Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్నంటే నడిచే దైవం

[అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా ‘నాన్నంటే నడిచే దైవం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

“మాతృదేవోభవ, పితృదేవోభవ” అని తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది కానీ

పితా స్వర్గః పితా ధర్మః
పితాహి పరమం తపః।
పితరి ప్రీతిమాపన్నే
సర్వః ప్రీయంతి దేవతాః॥

తండ్రే స్వర్గం, తండ్రే ధర్మం, తండ్రే పరమ తపస్సు, తండ్రిని సంతోషపరిస్తే దేవతలందరూ సంతోషిస్తారు అన్నది వేదవాక్కు.

“నతో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్।
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా॥”

తండ్రికి సేవచేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకన్నా ధర్మాచరణం మరొకటిలేదని శ్రీ మద్రామాయణం చెప్పింది.

జీవి మనుగడకు తల్లిదండ్రులే ఆధారం. అమ్మ సత్యం, నాన్న నమ్మకం, జ్ఞానం. అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోసి అందమైన రూపమిచ్చి, ప్రాణమిచ్చి భూమ్మీదకు తెస్తుంది. తన ఒడిలో చేర్చుకొని రక్తాన్ని పాలగా మార్చి జీవితాన్నిస్తుంది. అమ్మ ప్రేమ వెన్నెల తునకైతే, నాన్న ప్రేమ ఉదయించే సూర్యుడి లాంటిది. ఆ ప్రేమ ఉదయపుటెండలోని చల్లదనం, మధ్యాహ్న మార్తాండుని తీక్షణతను, సంధ్యా సమయపు హాయిని అందిస్తూ పిల్లల ఉన్నతిని కాంక్షిస్తాడు.

అమ్మ ఒడిని వీడిన పసివాడు నాన్న గుండెల మీదకి చేరుతాడు. నాన్న జీవితాంతము గుండెలలో దాచి ప్రాణప్రదంగా కాపాడుతాడు. అమ్మ ఒడిన మాటలు నేరిచిన పసివాడు నాన్న చిటికెన వేలు పట్టుకుని తప్పటడుగులు వేయటం ప్రారంభిస్తాడు. అడుగు తడబడకుండా నడిపిస్తాడు నాన్న. అడగకుండానే అన్నీ అమర్చి పెడతాడు. తన పిల్లల కోసం జీవితాంతము వెన్నుదన్నుగా నిలబడి కాపు కాస్తాడు. వారి క్షేమం కోసం అహర్నిశలు ఆరాటపడతాడు. తాను చీకటిలో ఉండి తన బిడ్డలను వెలుగులోకి నడిపిస్తాడు. పిల్లలు తన కన్నా ఉన్నతస్థితిలో ఉండాలని కోరుకుంటాడు.

తన కష్టాలను, బాధలను తనలోనే దాచుకుని పిల్లల చిరునవ్వులలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. నాన్నంటే ఒక వ్యక్తి కాదు. కుటుంబానికి బలమైన ఆధారం. భవనానికి పునాది ఎలాగో బిడ్డల జీవితానికి నాన్న అలాంటివాడు. రాత్రనకా పగలనకా కష్టపడి తనవారి విజయాలను చూసి మురిసే తండ్రి తన కష్టాన్ని మరిచిపోతాడు. చెట్టులా నీడనిచ్చి, ప్రేమతో సేదతీర్చే చల్లనినీడ నాన్న. ప్రేమనీ చూపించగలడు తప్పు చేస్తే దండించి దారిచూపి సరిదిద్దే కాఠిన్యత చూపగలడు. జీవితానికి భరోసా నిచ్చేది తండ్రి. తండ్రి ప్రేమ ఎప్పుడూ బయటకు కనిపించదు. ఆయనకు మనసులో పిల్లలపైన పూవులోని తావిలాగా కనబడకుండా అంతులేని ప్రేమ ఉంటుంది. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి.

కష్టపడి పనిచేయడం, నిజాయితీగా జీవించడం, ఇతరులను గౌరవించడం, తోటివారితో స్నేహంగా మెలగటం, మానవతతో మసలటం వంటి సంస్కారవంతమైన లక్షణాలన్నీ తండ్రి నుంచే అలవడతాయి. తండ్రి మాటకై అడవులకేగిన శ్రీరాముడు గురువైన విశ్వామిత్రుడు తాటకిని చంపమంటే స్త్రీ అని ఆలోచించినవాడైనప్పటికి “పితుర్వచన నిర్దేశాత్” అని తండ్రి ఆజ్ఞను పాటించటమే తన ధర్మమనుకున్నాడు.

“పితృ వశాను వర్తీ పుత్రః” అని చాణక్యసూత్రములు చెప్పాయి.

పూర్వం నాన్న బయటకు వెళ్ళి సంపాదించుకు వస్తే, అమ్మ ఇంటిని సమర్థించేది. కాని నేడు పురుషులతో పాటు స్త్రీలూ సమానంగా చదువుకుంటున్నారు. వాళ్ళుకూడా బయటికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. దానితో పరిస్థితులు మారిపోయినాయి. తండ్రి కూడా పిల్లల ఆలనా పాలన పట్టించుకోవలసినస్థితి వచ్చింది. ఈనాటి పిల్లలు తండ్రికి చేరువ అవుతున్నారు. ఒకప్పుడు తండ్రంటే పిల్లలకు గౌరవం, భయం మాత్రమే ఉండేవి. కాని నేడు వాటి స్థానే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎక్కువయినాయి. జీవితంలో ఎలాంటి సమస్యలనైనా మొదట తండ్రితోనే చర్చిస్తున్నారు. వయసువచ్చిన పిల్లలకు తండ్రి స్నేహితుడితో సమానమంటారు కదా! అందునా ఆడపిల్లలు తండ్రి ప్రేమను మరీ కోరుకుంటారు.

ఈ తరం పిల్లలు తల్లి ఒడిలోకన్నా తండ్రి భుజాలమీదనే స్వారీ చేస్తున్నారు. తాను తిన్నా తినకున్నా, తాను చినిగిన బట్టలు కట్టినా బిడ్డలు ఏ లోటు లేకుండా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి. దేవుడిని చూడాలంటే తండ్రి బుజాలమీద ఎక్కుతాడు. అపుడు తెలియదు తరువాత తెలుసుకుంటాడు తాను దేవుడిపైనే ఎక్కానని. బడబానలాన్ని తనలో దాచుకుని చల్లని సముద్రంలా ఉంటాడు. తన ప్రేమను మాటలలో చూపకపోయినా చేతల్లో బాధ్యతను చూపుతాడు. బాధలను తనలో దాచేసేవాడే నాన్న. అదీ తండ్రి గొప్పతనం.

ప్రతివారికి నాన్నే హీరో. పిల్లలకు నాన్న దేనినైనా సాధించగలడన్న నమ్మకం. నాన్న చేయి పట్టుకుని నడిపించిన అడుగులు దారి తప్పనివ్వవు. నాన్న భుజం ఒక రక్షణ కవచం. నాన్న అండ కొండంత ధైర్యాన్నిస్తుంది. భుజాన్ని చుట్టిన నాన్నచేయి కాపాడి రక్షణనిస్తుందని భరోసా. ఆపదలో ఓదార్పునిచ్చేది నాన్న మాటలే. జీవితమంతా తన కోసం కష్టపడిన నాన్నే నా ఉన్నతికి, విజయాలకు కారణం. నాన్న అంటే కనిపించే దైవం.

అమ్మ ఒడిని వీడి
నాన్న వేలు పట్టుకొని
బుడిబుడి అడుగులతో
ప్రపంచాన్ని చూస్తూ
అనుభవాలతో జీవితాన్ని
గెలుస్తున్నారు.

ఈనాటి పిల్లలకు నాన్నతోటిదే లోకం. అలకలు, ఆరాటాలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, అనురాగాలు ఆప్యాయతలు అన్నీ నాన్నకే స్వంతం. నాన్నంటే ఉండాల్సింది భయం కాదు గౌరవం, ప్రేమ. నేటి పిల్లలకు అవి పుష్కలంగా ఉన్నాయి. నాన్న బుజాల మీద చేయివేసి మాట్లాడే చనువు నేటి పిల్లలకుంది. నాన్న ప్రేమ, దండన, స్నేహం, సలహా, సహాయాలతో ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసుకుంటున్నారు.

నాన్నంటే నమ్మకం
నాన్నంటే ధైర్యం
నాన్నంటే ప్రేమ
నాన్నంటే స్నేహం
నాన్నే ప్రపంచం
నాన్నే లోకం
నాన్నే దైవం
నాన్నే సర్వస్వం

దేశాన్ని పరిపాలించే రాజైనా తన పిల్లల చేతిలో తాను ఓడిపోవాలనే కోరుకుంటాడు. వారి గొప్పతనాన్ని చూసి మురిసిపోతాడు.

“పుత్రాధిచ్ఛేత్ పరాజయం”

కొడుకు చేతిలో ఓడిపోయిన తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. వాడు తన కొడుకు అనటం కన్న, వాడి తండ్రిని నేనని చెప్పుకోవటంలో గర్వపడతాడు. అదీ స్వార్థం తెలియని నాన్నతనం.

అందుకే “ఆత్మావై పుత్రనామాసి” అంటారు.

పిల్లలు తండ్రికి ప్రతిబింబాలు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా బ్రతకాలో తన అనుభవాలను పాఠాలుగా చెబుతాడు. అందుకే “ఆచార్యాణాం శతం పితా” అని అంటారు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. తండ్రిచెప్పే మంచిమాటలు జీవితంలో ఎదగడానికి సోపానాలవంటివి. అభివృధ్ధిపథంలో నడిపించే నాన్నే సంతానానికి మార్గదర్శి. కష్టం తెలియకుండా జీవితాన్ని నడిపించే నాయకుడు నాన్న.

Exit mobile version