంటున్నాడనీ అన్నీ అర్థమవుతున్నాయి నాగులుకు. కానీ, ఆ పరిస్థితిలోనించి బయటపడే మార్గం మాత్రం గోచరించడం లేదు.

అసలు తను అట్లా ఎందుకుందో.. తనకు పెండ్లెందుకు కాలేదో అర్థం కాదు ఆమెకు.

అప్పట్లో రాయలసీమలోని అనేక చోట్లలోలాగే కర్నూలు జిల్లాలోని ఊళ్లలో చాలా నీటిఎద్దడి వుండేది. ఆ ఊళ్లో ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా నీళ్ల కోసం నిరంతరం బిందె పట్టుకుని, ఏ వీథిలో కొళాయినీళ్లు వస్తే అక్కడికెళ్లి తెచ్చుకోవాల. ఊరికి ఉత్తరాన వున్న ఏట్లో నీళ్లు వున్నన్ని రోజులూ ఇంత ఎద్దడి లేదు. ఏటికి పైన కొండప్రాంతంలో చిన్న ఆనకట్ట కట్టడంతో నీళ్లు నిరంతరం ప్రవహించడం ఆగిపోయాయి. ఏట్లోనే బోర్లు కొట్టి ఊళ్లో ఇంటింటికీ కొళాయిలు వేసినారు. కొళాయిలు వచ్చిన కొత్తలో నీళ్లు బాగానే వచ్చేవి. తరువాత బోర్లలో జల తగ్గి పోయింది.

వీథికొళాయిల్లో మాత్రమే నిర్ణీత సమయానికి నీళ్లొచ్చేవి. తరువాత రోజుల్లో ఒక్కో వీథికి ఒక్కొక్క సమయం పెట్టినారు. తరువాత బోర్లో ఎప్పుడు నీళ్లు ఊరితే అప్పుడు వదలడం, జనం పరుగులు పెట్టడం మామూలయింది.

ఊళ్లో కొళాయిలు వచ్చిం తర్వాత ఉప్పునీటి బావులను ఎవరూ పట్టించుకోక పొవడంతో నీళ్లు మురిగిపోయి పాడుబడి పోయినాయి. మళ్లీ ఈ మధ్యనే వాటికి పూడికలు తీయించిన తరువాత కాస్త నీళ్లు ఊరుతున్నాయి. మంచినీళ్లకయితే కొళాయిల మీద ఆధారపడాల్సిందే!

“సరేగానీ.. నాగులూ! ఒక్క పాట అందుకోయే! నిద్దరంతా పోయేటట్టుగా..” అడిగింది కాపోళ్ల అచ్చమ్మ.

ఆమెను పాట పాడమని అడిగితే కోపమంతా పోయి వుషారు వస్తుంది నాగులుకు.

“నన్ను ఇట్ల గూనిదానిగా ఎట్ల పుట్టిస్తివిరో రామా గోవిందా రామా!

మా అమ్మానాయనను ఎందుకు తీసకపోతివిరో రామా గోవిందా రామా!

ఈ నీల్లులేని వూర్లో ఎందుకు పుట్టిస్తివిరో రామా గోవిందా రామా!”

ఇట్లా తన కష్టాలన్నీ పాటలాగా పాడుకుంటూ పోయింది. అందరూ పకపకా నవ్వుకున్నారు. ఆమె దుఃఖం వాళ్లకు నవ్వులాట!

ఎట్లాగో గంటకు పైగా ఎదురు చూసిన తర్వాత నాగులక్క ఒంతు ఒచ్చింది. రెండు ప్లాస్టిక్ బిందెల్లో నీళ్లు పట్టుకుంది. ఒకటి నెత్తిపైన, ఒకటి చంకలో పెట్టుకొని మలికోడి కూస్తుండగా ఇంటి దారి పట్టింది నాగులు.. మూర్తీభవించిన నిర్వేదం లాగా.. మనిషి ఆకారం దాల్చిన భగ్నహృదయం లాగా! శిధిలస్వప్నం ఒక స్త్రీ రూపుదాల్చితే అచ్చం నాగులు మాదిరే వుంటుందేమో!

ఆమె కళ్లల్లో సమాజంపై తాను సంధించిన ప్రశ్నలు తూటాల్లా దూసుకొస్తుంటాయి.

‘నేనెందుకు ఇట్లా పుట్టినాను? నాకు గూని ఎందుకొచ్చింది? నేనేం తప్పు చేసినాను? ఒకేళ నేను వికారంగా వుంటే మాత్రం అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడడం ఎందుకు? పుట్టడం నా చేతిలో వుందా? నాకూ అందరి లాగా బతకాలనే వుంది. కానీ, ఎందుకు నన్ను మామూలుగా బతకనివ్వరు? నేను కట్టుబాటు ఎక్కడా తప్పలేదే? పెండ్లి కాకపోవడం నేరమా? పెండ్లి చేయని అన్నను, వదినెను అనాల గానీ, తననెందుకు గద్దల వలె ఈ జనాలు పొడుస్తావున్నారు?’ అని ఆమె మనసు సమాజాన్ని మౌనంగా నిరంతరం ప్రశ్నిస్తూనే వుంటుంది. ఆ ప్రశ్నలను అగ్నిశకలాల్లా ఆమె కళ్లు కురిపిస్తూనే వుంటాయి. కానీ, వాటిని గ్రహించే ఓపిక అక్కడి వారెవరికీ లేదు. పట్టించుకునే అక్కర ఆమెపై వారికి లేదు. సమాజం తీరే అంత! బలవంతులకు భయపడడం, బలహీనులను యేడిపించడం..!

చిన్నప్పుడు కూడా ఆమెతో పిల్లలెవరూ సరిగ్గా ఆడుకునేవారు కాదు.

తమ ఇంటిపక్కనున్న స్వామిరెడ్డి మాత్రం తనతో ఆడుకునేవాడు. తననెప్పుడూ ఎగతాళి చేసేవాడు కాడు. అందుకే అతనంటే ఇష్టం నాగులక్కకు. అయితే దురదృష్టం కొద్దీ, వాళ్లు వేరే వూరికెళ్లిపోవడం వల్ల ఆ స్నేహం తెగిపోయింది. పెద్దయ్యేకొద్దీ అతనినే తన భర్తగా భావించుకుంది నాగులు. తనకు పెళ్లయ్యే యోగం లేదని తెలుసు కున్నాక, అతనిని గురించిన కలల్లోనే బతుకుతూ వుంది. అతను ఎక్కడున్నా సుఖంగా వుండాలని మాత్రం కోరుకుంటుంది. అంత కనాకష్టపు బతుకులో అదొక్కటే ఆమెకు కొంత సంతోషాన్నిచ్చే సంగతి!

2.

ఈ కథాకాలం కూడా 1980 సంవత్సరాల నాటిదే! అది బెంగుళూరు మహానగరంలో తమిళులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం. అక్కడ ఒక రాజరాజేశ్వరి అమ్మ వారి గుడి వున్న వీథి. ఆ వీథికంతా అందాన్నీ, హోదానూ కల్పిస్తూ ఒక పెద్ద మూడంతస్తుల పాతకాలం మేడ ఒకటి వుంది. అది ఒక వెయ్యి గజాల స్థలంలో నిర్మితమై వుంది. చుట్టూ వదిలిన స్థలంలో పెంచిన తోట పచ్చదనానికి నెలవుగా వుంది.

కింద భాగంలో నాలుగైదు కార్లు, స్కూటర్లు పార్క్ చెయ్యడానికి తగినంత స్థలం వుంది. ఆ వెనుక అయిదారు చిన్నచిన్న ఇళ్లు పనివాళ్లు, డ్రైవర్ల కోసం కట్టారు.

అందమైన పాలరాతి మెట్లెక్కి పైకొస్తే మధ్యభాగంలో ఆ ఇంటి యజమాని వైద్యనాథ అయ్యర్ నివాసం. ఆయన ఆ ఊళ్లోని పెద్ద లాయర్లలో ఒకరు. ముందొక వరండా. కక్షిదారులొస్తే కూర్చోవడం కోసం అక్కడ కొన్ని కుర్చీలు, బెంచీలు, ఒక సోఫా వేసి వున్నాయి.

ఆ తర్వాత లాయరుగారి ఆఫీసురూమ్. ఆ వెనుక లాయరు గుమాస్తాలిద్దరు కూర్చుని పని చేసుకోవడానికి, ఫైళ్లు పెట్టు కోవడానికీ ఓ గది. దాని వెనుక పెద్ద బాల్కనీ.

ఆఫీసు గది దాటాక పెద్ద హాలు, అందులోనే దేవుడి గది. దాని పక్కనే అయ్యరుగారి పడకగది. ఇదంతా ఇంటికి ఒకవైపు.

భవనం మధ్యలో, ఇంట్లోకి గాలీవెలుతురూ రావడానికి వదిలిన ఖాళీ స్థలం. దాని చుట్టూ పిట్టగోడ. దానికి మరో వైపు నాలుగు పడకగదులు, వాటినానుకొని భోజనాలహాలు, ఆ పైన వంటిల్లు, వంటింటినానుకొని చిన్న స్టోర్ రూమ్. ఆ పక్కన బాల్కనీ, అందులోనించి పైకి పోవడానికి మెట్లు.

పైకి మూడో అంతస్తులోకి కెళ్తే చిన్నవీ, పెద్దవీ కలిసి ఐదు పోర్షన్లు అద్దెకిచ్చినవీ కనిపిస్తాయి.

***

అప్పుడు తెల్లవారుఝామున నాలుగు గంటలవుతోంది. వంటింటి పక్కనున్న సామాన్లగదిలో ఓ పెద్ద బెంచీపై వేసుకున్న బొంత మీద పడుకున్న గౌరికి అలారం మోతకు మెలకువ వచ్చింది.

నెమ్మదిగా లేచి, తల వైపు పెట్టుకున్న దేవుళ్ల ఫోటోలకు దండాలు పెట్టుకుని, యేవో స్తోత్రాలూ అవీ చెప్పుకుంది. మెల్లగా లేచి నీళ్ల హండా కింద మంట పెట్టి నీళ్లు కాచింది. స్నానం ముగించి, తమిళ వేంకటేశ్వర సుప్రభాతం చదువుతూ సాంబారు కోసం కందిపప్పు కుక్కర్‌లో పెట్టి, దేవుడిగది శుభ్రం చెయ్యడం మొదలుపెట్టింది. ఆ సుప్రభాత గీతం ఇల్లంతా పాకి, రోడ్డు పైకి కూడా వ్యాపించింది.

అది పెద్ద సైజు దేవుడిగది. దాంట్లో ఓ ఇరవైకి తక్కువ కాకుండా చిన్నా పెద్దా ఫోటోలు.. రకరకాల దేవుళ్లవి వుంటాయి. అన్నింటికీ మాలలు వేస్తారు. పొద్దున్నే అవన్నీ తీసి, ఫోటోలు తుడిచి, విగ్రహాల మీద వున్న నిర్మాల్యం తీసి, దేవుడిగది శుభ్రం చేసి, ముగ్గు వేసి, గంధం అరగ తీసిపెట్టి, దీపపు సెమ్మెలు వగైరా దేవుడి సామాన్లు కడిగి, తిరిగి దీపపు సెమ్మెల్లో నెయ్యి, ఒత్తులూ వేసి సిద్ధం చేసి, మంచినీళ్ల మోటర్ వేసి, చిన్న వెండిబిందెతో నీళ్లు సిద్ధంగా పెట్టేసరికి అయిదున్నర అవుతుంది. ఆపైన స్కంధకవచం చదివింది. ఇంకా యేవో స్తోత్రాలు చదువుతూనే వుంది.

అంతటితో ఆగిపోలేదు ఆమె దైవసేవ. ముందురోజు సాయంత్రమే కట్టిన పూలమాలలన్నీ దేవుడి ఫోటోలకు అలంకరించింది. కింద తోటలోకెళ్లి తోటమాలి సహాయంతో పూలన్నీ కోసి, చిన్న బుట్టెడు పూలు మేనమామ పూజ కోసం సిద్ధం చేసింది. చిన్న దీపాలు రెండు, ఊదుకడ్డీలు రెండు వెలిగించి, అరటిపండ్లు నైవేద్యం పెట్టి, హారతిచ్చి, దండం పెట్టుకుని వంటింట్లోకి వెళ్లింది గౌరి. ఆ పైన వంటకు ఉపక్రమించింది ఆమె.

ఇంతలో పాలవాడి పిలుపు వినిపించింది.

“అత్తంగో.. పాలు.. పాలు” అని.

అత్తంగో అంటే తమిళంలో ‘అత్తగారు’ అని అర్థం. మేనత్త వరసయ్యే వాళ్లను తమిళులు అలా పిలుస్తారట! ఆ ఇంట్లోని పిల్లలు ఆమెను అలా పిలుస్తారు. పోను పోను పిల్లాపెద్దా, పనివాళ్లూ, పాలవాళ్లూ అందరూ ఆమెను ‘అత్తంగో’ అనే పిలుస్తారు. పాలు పోయించుకుని వంటింట్లోకి వచ్చింది.

పెద్ద ఫిల్టరులో అందరికీ సరిపడేటట్టుగా రెండుమూడు సార్లు డికాక్షన్ తీసింది. కొద్దిగా పలుచని డికాక్షన్ పనివాళ్ల కోసం తీసింది. ముందుగా తాను స్ట్రాంగ్ కాఫీ కాచుకుని తాగింది.

రాత్రే తరిగిపెట్టుకున్న కూర ముక్కలను తిరగమోతలో వేసి మూత పెట్టింది. సాంబారు కోసం కొబ్బరి, సాంబారుపొడి కలిపి రుబ్బుకుంది. ఆ పైన ఇడ్లీలోకి చెట్నీ రుబ్బడం మొదలుపెట్టింది.

ఐదు గంటలకే లేచిన వైద్యనాథం గారు యోగాసనాలు వేసి, స్నానం చేసి, ఏడుగంటలవుతుండగా కాఫీ కోసం వంటింట్లోకి వచ్చాడు..

“అత్తంగో! స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా!” అంటూ ప్రేమ కురిపిస్తూ అడిగాడు.

“వాంగో మామా.. వక్కారుంగో.. కాఫీ ఇస్తును. ఇదేమి అన్యాయం మామా! మీరు కూడా నన్ను ‘అత్తంగో’ అంటున్నారు!” నిష్ఠూరంగా అంటూ పీట వేసి, మంచి కాఫీ ఇచ్చింది గౌరి. సమాధానం యేమీ చెప్పకుండా నవ్వేశాడు ఆయన.

ఇంతలో ఆయన భార్య కామాక్షి వచ్చింది కాఫీ కోసం.

“ఏమైనా చెప్పు కామూ! మన గౌరి చేతి కాఫీదా టాప్! ఈ ఊళ్లో ఇంత మంచి కాఫీ మన ఇంట్లో దానే దొరుకును. నేను చెప్పడం కాదు, మన ఇంటికి వచ్చినవాళ్లంతా ఇదే మాట దా చెప్తురు. గౌరి చేతిలో యేదో అమృతం వుంది. కాదంటావా?” అన్నాడు కాఫీ గుటకలు వేస్తూ.

“సరి సరి.. మీ మేనకోడలిని మీరు దానే మెచ్చుకోవాల! దానికి దిష్టి తగిలేను! అయినా గానీ మీ మేనకోడలి మీద ప్రేమెక్కువై.. దానికి కాఫీ చెయ్యడం నేర్పించిన దాని గురువును మరిచి పోయినారు” అన్నది గోముగా భర్తకేసి చూస్తూ.

ఇవన్నీ నిజమైన ప్రేమలు, మెచ్చుకోళ్లు కావనీ, తనను ముగ్గులో మరింతగా ఇరికించే మాటలనీ ఈ మధ్యనే గౌరికి గ్రాహ్యం అవుతోంది.

“కామాచ్చి మామి మాదిరి కాఫీ చేసేది, వంట చేసేది నాకు రానే రాదు మామా. మామి చేతిలోనే దా అమృతం వుండును. అది నాకూ కొంచెం అంటుకుందో.. యేమో!” అని కూర వేపుతూ అత్త పక్షం తీసుకుంది గౌరి.

ఇప్పుడిప్పుడే బతకనేరుస్తోంది ఆమె. ఇలాంటి ఇచ్చకపు మాటల తోనే నెగ్గుకొని రావాలని ఆమెకు జీవితం నేర్పింది.

“సరి.. సరి.. అత్తాకోడలూ ఇద్దరివీ అమృతహస్తాలే! మేమే మరీ పనికిమాలినవాళ్లం అయ్యాం కదా.. గౌరీ?” అన్నాడు వైద్యనాథం అయ్యర్ యేదో జోక్ వేస్తున్నట్టు!

“అచ్చొచ్చొ.. అదొణ్ణూ ఇల్లే మామా! మామీ చేతుల్లో అమృతం వుంటే, మీ చేతుల్లో ఆ మహాలక్ష్మీ దేవే సాక్షాత్తూ కొలువై వుంటుంది మామా! మీ వల్ల దానే ఈ ఇల్లు ఇంత సంస్థానం మాదిరి నడుస్తా వుంది” నొచ్చుకుంటూ అన్నది గౌరి. మామా, మామి నవ్వుకున్నారు.

ఆ రోజు వంట గురించి సలహాలు ఇచ్చింది కామాక్షి మామి. ఏమేమి తెప్పించుకోవాలో, యే పనివాళ్లు రావడం లేదో వగైరా ఇంటి విషయాలు చెప్పింది గౌరి. ఎంతమంది కక్షిదారులు రావచ్చో, దూరం నుంచి వచ్చేవాళ్లకు వంట యేర్పాట్లు ఎలా చెయ్యాలో వివరించాడు వైద్యనాథం.

ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురూ. పెద్దకొడుకు ఆయన దగ్గరే జూనియర్ లాయర్‍గా పనిచేస్తాడు. రెండో కొడుకు చార్టెడ్ అకౌంటెంట్. అల్లుడు హెచ్.ఏ.ఎల్.లో ఇంజనీరు. పెద్దకోడలు వసుమతి ఆ ఊళ్లో పెద్ద పేరున్న నర్తకి. ఆమెకు ఓ డాన్స్ స్కూలు వుంది. రెండో కోడలు శాంతి మాథ్స్ లెక్చరర్ ఒక లేడీస్ కాలేజీలో. కూతురు శోభ, తల్లి దగ్గర సంగీతం ఒడిసిపట్టింది. సంగీతం కాలేజీలో లెక్చరర్‍గా పనిచేస్తుంది. కూతురు మీద ప్రేమతో తన ఇంట్లోనే అల్లుడిని ఇల్లరికం పెట్టుకున్నాడు వైద్యనాథం గారు.

ముగ్గురికీ ఇద్దరేసి పిల్లలు. మొత్తం మీద ఇంట్లో సభ్యులు పదహైదు మంది. వీళ్లుగాక పని వాళ్లు, వచ్చీపోయే కక్షిదారులు.. మొత్తం రోజుకో ఇరవై మందికి వంటచెయ్యాలి గౌరి.

3.

రోజూ పొద్దున ఇడ్లీ కానీ, దోసె కానీ టిఫిన్ వుండాలి. అప్పుడప్పుడూ పూరీ, ఉప్మా, ఊతప్పం వగైరా టిఫిన్‍లు చెయ్యాలి. ఇడ్లీ, దోసెల కోసం రోజూ మధ్యాహ్నం ఓ గంట సేపు పప్పు రుబ్బుకోవాలి. పని కుర్రవాడికి చెప్పి కిరాణా దుకాణం నుంచి సరుకులు తెప్పించుకోవాలి. కూరలు తెప్పించుకుని, రాత్రికీ, పొద్దునకూ తరిగిపెట్టుకోవాలి. రాత్రికి అందరికీ చపాతీలు, కూర, పిల్లలకు అన్నం, రసం చెయ్యాలి. సరిపడినన్ని పాలు తెప్పించుకుని, కాఫీలకు పోగా తోడుపెట్టుకోవాలి. మధ్యమధ్యలో కింద భాగంలో వున్న పనివాళ్లు, పై భాగంలో వున్న అద్దెవాళ్లు, మంచినీళ్లు అయి పోయాయనీ, వాడుక నీళ్లు అయి పోయాయనీ ‘అత్తంగో.. అత్తంగో’ అని పిలుస్తూనే వుంటారు. మంచినీళ్ల ట్యాంకు మోటార్ స్విచ్, బోర్ వెల్ స్విచ్‌లూ వెయ్యడం, ఆఫ్ చెయ్యడం ఒక అదనపు డ్యూటీ గౌరికి.

మామ కోసం వచ్చేవాళ్ల కోసం కాఫీలు పెట్టడం, టిఫిన్లు అందించడం, భోజనాలు పెట్టడం నిరంతర కార్యంలా నడుస్తూనే వుంటుంది.

మధ్యాహ్నం నాలుగయ్యేసరికి పూలవాడు వచ్చి ఓ చిన్నగంపడు పూలు తెస్తాడు. తోటమాలి తోటలోని మల్లెపూలు, కనకాంబ రాలు, నీలాంబరాలు తెచ్చి పెడతాడు. కొన్ని తాను, తన కోడళ్లు, కూతురు, మనవరాళ్లు పెట్టు కోవడానికి కామాక్షిమామి మాలలు కడుతుంది.

తక్కినవన్నీ గౌరి మాలలు కట్టాలి. అన్నీ చకచకా మాలలు కట్టి తడిగుడ్డలో చుట్టి, మరుసటిరోజు పూజకు సిద్ధం చేసుకుంటుంది గౌరి. మళ్లీ రాత్రి వంట చేసుకోవాలి. మధ్యలో ఓ అరగంట వీలు చేసుకుని గుడికి వెళ్లొస్తుంది.

మరి అన్ని పనులూ గౌరి చేస్తే, మిగతావాళ్లు యేం చేస్తారంటారా? పెద్దకోడలికి డాన్సు స్కూలు పనులు సరిపోతాయి. రెండో కోడలు ట్యుటోరియల్‍లో లెక్కల క్లాసులు తీసుకుంటుంది. కూతురు, తల్లీ కలిసి పొద్దునా, సాయంత్రం సంగీతసాధనలు చెయ్యడం, ఆకాశవాణి ప్రోగ్రాములు ఇవ్వడం, సంగీతకచ్చేరీలకు వెళ్లడమో, వీళ్లు ఇవ్వడమో.. దీంతోనే వాళ్లకు క్షణం తీరిక వుండదు.

హు.. నా మతిమండిపోయినట్టే వుంది?

ఇంతకీ గౌరి ఎవరు? ఆ ఇంటికి ఎట్లా వచ్చింది.. అన్న విషయాలేవీ ఇంతవరకూ చెప్పనేలేదు కదా!

శ్రీగౌరి.. వైద్యనాథం గారికి వరుసకు చెల్లెలైన సుబ్బలక్ష్మి కూతురు. వాళ్లది కుంభకోణం చుట్టుపక్కల వూరు. గౌరి తండ్రి టి.బి.తో చిన్ననాడే గతించాడు. ఆస్తులేమీ లేకపోవడంతో తల్లి వంటలు చేస్తూ గౌరిని పోషించింది. కలరా సోకి సుబ్బలక్ష్మి గౌరిని ఒంటరిదాన్ని చేసి ఈ అకస్మాత్తుగా లోకం నించి నిష్క్రమించింది.

అదే సమయంలో ఆ ప్రాంతాలకు పని మీద వెళ్లిన వైద్యనాథంగారు పరిస్థితి గ్రహించి, ముందుచూపుతో లాభనష్టాలు లెక్కకట్టుకొని, ‘గౌరిని తాను పెంచుతాననీ, పెళ్లీపేరంటం చేస్తాననీ’ ఆమె చుట్టాలకు అభయమిచ్చి బెంగుళూరు తీసుకొచ్చాడు. అంతే చాలనుకున్నారు వాళ్లు.

అప్పటికి గౌరి వయస్సు పదహైదేళ్లు మాత్రమే! నాలుగున్నర అడుగుల ఎత్తుతో, రంగు తెల్లగా వున్నా, ముఖమంతా ఉండలు కట్టిన రబ్బరులాగా వుంటుంది. ముదిరిపోయి, మందంగా మారిపోయిన చర్మం ఆమెకు వికార రూపాన్ని పులిమింది. చిన్న కళ్లు, దొప్పచెవులూ ఇలా ఆమె ఒక మరుగుజ్జు స్వరూపంతో వుంటుంది. ఆమెకు అంతో ఇంతో ఆకర్షణనిచ్చేది ఆమె నొక్కులజుట్టు మాత్రమే!

అయితే చక్కటి కంఠస్వరం, ఎంత పనినైనా ఒక్కతే పద్ధతిగా, శుచి శుభ్రతలతో చెయ్యగలిగిన శరీరబలం, గట్టి ఆరోగ్యం, దైవభక్తి, మంచితనం, చక్కని పనితీరు, ఓపిక, అమాయకత ఇవీ ఆమె అదనపు అర్హతలు!

ఈ దిక్కూదివాణం లేని పిల్ల తన ఇంట్లో చక్కగా వుపయోగపడుతుందని గ్రహించాడు అయ్యరు. అలా పదహైదుయేళ్ల పైబడి ఆ ఇంట్లో మామి చేతికింద నలిగి చక్కటి పనిమంతురాలయింది గౌరి. ఎప్పటికప్పుడు ‘తనకు తగిన సంబంధం మామ చూస్తాడులే..’ అని ఆశతో ఇన్నాళ్లూ బతికింది.

కానీ, ఇప్పుడిప్పుడే ఆమెకు మామలోని స్వార్థపరత్వం అర్థం అవుతోంది. తనకు పెళ్లి చెయ్యడం ఆయనకు చిటికెలోని పని. కానీ, తాను వెళ్లిపోతే తన ఇంట్లో జీతం బత్తెం లేని వంట మనిషి దొరకదు కదా! అందుకే సంబంధాలు చూస్తున్నట్టు, గౌరి అనాకారిత్వం వల్ల యేదీ కుదరనట్టు నటిస్తున్నాడని గౌరికి ఈ మధ్య బాగా అర్థం అవుతున్నది.

4.

ఇంటికి చేరుకున్న నాగులు నెత్తిపై నించి బిందె దించింది ఒదిన. ఇంకో బిందె దించీ దించగానే.. “అమ్మే! ఈ పేడ దిబ్బలో పోసిరాపో!” ఆజ్ఞాపించినాడు పశువులశాలలో కసవూడుస్తున్న అన్న. మారు మాట్లాడకుండా మూడు గంపల పేడను దిబ్బలో పారబోసి ఒచ్చింది.

ఒదిన బర్రెగొడ్డు పాలు పిండుతూ, ఇంకో బర్రె పాలు పిండమని ఆదేశించింది. రెండు బర్రెలపాలు పిండి ఆ గిన్నెలు వంటింట్లో పెట్టివచ్చింది. పాలఘాట్ అయ్యర్ హోటల్‍లో ఆ పాలు పోసిరమ్మన్నాడు అన్న.

హోటల్‍కు పోయి పాలు పోసి రావాలంటే బలే కుశాలుగా వుంటుంది నాగులుకు. కొద్ది నీళ్లు కలిపిన పాలను పెద్ద క్యాన్‍లో పోసి ఇచ్చింది ఒదిన. క్యాన్ నెత్తిన పెట్టుకోని అయ్యర్ హోటల్‍లో పోసింది నాగులు.

“నాగులూ! రాత్రి వణ్ణం కొంచెం వుంది.. తింటువా?” అని అడిగింది అయ్యర్ భార్య.

“తింటా అమ్మయ్యా! ఇప్పుడే మొహం కడుక్కొస్తానుండు” అని పక్కనే వున్న వేపచెట్టుకున్న పుల్ల విరుచుకుని దంతధావనం చేసుకోని వచ్చింది.

ఆయమ్మ రాత్రి మిగిలిన పట్టెడన్నం, సాంబారు, కొన్ని కూర ముక్కలూ పెట్టింది. అన్నీ కలిపి ఆబగా తినింది నాగులు. ‘ఆబువ్వ’ (వరిఅన్నం) ఇంట్లో పండగలప్పుడు గానీ వండరు. అందుకే ఆబువ్వ తింటే పండగన్నట్టే వుంటుంది ఆమెకు. ఇంతలో అయ్యరు రెండిడ్లీలు, చారెడంత చెట్నీ ఆకులో వేసి, పెద్ద గాజు గ్లాసు నిండా కాఫీ పోశాడు.

“బిడ్డ ఇంట్లో యేమి తినునో యేమో.. ఆ ఒదిన పనిజేయించు కోవడమే గానీ, కడుపు నిండా పెట్టునో.. లేదో?” అని భార్యతో అని నిట్టూరుస్తూ హోటల్ లోపలికి పోయినాడు అయ్యరు.

కృతజ్ఞతతో మనసు నిండి పోయింది నాగులుకు. ఎవరూ చెప్పకుండానే అక్కడున్న గిన్నెలన్నీ తోమి, దొడ్డి అంతా శుభ్రం చేసి ఇంటికి బయలుదేరింది.

ఇంటికి రాంగానే ఇంతలోనే వీథిలో కలకలం మొదలైంది. “సంతపేటలో నీల్లొస్తాన్నాయంట! తొందరగా పాండి (పదండి) పాండి” అంటూ అందరూ బిందెలు పట్టుకొని పరుగులాంటి నడకతో పోతున్నారు.

ఒదినె బిందెలు ఖాళీ చేసిచ్చింది. నాగులు ముందు బిందెలు పెట్టి వెళ్లమన్నట్టు చూసింది. అన్నకు ‘అయ్యో పాపం..’ అనిపించినట్టుంది.

“ఆ పిల్లకు ఇన్ని కాపీనీల్లన్నా పొయ్యే!” అన్నాడు ధైర్యం చేసి.

“నీకు తెలీదేమో.. అది అయ్యరు హోటల్‌లో కాపీ తాగి, టిపినీ గూడా తినొచ్చింటాది. దాని పొట్ట చూస్తే తెల్లేదా? నువ్వూ, నేనే అమాయకులం. అది సప్పుడు సెయ్యకుండా తినేసి వస్తాది. ఇంట్లో పిల్లలకు పట్టుకొస్తామనే ఇంగితం కూడా లేదు. అంత మాంతమైంది (గట్టిది) నీ సెల్లెలు..” కొరకొరా చూస్తూ అంటించింది తులిశమ్మ.

మారుమాట్లాడలేదు వీరారెడ్డి. కడుపులో చల్లగా వుందేమో.. వుషారుగా వుంది నాగులుకు. ఒదినె వైపు ఒక ధిక్కారపు చూపు విసిరి, అన్నను పైకీ కిందికీ ‘నీ మాటకున్న ఇలువ ఇంతే!’ అన్నట్టు చూసి, బిందెలు తీసుకుని చరచరా సంతపేట వైపు నడిచింది నాగులు.

బలిజవోళ్ల ఇండ్లు దాటి, తురకవీథి దాటి, ఈడిగ వాండ్ల ఇళ్లు దాటి, చాకలిబజారు దాటి, రంగరాజుల వీథి దాటి సంతపేట చేరింది నాగులు.

5.

గంటసేపు ఎదురుచూసినాక రెండు బిందెల నీళ్లు దొరికినాయి ఆమెకు.

వొస్తూ వొస్తూ అయ్యరు హోటలు దగ్గర నిలిచి, దొడ్డివాకిటి నించి లోపలికి పోయి ఆ రెండు బిందెల నీళ్లూ వాళ్ల నీళ్ల బానలో పోసి, ఖాళీ బిందెలతో తిరిగి సంతపేటకు బయలుదేరింది ఆమె. అయ్యరు ప్రేమగా, కృతజ్ఞతగా ఆమె వైపు చూసి నవ్వినాడు.

తానూ నవ్వుతూ బయలుదేరింది నాగులు. ఈసారి కోమిటోళ్ల బజారులో నీళ్లొస్తాన్నాయని అందరూ అనుకుంటుంటే.. అటు దిక్కు నడిచింది నాగులు. పోస్టాఫీసు దాటి, అమ్మవారిశాల దాటి, కోమటి బజారుకు చేరుకుంది. జనం ఎక్కువ లేక పోవడంతో త్వరగానే ఇల్లు చేరింది నాగులు.

“యేమ్మే.. యింతసేపు పోతివి! యేమేమి రాచకార్యాలు చేస్తివి? ఎవుడన్నా తగిల్నాడా యేమి? ల్యాకపోతే ఇంత సేపు ఐతా వుంటే రాకుండా యేం చేస్తావున్నావు?” దుర్భాషలాడింది ఒదినె. అక్కడే వున్న పక్కింటి పుల్లమ్మ ఫక్కుమని నవ్వబట్టింది.

“మాటలు సూసుకొని మాట్లాడాల! మంచిమాటలు మాట్లాడకపోతే నేనేం జేస్తానో నాకే తెలీదు! ఒక్కరోజు నువ్వు నీల్లకు పోతే నీకు బాగా తెలుస్తాది.. ఎంత సేపయ్యేదీ..” అని చెయ్యి పైకి లేపింది నాగులు, అభిమానం దెబ్బతినగా.

ఆ చేతిని ఒడిసిపట్టి మెలి తిప్పింది తులిసెమ్మ. ఇంకో చేత్తో వొదినె జుట్టు పట్టుకుంది నాగులు. నాగులు బలం ముందు ఒదినె బలం చాలలేదు. చెయ్యి వొదిలేసింది.

“జాగరత్త! నా జోలికి ఒచ్చేవు మల్లీ!” అని హెచ్చరించి జుట్టు వదిలింది నాగులు. దెబ్బతిన్న పక్షి వలె మిర్రిమిర్రి చూసింది తులిశెమ్మ.

“తల్లి వంటి ఒదినెను జుట్టు పట్టుకుంది చాలు గానీ, మీ అన్న బీడు కాడ ఫారంకంప కొడతాన్నాడంట! పోయి కట్టగట్టి తీసక రాపో.. పెద్దా చిన్నా లేనే లేదు. ఒదినె మీదనే చెయ్యెత్తుతావా? బయం బక్తీ యేమన్నా వున్నాయా నీకు?” తులిసెమ్మ పక్షం తీసుకోని నాగులును దండించింది పుల్లమ్మ.

ఈసడింపుగా ఒదినె దిక్కు చూస్తూ, “ఇది తల్లా? తప్పుడు మాటలు మాట్లాడితే నీకైనా అదే గతి సూసుకో!” అని పుల్లమ్మ దిక్కుచూసి, తలెగరేసి, లోపలికి పోయి పాత చీర తీసుకోని బీడు చేని వైపు నడిచింది నాగులు.

ఆడబిడ్డ చేతిలో అవమానం పొందిన తులిసెమ్మ వెనకనించి తిట్లు, శాపనార్థాలు కురిపిస్తానే వుంది.

అయితే తప్పు తనదే గనుక ఆ విషయాన్ని భర్త వరకూ పోనియ్య లేదు తులిశమ్మ. అయినా వాళ్లిద్దరికీ అవి మామూలే!

రెండుగంటలు గడిచినాక అన్నా చెల్లెలూ ఫారంకంప కట్టెలను పాతచీర ముక్కల్లో కట్టలు కట్టి తెచ్చి ఇంటి వెనక పెట్టినారు. అందరూ రొట్టె, పప్పు తిన్నారు. మజ్జిగ తాగినారు.

కాసేపు నడుం వాల్చిన తర్వాత అన్న ఉప్పునీల్ల బాయికి నీళ్లకు పోతుంటే, తానూ వెంటపోయింది నాగులు. ఔత్ కానా (హౌజ్ ఖానా అనే ఉర్దూ పదానికి వికృతరూపం) నిండా, పశువుల తొట్టి నిండా నీళ్లు తెచ్చిపోసినారు ఇద్దరూ కలిసి.

పశువులు ఉప్పునీళ్లయినా ఇష్టం గానే తాగుతాయి. నాలుగు బర్రె గొడ్లు, రెండు ఎద్దులకూ ఎన్ని నీళ్లూ చాలవు. నిముషాల మీద ఖాళీ అవుతాయి.

సాయంత్రం మళ్లీ సత్రంబడి కాడ నీళ్లొస్తాన్నాయన్నారు. మళ్లీ ఆంజనేయుల గుడి దాటి, కాపోళ్ల ఇళ్లు దాటి, తురకవీథి దాటి రెండుబిందెల నీళ్లు తెచ్చింది.

ముప్పావు బకేటు నీళ్లతో ఒడుపుగా స్నానం చేసింది. వర్తనగా పాలుపోసే ఇళ్లకు పోయి పాలుపోసి వచ్చింది. హోటల్ కు పోయి పాలుపోసి అయ్యరిచ్చిన కాఫీ తాగి, నాలుగు బుగ్యాలు (బజ్జీలు)ఇస్తే తినేసి, గిన్నెలు కడిగి, దొడ్డి శుభ్రం చేసి, ముందు వాకిట్లో కసవు వూడ్చి వచ్చింది.

సాయంత్రం అయితే శివాలయానికి పోతుంది నాగులక్క. శివాలయం ముందున్న అరుగు మీద చిన్న కొట్టిడి (గది) వుంటుంది. దూదేకుల బాబయ్య అనే ముసలి దర్జీ అతను దాన్ని బాడుగకు తీసుకున్నాడు. ఆ అరుగుమీద మిషను పెట్టుకోని బట్టలు కుట్టుకుంటా వుంటాడు. చీకటి పడేసమయానికి మిషను, గుడ్డలూ రూములో పెట్టి తాళం వేస్తాడు.

అతని దగ్గర కూర్చోని ఊళ్లో విశేషాలన్నీ మాట్లాడుతుంది నాగులు. ఆయనకు నాగులంటే సానుభూతి. ఆయన బట్టలు కుట్టగా మిగిలిపోయిన చిన్నచిన్న పేలికలన్నీ ఒక గుడ్డసంచీలో కుక్కి దిండువలె తయారుచేస్తుంది నాగులు. పైన చేతికుట్టు వేసి బాబయ్యతాతకు ఇస్తుంది. నెలకో దిండు తయారవుతుంది. పేదవాళ్లకెవరికైనా ఇస్తుంటాడు బాబయ్య. నాగులు ఇంట్లో దిండ్లన్నీ బాబయ్య తాత ఇచ్చినవే!

జాకెట్లు కుట్టగా మిగిలిపోయిన రంగురంగుల గుడ్డలన్నీ కలిపి నాగులుకు జాకిట్లు కుట్టి ఇస్తుంటాడు బాబయ్య తాత.

వాటిని చూసి అందరూ నవ్వినా సరే, ఇష్టంగానే తొడుక్కుంటుంది నాగులు. మరి నవ్విన వాళ్లెవ్వరూ ఆమెకు జాకిట్లు ఇయ్యరు కదా!

గుళ్లోకి పోయి, గుడి చుట్టూ వూడ్చి, నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంది. పూజారయ్య ఇంట్లో యేమైనా పనుంటే అందుకుంటుంది. నాలుగు బిందెల ఉప్పునీళ్లు తెచ్చి ఔత్ కానాలో పోస్తుంది. దేవుడికి దండం పెట్టుకోని, పూజారయ్య ఇచ్చిన ప్రసాదం.. అరటిపండో, సెనగలో, కొబ్బరిచిప్పో తీసుకోని ఇంటికి వస్తుంది.

రాత్రి జొన్నరొట్టెనో, సంకటో తిని తన కుక్కిమంచం ఎక్కిందంటే ఒళ్లెరగని నిద్రముంచుకొస్తుంది ఆమెకు.

ఆయాల ఆమెకు నిద్రపట్టిందో లేదో.. సామిరెడ్డి కలలోకి ఎగిరొచ్చినాడు. కలలో నాగులూ, సామిరెడ్డీ చేనికిపోయి కలుపు తీసి, చేలోనే కూర్చొని, జొన్నరొట్టే, ఉల్లిగడ్డ కారమూ తిన్నారు. అక్కడే వంకలో నీళ్లు తాగినారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ కుశాలగా మాట్లాడుకుంటున్నారు. దారిలో తంగేడు చెట్టు కనిపిస్తే.. ఒక తంగేడు పూలగుత్తి తుంచుకోని వచ్చి, నాగులుకిచ్చి జడలో పెట్టుకొమ్మన్నాడు సామిరెడ్డి.

“నాగులూ! తంగేడు చెట్టంటే పార్వతీ అమ్మవారంట! ముత్తైదలు తన పూలు తుంచి తలలో పెట్టుకోకపోతే ఆయమ్మ శాపమిస్తాదంట! మా యమ్మ సెప్పింది” అంటున్నాడు అతను.

చెదిరిపోయి వున్న తన జడలో తాను పూలు పెట్టుకోవడం, వాటిని అతను సరిజెయ్యడంతో తగని సిగ్గూ, నవ్వూ వచ్చింది నాగులుకు. కిలకిలా తంగేడుపూల వలెనే నవ్వుతున్నది నాగులు కలలో.

కలలోనే కాదు.. బయటికి కూడా నాగులు కిలకిలలు వినిపించినాయి.

“యేం పుట్టిందీ గూనిదానికి? అంత పకపకా నవ్వుతాంది?” అన్నది ఇంకా నిద్రపోని తులిశమ్మ.

“పోనీలే.. కల్లోకి అమ్మా నాయినా వొచ్చినారేమో! కల్లోనయినా నవ్వుకోనీలే!” అన్నాడు వీరారెడ్డి నిస్పృహగా.

***

మళ్లీ తెల్లవారింది. నీళ్లకోసం ఊరంతా తిరిగింది నాగులు. అన్నతో పాటు సెనిక్కాయల చేలోకి పోయి, కలుపు తీసివచ్చింది.

ఇలాగే వారానికి రెండురోజులు బీడుచేలోకి పోయి పచ్చిగడ్డి దోక్కోని వస్తుంది. రోజూ పేడతో నుగ్గులు (పిడకలు) చేస్తుంది. పొలంలో విత్తనాలు వెయ్యడానికీ, కోతలకూ, కళ్లంలో కాపలాకు ఇలా సవాలక్ష పనులు చక్కబెడుతూ, అన్నావొదినెలతో తిట్లు తింటూ, కండ్లు తుడుచుకుంటూ రోజులు గడిపేస్తుంది నాగులు.

ఇంతలో వైశాఖమాసం రానే వొచ్చింది. చెల్లెలు లక్షిందేవి, భర్త ఎల్లారెడ్డీ, ఇద్దరు పిల్లలూ వొచ్చినారు. ఎండాకాలం కావడంతో నీళ్లకు కటకట అయిపోయింది ఊళ్లో. దానికితోడు ఊళ్లో చెన్న కేశవస్వామి తిరుణాల వచ్చింది. అందరూ ఆడపిల్లలను, బంధువులను పిలుచుకున్నారు. ఇంట్లో ఆడవాళ్లు రకరకాల వంటలు చేసి చుట్టాలను తృప్తిపరుస్తున్నారు. మొగవాళ్లూ, పిల్లలూ బిందెలు పట్టుకొని నీళ్లకోసం ఊరంతా తిరుగుతున్నారు.

పగలూ రాత్రీ తేడా లేకుండా బిందెపట్టుకోని తిరుగుతూనే వుంది నాగులు. ఆరోజు జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

6.

గౌరికి ఈ మధ్య మనసు మనసులో వుండటం లేదు. మూడు నెలల పై మాటే అయింది.. ఆమె యేవో రెండు భావాల మధ్య నలిగి పోతున్నది. యేదో పరధ్యానం ఆమెను ఆవహిస్తున్నది. మాట్లాడుతూండగానే.. మనసు పరధ్యానంలోకి వెళ్లిపోతుంది.

ఇంట్లో ఇంకెవ్వరూ గమనించక పోయినా, సూక్ష్మగ్రాహి అయిన కామాక్షిమామి మాత్రం పసికట్టింది. గౌరి ఎక్కడికి పోతున్నదీ.. ఎవరితో మాట్లాడుతున్నదీ, యేమి చేస్తున్నదీ.. అన్నింటిపై నిఘా వెయ్యడం మొదలుపెట్టింది. ఒక్కోసారి గౌరి నిద్రపోతుండగా కూడా వచ్చి చూసిపోతున్నది.

ఆమె కృషి ఫలించింది. (కృషితో నాస్తి దుర్భిక్షం కదా!)

తమ మేడమీద అద్దెకున్న తెలుంగు మామీ విమలతోనూ, మళయాళీ మామీ సతీనాయర్ తోనూ గౌరికి స్నేహం ఎక్కువైందని గ్రహించింది. వాళ్ల మాటలు వినాలని ప్రయత్నించింది. కానీ, ఆమెకు కాస్త వినికిడి శక్తి తగ్గింది కాబట్టి వినబడలేదు. కూతురు గానీ, కోడళ్లు గానీ ఈ విషయంలో తనకు సహకరిస్తారని నమ్మకం లేదు.

పోనీ గౌరిని నిలదీద్దామంటే, సరైన కారణం దొరకడం లేదు. పోనీ, పనిలో యేదైనా తేడా వస్తే.. ఆ సందర్భంగా యేమైనా పరోక్షంగా నైనా అందామంటే గౌరి తన పనిలో వంకపెట్టడానికి అవకాశమే ఇవ్వదు.

గౌరి కూరగాయలు తరుగుతూనో, పూలు కడుతూనో, వెనక మెట్ల మీద కూర్చుంటే, పై మెట్ల మీద కూర్చుని విమల, సతి.. గౌరితో మాట్లాడుతున్నారు.

విషయం యేమైవుంటుందా.. అని ఆమె ఆలోచించి, ఆలోచించి అలసి పోతున్నది. ఆమె నిరీక్షణ ఒకరోజు ఫలించింది.

రోజూ సాయంత్రం వేళ నీళ్ల ట్యాంకులలో నీళ్లు ఎంతవరకూ వున్నాయో చూడటానికి మిద్దె పైకి వెళ్తుంది గౌరి. ఆ రోజు సతి, విమల ఆమె వెంటనే వెళ్లారు గౌరితోపాటు. ఇది గమనించిన కామాక్షిమామి తనూ పైకి వెళ్లింది. చాటుగా వాళ్లని గమనిస్తోంది. వాళ్లిద్దరూ గౌరికి ధైర్యం నూరి పోస్తున్నారు.

ఇంతలో మామీ అనుకోకుండా అక్కడికి రావడంతో ఉలిక్కి పడ్డారు. వెంటనే సతి, విమల తేరుకున్నారు.

“వాంగో మామీ! మీరు ఈ టైంలో సంగీతసాధనలో వుంటారు కదా! ఇలా వచ్చేశారేంటి?” విమల నవ్వుతూ అడిగింది.

గౌరి నిలువెల్లా ఒణికిపోతూ పిట్ట గోడను పట్టుకొని తమాయించుకోవడానికి ప్రయత్నిస్తోంది. విమల ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది.

“అదంతా సరే విమలా!.. సతీ..! యెన్న విషయం? గౌరితో మీరు ఇంత సీరియస్‌గా యేమిదా మాట్లాడుతున్నారు? అది నాకు తెలియాల!” అన్నది ఆమె గంభీరంగా మొహం పెట్టి.

“అవళ సీరియస్ ఒణ్ణూ ఇల్లే మామీ! మన గౌరీని ఒక అబ్బాయి కల్యాణం చేసుకుంటానన్నాడు. అది మీకు చెప్పడానికి భయపడుతున్నది. మామా, మామీ నీకు తల్లీదండ్రీ మాదిరి కదా! ధైర్యంగా చెప్పు.. వాళ్లు అన్నీ చూసుకుంటారు.. అని చెప్తున్నాం మామీ.. అంతదా..!” అన్నది విమల.

ఇప్పుడు షాక్‌కు లోనుకావడం మామీ వంతు అయింది.

“ఎవరు ఆ పిల్లవాడు? ఈ జగదేక సుందరిని వరించినవాడు?” వీలైనంత ఎగతాళిగా అన్నది మామి, తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ.

“ఎవరో కాదు మామీ! మన అమ్మన్ కోవెల్‌లో పూజారికి సహాయం చేసి, వంట అదీ చేస్తుంటాడే అతనే పరమ శివన్.. వాడుదా.. గౌరిని చేసుకుంటానన్నది..” సతి చెప్పిందీసారి మామీ మొహంలో మారుతున్న రంగులను చూస్తూ.

“వాడా? మూగవాడు దానే? వాడికిపోయి మా గౌరి కావాల్సి వచ్చిందా?..”

ఆమె మాట పూర్తికాకుండానే, “ఏం మామీ? మూగవాడైతేనేమి? వాడెంతో ఉత్తముడుదా.. మీ కులం దానే! ఇంక యేమి అభ్యంతరం ఉండును మీకు? గౌరికి లాయర్ మామ ఎన్ని సంబంధాలు చూసిరి.. దాన్నెవ్వరూ ఒప్పుకోలేదు కదా.. ఒప్పుకున్న వాడికిచ్చి చేస్తే సరిపోతుంది కదా!” సతి చెప్పాలనుకున్నది టకటకా చెప్పేసింది.

“చాలు.. చాలు.. మీ సుద్దులు..! మీతో బుద్ధులు చెప్పించుకునేంత తెలివితక్కువ దాన్ని కాదు. అది మా పిల్ల.. దాని భవిష్యత్తు మేము దా చూసుకుంటాం! దానికి కల్యాణం చేసేది మేమే గానీ, మీరు కాదు. మీ పనిదా మీరు చూసుకోండి మీ. పదవే గౌరీ!” అని కోపంతో విసురుగా అని చరచరా వెళ్లిపోయింది మామి.

గౌరి నిలువెల్లా ఒణికిపోతూ వున్నది.. కిందికిపోతే మామా మామీ యేమంటారో.. యేమి గొడవ చేస్తారో.. అని.

“గౌరీ! ఇదుగో నాకు అందుకే కోపం వస్తూంది. అన్నింటికీ అంత భయపడటం ఎందుకమ్మా! మేమంతా లేమా? నీకిష్టమైతే చెప్పు. సతి వాళ్లాయన సర్కిల్ ఇన్‍స్పెక్టర్ కదా.. పోలీస్ స్టేషన్‍లో నయినా నీకు పెళ్లి చేయిస్తాడు. నేను నీ పక్కన వుండి పెళ్లి జరిపిస్తును” ధైర్యం చెప్పింది విమల.

“మీకు తెలియదు మామీ నా పరిస్థితి..” ఒణుకుతూ కిందికి వెళ్తున్న గౌరిని ఇద్దరూ పట్టుకొని కిందికి తీసుకొచ్చి వంటింట్లో దింపారు. భయం భయంగానే రాత్రి వంట మొదలుపెట్టింది గౌరి.

మామీ సంగీతకార్యక్రమం సాగుతూనే వుంది.

భోజనాలయి అందరూ ఎవరి పడకగదుల్లోకి వాళ్లు వెళ్లిపోయాక మామా మామీ భోజనాల హాల్లో కూర్చుని గౌరిని పిలిచారు.

ఒక్క పరుగున వచ్చి మామ కాళ్లు పట్టుకొని, “నేనేమీ తప్పు చెయ్యలేదు మామా! నేను మీకు అపకీర్తి తెచ్చే పని యేదీ చెయ్య లేదు. నన్ను నమ్మండి మామా! అతను చెప్పిన మాట మీకు చెప్పలేక విమలతోనూ, సతితోనూ చెప్పాను. అంతే!” అంటూ భోరుమన్నది గౌరి.

“సరి.. సరి.. లేమ్మా లే! ఇంతకూ వాడు అడిగిన దానికి నువ్వేమని సమాధానం చెప్తివి?” అని నిలదీశాడు.

“‘నాకేమీ తెలీదు.. మామను అడగాల’ అని చెప్తిని మామా”

“ఆహా.. అయితే నీకు వాణ్ని చేసుకోవడం ఇష్టమేనా? కాదా?” గౌరి కళ్లలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మామ.

“నాకు అభ్యంతరం యేమీ కనిపించ లేదు మామా.. వద్దనడానికి..”

“యేమ్మా? మూగివాణ్ని, వంట వాణ్ని ఎట్లా చేసుకుంటావే నువ్వు? నువ్వేమి సుఖపడతావమ్మా? వాడికి 150 రూపాయల జీత మొస్తుందేమో! దానితో నిన్ను ఎట్లా పోషిస్తుడు?” భూమ్మీద నిలబడి ఆలోచించమన్నట్టుగా సూచించినాడు మామ.

“మామా.. అతనికి గుడి వెనుక రూము ఒకటి ఇచ్చినారు. అతనికి గుడిలో ప్రసాదాలతోనే ఒక పూట కడుపు నిండుతుంది. నేను ఎటూ మన ఇంట్లో వంట చేస్తును కదా.. నాకు పిడికెడన్నం మీరు పెడతారు కదా.. ఇంతకంటే ఇంకేం ఖర్చులుంటాయి మామా? నన్ను, ఈ మరుగుజ్జు దాన్ని వంటవాడు కాక పెద్ద ఆఫీసర్లు ఎందుకు చేసుకుంటారు మామా? నాకు యేమీ పెద్దపెద్ద కోరికలు లేవు. మా అప్పదా బీదవాడు. అందరిళ్లకూ నది నించి కావడిలో నీళ్లు తెచ్చి పోసేవాడు. మా అమ్మ వంట మనిషి. నేను కూడా మీ ఇంట్లో వంటమనిషిని దానే.. నాకు ఈ మాత్రం సంబంధం చాలు మామా!” ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని గౌరి అన్నది.

“నీవు వంటమనిషివి ఎందుకవుతావు? నా మేనకోడలివి. వద్దమ్మా! నాకు నచ్చలేదు ఈ సంబంధం! ఇంతకంటే మంచి సంబంధమే వచ్చును నీకు.. ఇంక కోవెలకు పోవద్దు నీవు!” ఆయన ఆజ్ఞాపించి లేచి వెళ్లిపోయినాడు. నిశ్చేష్టురాలయిపోయింది గౌరి.

మామీ గౌరిని నానా మాటలూ అన్నది.

“నీకు కృతజ్ఞత లేదు.. నీవు కష్టంలో వున్నప్పుడు మామ నిన్ను తెచ్చి కడుపులో పెట్టుకుంటే.. ఆయన పరువు పోగొడతావా? ఒక వంటవాడికి నిన్ను ఇచ్చి పెండ్లి చెయ్యాలంటే మీ మామకు ఎంత తలవంపులుగా వుంటుందో ఆలోచించినావా? మీలాంటి పేదవాళ్లకు, పల్లెటూరి వాళ్లకూ ప్రేమాభిమానాలు వుండవు. పాముకు పాలుపోసి పెంచుకున్నట్లయింది. అయినా మరుగుజ్జు దానికి నీకు పెండ్లెందుకు? మళ్లీ నీలాంటి పిల్లలనే భూమ్మీదికి తెస్తావా? నీ హద్దులు మరిచిపోయి ప్రవర్తిస్తున్నావు! ముప్ఫయ్ అయిదేళ్లొస్తున్నాయి.. ఇంకా నీకు పెండ్లిమీద కోరికెందుకు? పైకి ఎంతో మంచిదానిలాగా వుంటావు గానీ, లోపల విషం పెట్టుకున్నావు!” అని ఇంకెన్నో అనరాని మాటలు అన్నది కామాక్షిమామీ.

ఆ మాటలకు గౌరికి భూమెక్కడుందో.. ఆకాశమెక్కడుందో.. కనబడలేదు.

మామీ ఎప్పుడు వెళ్లిపోయిందో తెలీలేదు.

స్పృహ కోల్పోయినట్టయి, నేల మీదికి వాలిపోయింది. రాత్రంతా చల్లటి నేలపై పడివుండటంతో, మానసిక సంఘర్షణతో తెల్లవారు ఝామున విపరీతమైన చలీజ్వరం వచ్చింది. లేవడానికి చేతకావడం లేదు. ఎవరినైనా పిలుద్దామంటే నోరు పెగలడం లేదు.

అత్తంగో పూల కోసం కిందికి రాలేదని తోటమాలి తానే పూలు కోసి, పైకి తెచ్చి, “అత్తంగో.. అత్తంగో..” అని పిలిచినాడు. పలకకపోయేసరికి భోజనాల హాలులోకి కిటికీలో నుంచి తొంగిచూసినాడు.

అత్తంగో నేలపై పడుకొని, ‘చలి.. చలి..’ అని వొణుకుతున్నది.

ఒక్క ఉదుటున పరిగెత్తి మామీని పిలుచుకొచ్చినాడు. అందరూ ఆ సందడికి నిద్ర లేచినారు.

అందరూ కలిసి ఆమెను సామాన్ల గదిలోని ఆమె బెంచీపై పడుకోబెట్టి, రగ్గులన్నీ తెచ్చి కప్పినా ఆమె చలితో ఎగిరెగిరి పడుతోంది. అప్పటికప్పుడు తమ ఫామిలీ డాక్టరును పిలిపించాడు లాయరు మామ. వెంటనే తన నర్సింగ్ హోమ్‌లో చేర్చుకున్నాడు డాక్టరు.

చలి తగ్గింది. జ్వరమూ కాస్త తగ్గింది.

కానీ ఒకటే కలవరిస్తోంది..

‘మామా.. నేనేం తప్పు చెయ్యలేదు.. మీరంటే నాకు ఎంతో గౌరవం! మీకు అపకీర్తి తీసుకు రాను.. మీరెట్లా చెప్తే అట్లాగే చేస్తును.. మామీ.. నేను మీ బిడ్డ మాదిరి దానే! మీకు ద్రోహం చేస్తునా? నాకు కల్యాణం వద్దు.. యేమీ వద్దు.. నేను మీ ఇంట్లోనే వుండి మీకు సేవ చేసుకుంటును..” ఇలా మాట్లాడుతూ మధ్య మధ్యలో స్తోత్రాలు వల్లిస్తోంది.

ఆమె కలవరింతలు విని మామీకి కూడా కళ్లనీళ్లు వచ్చినాయి.

“గౌరీ! ఊరుకోమ్మా!” అని ఓదారుస్తూ తల నిమురుతోంది.. రాత్రి తను మాట్లాడిన మాటలకు పిల్ల మనసు క్షోభ పడుతోందని అర్థమైంది. లాయరు మామ కూడా కళ్లు ఒత్తుకున్నాడు.

“మిస్టర్ వైద్యనాథం! యేమైంది ఆమెకు? ఇంట్లో గొడవపడ్డారా? ఏదో చాలా మానసిక సంఘర్షణ పడుతోంది. మీరు ఆమెకు ధైర్యం చెప్పండి.. లేకపోతే ఆమెకు జ్వరం తగ్గదు.” అన్నాడు డాక్టరు.

“నాన్ ఎల్లాం పాకరే!” (నేను అన్నీ చూసుకుంటాను) అని డాక్టరుకు మాట ఇచ్చినాడు లాయరుమామ.

ఆయనలో ఒక సంఘర్షణ మొదలైంది. తాను తన స్వార్థం కోసం చూసుకున్నాడు. గౌరిలాంటి మరుగుజ్జు పిల్లకు కల్యాణం అవసరం లేదని తీర్మానించుకున్నాడు. పెండ్లి కాకుంటే ఇంట్లో నమ్మకమైన వంటమనిషిగా నిలిచిపోతుందనే ఉద్దేశంతోనే సంబంధాలు చూడలేదు. తన భార్య, కోడళ్లు, కూతురు వీళ్లకు యే వంట, పనీ, బాదరబందీ వుండకూడదనీ, గౌరిని జీతంబత్తెం లేని బానిసగా తాను తన ఇంట్లోనే వుంచేసుకోవాలనుకున్నాడు. కానీ, తాను కొలిచే శివుడు తనను ఈ అపరాధం శాశ్వతంగా చేయకుండా తనను కాపాడటానికే ఈ పరమశివన్‍ను పంపించాడు.

ఇప్పుడైనా తన కోరిక తీరడానికి యేమీ అవరోధం లేదు.

గౌరికి, శివన్‍కు పెండ్లిచేసి, మేడ మీద వున్న ఇళ్లలోని ఒక చిన్న ఇంట్లో పెట్టుకుంటాడు. శివన్‌ను తన పనివాళ్లందరి మీదా హెడ్‌గా నియమించి, జీతమిస్తాడు. గౌరి వంటపని చూసుకుంటుంది. శివన్‌పై పనులు చూసుకుంటాడు. ముందు ముందు డ్రైవింగ్ లాంటి పనులన్నీ నేర్పించి నమ్మకస్తుడైన అనుచరుడుగా మార్చుకుంటాడు. ఇద్దరూ తనను ఆశ్రయించి బతుకుతారు. తాను గౌరికి అన్యాయం చేస్తున్నాననే వేదన కూడా తనకు వుండదు.

బంధువుల్లో కూడా అనాథ పిల్లను చేరదీసి పెండ్లీపేరంటం చేసినందుకు మంచిపేరు వచ్చును.

ఇట్లా లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ, ఆలోచించుకుంటూ అమ్మన్ కోవెలకు పోయి, అమ్మవారికి దండం పెట్టుకొని, ఆమెకు తన సంకల్పం చెప్పి, పరమశివన్‍ను తనతోపాటు కారులో నర్సింగ్ హోమ్‌కు తీసుకువచ్చాడు.

శివన్ లోలోపల ఒణికి పోతున్నాడు. అతనికి యేమీ అర్థం కావడం లేదు. ఏమి జరుగుతున్నదో, జరుగబోతోందో తెలీదు అతనికి. యేదైనా అడుగుదామంటే అతనికి నోరులేదు.

***

గౌరి పిచ్చి పిచ్చిగా యేదో వదురుతూనే వుంది. తన తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులనూ గురించి యేదో మాట్లాడుతూ వుంది. కామాక్షి మామి ఎంతగా చెప్పినా ఆమె మనసుకు చేరడం లేదు.

“అమ్మా! అప్పా! నన్నెందుకు కంటిరి? ఎందుకు అనాథను చేస్తిరి? నాకు ఎవరూ లేరే.. నేనేం పాపం చేస్తిని? మురుగనే..! నీకుదా ఇంత పూజ చేస్తినే! నువ్వు కూడా నన్ను ఈ మాదిరి బాధ పెడుతువా? నన్ను నీ దగ్గరికి తీసుకుపో.. నాకు బతకాలని లేదు.. నాకు కల్యాణం వద్దూ.. యేమీ వద్దు!” ఇలా సాగుతోంది ఆమె కలవరింత.

విమల, సతి ఆమె పక్కన కూర్చొని సముదాయిస్తున్నారు. కాసేపు సర్దుకున్నట్టే వుంటుంది. తిరిగి వదరడం మొదలవుతూంది. జ్వరం పూర్తిగా తగ్గడం లేదు. చల్లనీటిలో తడిపిన గుడ్డలను తలమీద వేసి, తడిగుడ్డలతో కాళ్లూచేతులూ తుడుస్తున్నారిద్దరూ.

అప్పుడే గౌరి వున్న గది లోపలికి వచ్చిన పరమశివన్‍కు గౌరిని ఆ స్థితిలో చూసి కంగారుపుట్టింది.

“శివన్! గౌరితో మాట్లాడప్పా! దాన్ని ఓదార్చు! గౌరి నీదిదా! మంచిరోజు చూసి మీ ఇద్దరికీ కల్యాణం చేస్తును” అని, కామాక్షిని తీసుకుని వెళ్లి బయట బెంచీపైన కూర్చున్నాడు లాయర్ మామ.

సతి, విమల ఆనందంగా ఒకరి నొకరు చూసుకున్నారు.

శివన్‌కు తాను యేం వింటున్నాడో అర్థం కాలేదు. మాటలు రాక పోయినా గౌరిని మామూలు మనిషిని చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినాడు, విమలామామి, సతీమామితో కలిసి.

త్వరలోనే లాయర్ మామ ఇంట్లో పెండ్లిమేళాలు మోగినాయి. గౌరికి కొత్తగా మెడలో మంగళసూత్రాలు, కాళ్లకు మెట్టెలు, పాపిటలో బొట్టు వచ్చింది. కొత్త ముత్తైదువుగా కళకళలాడుతున్నది గౌరి. ఇంట్లో మామూలుగానే ‘అత్తంగో’ స్మరణ జరుగుతూనే వుంది. ఒక విధమైన హుందాతనంతో, నిశ్చింతతో అత్తనూ, మామనూ సేవించుకుంటున్నారు గౌరి, పరమశివన్ దంపతులు!! ఇద్దరూ కలిసి అరమరికలు లేకుండా కలిసి భార్యాభర్తలుగా బతకడమే వారికి జీవితంలో లభించిన గొప్ప భాగ్యం! పెద్దగా కోరికలు, ఆదర్శాలూ యేమీ తెలియని అమాయక జీవులు వాళ్లు! పెద్ద హోదాలు, ఆడంబరాలు, ఐశ్వర్యాలు, గుర్తింపులూ, ఆర్భాటాలూ యేమీ అవసరం లేదు. వాళ్లిద్దరూ కలిసివుంటే చాలు! అదే పెద్ద వరం వాళ్లకు!

“సీతా కల్యాణ వైభోగమే.. రామ కల్యాణా వైభోగమే..” అని కామాక్షి మామి, ఆమె కూతురు పాడుతున్నారు. అయ్యరు మామ మృదంగం వాయిస్తూ వున్నాడు.

7.

ఆ వూళ్లో చెన్నకేశవ స్వామి రథోత్సవం రేపనగా ఊళ్లో జనం నిండిపోయినారు. వీరారెడ్డి ఇంట్లో రెండో చెల్లెలు లక్షిందేవి, ఆమె భర్త ఎల్లారెడ్డీ, ఇద్దరు పిల్లలూ రెండు రోజుల కిందటే వచ్చినారు. చుట్టుపక్కల ఊళ్లనించి ఇద్దరు ముగ్గురు చుట్టాలు కూడా వచ్చినారు. ఊళ్లో అందరిళ్లలో ఇదే పరిస్థితి కాబట్టి నీళ్లకు కటకట అయిపోయింది. ఉప్పునీళ్లు కూడా సరిగ్గా దొరకడం లేదు.

నాగులు ఒక్క క్షణం కూడా ఉసి పోకుండా నీళ్ల కోసం తిరుగుతూనే వుంది. వీలయినన్ని ఉప్పునీళ్లు తెచ్చిపోస్తూనే వుంది. మంచినీళ్లకు బాగా ఇబ్బంది అయిపోయింది.

అక్కడికీ వకీలు గారింట్లో బోర్ పంపు నుంచి మూడు బిందెలు కొట్టుకొచ్చింది. దాని కోసం వాళ్ల చేత నానా దూషణలూ, నిష్ఠూరాలూ భరించింది. అయినా ఆ నీళ్లు వంటకేగానీ, తాగడానికి పనికిరావు.

కరణం నరసింహారావు గారి దొడ్లో మంచినీళ్ల బావి వుంది. వాళ్లు ఎవ్వరికీ చుక్క నీళ్లు ఇవ్వరు. ఎందుకంటే ఆ నీళ్లు వాళ్లకే అక్కడి కక్కడికి సరిపోతాయి. వాళ్లు నీళ్లు తోడుకోంగానే గిలకకు ఇనుపగొలుసు చుట్టేసి బీగం వేస్తారు.

కానీ, నీళ్ల కోసం తెల్లవారు ఝూమున తిరుగుతున్న నాగులు ఆ బావినీళ్లు రెండుబిందెలు దొంగతనంగా తోడుకుంది. ఒక తాడు తెచ్చుకోని, దానికి బిందెను కట్టి, బావిలోకి వేసి, బాగా ఒంగి లాక్కోవలసి వచ్చింది. దాంతో చేతులు దోక్కొని పోయినాయి. పొట్ట మీద చర్మం ఒరుసుకొని పోయింది. అయినా ఇంట్లో అవసరం కోసం భరించింది. ఎన్నడూ లేనిది నీళ్ల దొంగతనం చేయాల్సి వచ్చింది. పట్టుబడితే యేమయ్యేదో తెలీదు గానీ, దేవుడి దయవల్ల పట్టుబడలేదు.

ఊరి సర్పంచి పక్క వూళ్ల నించి, ఊరి బయట వున్న వ్యవసాయ బావుల నించీ, పీపాలతో నీళ్లు తెప్పిస్తూనే వున్నాడు గానీ, అవి ధనవంతులకు, పలుకుబడి వున్నవాళ్లకే పరిమితమయ్యాయి. బీదాసాదల గతి కుక్కలకెరుక!

అక్కడికీ పీపావాళ్లను బతిమాలి ఒక్క బిందెడు నీళ్లు సంపాదించింది నాగులు.

పొద్దున పది గంటలవుతుండగా విస్తట్లో ఉప్పుడుపిండి పెట్టి, దానిమీద పప్పులపొడి వేసి, నాగులు ముందు పెట్టి, “అమ్మే.. నాగులూ! ఒక్క రెండు బిందెల మంచినీల్లు సంపాయిచ్చినా వంటే ఇయ్యాల్టి దినం గడుస్తాది. పొద్దున అందరూ ఎవరి వూళ్లకు వాల్లు ఎల్లబారిపోతారు” అని మంచి మర్యాదగా మాట్లాడింది. పెద్ద గళాసు నిండా కాపీ కూడా పోసుకొచ్చి, ఆమె ముందు పెట్టింది.

‘మా ఒదినెకు ఇంత మంచి మాటలు గూడా వొస్తాయా?’ అని మనసులోనే బుగ్గలు నొక్కుకుంది నాగులు.

‘నీవేమో, నీ బతుకేమో, నీ మాటలేమో నాకు తెలుసులే!’ అన్నట్టు ఒక చూపు చూసి ఉప్పుడుపిండి తినడంలో మునిగిపోయింది నాగులు, జవాబేమీ చెప్పకుండా.

‘మంచి నీళ్లెక్కడ దొరుకుతాయా..?’ అని యోచనలో పడింది నాగులు. అప్పుడు జంగమయ్యకుంట పక్కన రెడ్డిగారి తోట కాపలాదారు అయిన శంకరయ్య తాత గుర్తుకొచ్చినాడు. అప్పుడప్పుడూ పచ్చిగడ్డి దోక్కొని రావడానికి ఆ తోట దిక్కు పోయి నప్పుడు తోటలోకి రానిస్తాడు ఆ తాత.. మంచినీళ్లు తాగడానికి.

‘అవ్వకు కూడా తనంటే ఇష్టం. ఆమె కూతురు పదేండ్ల కింద అత్తగారింట్లో బాధలు తట్టుకోలేక బావిలో పడి చచ్చిపోయిందంట. ఆమె కొద్దిగా తన మాదిరి వుండేదంట! ఆమెకు తనను చూస్తే కూతురిని చూసుకున్నట్టు వుంటుందంట! అయితే శానా దూరం వుంది ఆ తోట. ఎండలో అంతదూరం పోవాలంటే కాళ్లు కాలుతాయి. కానీ, నీళ్లు లేకుంటే ఇంట్లో జరగదు గదా..’ ఇట్లా ఆలోచించుకొని, పాతచీర ముక్కలు కాళ్లకు బద్దరంగా చుట్టుకొని గట్టి ముడులు వేసుకోని తోటవైపు నడిచింది నాగులు.

వైశాఖమాసపు ఎండ ఈడ్చీడ్చి కొడతావుంది. ఎండకు కాలిన తారురోడ్డు వేడిని గుడ్డముక్కలు ఆపలేకపోయినాయి. కాళ్లు మండిపోతుంటే పరుగులాంటి నడకతో తోటకు చేరుకుంది. చుట్టూ చెట్లతో వనదేవత చల్లగా ప్రత్యక్షమయింది, నాగులుకోసం చల్లగాలి వీస్తూ.

నీళ్ల కోసం ఇంతదూరం ఒచ్చిన నాగులును చూసి, బాధా, కోపమూ రెండూ ఒచ్చినాయి శంకరయ్య తాతకు. అప్పటికే కొందరు పీపా బండ్లవాళ్లు నీళ్లు తీసుకొని పోతున్నారు. వాళ్లతో మాట్లాడుతూనే..

“నీ పాసుగూల! నీ పిల్ల యేసర! (వేసారిపోనూ!) ఇంత ఎండలో ఇంత దూరం నీల్లకోసం ఒచ్చినావా నాగులూ? నీ నీల్ల మీద వాన గురువ! నీ అసాద్దెం పాడు గానూ!..” అని తిట్టడం మొదలుపెట్టినాడు తాత.

“పాపా! మీ తాత అట్లనే మాట్లాడుతాడులే.. లోపలికి రామ్మా!” అని వాళ్లు వుండే ఇంట్లోకి పిలిచింది అవ్వ.

తాతకు జవాబు చెప్పకుండా అవ్వవెంట నడిచింది నాగులు.

“ఇయ్యాల దేవుడు ఊల్లోకి వస్తాన్నాడని అందురూ పండగ చేసుకుంటా వుంటే.. నువ్వు తోటలెంటా, దొడ్లెంటా తిక్కదాని మాదిరి తిరుగుతాన్నావే.. నీల్లకోసరం..! ఎంత తిక్కపిల్లవే! నెత్తికి సమురుపెట్టుకోని ఎన్నాల్లయిందే తిక్కపీనిగా..! యేమి అన్న? యేమి ఒదినె? సరే.. వాల్లను అనేమి లాబం? నీ కర్మ అట్లా కాలింది. సరే.. సమురు పెట్టుకో తలకు…” అని చమురు సీసా ఇచ్చింది. “పోయి బచ్చలింట్లోకి (స్నానానికేర్పాటు చేసుకున్న తడికెల గది) పోయి, స్తానం చేసిరా.. నా చీర ఇస్తా.. నీ చీర పిండి ఆరేసుకో.. పండగనాడు పిచ్చికళన బడి వున్నావు సూడు. ఔత్ కానాలో నీల్లున్నాయి సూడు” అని చెప్తూనే దొడ్లో వున్న కుంకుడు చెట్టు కొమ్మ గుంజి, పిడికెడు పచ్చి కూకుడుకాయలు (కుంకుడుకాయలు) ఒక మట్టి చట్టిలో యేసి యిచ్చింది అవ్వ. తల రుద్దుకోవడానికి అన్నంగంజి ఒక గిన్నెలో పోసి యిచ్చింది. అవ్వ ప్రేమకు కళ్లలో నీళ్లు తిరిగినాయి నాగులుకు. పచ్చికూకుడు కాయలను నలిపితే వచ్చిన నురుగుతో స్తానం చేసింది. అన్నంగంజి తలకు పట్టించుకోని, మిగిలిన కూకుడుకాయల రసంతో తలరుద్దుకుంది. తన బట్టలు పిండి ఆరేసుకుంది. అవ్వ చీర చుట్టుకుంది.

స్తానం అయింతర్వాత మొహాన కుంకుమబొట్టు పెట్టి, దేవుడికి దండం పెట్టిచ్చి, పెద్ద బాదం ఆకులో రెండు భక్ష్యాలు, మరో ఆకులో పట్టెడు చిత్రాన్నం పెట్టింది అవ్వ. తాత నవ్వుతూ చూస్తున్నాడు.

ఆవేళ దేవుడు వూళ్లోకి వొస్తున్నాడని వూరంతా పండగ చేసుకుని, భక్ష్యాలు చేసుకున్నారు.

అవ్వ ప్రేమతోనే కడుపు నిండింది నాగులుకు. ఆమె పెట్టిన భోజనానికి మనసు కూడా నిండింది. తల దువ్వుకోమని దువ్వెన ఇచ్చింది.

అంతా అయ్యాక “అవ్వా! ఇంట్లో చుట్టాలున్నారు. రెండు బిందెల నీల్లిస్తే నేను ఎల్లిపోతానవ్వా! నీ మేలు మరువను..” అన్నది నాగులు.

“ఇంత ఎండలో ఎట్లపోతావు పాపా! ఎండ తగ్గనీలే!” అనింది అవ్వ. వీలుపడదు.. ఎట్లయినా పోయేదేనన్నది నాగులు.

8.

మోటర్ వేసి, బావినీళ్లు రెండు బిందెలు పట్టిచ్చినాడు తాత.

“ఇంత దూరం మోసుకోని పోవడం కస్టంలే పాపా.. వుండు.. యేదైనా బండి దొరుకుతుందేమో.. చూస్తాను” అని తోట బయటికెళ్లి ఒక బండిని ఆపినాడు. వాళ్లు పక్కవూరికి పోతున్నారంట. నాగులును ఆమె వూరి పొలిమేరలలో దింపిపోతామన్నారు.

నాగులు వూరి ముందర దిగి, నెత్తి మీద బిందె, చంకలో బిందెతో కాళ్లు కాలుతూ వుండగా మొండిగా నడుస్తూ ఇల్లు జేరింది.

బిందెలు దింపి, ఎండవేడికి తాళలేక.. తన మంచం పక్కన బండలమీద వాలిపోయింది. వాళ్లంతా అన్నాలు తింటున్నారు. ఆమెనూ రమ్మని పిలిచినట్టున్నారు. ఆమెకు వినబడలేదు. మంచి నిద్రలోకి జారుకుంది.

***

ఏవో గట్టిగా నవ్వులు, మాటలు వినబడి మెలకువ వచ్చింది ఆమెకు. కళ్లు మూసుకోనే వింటున్నది.

ఒదినా, తన చెల్లెలు, ఇంకా ఎవరో ఆడవాళ్లు బారాకట్ట (గవ్వలాట) ఆడుతున్నారు. అన్నా, ఎల్లారెడ్డీ పులిగీతం (పులిజూదం) ఆడుతున్నారు. పిల్లలు గోలగోలగా సినిమా కథలు చెప్పుకుంటూన్నారు.

పులిగీతంలో అన్న గెలిచి నట్టున్నాడు. పెద్దగా నవ్వుతూన్నాడు.

“ఎట్లయినా గానీ, నిన్ను ఓడిపిచ్చడం కట్టంలే బావా! నీకున్న తెలివి నాకేడుంది సెప్పు? ఆడపిల్ల అని గూడా సూడకుండా నాగులక్కను వూరంతా తిప్పి నీల్లు తెప్పిచ్చుకుంటావు. నీవు, మాయక్క ఇంట్లో కడుపులో చల్ల కదలకుండా కూకుంటారు. ఆయమ్మికి పెండ్లి జెయ్యకుండా ఆమె సేను గూడా నువ్వే యేసు కుంటావున్నావు. పండగనాడయినా, సెల్లెలికి కొత్తకోక కొనవు. అన్నీ దుడ్లే బావా నీకు! అంతా మిగులే బావా! మాతో కూడా కొంచెం పంచుకోవచ్చుగదా! ఆమెను మా ఇంట్లో కొన్నాల్లు వొదిలిపెట్టు బావా! నీ సెల్లెలు కూడా సుకపడతాది..” అని ఆటలో ఓడిపోయినానన్న ఉక్రోషంతో, బావకు నాగులు రూపంలో జీతం బత్తెం లేని పనిమనిషి దొరికిందన్న అక్కసుతో అన్నాడు ఎల్లారెడ్డి.

“అన్నా! దాన్ని ఇంట్లో పెట్టుకోని మేమేదో సుకపడతాన్నామని నువ్వు అనుకుంటాన్నావు. అది సింకి చాటెడంత తింటాది పూట పూటా.. తెలుసా? దానికన్నా ఎవురన్నా మనిషిని పెట్టుకోని శాకిరీ జేయించుకుంటే మనకు అగ్గువ పడతాది తెలుసా?” అనింది తులిశెమ్మ చేతులు తిప్పుతూ.

ఆ మాటలకు లక్షిందేవి పగలబడి నవ్వుతా వుంది.. అన్నకు తగిన చెల్లెలు!

“నువ్వేమన్నా జెప్పక్కా! రేపు మాతో పాటి మావూరికి పిల్చక పోయేదే నాగులక్కను. మళ్లా తిరనాల అప్పటికి దింపుతాములే” అని పట్టుదలగా అన్నాడు ఎల్లారెడ్డి.

“యేం మాట్లాడతాండావు బావా? పెండ్లిగాని పిల్లను దాని సెల్లెలింటికి ఎట్ల పంపమంటావ్! సెప్పు! లోకం నా మొగాన ఉమ్మేయదా?” అన్నాడు వీరారెడ్డి ఆందోళనగా.

“ఇప్పుడు మాత్తరం నిన్ను మెచ్చుకుంటా వుండారా బావా? అట్లా అయితే ఆయమ్మిని నాకిచ్చి పెండ్లిజెయ్యి! ‘ఎక్కడా దొరకకపోతే అక్కమొగుడే గతి’ అని సామతి గూడా వుంది గదా? నాకంటే గొప్ప మొగోడు దొరుకుతాడా దానికి?.. ఎన్నాల్లని పెండ్లి జెయ్యకుండా పెట్టుకుంటావ్!” ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడుతా పోతున్నాడు ఎల్లారెడ్డి.

అందరూ మాటలు రానట్టు కొయ్యబారి పోయినారు.

ఆ మాటలకు కాళ్లకింద నిప్పులు పోసినట్టుగా జయ్యిమని లేచింది నాగులు. పక్కనే వున్న ముల్లుగర్ర అందుకుని గుండ్రంగా సాము గరడీలు చేసేవాళ్లలాగా తిప్పుతూ..

“ఎవుడ్రా ఈ మాటలు అంటాండేది? నీకు సిగ్గు, మానం, మరేద ఉందారా ఎల్లారెడ్డిగా? నీకు నా సెల్లెల్ని ఇచ్చే దాని గొంతు కోసినాడు మాయన్న. నీకు నేను ఒదినెనురా. అక్క వంటి దాన్ని. నన్ను పెండ్లి జేసుకుంటావారా? దమ్ముంటే పది మంది ముందరా మాట్లాడుదువు రారా! అందరూ ఉమ్మేస్తే బుద్ధొస్తుందేమో!” అంటూ అన్నవైపు తిరిగి,

“ఓరేయ్ ఈరారెడ్డీ! ఈ ఛనం నించీ నేను నీ సెల్లెల్ని గాదు. నువ్వు నా యన్నవూ గాదూ! తెగిపోయింది సుట్టరికం.. నేను అమ్మానాయనతో బాటు సచ్చిపోయినట్టు లెక్కేసుకో! తద్దినం పెట్టుకో! నేను ఎలబారి పోతాన్నా..! నా జోలికి ఎవురన్నా ఒచ్చినారంటే సూసుకోండి” అంటూ తన బట్టలమూట చంకన బెట్టుకోని, ముల్లుగర్రను చేతిలో పట్టుకొని బయటికి నడిచింది నాగులు.

ఒదినెను, చెల్లెల్నీ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది.

“ఒరేయ్! ఎల్లారెడ్డిగా! నీ నోట్లో మన్నుబడ! నీకు గోరీగట్ట! నీ ఇల్లు పీర్లసావిడిగానూ! నీ యింట జిల్లెడుసెట్లు పుట్ట! సస్తావురేయ్ నువ్వు!” అని బండబూతులు తిట్టింది.

ఇంటిముందు నిలుచుకోని పిడికెడు మట్టిని పట్టుకోని ధారగా పోసింది శపిస్తున్నట్టు. వెనిక్కి తిరిగి చూడకుండా శివాలయానికి చేరుకుంది.

***

తిరుణాలకొచ్చిన జనం శివాలయం అరుగుల నిండా కూర్చొని, పండుకొని వున్నారు. నేరుగా పూజారయ్య ఇంట్లోకి పోయింది నాగులు.

నిలువెల్లా ఒణికిపోతున్న నాగులక్కను చూసి, ఆమె చంకలోని మూటను చూసి, కొంత అర్థమయింది పూజారయ్య భార్యకు. వెనుక వరండాలో చోటు చూపి, అక్కడే తన మూటను పెట్టుకోమన్నది.

తరవాత అన్నాఒదినా ఒచ్చి రాద్ధాంతాలు చేసినారు. నాగులు తన పట్టు విడవలేదు. పెద్దల పంచాయితీ పెట్టించినారు. పెద్దల ముందు తన కష్టాలన్నీ చెప్పుకోని, తాను శివాలయంలోనే వుంటాననీ, పూజారయ్య, దూదేకుల బాబయ్య రక్షణలో వుంటాననీ, శివాలయంలో పనులన్నీ చేస్తాననీ, దేవుడే తనకు దిక్కనీ చెప్పింది. తన రెండెకరాల పొలం తనకు వొద్దనీ, దాన్ని అన్ననే వేసుకోమని గూడా చెప్పింది. లోలోపల మనసు తేలికయింది వీరారెడ్డికి ఆ మాట విని.

ఊరి పెద్దలు, అక్కడ చేరిన వాళ్లందరూ వీరారెడ్డినీ, తులసెమ్మనూ తూర్పారబట్టినారు. ‘ఎప్పుడు అడిగితే అప్పుడు నాగులక్క రెండెకరాలు ఆమెకియ్యాలనీ, ఆమె జోలికి పోరాదనీ’ నిర్ణయం చేసినారు. పూజారయ్యను, బాబయ్యనూ ఆమెకు రక్షణగా పెట్టినారు. శివాలయం వెనక వున్న పాతగదిని ఆమె వుండడానికి వాడుకోవచ్చనీ తీర్పు యిచ్చినారు.

దాంతో బలవంతపు చాకిరీ నించి నాగులుకు విముక్తి దొరికింది. ఇప్పుడు స్వతంత్రం స్వర్గలోకంగా అనిపిస్తున్నది ఆమెకు.

తనకు ఇచ్చిన రూమును చక్కగా తీర్చిదిద్దుకుంది నాగులు. శివాలయం ఇప్పుడు శుభ్రతకు ఆలవాలంగా మారింది. స్వామివారి పూజాపాత్రలన్నీ తళతళ లాడుతున్నాయి. పూజారయ్య భార్య ఆరోగ్యం బాగుపడింది నాగులు సేవలతో. నీళ్లమోత తప్పడంతో పూజారయ్య కొంచెం తెరిపిన పడినాడు. రెండు బిందెల మంచినీళ్లు మాత్రం పూజకూ, తామిద్దరూ తాగడానికీ తెచ్చుకుంటాడు. ఇప్పుడు మంత్రాలు కూడా ధాటిగా చెబుతున్నాడు. ముందటిరోజుల్లో ఆయన చెప్పే మంత్రాలు శివునికైనా వినబడేవో? లేదో?.. అనుకునేవాళ్లు.

శివాలయం నిర్వహణ బాధ్యత మొత్తం నాగులక్కే తీసుకుంది.

శివాలయం వెనక స్థలాన్ని బాగుచేసి, పూలచెట్లు, మల్లెమొక్కలు, బిల్వం, మామిడి మొక్కలు నాటింది. ఇప్పుడు శివుడు రోజూ పూలదండ వేసుకుంటున్నాడు నాగులు పుణ్యమా.. అని. లేకపోతే యే పండగనాడో తప్ప పూలదండ వుండేది కాదు ఆయనకు. బిల్వదళం కూడా రోజూ అబ్బుతున్నది స్వామికి. పార్వతీదేవి కొప్పులో రోజూ మల్లెపూలదండ అమరుతోంది.

అయ్యరు హోటలులో పని వొప్పుకుంది నాగులు. తిండి బాధ తప్పింది ఆమెకు. డబ్బూ కొంత ఇస్తున్నాడు అయ్యరు.

తనకు పనిలేనప్పుడు బాబయ్య దగ్గర కూర్చొని, జాకెట్లకు హెమింగులు చెయ్యడం, హుక్కులు కుట్టడం, అప్పుడప్పుడే మొదలైన కొత్త పద్ధతి చీరలకు ఫాల్స్ కుట్టడం నేర్చుకుంటున్నది. నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నది. పూజారయ్య ఆమెకు పోస్టాఫీసులో డబ్బు దాచుకోవడం నేర్పించినాడు. పూజారయ్య భార్య ఆమెకు భజనలూ, పాటలూ నేర్పిస్తున్నది. మధ్యాహ్నాలప్పుడు ‘ఓనమాలు’ నేర్పిస్తున్నది. గుడి నేల మీది బండల నిండా ‘అఆఇఈ’లు సుద్దముక్కతో రాసుకుంటుంది నాగులు. తొందరగా అన్నీ నేర్చేసుకోవాలని ఆమె తపన పడుతూ వుంటుంది. ఇప్పుడు పెద్ద పండగలకు కొత్తచీర కొనుక్కుంటుంది. చెప్పులు వేసుకోవాలంటే తెగ సిగ్గుపడుతూ వుంటే, పూజారయ్య హవాయ్ చెప్పులు కొనిచ్చి బలవంతంగా తొడిగిచ్చినాడు. ఇప్పుడు హవాయి చెప్పులతో తిరుగుతుంది నాగులక్క.

కురూపితనం అనే ముసుగులో తనపై అన్నా ఒదినా రుద్దిన భయంకరమైన కట్టుబానిసత్వం నించి బయటపడిన నాగులక్క స్వతంత్రంగా బతకడంలోని ఆనందాన్ని అనుభవిస్తున్నది.

ఇప్పుడు తిట్లు, శాపనార్థాలూ లేవు! పని అప్పటివలెనే చేస్తూన్నా.. మనసుకు శాంతిగా వుంది. అలసటే అనిపించడం లేదు. ఇప్పుడు శివాలయమే ఆమె నివాసం! శివుడే ఆమె ప్రాణ బంధువు! పూజారయ్య దంపతులే తల్లిదండ్రులు! దూదేకుల బాబయ్యే ఆమెకు ఆత్మీయుడు!! ఈ ఆనందంలో సామిరెడ్డి కూడా ఎక్కువగా గుర్తుకురావడం లేదు.

ఇప్పుడు నాగులక్క సొంతంగా పోస్టాఫీసుకు పోయి డబ్బు వేసి.. సంతకం చేసి వస్తుంది.. జి. నాగలచ్చమ్మ.. అని!

శివాలయం వాకిట్లో కూర్చోని మల్లెపూల దండ కడుతున్న నాగులుకు ఆకాశంలో హాయిగా ఎగురుతూ వెళ్తున్న కొంగలు కనిపించినాయి! వాటిని చూసి తృప్తిగా నవ్వింది నాగులక్క.

సమాప్తం

Exit mobile version