[వాణి వేమవరపు గారు రచించిన ‘నాన్న’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆనాడు బాల్యంలో నేను,
బ్రతుకు బాధ్యతల బరువున నాన్న.
నాన్న వేలు పట్టుకుని
రాజువోలే తిరిగిన రోజులు,
దరిని నిలిచిన నే నెరుగని
తన మదిలో బరువులు.
నలగని చొక్కా
చెరగని జుత్తు తో నేను,
నిత్యం సమస్యలతో
చెమటోడుతూ నాన్న.
నేనడిగినవి తక్షణమే
ఆనాడు హాజరు,
అవసరాలను తీర్చే
యోచనలో నాన్న బేజారు.
నాడు బ్రతుకు నావన
ఎదురీతగా నిలిచిన తండ్రి వ్యథలు,
ఈనాడు తెలుపకయే తెలిసితిని
తండ్రిగా ఆ తండ్రి తపనలు.
