Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్నంటే

[శ్రీ తోకల రాజేశం రచించిన ‘నాన్నంటే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నాకు నాన్నంటే భయం

తప్పు చేస్తే తన్నులు తప్పవని
తప్పేదో, ఒప్పేదో అమ్మ చెప్తుంటే
నాన్న ఉరిమే మేఘమై
చూసే చూపులే కనిపించేవి
ఆ ఉరుముల చాటున అమృతపు
జలపాతం దాగుందని అప్పుడర్థమయ్యేది కాదు

పచ్చని పొలం గట్ల మీదికో,
చల్లని చెరువు కడుపులోకో
వెల్దామని పథక రచన చేసినప్పుడల్లా
నాన్న శిలక్కొయ్యకు వేలాడదీసిన
ముల్లుగర్ర మూడోకంటితో కనిపెట్టేది

నా వేలు పట్టుకొని లోకాన్ని
సినిమా చూపించినట్టేమీ
చూపించలేదు నాన్న
కానీ..
మా కోసం నాగలి మోసీ మోసీ
కాసిన కాయలను మాత్రం చూపించాడు
మా బరువును ఎత్తీఎత్తీ
చేతులు బండ బారి పోయిన వైనం
ఆనాటి నా లేత చేతులకు తెలిసేది కాదు
చేతుల్లాగే మా నాన్న గుండె కూడా
బండనేమోనని అనుమానం వచ్చేది అప్పుడప్పుడు
తిండిదగ్గర కూర్చున్నప్పుడు కానీ
ఆయన నెయ్యి కుండ అని అర్థం కాలేదు

నా తల్లి లాగా నన్నెప్పుడూ
మెచ్చుకునేవాడు కాదు నాన్న
ఊరిలోకి వెళ్తే కానీ ఆయన
నా భవిష్యత్తు మీద
ఎన్ని కలలు గీచుకున్నాడో తెలిసిరాలేదు
ఇంత వయసు వచ్చినా
నాన్న నాకు సంపూర్ణంగా
ఏనాడూ అర్థం కాలేదు
నేను నాన్ననయితే కానీ
నేనంటే నాన్న నీడనని ఎరుక కాలేదు.

Exit mobile version