Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్న!

[ఆచార్య ఫణీంద్ర గారు రచించిన ‘నాన్న!’ అనే కవితని అందిస్తున్నాము.]


చదువుకొన్నప్పుడు ఎట్లా చదువుకొన్నాడో..
ఉద్యోగం సాధించేందుకు ఎంత కష్టపడ్డాడో..
పెళ్ళి ఎంత సంబరంగా చేసుకొన్నాడో..
ఏమో! నాకేం తెలుసు?
నేనప్పుడు పుట్టలేదుగా!!
కానీ నేను కాస్త కళ్ళు తెరిచి,
చంకనెక్కిన నాటి నుండి మాత్రం..
ఆయనకు మొత్తం నా ధ్యాసే!
“ఒరే నాన్నా.. అది ముట్టకు.. కాలుతుంది!
అటు వెళ్ళకు .. పడిపోతావు!
ఇది పట్టుకో.. నీకేం కాదు!”..
నాన్న – నా చుట్టూ నిర్మించిన రక్షణ కోట!

చెట్టులా నిలుచున్న నాన్నకు
నీళ్ళెవరు పోసేవారో..
నాకు తెలియదు‌ గానీ,
నాకేం కావాలన్నా.. అవన్నీ..
నాన్న చేతుల కొమ్మలకు పుష్పించేవి!

బడిలో చెప్పిన పాఠాలు
ఇనుప తీగల్లా నా మేనును గ్రుచ్చుకొంటే..
నాన్న నోట అవే పాఠాలు
మల్లె పూల పరిమళాలై
నా అణువణువూ ఆవరించేవి!
మార్కులు తొంబయ్ దాటితే..
ముద్దులు వంద దాటేవి!

ఎదుగుతూ, ఎదుగుతూ..
నేను గమనించ లేదు గానీ –
నేను నిటారుగా నిలబడేందుకు
తాను వంగిపోయేవాడు!
నేను రంగమెక్కాక.. నాన్నకేం పని?
నా పాటే పాడేవాడు! నా డప్పే కొట్టేవాడు!!

నాన్న ఒక సిలబస్ బుక్!
నేను నాన్న నయ్యాక..
ఆ సిలబసే అధ్యయనం చేస్తున్నాను!
ఆ సిలబసే అధ్యయనం చేస్తున్నాను!!

Exit mobile version