Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్న నీడ

[డా. సి. భవానీదేవి రచించిన ‘నాన్న నీడ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నాన్న మా ఇంటికి మూలస్తంభం,
కుటుంబ గుడారాన్ని నిలబెట్టే ధైర్యం.
ఎండలో నీడనిచ్చే వృక్షం
వానలో కాపాడే ఛత్రం
మాటల్లో కర్తవ్యాలు నేర్పించినా ,
మనసంతా ప్రేమసాగరమే!
పిల్లల చిరునవ్వులే పండగ
కుటుంబ సంతోషమే కళ్ళమెరుపు
బాధలెన్నయినా భరించారు
కన్నీటిని కళ్ళల్లోనే దాచుకున్న కర్మయోగి
విషాద హాలాహలాన్ని శివునిలా
గొంతులోనే నిలుపుకున్న గీతానుసారి
కష్టాలన్నీ తానే భరిస్తూ,
మా కలలకు రెక్కలు తొడిగారు
అలసిన అడుగులకు ఆసరా
తడబడుతున్న మనసుకు ధైర్యం
నాన్న స్వేదమే మా భవిష్యత్తు,
నాన్న త్యాగమే మా జీవన సంపద.
నేను నాన్నకు నీడను, అడుగుజాడల్లో నడిచే వెలుగును.
నాన్న చూపిన మానవత్వ మార్గమే
నా జీవితానికి దిక్సూచి
పరోపకారం నేర్పిన గురువు!
ప్రేమపంచడం అలవాటు చేసిన అమృతజీవి!
క్షమ, కరుణ, దయ, దానం,
ఆ హృదయంలో నిత్య వికసిత సుమాలు
నాన్న గురించి రాయాలంటే
అక్షరాలు దొరకని ఆడకూతుర్ని
కావ్యాలు సరిపోని కంటిపాపని!
సముద్రం లోతును కొలవగలమేమో..
నాన్న ప్రేమ అంచుల్ని అందుకోలేం
సాగరానికి తీరం ఉందేమోగానీ
నాన్న వితరణకు హద్దులు కనిపించవు
నా ప్రతి శ్వాసలో జీవిస్తున్నది..
నా ప్రతి విజయంలో గర్వించింది
మా నాన్నే!
నాన్నని మనసునిండా పిలిస్తే
ఆకాశమంత యోగిత్వం నిలుస్తుంది
నా హృదయకేతనం తలెత్తి చాటుతున్నది
నాన్నకు నీడను నేనేనని!
వసివాడని స్మృతులన్నీ నాన్నవేనని!

Exit mobile version