[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘నాన్న లేని పుస్తకాల గది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తూరుపు వాకిలి గాలి తాకిడికి
కిటికీ రెక్క
బిగుసుకుని పొయింది.
ఓరకు ఆనిన తలుపు నీడలో
వెలుగు కరిగిపోయింది.
మేజా బల్ల మీద
తెల్ల కాగితం శ్రద్ధాంజలినిచ్చింది.
తెరచి ఉంచిన కలం ముల్లు
గుండెకు గుచ్చుకుని
నిటారుగ వాలి పోయింది
జ్ఞాపకాల బరువు కుర్చీ
నాలుగు కాళ్ళు కదలక
నేలకు వంగింది.
నిదుర మరచిన రాత్రులలో
అవిశ్రాంత వాఙ్మయ ఋషికి,
ఆయాస పడక తోడు నిలిచిన దీపం
ఇపుడు ఓరిమి నేర్పిన ఒజ్జను కోల్పోయి,
అలముకున్న దిగులుతో
పట్ట పగలు చీకటిని
పులుముకుని ఉండి పోయింది.
వరుస వర్గాక్షరాలకు
అర్థ వివరణ లిచ్చిన
దిటమైన పుటల శబ్దార్థ నిఘంటువు
గట్టి అట్ట వెనుక ముఖం చాటు చేసుకుంది.
అప్పటప్పటి రచనల ఉనికి పట్టు
ఆధార గ్రంథం
సగం తెరచిన గాజు అలమరు
గర గరల ధూళి రాపిడికి చిక్కింది.
చదివిన కొలదీ తెలియని తనానికి
వెలుగు నిచ్చిన గ్రంథ నిలయం –
పుటలను తిప్పిన
మసక అద్దాల కళ్ళజోడు మాత్రం
కాంతి రేఖలను తడుముతునే ఉంది.
నాన్న లేని పుస్తకాల గది
పంచిన భాషా విజ్ఞాన సర్వస్వం,
సాహిత్య అధ్యాయాల వారసత్వానికి,
సరి కొత్త చూపు కలిగిస్తునే ఉంది.
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
