[28 నవంబర్ 2026 శ్రీదేవి నటించిన ‘నగీనా’ విడుదలై 40 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు దిలీప్ కేతవరపు.]
హిందీ చలనచిత్రం ‘నగీనా’లో నటించవలసిందిగా మొదట జయప్రదను అడిగారట చిత్ర దర్శకుడు హర్మేశ్ మల్హోత్ర.
సర్పాలంటే తనకు భయమని, ఆ సినేమా తాను చేయనని జయప్రద బదులిచ్చారు.
(దాంతో, ఆ చిత్ర కథను శ్రీదేవి దగ్గరకు తీసుకు పోయారని సినేమా మేగజైన్ లలో వచ్చింది.)
కథను ఆనవాయితీ ప్రకారం మొదట శ్రీదేవి తల్లి గారు విన్నారు; విని, పప్పి (శ్రీదేవిని ఇంట్లో ముద్దుగా పప్పి అని పిలిచే వారు), నువు ఈ సినేమాను చేయాలమ్మా అన్నారట.
కానీ, సర్పాలంటే శ్రీదేవికి కూడ భయం ఉండటం, అవి ఆమెకు కలల్లో తరచు కనిపిస్తూ ఉండటంతో ఈ సినేమా విషయంలో శ్రీదేవి కొంత ముందు వెనుకలాడారట. కానీ కథ తల్లీకూతుళ్లను ఆకట్టుకోవడంతో, మొత్తం మీద సినేమాను చేస్తామంటూ వారు అంగీకారాన్ని తెలియజేశారు. ఈ సంగతిని ‘శ్రీ’ (ఇలా ముద్దుగా శ్రీదేవిని అభిమానులు పిలుచుకుంటారు) స్వయంగా వెల్లడించారు తరువాత ఒక ఇంటర్వ్యూలో.
***
శ్రీదేవి జడ్జిమెంట్ వృథా పోలేదు.
1986 నవంబర్ 28న వచ్చిన ‘నగీనా’ టికెట్ కిటికీల వద్ద సూపర్ డూపర్ హిట్టయింది.
మీకు రాసి పెట్టి ఉన్నది మీకు దక్కుతుంది.
***
అప్పటికే బాలీవుడ్లో ఎనిమిది విజయవంతమైన సినేమాలు (‘హిమ్మత్వాలా’, ‘జస్టిస్ చౌధరి’, ‘మవాలి’ (1983 విడుదలలు ఇవి), ‘తోఫా’, ‘మక్సద్’ (1984 విడుదలలు), ‘ఘర్ సన్సార్’, ‘కర్మ’, ‘ఆఖ్రీ రాస్తా’ [ 1986 రిలీజులు ] తో జోరు మీదున్న శ్రీ ఆర (aura) ను ఆనక. ‘నగీనా’ తో పాటు, ‘మిస్టర్ ఇండియా’ (1987), ‘వతన్ కే రఖ్వాలే’ (1987), ‘వఖ్త్ కీ ఆవాజ్’ (1988), ‘జవాబ్ హం దేంగే’, ‘చాంద్నీ’ (1989), ‘చాల్బాజ్ (1989)’ సినేమాలు – ఆంధ్ర భాగవత రచయిత పోతన చెప్పిన ‘ఇంతింతై వటుడింతై తానింతై నభోవీధిపై నంతై తోయద మండలాభ్రమునకల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై..’ – రీతిన విస్తరింప చేసివేశాయి.
ప్రేక్షక వర్గాలకు శ్రీ ఆరాధ్య తారయే అయ్యారు.
కాలక్రమంలో, భారతదేశంలో నంబర్ వన్ ఫీమేల్ సూపర్ స్టార్ ఖ్యాతిని కూడ తాను సొంతం చేసుకొన్నారు.
***
1988 నవంబర్ కల్లా, మాధురీ దీక్షిత్ వచ్చారు. (సరే.. అది వేరే అధ్యాయమనుకోండి.)
***
మళ్లీ.. ‘నగీనా’ దగ్గరకు వద్దాం.
ఈ చిత్ర కథ.. చలనచిత్ర పరిభాషలో చెప్పుకోవాలంటే.. సీదా సాదా కథే.
ప్రేమికులను విడదీస్తే, వారు మరు జన్మ లోనూ తమ ప్రేమను కొనసాగించడం. అయితే, ఇక్కడ ప్రేయసికి గత జన్మలో సర్ప జన్మ ఉంటుంది.
దర్శకుడు హర్మేశ్ మల్హోత్ర ఈ సినేమాకు నిర్మాత కూడాను. ఈయన.. సినిమాటోగ్రఫీ బాధ్యతను వి. దుర్గాప్రసాద్‌కు, ఎడిటింగ్ బాధ్యతను గోవింద్ దాల్వడీకి ఇచ్చి, సంగీతాన్నేమో లక్ష్మీకాంత్- ప్యారేలాల్‌లను చేయమన్నారు. నృత్య దర్శకురాలుగా సరోజ్ ఖాన్‌ను తీసుకున్నారు. ఈమె శ్రీదేవి అభిమాన పాత్రురాలు. రివీలింగ్ కాస్ట్యూమ్స్‌ను ఇవ్వకుండా, ఉత్తేజకర నాట్య భంగిమల ఎంపిక జోలికి పోకుండా ‘శ్రీ’ని హుందాగా, ఎలిగెంట్‌గా సరోజ్ ఖాన్ ప్రెజెంట్ చేశారు. (‘నగీనా’ సినేమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్స్గా కచిన్స్, రీకు ఫ్యాశన్స్, మాధవ్స్ మెన్స్ మోడ్స్, నీతు కపూర్, ఉమా చోప్డా వ్యవహరించారు. వీళ్లలో నీతు కపూర్ హీరో రుషి కపూర్‌కు భార్య. శాంతారామ్ సావంత్, మోహన్ సావంత్‌లు కాస్ట్యూమ్స్ వింగ్‌లో సహాయకులుగా పనిచేశారు. నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్‌కు హమీద్ ఖాన్ సహాయకునిగా ఉన్నారు. మేకప్ బాధ్యతలు విశాల్ కస్తూరి, జాదవ్ రావ్, గోవింద్ మెహ్త, భాస్కర్ రావు, వేణు సెల్వన్, హీరాలాల్ డోర్, భూషణ్ సావంత్‌లు మోశారు. రి-రికార్డింగ్ కర్తవ్యాన్ని కుల్ దీప్ సూద్, ఆడియోగ్రఫి కర్తవ్యాన్ని చంద్రకాంత్ దవేలు పాలించారు.)
రజనిని శ్రీ – ఎప్పటి మాదిరిగా- అనుభవాన్ని రాశి పోసి మన కళ్లకు కడతారు. రజని పాల్గొన్న పలు సన్నివేశాలలో goosebumps రాక మానవు. చాలా భాగం కళ్ల తోటే భావాలు పలికిస్తారు ఆమె. (కాంటాక్ట్ లెన్సెస్‌తో ఉన్నప్పుడు, శ్రీ మరీ అందగత్తెగా కనిపిస్తారు అంటాను.) ప్రేక్షక వర్గాలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి, బాక్సాఫీస్ వద్ద శ్రీ కి పట్టాభిషేకాన్ని జరిపించారు.
హీరో పాత్రలో రుషి కపూర్ పాత్రోచితంగా నటించారు. ప్రేమ్ చోప్డా ఉన్నది కొన్ని సన్నివేశాల్లోనే; అయినప్పటికీ, తాను చెరగని ముద్ర వేశారు. అభిమానులు ఎప్పటికీ మరచిపోనేలేని, అపురూపంగా ఎంచే శ్రీ అనేక చలనచిత్ర రాజాలలో ఒక చిత్రరాజం ‘నగీనా’.
ఈ సినేమా ఎంత మంది స్మృతి ఫలకాలలోనో సుస్థిరంగా నిలచిపోయింది అంటే, అందుకు ప్రధాన ప్రాతిపదిక శ్రీ అనన్య సాధ్య అభినయ ప్రజ్ఞ అనడం నూటికి నూరు పాళ్లు యథార్థం.
‘మైఁ తేరీ దుశ్మన్ దుశ్మన్ తు మేరా మై నాగన్ తూ సపేరా’ పాట బాణీని ఈ రోజున విన్నా సరే, శ్రీ నృత్యానికి సాహో పలకడం ఖాయం. షూటింగుకు తీసుకున్న స్టుడియో ఫ్లోరుకు అనుకున్న టైం ముగియ వస్తోందని స్టుడియో యాజమాన్యానికి అప్పగించడానికని అంత దాకా చిత్రీకరణ జరిపిన సెట్స్‌ను ఒక పక్క నేలమట్టం చేస్తూ, మరో వైపు ఈ పాట చిత్రీకరణను కొనసాగించారు. అంత హడావిడిలో శ్రీ తనేమిటో నిరూపించారు. ఇదే కాదు, ‘భూలీ బిస్రీ ఏక్ కహానీ’, ‘బల్మా తుమ్ బల్మా హో మేరే ఖాలీ నామ్‌కే’లతో కలుపుకొని చిత్రంలో సోలో గీతాలు నాలుగు. ‘ఆజ్ కల్ యాద్ కుఛ్ అవుర్ రహతా నహీఁ, ఏక్ బస్ ఆప్ కీ యాద్ ఆనే కే బాద్’ (ఈ హిందీ మాటలకు.. ప్రస్తుతం మరి ఏదీ జ్ఞాపకం ఉండట్లేదు, ఒక్క మీరు మాత్రమే గుర్తొచ్చిందాదిగా.. అని భావం) పాటలో హీరో మాత్రమే పెదాలు కదుపుతాడు. ‘భూలీ బిస్రీ ఏక్ కహానీ..’లో హీరోయిన్ చాల వరకు లాంగ్ షాట్స్‌లో నడుచుకుంటూ వెళ్తుంటుంది, ఒక్క ‘బల్మా తుమ్ బల్మా హో..’లో పాటలోనే ప్రేక్షక లోకానికి అప్పటికి సుపరిచితం అయిన శ్రీ మార్కు హొయలు ఉన్నాయి. తతిమా ‘తూ నె బేచైన్ ఇత్నా జియాదా కియా..’ ఈ చిత్రంలో ఏకైక యుగళ గీతం. ఈ పాటా (గీతం ఆనంద్ బక్శీ, పాడిన వారు: మొహమ్మద్ అజీజ్, అనురాధ పౌద్వాల్) ప్లస్ ‘ఆజ్ కల్ యాద్ కుఛ్ అవుర్..’ పాటా (గీతం ఆనంద్ బక్శీ, గానం: మొహమ్మద్ అజీజ్) జరూరుగా దృశ్య కావ్యాలు సుమా.
ఈ సినేమా సంగీతం హక్కులను సూపర్ కేసెట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. సినేమా హిట్ అయింది చూసి, ఈ సంస్థ పాటలతో పాటు డైలాగ్స్‌ను కూడా జత పరిచి, 2 సెట్ల కాంబినేషన్ ఆడియో కేసెట్ను తీసుకువచ్చింది. ఈ ట్విన్ ఆడియో కేసెట్ అప్పట్లో బాగా అమ్ముడయింది. సిల్వర్ జూబిలీ ఫంక్షన్లో డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ హర్మేశ్ మల్హోత్ర చేతుల మీదుగా ట్రోఫీని శ్రీదేవి అందుకుంటున్నప్పటి ఫోటోలు గూగల్ ఇమేజెస్‌లో అప్లోడ్ అయి ఉన్నాయి. నగీనా సినేమా వచ్చి ఈ నెల 28 వ తేదీ కి నలభై సంవత్సరాలు అవుతుంది.
***
కీర్తి శేషులు శ్రీదేవి, రుషి కపూర్ నటించిన హిందీ చలన చిత్రాలు అయిదు. అవి: 1. నగీనా, 2. చాంద్నీ, 3. బంజారన్, 4. గురుదేవ్ 5. కౌన్ సచ్చా కౌన్ ఝూటా. వీటిలో ‘నగీనా’ 1986 నవంబరు 28న విడుదలై, సూపర్ హిట్ అవడం ఒక్కటే కాకుండా, శ్రీదేవి హిందీ చిత్ర రంగ విజయ ప్రస్థానంలో కీలకమైన మజిలీగా కూడ నిలిచింది. [చాంద్నీ (1989లో విడుదల అయింది) కూడా బ్లాక్ బస్టరే.]
***
హర్మేశ్ మల్హోత్ర, శ్రీదేవి లవి మరో నాలుగు చలనచిత్రాలు ‘శేర్నీ’ (1988 లో వచ్చింది), ‘నిగాహేఁ నగీనా పార్ట్- II’ (1989 రిలీజ్), ‘బంజారన్’ (1991 రిలీజ్), ‘హీర్ రాంఝా’ (1992 లో విడుదలైంది) అని వచ్చాయి. వీటిలో శ్రీదేవి నటన పరంగా ‘షరా మామూలే’గా న్యాయాన్ని చేశారు. అయితే, వసూళ్ల పరంగా ఈ సినేమాలకు సక్సెస్ దక్కలేదు. కానీ, మరీ ముఖ్యంగా ‘శేర్నీ’ లో దుర్గ, ‘హీర్ రాంఝా’ లో హీర్ పాత్రలను శ్రీదేవి అసామాన్యంగా పోషించారు. అవి ఆమె అభిమాన ప్రేక్షకులు అనే కాదు, రసజ్ఞులు అయిన సినీ అభిమానులను అలరించి తీరుతాయి అనడంలో అనుమానం అక్కరలేదు.
పాత్రను పండించడంలో- శ్రీదేవి తరానికి చెందిన నటిలలో- తతిమా వారు లెక్కకు వచ్చేది ఆమె తరువాతనే. ప్రేక్షక లోకం హృదయాకాశంలో ధ్రువతారగా శ్రీదేవిని నిలుపుకొందీ అంటే, అందుకు ఒకే ఒక కారణం ఇదే.
