Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నడిచే కాలానికి..

[పి.ఎల్.ఎన్. మంగారత్నం గారు రచించిన ‘నడిచే కాలానికి..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ముప్పై నాలుగేళ్ళ సర్వీసు తర్వాత..

ఇంకా మూడు నెలల కాలం మిగిలి ఉంది రిటైరుమెంటుకి.

ఇన్నాళ్ళూ చేసిన సర్వీసు ఒక ఎత్తయితే.. సంవత్సర౦ క్రిందట వచ్చిన ప్రమోషను.. మరో ఎత్తు.

కొత్త ఆఫీసు.

ఇంతకుముందు రెవెన్యూలో పని చేస్తే.. ఇప్పుడు అందులోనే పౌరసరఫరాలు అనే మరో విభాగంలో పని చేస్తున్నాను. ఒక విధంగా డిప్యుటేషన్ పోస్టు.

చివరికి వస్తున్నందుకో! ఏమో! పరిస్థితులు.. నా మీద నాకే నమ్మకం లేకుండా చేస్తున్నాయి.

పైలు పెడితే చాలు.. సెక్షను హెడ్ కేశవమూర్తితో ఇబ్బంది.

“అదేమిటమ్మా.. ఇట్టా రాసావ్. నిన్నెవరు రాయమన్నారు ఇలా?” అంటూ విమర్శించేవాడు. ఆ మాటలకి నిన్నకాక, మొన్న వచ్చిన చిన్నవాళ్ళ మధ్య తలెత్తుకోవడం కష్టంగా ఉండేది.

సీనియర్‌ని అయినా.. ప్రస్తుత౦ రికార్డు అంతా కంప్యుటరైజేషను అవడం వలన.. ఆ డేటా గురించీ, అవి ఓపెన్ చెయ్యడం గురించీ,  కొత్తవాళ్ళలా.. ‘నా తరాని’కి తెలీదనే చెప్పాలి. మరొకళ్ళ సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేక పోతున్నాను.

సబ్జెక్ట్ పరంగా ఏ విషయమూ విశదపరచక పోయినా.. విమర్శ ఎక్కువగా చేసేవాడు. మిగిలిన స్టాఫ్ చాలాళ్ళుగా ఆ వింగులోనే పని చేస్తూ, వర్కుకి అలవాటు పడ్డారు.

కేశవమూర్తి ప్రతిరోజూ.. ఉదయం ఓ గంట లేటుగానూ..  మధ్యాహ్నం లంచ్ తరువాత కూడా అలాగే గంట ఆలస్యంగానూ ఆఫీసుకి వచ్చేవాడు. వస్తూ ఏవో! మెయిలు కాపీల  ప్రింటు పట్టుకొచ్చి “ఇప్పుడు లెటర్ పెట్టేయండి. అర్జంటు” అంటూ చేతిలో పెట్టేవాడు.

ఎవరికి పెట్టాలో! ఏం పెట్లాలో డైరెక్షను ఉండేది కాదు. అస్తమానం చెవి దగ్గర సెల్ పోనే. తిరిగి అడిగే  వీలులేకుండా.. పోనీ, అడిగినా ఏమిటి? మీకు ఇంతవరకూ ఈ విషయమే తెలీదా? అన్నట్లు చూసేవాడు. అడిగినా బాదే, అడగకపోయినా ఇబ్బందే.

సాయంత్రం పూట ఇంకో అరగంటలో బయలుదేరుతా౦ అనగా..

కొత్త కాగితం చేతిలో పడేసరికి కంగారు పట్టుకునేది. అది చదివి అర్థం చేసుకునేది ఎప్పుడు? ఆ తరువాత టైపు కొట్టేది ఎప్పుడు? మనసుకి ఆలోచన రావద్దా. మెంటల్ ప్రిపరేషను లేనిదే, ఏ పని సక్రమంగా ఉంటుంది.

నాకా ‘కీ’ బోర్డు చూస్తే తప్ప అక్షరం పడదు.

అవసరం కోసం కంప్యుటర్ ముట్టుకోవడమే గాని, టైపు అంటే, తెలీదు. ఓ లెటర్ కొట్టడానికి తక్కువలో తక్కువ గంట టైము కావాలి.

దిగులుగా గది కిటికీ వైపు చూస్తూ ఫర్వాలేదు.. చీకటి పడడానికి ఇంకాస్త టైము ఉండనే ఉంది అని సమాధాన పడుతూ..

ఎలాగో.. ఓ గంట కష్టపడి డ్రాఫ్ట్ తయారుచేసి తీసుకువెళితే “ఏమిటీ? కాగితాలు చదవరా! మీరు. కమీషనరు లెటర్‌ని మక్కీకి మక్కీ టైపు కొట్టేసారు. ఇదే కాగితాన్ని క్రిందవాళ్ళకి ఫార్వార్డ్ చేస్తే, వాళ్ళు చదువుకోరా! ఏమిటి? దానికి ఇంత కష్టపడి మీరు టైపు కొట్టాలా” మొహం పట్టుకుని అడిగేవాడు.

ఏ చెప్పాలో తెలిసేది కాదు. తెలిసింది వ్రాసాను.

పై ఆఫీసర్ల దగ్గర మీటింగులో ఉండేది వాళ్ళు. ఆ విషయం వివరించి చెప్పే తీరికలో లేనట్లు ఉంటాడు ఆయన. అయినా చివరి నిముషంలో కాగితం చేతుల్లో పెడితే, ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఇంటికి చేరుకుంటాం అన్నఆత్రం.

పోనీ, అదేమన్నా అర్జంటు వ్యవహరమా! అంటే అదీ కాదు. రొటీన్లో జరిగే మేటరే.

ఆలోచించి, రేపటి రోజున పెట్టుకున్నా నష్టం లేదు. అయినా తన ఆఫీసులో కాగితం పెండింగు ఉండకూడదు అది అతని పాలసీ.

చాలాళ్ళుగా  అక్కడ పాతుకుపోవడంతో .. అతనికి స్థానబలిమి ఎక్కువ.

ఏమీ మాట్లాడలేని ఆశక్తత నాది.

నా బ్లాంక్ ఫేస్ చూసి “వెయ్యికి పైగా రేషను కార్డులు కలిగిన షాపులు జిల్లాలో నూట మూడు ఉన్నాయి. వాటిని అయిదు వందల కార్డులకు ఓ షాపు చొప్పున బైఫర్కేషను చెయ్యాలని జాయింటు కలెక్టర్ గారు చెప్పారు. అది వ్రాయకుండా ఇంకేదో వ్రాస్తే ఎట్టా” అంటూ ఫైలు చేతిలో పెట్టేసేవాడు.

మళ్ళీ కంప్యుటర్ దగ్గర వెళ్ళాల్సి వచ్చేది.

బయట చీకటి ముసరడంతో వీధి లైట్లు వెలిగేవి.

చివరికి ఎలాగో.. ఇతన్ని దాటుకుని.. ఆఫీసరుగారి సంతకానికి వెళ్ళేది.

మా ఆఫీసరుగారు చాలా మంచివారు. బి.ఏ.. బి.ఇడీ చేసారు. స్కూల్ హెడ్ మాస్టారులాగ.. ఎక్కడైనా కామాలూ, చుక్కలూ వదిలేసినా స్పెల్లింగు తప్పులు వచ్చినా చక్కగా సరిచేసి పంపేవారు. మళ్ళీ టైపు చెయ్యమని.

అంతటితో ఫైలుకు మోక్షం వచ్చిందనుకుని.. సంతోషపడడం అయ్యేది.

ఆ తరువాత సంతకం అయితే, ఫెయిర్ కాపీ తీసి.. దాన్ని మెయిలు పంపించేసరికి రాత్రి ఏడున్నరా.. ఎనిమిదయ్యేది.

జిల్లా హెడ్ క్వార్టర్ కావాలనుకుంటే.. లేట్ నైట్స్ ఉండక తప్పదు.

ఆఖరుకి మండలాల నుంచి రిమార్కులు, కేసు  రికార్డులు తెప్పించడం కోసం రిమైండరు పెట్టినా.. ఏదో విమర్శే. పిలవకుండా, ఏదో కరెక్షను చెయ్యకుండా కాగితం ఆఫీసరు దగ్గరకు వెళ్ళేది కాదు.

పాతదాన్ని చూసే వ్రాసేదాన్ని. నేనేం స్వంత పాండిత్యం ఒలకబోస్తున్నానా! వచ్చినవి కోర్టు కేసులు. కేడరు పెరిగితే, కష్టమైన సబ్జెక్ట్‌లే వస్తాయి.

***

వయస్సు పైబడుతుoటే, ఇంకా బస్సులు పట్టుకుని వెళ్ళలేక్.. ఉన్న ఊరిలొనే కోరుకున్నందుకు అలాగే వేసారు కలక్టరేటు వాళ్ళు.

ఏ జిల్లా ఆఫీసులో అయినా హైకోర్టు నుంచి ఏదైనా కాగితం వస్తే, వెంటనే డివిజినల్ ఆఫీసులకు, మండలాఫీసులకూ తోసేస్తుంటారు. ఆ ఫైలుకి సంబంధించిన రిమార్కులు, దానికి సంబంధించిన  కేసు ఫైలూ పంపమని. అసలు కేసు పెడుతున్నది క్రింది ఆఫీసువాళ్ళే కాబట్టి.

ఇప్పుడూ అలాగే..

వ్రాస్తున్న ఫైలు సక్రమంగా ఆఫీసరుగారి సంతకానికి వెళ్ళడం లేదు. చిన్నచిన్న ఫైళ్ళు కూడా.. అలా ఒకటికి రెండుసార్లు  సరిచేయ్యాల్సి రావడం.. నాకు సిగ్గుగానే ఉండేది.

ఒకళ్ళకు చెప్పాల్సిన స్టేజ్లో ఉండి కూడా.. జిల్లా ఆఫీసులో ఉన్నందుకు.. నా పైన సుపీరియర్‌తో.. విమర్సించబడే, దుస్థితిలో ఉన్నాను, అదే ఏదైనా మండలానికి వెళితే, నేనే సూపరింటెండెంటుని.

ఆఫీసరు తరువాత ఆఫీసర్ని. అలాగే, గనుక జరిగితే, ఆఫీసు బాధ్యతలన్నీ నా భుజాలపైనే పడతాయి. అదే భయం నా జీవితానికి.

నాకసలే చేతులు నొప్పి .. చాలా ఏళ్ళుగా.

***

సంవత్సరాల తరబడీ రాసీ, రాసీ.. నొప్పితో కుడిచేయ్యి.. ఈరోజు చెయ్యి వ్రాయలేని స్థితికి వచ్చేసింది.

సంతకం తప్ప చేతిలో మరేం లేదు.

కంప్యుటర్ కీ బోర్డు మీద వ్రేళ్ళు కదిలితేనే జీతం. కష్టాల్ని ఎదిరించి బ్రతక గలిగితేనే  జీవితం.

ఎందుకైనా పది రోజులు శెలవు పెట్టాల్సివస్తే, జీతం ఆగిపోతుమ్దన్న భయంతో బ్రతుకు పోరాటమే చేశాను.

కాబట్టి, ఎడమ చేతిలో వ్రాయడం అలవాటు చేసుకున్నాను. అయిదవ తరగతి పిల్ల వ్రాసినట్లు వంకర టింకరగా.. లైన్లు బాంబే నుంచి కలకత్తా వెళ్ళినట్లు ఉండేవి.

***

అందుకే, మండలాలు వద్దనుకున్నాను. అక్కడ పనీ.. పని ఒత్తిడీ ఎక్కువే.

ఇప్పుడు ఈ హెడ్ ఆఫీసులో అందరితో పాటు నేనూ.. ఓ క్లార్కుని.

ఆ రోజుకి.. ఆ ఫైలు.. పెట్టేస్తే మనస్సాంతిగా ఇంటికి వెళ్ళొచ్చు. మరునాడు ఏ టెన్షనూ లేకుండా రావచ్చు అనుకున్నా సంతోషంగా మాత్రం ఉండలేకపోతున్నాను.

రోజులు లెక్కపెట్టుకుంటున్నాను అనుకోవడం కన్నా, గంటలు లెక్కపెట్టుకుంటున్నాను అనుకోవడం సరియిన పని.

సూర్యుడు నిరంతర ప్రయాణీకుడు. సూర్యునితో పాటు ప్రయాణం చేసేది కాలం.

ఉదయం పదిన్నరకు వచ్చి కూర్చుంటే.. ప్రభుత్వ పని వేళలు.. ఏడున్నర గంటల కాలం గడిచి సాయంత్రం అవుతుంది. అంటే, ఓ రోజు గడచినట్టే. జీతాన్ని సంపాదించి పెట్టే ఓ కష్టతరమైన ఉద్యోగపురోజు తరిగినట్లే.. అనుకునే పరిస్థితి.

ఇదే కాదు. బయటి ప్రపంచానికి తెలియని.. ఓ విషయం  ‘అంతర్లీనం’ కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. దానికీ నా రిటైరుమెంటే టార్గెట్.

***

చెయ్యలేని నాలాంటి వాళ్ళకి అదో కష్టం గానీ..  ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రం అదో ప్రేమనుబంధం.

పెద్ద కొడుకూ, కోడలు అమెరికాలో ఉద్యోగాల్లో ఉండి, తొమ్మిది నెలల చంటిపిల్లని చూసుకోలేకపోతున్నందుకు ‘మా శ్రీవారు’ అమెరికా వెళ్లి.. పాపాయిని ఇండియాకు తీసుకు వచ్చేసారు.

నేను ఇంకా ఉద్యోగం లోనే ఉన్నందుకు.. అమలాపురంలో ‘ఇంట్లో’ ఉండే అమ్మమ్మగారు  చంటి పిల్లను చూసుకునేలా.. మాటలు.

అంతవరకూ బాగానేవుంది.

ఓ శ్రీరామనవమి శెలవురోజున.. మొట్టమొదటగా అమెరికా నుంచి నా మనవరాలు.. నా ఇంటికి వచ్చింది. కొద్దిసేపే ఎత్తుకోగాలిగాను.

బియ్యంలో, పెసరపప్పు వేసి అత్తెసరు చేశా, నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తిన్నది.

ఇంకా నోట్లో పళ్ళే రాలేదు. బోసినవ్వులు చిందిస్తూ.. ఇల్లంతా పాకేస్తుంది.

ఆ నవ్వులే నన్ను కట్టి పడేసినాయ్. అతి కష్టం మీద ఎత్తుకోవలసి వచ్చేది.. చేతుల్లోనుంచి జారిపోకుండా.

పాపాయిని తీసుకు వెళ్ళడానికి అమలాపురం నుంచి మా వియ్యంకుడూ, వియ్యపురాలూ వచ్చారు.

వియ్యపురాలితో అన్నా “నేను పాపాయి కోసం రెండు రోజులు శెలవు పెట్టాను. ఈ రెండురోజులూ మీరు ఇక్కడ ఉంటే, పాపాయి రెండురోజులు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది” అని.

“అబ్బే. రేపటి నుంచీ  మీ తమ్ముడిగారికి స్కూలు.. నేను వెళ్లిపోవాలి. పాపాయిని ఉంచుకోవాలనుకుంటే, కొద్ది రోజులు ఉంచుకుని, అప్పుడు తీసుకురండి” అంది ముందే తన ప్రోగ్రాం నిర్ణయించేసుకున్నదానిలా.

“వద్దు. నువ్వు పాపాయిని చూడలేవు. రాత్రుళ్ళు బాగా ఏడుస్తుంది. అస్సలు నిద్ర పోదు. కావాలంటే, వారం రోజులు పోయిన తరువాత ఓసారి వెళ్లి చూడవచ్చులే” అని ఆయన అనడంతో నేను చెయ్యగలిగింది ఏమీలేక ..

“సరే. తొమ్మిది నెలల తరువాత వచ్చి నేను,  పాపాయిని తీసేసుకుంటాను” అన్నా పంతం పట్టినట్లు.. నా కొడుకు కూతురు నా దగ్గరే ఉండాలి అన్నట్లు.

అలా అనడానికి కారణం.. తొమ్మిది నెలల తరువాత ‘రిటైరు’ అయిపోతాను కాబట్టి, నా మనవరాలిని  నిరాటంకంగా నేను తెచ్చేసుకోవచ్చన్నట్లు.

అయితే, ఆ మాటే ఇప్పుడు ‘ఇబ్బంది’ నన్ను పెడుతుంది.

***

పాపాయిని చూసింది మొదలు మరెవ్వరూ గుర్తు రావడం లేదు.

రాత్రీ, పగలూ పాపాయే.

అలానే, నీతో పాటు నేనూ అన్నట్లు నా బాధలూ.

పాపాయిని చూడడానికి వెళ్ళినప్పుడల్లా ..

“పిల్ల రాత్రుళ్ళు అస్తమానం ఏడుస్తుంది. అస్సలు నిద్ర పోనివ్వడం లేదు. మరునాడు స్కూలుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. పైగా సింగిల్ టీచర్‌ని. లేటుగా కూడా వెళ్ళకూడదు” అని, అతను వాపోతే ..

“పాలు త్రాగదు, తిండి తినదు  ఏడిపించేస్తుంది” అంటూ అమ్మమ్మ ఆవేదన.

“పిల్లని చూడలేక.. మా అమ్మాయికి అస్తమానం జ్వరం వచ్చేస్తుంది. అందుకే నేను వచ్చాను. ఏం పిల్ల బాబూ ఇది.. నిద్దరోదు.. పాలు త్రాగదు” విసుగంతా ముఖంలో కుమ్మరించుకునేది వియ్యపురాలి తల్లి హైమావతమ్మ.

పిల్లని మీరు ఎంత త్వరగా తీసుకుపోతే.. నా కూతురు అంత సుఖపడుతుంది అన్నట్లు. ‘ఆ పిల్ల నా కూతురుకేనా మనవరాలు .. నీక్కాదా’ అన్నట్లు ఉండేవి ఆ మాటలు.

నిజానికి ఆవిడ వచ్చి కూతురి దగ్గర ఉన్నది మరెవరో ఆ ఊరి హాస్పిటల్లో ఉంటే పరామర్శించి పోవడానికి.

ఏం చెయ్యడానికీ తోచేది కాదు.

వియ్యపువాళ్ళు ఇద్దరూ నా కన్నా ఏడెనిమిదేళ్ళు చిన్నవాళ్ళు. కాళ్ళూ చేతులూ బాగానే ఉన్నాయి. అలాంటి వాళ్ళే చంటిపిల్లని చూడలేకపోతే, గాజుబొమ్మలా ఉద్యోగానికి వెళ్లి వచ్చే నేను.. ఏం చెయ్యగలను?

ఇంకా చెప్పాలంటే..

అక్కడికి వెళితే, నాకు బాత్రూములో బకెట్టుతో ‘ఆవిడే’ నీళ్ళు పెడుతుంది.. నేను పెట్టుకోలేనని. అయినా, నా పరిస్తితి తెలిసీ.. వాళ్ళు అలా బాధపడుతున్నందుకు మనసు పాడై ఏం మాట్లాలేక పోయేదాన్ని.

ఇంకా సర్వీసు అనే ‘షీల్డు’ నన్ను రక్షిస్తునే ఉంది.

అంతవరకూ సమస్య లేదు.

కడుపుతో ఉన్నామె కనక మానదన్నట్లు.. ఏదో రొజు ఆ మురిపెమూ తీరకపోదు.

ఓవైపు..

ఆఫీసులో ‘ఈరోజుఎలా గడుస్తుంది రా బాబూ!’  అనుకుంటుంటే..  ఇంకో వైపు ఎంత తొందరగా ముంచుకొచ్చేస్తుందీ రిటైరుమెంటు అన్నట్లు ఉండేది. చక్రబంధం అంటే, ఇదే.

ఆరు నెలలు తిరిగేసరికి..

పాపాయి పరుగులు పెడుతుంది.

కనిపించినవి అన్నీ నోటిలో పెట్టేసుకుంటుంది. పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. వెనకాలే తిరిగి కంటికి రెప్పలా చూడాల్సి వస్తుంది. వయసులో ఉన్నప్పుడు మా పిల్లల్ని ఎలా చూసుకున్నానో! గాని, మనవరాలు దగ్గరకు వచ్చేసరికి ఓపిక నశించిపోయింది.

అప్పటికీ ఇప్పటికీ ముప్పై ఏళ్ల వయసు గడిచిపోయింది.

“అమ్మ”..

“కాకి” ..

“కారు” అంటూ రెండక్షరాల మాటలు మాట్లాడుతుంది. ‘అమ్మ’ అని మాత్రం చాలా ఆర్తిగా పలుకుతుంది. పాపాయిని ఎత్తుకోలేక పోయినా వెళితే.. వదిలి రాలేకపోతున్నాను.

ఆ ముద్దు మాటలూ, అల్లరి చేష్టలూ కట్టిపడేస్తున్నాయి ‘ఆవిడ కాబట్టి, చూస్తుంది. నేనైతే ప్రతి నిముషం అలా తిరగలేను.. ఒక్కరోజుకే నా పని అయిపోతుంది’ అనుకునేలా.

బహుశా, ఆవిడ కూడా అలానే, అనుకుంటుందేమో ‘ఉద్యోగం పేరుతో ఈమె సుఖపడుతుంది. చంటిపిల్లను చూసే కష్టమంతా నాదే  కదా’ అన్నట్లు.

***

వాళ్ళు పాపాయిని చూడలేకపోతున్నామని వాళ్ళ ఇబ్బందిని తెలియచేస్తున్నా.. నా నుంచి ఆశించిన ప్రతి స్పందన ఏదీ రాకపోవడంతో.. పాపని ఎప్పుడు  తీసుకువెళతారు అని అడగలేక, డైరెక్టుగా విషయానికి వచ్చేసాడు వియ్యంకుడు, దసరాకు వెళ్ళినప్పుడు ..

“పాప మీ కాకినాడ వచ్చేస్తే, మాకేం తోచదేమోనండీ!” అని.

చేసి.. చేసి ఉన్నవాళ్ళకి ఒక్కసారిగా ఖాళీ దొరికితే ఏం తోచదు మరి. ఈ విషయంలో భార్యాభర్తలు ఒక్క పట్టు మీదే ఉన్నారు. తరచూ అవే మాటలు.

దానికీ చిన్న నవ్వే సమాధానం. అంతే కదా! అన్నట్లు. ఇక లాభం లేదనుకున్నాడేమో.. రాజీ మార్గంలా

“అయినా ఎన్నాళ్లుంటుందిలే.. మా ఇంట్లో.. మహా ఉంటే, ఆరు నెల్లు. ఆ తరువాత మీ ఊరిలోనే చదువుకుంటుంది” అంటూ కొసమెరుపు కూడా ఇచ్చాడు మా వియ్యంకుడు.

ఆ మాటకు తేరుకుని “ఆ.. అంతే” అన్నా తేలికగా నవ్వేస్తూ.

నా లెక్క ప్రకారం .. నా టార్గెట్ మూడు నెలలే. కొత్త సంవత్సరం వస్తే  నేను ఇంట్లోనే.

అతను ఇంకో మూడు నెలలు ఆయుషు పెంచాడు. ఆరు నెలలు అంటూ. అందుకే ఆ సంతోషం.

అప్పటికి పాపాయి కాస్త పెద్దది అవుతుంది.

ఎత్తుకోమనకుండా నడవ గలుగుతుందేమో!

ఎంత నేను చంటిపిల్లని ఎత్తుకోలేకపోయినా.. నా ఆలోచన కూడా అదే.

నా మనమరాలు, నా దగ్గరే  నా ముద్దు తీరేలా పెరగాలనీ. చదువుతో పాటు నాకు తెలిసిన ‘ఆర్టు’ బొమ్మలు వెయ్యడం పాపాయికి నేర్పి౦చి భవిషత్తులో మంచి ఆర్టిస్టుగా తయారుచెయ్యాలని.

అది పిల్లకి కాస్త ఊహ తెలిస్తే తప్ప అది సాధ్యం కాదు.

అందుకే.. అప్పుడే పైకి చెప్పలేని అసహాయత.

ఈ మాటలన్నీ ‘ఆయన’ పరోక్షంలో జరిగినవే. నా నుంచి భరోసా తీసుకోవడం వాళ్ళకు ముఖ్యం.

ఇలా ద్వైదీ అవస్థలో గడుస్తున రోజుల్ని ఎలా అంచనా వెయ్యాలో? తెలియక.. రేపటి మీద భారం వేసాను. రోజు వెంట రోజు నడుస్తుంది. నడిచే కాలానికి గమ్యం తెలీనట్లుగా.

Exit mobile version