[శ్రీ షేక్ మస్తాన్ వలి రచించిన ‘నాటకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సాయంత్రం వచ్చే అతిథుల కొరకై బజ్జీలు కొనటానికి వెళ్ళి స్కూటర్ రోడ్డు ప్రక్కన ఆపి బంగారయ్య కొట్టుకెళ్ళాను. అక్కడ బజ్జీలు బాగుంటాయి. అవి వేడి వేడిగా తింటే స్వర్గానికి బెత్తెడేనని కొందరంటే, కాదు స్వర్గమేనని మరికొందరంటారు. జాతీయ రహదారి ప్రక్కనుండే ఆ దుకాణం పేరున ఆ ఊరికి బజ్జీల బిందారంగా గుర్తింపు వచ్చింది.
నలభై ఏళ్ళ బంగారయ్య లావుగా, గుండ్రటి బొజ్జ, గుమ్మడికాయ లాంటి తల, పెద్ద కళ్ళు, గుబురు మీసాలు, పొట్టి క్రాఫులతో, పంచెకట్టు, పైన బనీన్లో ఉన్నాడు. శ్రమించే శరీరం చెమటన తడిసి వుంది. అతను ఐదో తరగతి చదివాడు.
అతని దుకాణం ఓ చెక్క బడ్డి. ముడి సరుకులన్నీ అందులో నిల్వ చేశాడు. దానిముందు వేసున్న చిన్న రేకుల షెడ్‌లో పొయ్యి ఏర్పాటై వుంది. అక్కడే కుప్పగా కట్టెలు, మంట సెగన కాగుతున్న పెద్ద బాండి, దాని ప్రక్కగా నూనె డబ్బా, శనగపిండి పొట్లాలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు, ఉప్పు, సుగంథ ద్రవ్యాలు, పాలిథిన్ కవర్లు, ఇతర వంట పరికరాలు చిందరవందర గున్నాయి. ఓ మూలనున్న రాతి పలకపై తరగటాలు, కలపటాలు వగైరా జరుగుతున్నాయి.
ఇంకో ప్రక్క పొడవాటి చెక్క బల్లాపై వరుసగా ఆరు పెద్ద పెద్ద సత్తు పళ్ళేలలో దొంతర్లగా కొలువుతీరున్న ఆలు, మిర్చి బజ్జీలు ఘుమ ఘుమలాడుతూ జనాన్ని ఊరిస్తోన్నాయి. బేరాలు జరిగి సరుకు అయిపోతుంటే తరుగు స్థానే క్రొత్త వాయలు చేరుతున్నాయి.
ముఫ్పై ఐదేళ్ళ రంగమ్మ, భర్త బంగారయ్యకు తరగటం వగైరాలు చేస్తుంది. ఆమె సన్నగా, ఎత్తుగా, కోలముఖం, కొటేరు ముక్కు, తెల్లని పండ్లు, నల్లని కళ్లు, వంకీల జుట్టుతో చలాకీగా ఉంది. దంపతులు పరస్పరం ఛలోక్తులతో అలుపును తరిమేస్తున్నారు.
ఇక ఇరవై ఐదేళ్ళ రంగయ్య అమ్మకం సాగిస్తున్నాడు. అతను రంగమ్మకు స్వయాన తమ్ముడు. పదో తరగతి తప్పి నిరుద్యోగిగా వున్న అతనికి బావ ఆసరా కల్పించాడు. అతను హుషారుగున్నాడు.
బంగారయ్య దుకాణపు ప్రసిద్ధికి రహదారిపై వెళ్తూ ఆగే చిన్నా, పెద్ద వాహనాలు ఒక కారణమైతై, ఊరి జనానికి అప్పుపై సరుకు యివ్వటం మరొక కారణం. అయితే అలా చేసే ముందుగా ఎదుటి వ్యక్తి ఆర్థిక స్తోమత బేరీజు వేసుకుంటాడు. అతను ఓ ప్రక్క వంట కార్యక్రమం సాగిస్తూ, మరో ప్రక్క గల్లా పెట్టే మరియు పద్దుల పుస్తకం చూసుకుంటున్నాడు.
జనం రద్దీలో కాస్త సందు చేసుకున్న నేను “డజన్ మిర్చి, డజన్ ఆలు బజ్జీలు కట్టు బాబు!” అన్నా.
“నమస్తే.. సురేష్ సారూ! ఇవ్వాళ సరుకు అదిరి పోతుందండీ! రకానికో రెండు డజన్లు తీసుకెళ్ళండీ!” రంగయ్య ఊరించాడు.
“నిజంగా.. అంత బాగున్నాయా?”
“ఆ రోజు మా బావ మనస్సుపెట్టి పిండి కలిపాడండీ! జీలకర్ర, సోడా ఉప్పు.. అవి సమపాళ్ళలో పడ్డాయేమో.. తస్సాదియ్యా! వాసన గుప్పు.. గుప్పుమంటుంది!” కుర్రోడి బాదుడాగలేదు.
“అట్టయితే.. రకాని కొకటిన్నర డజన్ చొప్పున ఇయ్యి.. రంగయ్యా!” అంటూ మధ్యే మార్గానికి వెళ్ళా.
“ఓకే సార్!.. మీరెట్టాగంటే.. అట్టాగే! ఇంతకు పద్దా? రొక్కమా?”
“నెలాఖర్లో డబ్బెక్కడిదయ్యా!.. పద్దే!”
“మంచిది.. సార్! మీకెప్పుడన్నా కాదన్నామా” రంగయ్య చకచక బజ్జీలు పొట్లం నా చేతికిస్తూ బంగారయ్య వైపు తిరిగి “బావా! సురేష్ సారు ఖాతాలో ఒకటిన్నర మిర్చి, ఒకటిన్నర ఆలు.. రాసుకో!” అన్నాడు.
పొట్లం చేతికి వేడిగా తాకగానే “ఓహోఁ! సరుకు.. తాజాదే!” లోలోనే అనుకున్నా.
“సారూ! మీ లెక్క ఇవ్వాల్టికి రెండొందల అరవై! జీతం రాగానే చెల్లెట్టండీ!” బంగారయ్య నాతో అని, వేరే బేరానికి వెళ్ళిపోయాడు.
“బాబూ! ఆ చేత్తోనే నాకు ఓ డజన్ మిర్జీ బజ్జీలు యిచ్చి పద్దు రాసుకో!” జనం మధ్య నుంచి యింకో గొంతు అరిచింది.
“ఎవరూ? రంగారావు మేట్టారా! అట్టాగే సారూ! దీంతో మీ ఖాతా.. నూట నలభై! తొందరగా తీరసండీ!” బంగారయ్య సరుకు ఇవ్వమన్నట్లు బావమరిదికి సైగ చేసాడు. అదే పద్ధతిలో మరికొంతమంది నిత్య ఖాతాదార్లు పద్దుపై కావాల్సిన మేరకు బజ్జీలు కొంటున్నారు. ఈలోగా రహదారి ప్రక్కన ఆగిన వాహనాల నుండి దిగిన జనాల మరియు ఊరి ప్రజల రొక్క బేరాలు ఏకబిగిగా జరుగుతున్నాయి.
ఆపై స్కూటర్‌ని తీద్దామనుకుంటున్న నేను దుకాణం వద్ద అకస్మాత్తుగా చెలరేగిన గలభా గమనించి ఆగిపోయాను.
కొట్టు వద్దనున్న రద్దీని ఆసరాగా తీసుకొని నడి వయస్కుడొకడు దొంగతనంగా బజ్జీలు కొట్టెయ్యటానికి చివరిగా వున్న సత్తు పళ్ళెంలో చేయేశాడట. బంగారయ్య దొంగని కనిపెట్టటంలోను, అతన్ని పట్టటంలోను విమాన వేగాన్ని కనబరిచాడు. పైగా అతని కబంధ హస్తం అంతకంతకు బిగిసింది. ఫలితం దొంగ చెయ్యి బజ్జీల పిండిలా నలిగిపోయింది. దాంతో అతను ఉచ్చునబడ్డ పక్షిలా గిలగిలలాడాడు.
“ఏరా.. బదమాష్! పబిలిక్కుగా దోసేద్దామనే? డొక్క చీరేత్తా!” బంగారయ్య కంఠం గరగరలాడింది. ముఖం జేవురించి ఉంది. కళ్ళు చింత నిప్పుల్లాగున్నాయి.
నా చూపులు దొంగనబడే వ్యక్తి వైపుకు మళ్ళాయి.
అతనికి నలభై ఏళ్ళుండొచ్చు. చింపిరి జుట్టు, కాస్త పెరిగిన గడ్డం, చిన్న మీసాలు, చీకిరి కళ్ళు, కంతిరి చూపులతో, మాసిన గండ్ల లుంగీ, లాల్చిలపై తువ్వాలు వేసుకొని వున్నాడు. నొక్కి వదలబడ్డ చేతిని గాలిలో వూపుతూ… బాధగా ముఖంపెట్టి “ఏందయ్యా! ఇట్టా.. నలిపేత్తివి! నా సెయ్యిరిగితే.. నువ్వేమన్నా కట్టిత్తావా?” అని అతను బంగారయ్యను నిలదీసిన తీరు గొప్పగుంది. అతని ముఖంలో తెంపరితనం కొట్టొచ్చినట్లుంది.
“ఆఁ నే కట్టియ్యాలా! నువ్వు సేసిన ఎదవ పనికి ఎదురు జవాబొకటా? దొంగ నా కొండే! లేశానంటే పళ్ళు పదారు రాలి పోతాయ్!” బంగారయ్య చేతిలోని చిల్లుల గరిటను కట్టెలపైకి విసిరాడు. అది ఖణ్!.. ఖణ్! మని శబ్దం చేసి యజమానికి వత్తాసు పలికింది. అతని ముక్కు పుటలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎగసి పడుతున్నాయి.
“అంత కోపమెందుకయ్యా? ముందు నే సెప్పేది కూత్తంత ఇనరాదా?” దొంగ నిర్లక్ష్యంగా ఎదురు చెప్పాడు.
“నువ్వు సెప్పేదేంది? నే.. యినేదేంది! దొంగ బడవా!” బంగారయ్య ఒకే ఊగిపోతున్నాడు.
“ఉండయ్యా! నువ్వెందుకంత ఆయాస పడ్తున్నావ్? అసలే.. బి.పి మడిసివి! ఆ దొంగోడి మాటలకు గింజుకుంటావేంది? ఆ కాడికొత్తే ఆడి సంగతి నా తమ్ముడు.. సూసుకుంటాడ్లే!” రంగమ్మ భర్త నుద్దేశించి రాగాలు పోయింది.
“ముందు.. ఆ గింజుకోటమాపి నే సెప్పేది కూత్తయినమ్మా!” దొంగ రంగమ్మ వైపు కొర కొర చూశాడు.
“ఏందిరా! నేనినేది! దొంగముండా కొడకా! అందర్ని బో దబ్బాయిత్తన్నవే! ఒరే రంగా! మాటలాపి ఈడ్నో సూపు సూడ్రా!” రంగమ్మ తమ్ముడ్ని ఎగదోసింది.
అంతే! రంగయ్య హనుమంతుడే అయ్యాడు. అతను ఎగిరి రంగంలోకి దూకి – “ఏరా దొంగ నా కుక్కా! బజ్జీలు నొక్కబోయిందే గాక.. మా అక్క బావలకే ఎదురు సెప్తావా! ఒరే! ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా!” అని దగ్గర్లో వున్న కట్టె పేడు తీసుకున్నాడు.
క్షణకాలం నాకు దెబ్బలాట ఖాయమనిపించింది.
కాని దొంగ ఏ మాత్రం తమకకుండా “ఆగవయ్యా.. సామి.. ఆగు! అయినా ఇంతసేపు మొత్తుకున్నా.. నన్ను ఇసయం సెప్పనియ్యరేం! ఏదైనా యింటే గదా.. అర్థమయ్యేది!” అంటూ సమతూకంగా ప్రతిఘటించాడు.
ఈలోగా తగవు గమనిస్తున్న జనంలో కొందరు మౌనం వీడారు.
“రంగయ్యో! ఇతగాడికి పొగరు చాలానే వుంది! అస్సలు.. వదలమాకు!” ఓ పెద్దాయన అరిచాడు.
“పొయ్యే కాలమయ్యా! చేసిన తప్పును క్షమించమనకుండా.. మరీ ఎదురు చెపుతున్నాడు! ఇది కలికాలం మహిమ.. తల్లీ!” ఓ వేదాంతి తాపీగన్నాడు.
దాంతో రుసరుసలాడిన రంగమ్మ “సూత్తావేరా.. రంగా! ఎయ్యి.. దొంగ సచ్చినోడ్ని! కొవ్వు బట్టున్నాడు!” అని అరిచింది.
“నువ్వొత్తావా? నన్ను లెగమంటావా?” బంగారయ్య గొంతు పెట్రేగిన కోపంతో వుడికిపోయింది.
“నీదాకా ఎందుకు బావా! ఇప్పుడే.. ఈడి కథ తేల్చేస్తా!” రంగయ్య రెండడుగులు ముందుకేశాడు.
“అంటే.. నే సెప్పేది మీకోరికి అక్కర్లేదన్నమాట! ఏం సేత్తాం? ఇదో కరమనుకుంటా!” దొంగ దుకాణపు వాళ్ళతో పాటు మావైపు ఆశగా చూశాడు.
నాకెందుకో అతను చెప్పేది కూడ వింటే మంచిదనిపించింది. అందుకే,
“అతనేదో చెప్తానంటున్నాడు గదా.. బంగారయ్యా! విన్నంతలో మంది పోయేదేముంది!” అని ఓ సలహా యిచ్చా.
“నిజమే!” జనంలో మరికొందరు నాకు వత్తాసు పలికారు.
మరి బంగారయ్య ఏ ఖయాల్లో వున్నాడో గాని, మా మాట విని, దొంగవైపు విసురుగా తిరిగి “సెప్పేదేదో తొరగా సెప్పి సావు! అవతల బేరాలు పోతున్నాయ్!” అంటూ ఛీత్కరించాడు.
దాంతో రంగయ్య తన ఊపుకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి ‘ఏం చేయమంటావ్?’ అన్నట్లు అక్కవైపు చూశాడు.
‘కాసేపాగు’ అన్నట్లు రంగమ్మ చేతితో అతనికి సైగ చేసింది. జనం దొంగనే గమనిస్తూ చెవులు రిక్కించున్నారు. నాకూ కుతూహలంగుంది.
“ఏం చెప్పేదండీ! ఈల్లంతా దొంగ.. దొంగని అరుత్తున్నారే! అసలు దొంగతనమెవడు సేసాడండీ? శానామందికి అప్పు మీద బజ్జీలిచ్చి పద్దులు రాసుకుంటున్నారు గదా! అట్టానే నా పేర్లోను రాసుకోవచ్చుగా! కాకుంటే.. వాల్లు పద్దు సెప్పి సరుకు తీసుకున్నారు! నేను.. తీసుకొని పద్దు రాపిద్దామనుకొన్నా! దానికి.. దీనికీ తేడా ఏందీ? నాకయితే తెలియలా! మరీ.. ఇంతలోనే అంతగా నోరు పారేసుకోవాలా? దొంగ.. దొంగని తూలనాడాలా? తూఁ!.. దీనెమ్మ.. మనుషుల్లో ఎంత పచ్చపాతం! వున్నోళ్లయితే.. పద్దంట! లేనోల్లయితే.. దొంగంట! అట్టాంటప్పుడు ఈ పాడు లోకంలో ఏడుందయ్యా నేయం? అందుకే ఇయ్యాల్టికిక ఈ కొట్లో బజ్జీలే వద్దనుకుంటున్నా!” ఏక బిగిగా డైలాగ్ దంచిన దొంగ హడావిడిగా గలాటలో క్రిందపడ్డ కండువా తీసి.. భుజాననేసుకొని తిరిగి చూడకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు.
ఆ మాటలు మసాల నషాళానికంటిన బంగారయ్యకు గింగరాలు తిరిగి నోరెళ్ళబెట్టాడు. రంగమ్మ, రంగయ్యలు నిశ్చేష్టులై నిలబడిపోయారు.
‘ఓహోఁ! నాటకం గొప్పకుంది! మొత్తానికి దొంగ తన వాక్ చతురతతో జనాన్ని బోల్తా కొట్టించి మెత్తగా జారుకున్నాడుగా!’ నేను, నాతోపాటు మిగిలినవారు కళ్ళప్పగించి చూస్తుండిపోయాం.