[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘నాన్నకు నాన్నగా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“నాన్నగారు! అప్పుడే ఎనిమిదియింది టైం. స్నానం చేయండి. టిఫిన్ తిందురు గాని. తొందరగా బయలుదేరాలి. మిమ్మల్ని దింపి మేం కాలేజీలకి వెళ్ళాలి” అన్నాడు రాజేష్.
రామారావు గారి ముఖంలో దిగులు కనిపిస్తోంది. అది రాజేష్‌కి అర్థమవుతోంది, అయినా తప్పదు. ‘మొదట్లో అలాగే ఉంటుంది. అలవాటైతే అదే బాగుంటుంది. ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదు మరి’ అనుకుంటూ తండ్రి ముఖం లోకి చూస్తూ వున్నాడు.
రామారావు గారు స్నానానికి వెళ్లారు. వందన వంటింట్లోంచి వచ్చి, “ఏమైనా అంటున్నారా” అంది.
“ఏమీ గట్టిగా చెప్పరుగా! లోలోపలే బాధ పడతారు”, అన్నాడు రాజేష్.
రామారావు గారు స్నానం చేసి వచ్చారు. వందన వేడి వేడి ఇడ్లీ పెట్టి, కాఫీ ఇచ్చి, తను తయారవటానికి వెళ్ళింది. మామగారి మందులు, బట్టలు ఒక చిన్న సంచీలో పెట్టింది. ముగ్గురు ఆటోలో బయలుదేరారు.
వాత్సల్య వృద్ధుల డే కేర్ హోమ్ ముందు ఆటో ఆగింది. రాజేష్ తండ్రి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. వందన వెనకే వెళ్ళింది.
ముందు రోజు అన్ని వివరాలు మాట్లాడినందువల్ల హోమ్ నిర్వాహకుడు ప్రసాద్ సాదరంగా ఆహ్వానించాడు.
“రండి సర్, ఇది మీ గది. ఇందులో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ హాల్లో టి.వి. ఉంది. చూడొచ్చు. మీ వయసు వాళ్లే ఉన్నారు. మీకు మంచి కాలక్షేపం”, అని, “మీరు వెళ్ళండి రాజేష్ గారు, నేను చూసుకుంటాను”, అన్నాడు. వందన మందుల పర్సు చూపించి, భోజనం అయ్యాక వేయాల్సినవి చెప్పింది. ఓ గంట పోయాక హోమియో మందు వేయాలని వేరే పర్సు చూపించింది.
“నాన్నగారు, జాగ్రత్త, ఐదింటికంతా వచ్చేస్తాం. ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా! మీకేం కావాలన్నా ప్రసాద్ గారిని అడగండి”, అన్నాడు. వందన కూడా “వెళ్ళొస్తాం మామయ్య గారు, జాగ్రత్త”, అంది.
తలూపారు నిర్వికారంగా రామారావు గారు.
వందన, రాజేష్ వెళ్లిపోయారు.
ప్రసాద్, రామారావు గారిని విశాలమైన హాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఈయన వయసు వాళ్లే నలుగురు టి.వి.లో సినిమా చూస్తున్నారు. ఇంకో ఇద్దరు పేపర్ చూస్తున్నారు. ప్రసాద్, వాళ్లందరికీ పరిచయం చేసాడు.
***
రామారావు గారు తొందరగా కొత్త వాళ్లతో కలవలేరు. బాగా అలవాటైన సన్నిహిత మిత్రులు నలుగురు ఉండేవారు. అందులో ఇద్దరు చనిపోయారు. ఇంకో ఇద్దరు ఈయన లాగానే కొడుకుల దగ్గర వేరే ఊళ్ళలో ఉంటున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఫోన్లు తగ్గిపోయాయి. ఇప్పుడాయనకు దగ్గర మిత్రులెవరు లేరు. గత ఏడాది భార్య గుండెపోటుతో హటాత్తుగా పోయింది. అప్పటినుండి రామారావుగారు మరీ ఒంటరిగా అయిపోయారు. అంతవరకూ ఒకరికొకరు తోడుగా గుళ్ళు, గోపురాలు తిరిగేవారు.
తల్లి పోయిన వెంటనే రాజేష్ పల్లెటూళ్ళో ఇల్లు ఖాళీ చేసి, తండ్రిని తీసుకువచ్చేసాడు. రాజేష్, వందన ఇద్దరూ విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు కూడా రామారావు గారి అభిరుచి మేరకు ఇంటిముందు ఖాళీ స్థలం, విశాలమైన గదులు, హాలు, గాలి, వెలుతురు ఉండేట్లు కట్టినదే. ఈ ఇంటికి రామారావు గారు, భార్య అప్పుడప్పుడు వచ్చి 10, 15 రోజులు ఉండి వెళ్తుండేవారు. ఇదీ ఆయనకు ఇష్టమైన ఇల్లే! కొడుకు దగ్గరికి రావటానికి ఆయన ఏం ఇబ్బంది పడలేదు.
రామారావు గారికి జీవితంలో ఏర్పడిన అనుకోని శూన్యంతో ఒక్కసారిగా శరీరంపై బి.పి. షుగర్లు దాడి చేసాయి. ఈ మధ్య మతిమరుపు కూడా వస్తోంది.
తండ్రిని తీసుకువచ్చాక రాజేష్ 10 రోజులు సెలవు పెట్టి, తోడుగా ఉండిపోయాడు. ఆయనే, “నేనుండగలను, కాలేజీకి వెళ్ళు”, అంటే వెళుతున్నాడు. రోజూ అనేక జాగ్రత్తలు చెప్పి, టేబుల్ మీద భోజనం, సాయంత్రానికి స్నాక్స్ అన్నీ పెట్టి వెళతారు భార్యాభర్తలు. మధ్యాహ్నం ఫోన్ చేస్తారు ఇద్దరూ.
రెండు రోజుల క్రితం వందన, కాలేజీకి మధ్యాహ్నం సెలవిస్తే ఇంటికి వచ్చింది. గేటు దగ్గర నుంచే వీధి తలుపు, వంటింటి తలుపులు అన్నీ బార్లా తీసివుండటం చూసింది. లోపలికి వచ్చి చూస్తే మామగారు తన గదిలో ఏ.సి. వేసుకుని, తలుపు వేసుకుని నిద్ర పోతున్నారు. వందన గుండె గుభిల్లుమంది. ఏ దొంగయినా దూరి ఉంటే!
రామారావు గారు నిద్ర లేచి నాలుగింటికి బైటకి వచ్చారు. వందనని చూసి, “నువ్వెప్పుడొచ్చావమ్మా? లోపలికి ఎలా వచ్చావు?” అన్నారు ఆశ్చర్యంగా.
“మీరు తలుపులన్నీ బార్లా తీసి పడుకున్నారు. ఇవాళ సెలవిచ్చారు. ఒంటిగంటకు వచ్చేసాను. మన అదృష్టం. ఏ దొంగో దోచుకుపోలేదు” అని లోపలికి టీ తేవటానికి వెళ్ళింది.
“వేసాననుకున్నానమ్మా, అలా ఎలా మర్చిపోయానో!” తల పట్టుకు కూర్చున్నారు రామారావు గారు.
“ఫర్వాలేదు లెండి. ఏం జరగలేదుగా!” అంది వందన. ఆయన అసలే సున్నితం. ఎక్కువ అలోచించి బాధ పడతారని.
మర్నాడు వందన సెలవు పెట్టింది.
“నేను తలుపులు వేస్తానమ్మా! నా కోసం సెలవలు వృథా చేయద్దు”, అన్నారు రామారావు గారు.
“లేదు మామయ్య గారు. మీ కోసం కాదు. నాకు కొంచెం తలనొప్పి, నీరసంగా ఉండి, వెళ్లట్లేదు”, అంది. నిజానికి జరిగినదానికి రాత్రంతా నిద్ర పట్టకే,
తలనొప్పి వచ్చింది. తనతో పని చేసే శాంత, వందన రాలేదని, ఎలా ఉందని ఫోన్ చేసింది. వందన జరిగింది చెప్పింది. “ఒక్కరినీ వదలాలంటే భయం వేస్తోంది. అన్నీ మర్చిపోతున్నారు” అంది.
అప్పుడు శాంత, వాళ్ళ పెద్దనాన్నను వాళ్ళబ్బాయి ఇలాంటి సమస్య వస్తేనే కొన్నాళ్ళు వాత్సల్య డే కేర్ హోమ్‌లో పెట్టారని, అక్కడ బాగుంటుందని చెప్పింది.
వందన ఆశ్చర్యపోయింది. బేబీ కేర్ లాగా పెద్దవాళ్లకు కూడా వుంటుందా? వృద్ధాశ్రమాల గురించి వింది కాని వీటి గురించి తెలియదు. ఏవైనా అవసరాలొస్తేనే కదా తెలిసేది అనుకుని, రాజేష్ వచ్చిన వెంటనే జరిగిందంతా చెప్పింది.
రెండు వీధులవతల ఉండే మేనల్లుణ్ణి రమ్మని, మేం వచ్చేదాకా ఉండమని చెప్పి, వాత్సల్యకు వెళ్ళి చూసి వచ్చారు.
ఇంటికి వచ్చాక, “నాన్నగారు, మీరోక్కరు ఇంట్లో రోజంతా ఒంటరిగా వుంటూ ఉంటే మాకు భయంగా ఉంది. ఇవాళో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే! ఒకవేళ మీరు అప్పుడే బైటకి వస్తే, మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే! తలచుకుంటేనే వణుకు వస్తోంది. ఈ ఊళ్ళో డే కేర్ హోమ్ ఉంది. పొద్దున్న వెళ్ళేటప్పుడు దింపుతాను. సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు తీసుకువచ్చేస్తాను.
మీరు మందులు వేసుకోవటం మర్చిపోతున్నారు. భోజనం సరిగా చేయట్లేదు. అక్కడ అన్నీ చూసుకునే వాళ్ళుంటారు. మీ వయసు వాళ్ళుంటారు. కాలక్షేపం అవుతుంది. రేపు వెళదామా? ఏమంటారు?” అనునయంగా అడిగాడు.
రామారావు గారికి ఏం చెప్పాలో తెలియలేదు. “మొన్న ఒక్కరోజే మర్చిపోయి పడుకున్నానురా. రోజూ వేసే ఉంచుతున్నానుగా!” అన్నారు.
“అహ, అందుకోసం కాదు. ఇక్కడ పగలంతా మాట్లాడటానికి మనిషి లేకపోవటం వల్ల ఎక్కువ నిద్ర పోతున్నారు. రాత్రి నిద్ర పట్టట్లేదు. అదీ మంచిది కాదు. ఇది చూద్దాం. సాయంత్రానికి వచ్చేస్తాముగా”, అన్నాడు.
“ఏమోరా, ఇలాంటివి వుంటాయని తెలియదు. నేను అలాంటి చోట ఉండాల్సివస్తుందని, నా జీవితం ఇలాంటి మలుపులు తిరుగుతుందని తెలియదు. నేను ఎక్కడా ఉండలేనురా. ఎవరితోనూ తొందరగా కలవలేను. జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటానులే”, అన్నారు.
“నాన్నగారు! జాగ్రత్తగా తలుపులు వేసుకోవటం ఒక్కటే కాదు. ఒంటరితనంతో మీ ఆరోగ్యం పాడైపోతోంది. పిల్లలేమో దూరంలో ఎక్కడో చదువుకుంటున్నారు. వాళ్ళున్నా కొంచెం బాగుండేది. అక్కడ మీరు అందరితో కలవలేకపోయినా, మనుషుల మధ్య వుంటారు. ఒకరో, ఇద్దరో మీ స్వభావానికి తగిన వాళ్ళుండవచ్చు. ఒక నాలుగు రోజులు చూడండి. మీరు ఉండలేనంటే అప్పుడే మానేద్దురు గాని”, అన్నాడు.
***
సాయంత్రం రాజేష్ ఐదింటికి బండిమీద ‘వాత్సల్య’కు వెళ్ళాడు. రామారావు గారు సంచీ పట్టుకుని, వరండాలో కూర్చుని ఉన్నారు. తనను చూసి తండ్రి కళ్ళలో మెరుపు రాజేష్ దృష్టిని దాటి పోలేదు.
ప్రసాద్, “మధ్యాహ్నం అందరితో కలిసే భోజనం చేసారు. మందులు గుర్తు చేస్తే వేసుకున్నారు. పడుకుని లేచారు. టీ తాగి బిస్కట్లు తిన్నారు. బాగానే వున్నారు. అలవాటవుతుంది లెండి,” అన్నాడు.
ఇంటికి వచ్చాక, టీ తాగుతుంటే “ఎలా ఉంది నాన్నగారు? బాగానే ఉందా?” అని అడిగాడు.
“భోజనం ఎలా ఉంది మామయ్య గారు? అందరితో కలిసే తిన్నారా? గదిలో తిన్నారా? ఎవరైనా స్నేహితులయ్యారా?” అడిగింది వందన.
“నాకు బాగానే ఉందమ్మా! మీరేం కంగారు పడకండి. నెమ్మదిగా అలవాటవుతుంది”, అన్నారు రామారావు గారు. కాని, ఆయన మనసంతా ఇంటిమీదే ఉందని వాళ్ళకి తెలుసు. ఉదయం పదకొండు దాకా వరండా లోనే కూర్చుని చదువుకుంటూ ఉంటారు. సాయంత్రం నాలుగయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. మొక్కల ముందు కుర్చీ వేసుకుని, గేటు తీసేసి, దారిన పోయే వాళ్ళని చూస్తూ, కాసేపు పుస్తకం చదువుతూ అలా కాలక్షేపం చేయటం అలవాటు. అదే ఇష్టం ఆయనకి. కాని ఏం చేయాలి?
“నాన్నగారు! మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే దింపుతాను. చెప్పండి. లేకపోతే, వందన ఉద్యోగం మానేస్తుంది. నెల ముందు చెప్పాలి కాబట్టి రేపే చెపుతుంది. ఈ ఒక్కనెలా మధ్య మధ్యలో నేను, వందన సెలవలు పెట్టుకుని ఉంటాం. ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు. మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి నాన్నగారు! మీరు కష్టపడి, స్తోమత లేకపోయినా నాకిష్టమైన ఇంజనీరింగ్ చదువు చెప్పించారు. అమ్మ తన కోసం నగలు, మంచి చీరలు కూడా వద్దనుకుని, నేను చదువుకుంటే చాలంది. ఆ చదువు వల్ల వచ్చిన ఈ ఉద్యోగం, మీరు కట్టించిన ఈ ఇల్లు, ఈ జీవితం అంతా మీరు ప్రేమతో ఇచ్చింది. నేను మీకు ఏం చేయలేకపోతున్నాను. బాగా చూసుకోలేకపోతున్నాను. చెప్పండి నాన్నగారు! ఇంట్లోనే ఉండాలనుందా? వందనని చెప్పేయమంటారా రేపు?”, అన్నాడు.
“చెప్పండి మామయ్య గారు! మీకు అక్కడ ఇష్టం లేకపోతే నేను ఉద్యోగం మానేస్తాను”, అంది వందన.
“వద్దురా, వద్దమ్మా! నా గురించి ఇంత బాధపడద్దు. ఇప్పుడేమయిందని? అక్కడా బాగానే ఉంది. అయినా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తానుగా. మీ పిల్లల చదువులయి స్థిరపడాలి. అప్పటిదాకా వందన ఉద్యోగం కూడా చేయాలి. నేను, అమ్మ, నీ కోసం ఎలా డబ్బు కూడబెట్టి చదివించామో, ఇప్పుడు మీరిద్దరూ అదే చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి మంచి జీవితాన్నివ్వాలి. ఆ పిల్లలు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అవ్వాలి. మీరదే చేస్తున్నారు. ఇంకేం ఆలోచించకండి”, అన్నారు రామారావు గారు.
చిన్నప్పుడు, స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు ఒక చేత్తో, రెండో చేత్తో తన చేయి పట్టుకుని, నడిపించి స్కూలుకి తీసుకెళ్లే నాన్నగారిని, ఇప్పుడు తనే నాన్నలా రోజూ మందులు, లుంగీ టవలు ఒక సంచీలో సర్దుకుని బండి మీద ఎక్కించుకుని రాజేష్ దింపి వస్తున్నాడు. సాయంత్రం ఐదింటికి అచ్చంగా తను నాన్నగారి కోసం స్కూల్లో ఎదురు చూసినట్లుగానే, నాన్నగారు తనని చూసిన వెంటనే సంచీ పట్టుకుని బైటకి వచ్చేస్తున్నారు. ‘ఇది ఆయనకు మరో బాల్యం’ అనుకున్నాడు రాజేష్.
