Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపురూపమైన అనువాదం ఆనంద్ బక్షి జీవితం

[కొల్లూరి సోమ శంకర్ అనువదించిన ‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం పాటలు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ భువనచంద్ర.]

చన సర్వ స్వతంత్రం – అనువాదం కత్తి మీద సాము. ఎవరి సమర్థతని బట్టి వారు కవిత, కథ, నాటిక, నవలా రచనలను చేస్తారు. అయితే అనువదించడానికి కేవలం ‘సమర్థత’ సరిపోదు. మూల రచయిత రచనలోని పంక్తుల మధ్యకే (In between the lines) కాకుండా మూల రచయిత హృదయంలోకి చొరబడి అతని ‘ఆత్మ’ని పట్టుకోవాలి. అంతేకాదు, ఒక భాషలో నుంచి మరో బాషలోకి అనువదించేప్పుడు మరింత మరింత ఏకాగ్రత, తీక్షణత్వం కావాలి. కారణం మూల రచయిత రచించింది కేవలం ‘తన’ భాషలోనైతే, అనువదకుడికి క్షుణ్ణంగా రావలసింది రెండు భాషలు. ఆ రెండు భాషలు కేలవం ‘రావడం’ కాదు.. రెండిట్లోనూ నిష్ణాతుడు కావాలి.

నా చిన్నప్పుడు కొన్ని వందల అనువాద రచనలని చదివాను. అలెగ్జాండర్ డ్యూమాస్ ‘ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో’ నుంచి మాక్సిమ్ గోర్కీ, లియో టాల్‌స్టోయ్, సోమర్‌సెట్ మామ్, థామస్ హార్డీ నుంచి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ టాగోర్, బంకించంద్ర, మైఖేల్ మధుసూదన్ దత్, ముల్క్‌రాజ్ ఆనంద్, నిరాద్ సి, చౌదరీ, ఆర్.కె. నారాయణ్‌ వంటి మహామహుల మూల రచనలను తెలుగు అనువాదాలుగా చదివాను. కురాతుల్ ఐన్ హైదర్, హాన్ సు యాన్, మహాశ్వేతాదేవీ వంటి మహిళామూర్తుల రచనలనీ తెలుగు అనువాద రచనలుగా చదివి మైమరచిపోయాను. ‘వేయి పడగలు’ ఎన్నిసార్లు చదివానో, ‘అన్నా కెరినినా’, ‘యుద్ధము శాంతి’, ‘అమ్మ’ వంటి అనువాదాల్ని అన్నిసార్లు చదివాను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే,  ఆ రచనలు చదవబట్టే అనువాద ప్రక్రియలోని కష్టనష్టాలే కాదు, ‘తీపి’నీ నేను గ్రహించగలిగాను. కారణం కేవలం అటువంటి మూల రచనలని తెలుగులోకి అనువదించిన ‘అనువాద రచయితలు’.

అంతే కాదు, దాదాపు 350 సినిమాల్లో 500లకు పైగా తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలలోని పాటల్ని తెలుగులోకి, ‘మూల’ గీతాల నాణ్యత పోకుండా మన తెలుగు భాషలో చక్కగా ఇమిడిపోయేలా అనువాద గీతాల్ని రాశాను. నాకు అనువాద ప్రక్రియలో అనుభవం ఉన్నది కనకే, ఈ అద్భుత రచన ‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ’ ని తెలుగులోకి అనువదించిన శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారిని అభినందించడమే కాదు, ఇతః పూర్వం అనువాద ప్రక్రియలో నిష్ణాతులైన వారి సరసన నిలబడ్డందుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా.

ఈ అద్భుత రచన ‘గీత’కారుల జీవితానికి అద్దం పడుతుంది. రావల్పిండిలో జన్మించి, చిన్నతనానే తల్లిని పోగొట్టుకుని, ఆ లోటుని జీవితాంతం భరిస్తూ, నేవీ లోను, ఆర్మీ లోను దాదాపు 9-10 సంవత్సరాలు పని చేసి, భార్యను పుట్టింట్లో వదిలేసి, బలవంతపు బ్రహ్మచర్యం భరిస్తూ, సినీ పరిశ్రమకి రావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని, ఆ తరువాత అత్యుత్తమ గీత రచయితల్లో ఒకరుగా తన జ్ఞానఫలాల్ని శ్రోతలకు, ప్రేక్షకులకూ దశాబ్దాల పాటు పంచిన అమర కవి శ్రీ ఆనంద్ ప్రకాశ్ బక్షి గారి జీవిత చరిత్ర ఇది.

ఒక గీత రచయితగా, సైనికుడిగా, నన్ను నేను ఇందులో చూసుకున్నా. ఆనంద్ బక్షి గారి లానే నేనూ అనేకానేక సార్లు “నేను కవిని కాదు.. సినీ గీత రచయితని” అని ప్రజలకూ, పరిశ్రమకి కూడా విన్నవించుకున్నా.

అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలు శ్రీ ఆనంద్ బక్షి గారివి. ‘శతాబ్దాల’ పాటు అవి తమ సౌరభాన్ని పంచుతూనే ఉంటాయనేది నిస్సందేహం. గీతాలు, కవితల సంగతి పక్కన పెడితే, ఆనంద్ బక్షి జీవితం నిజంగా ప్రబోధాత్మకం. మనకి ఎన్నో నేర్పిస్తుంది. ఎన్నిసార్లో మనని మనకి చూపిస్తుంది. ఎంతో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. ఇతరుల జీవితాల్లో పాటలు వేరు జీవితం వేరు. అయితే బక్షి సాబ్ జీవితంలో పాటలూ, పాటల్లో జీవితమూ మమేకమైనాయి. You can’t separate him from his lyrics. ఆయన తన గురించి చెప్పుకున్న మాటలు సూటిగా ఆయన హృదయాన్ని ప్రతిఫలిస్తే, ఆయన పాటలు సామాన్యుల హృదయాల్నీ, సామాన్యుడి భావజాలాన్నీ, గ్రామీణ సౌందర్యాన్ని, జానపదపు చురుకుదనాన్నీ, చిలిపిదనాన్ని ప్రతిఫలిస్తాయి.

ఈ అద్భుతాన్ని లోకానికి కానుకగా ఇచ్చింది ఆనంద్ బక్షి గారి కుమారులు, రాకేశ్ ఆనంద్ బక్షి అయితే, దాన్ని తేటతెల్లని తెలుగులో ‘ఇదీ మన తెలుగు భాష తీయదనం’ అనేంత చక్కగా మనకి అందించింది శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారు.

ఎక్కడా, ఏ లైనులో కూడా ఒక అనువాద గ్రంథాన్ని చదువుతున్న ఆలోచనే రాలేదు. అంతేకాదు, ఇలా మరెవరూ అనువదించలేరన్న నిశ్చితాభిప్రాయమూ నా మనసులో నిలిచిపోయింది.

మరో మాట చెప్పి తీరాలి. ఇప్పటి వరకూ మీరు విన్న పాటలు అంటే most popular songs ఎవరి అకౌంట్ లోనో (అంటే ఇతర గీత రచయితల అకౌంట్లలో) వేస్తూ వచ్చాం. ఈ పుస్తకం చదివాకా, నిజంగా నిర్ఘాంతపోతాం.. ఇవన్నీ ఆనంద్ బక్షి గారివా అని!!

అందుకే మిత్రులారా.. ఈ పుస్తకం కేవలం చదవడానికి కాదు. కొని, చదివి, దాచుకోవడానికీ, ఇతరుల చేత చదివించడానికీ. కాబోయే రచయితలకు ఈ పుస్తకమూ, ఇందులోని సర్వ విషయాలూ మార్గదర్శకాలని ఘంటాపథంగా చెప్పగలను. మరోసారి కొల్లూరి సోమ శంకర్ గారికి జేజేలు చెబుతూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నాను.

***

నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు
మూలం: రాకేశ్ బక్షి
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: xxvi+224
వెల: ₹ 200/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643

~
ఆన్‌లైన్‌లో:
https://www.sahithibooks.com/products/anand-bakshi-jeevitham-paatalu-rakesh-anand-bakshi

https://www.telugubooks.in/products/nagme-kisse-baatein-yaadein-anand-bakshi-jeevitam-paatalu

Exit mobile version