[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 10 – 2000-2002 – మూడవ భాగం
నాన్న డైరీ
ఇది జూలై 20, 2001 రాత్రి, ఆ రోజు సాయంత్రం నాన్న మాకు చదివి వినిపించిన కవిత. ఆయన డెబ్బై రెండవ పుట్టినరోజు గురించి:
ఇక్‌హత్తర్ సాల్ గుజరే
బడే బేహాల్ గుజరే
సునే కోఠే పే ముజరే
లిఖే గీతోం కే ముఖడే
హుయే ఇస్ దిల్ కే టుకడే
సునో బక్షి కే దుఖడే:
కహీఁ లాఖోం మే ఏక్ హూఁ
మై బస్ ఏక్ నాగరిక్ హూఁ
యహీఁ హై నామ్ మేరా
హై చర్చా ఆమ్ మేరా
హుకూమత్ కా మై ప్యారా
మగర్ గురబత్ కా మారా
యఁ హీ దిన్-సాల్ గుజరే
బడే బేహాల్ గుజరే
కభీ మాచిస్ నహీఁ థీ
కభీ సిగరెట్ నహీఁ థీ
కభీ దోనోం థే లేకిన్
ముఝే ఫురసత్ నహీఁ థీ।
కభీ ఫురసత్ మిలీ తో
ఇజాజత్ హీ నహీఁ థీ
ఇజాజత్ మిల్ గయీ తో
యే దౌలత్ హీ నహీఁ థీ
యే దౌలత్ మిల్ గయీ తో
వో హిమ్మత్ హీ నహీఁ థీ
కభీ హిమ్మత్ భీ కీ తో
వో చాహత్ హీ నహీఁ థీ
కభీ చాహత్ నహీఁ థీ
కభీ కిస్మత్ నహీఁ థీ
కభీ కుఛ్ థా అధూరా
ముకమ్మల్ కుఛ్ నహీఁ థా
రహా సబ్ కుఛ్ బరాబర్
జ్యాదా కమ్ నహీఁ థా
జుదాయీ తో నహీఁ థీ
మగర్ సంగమ్ భీ నహీఁ థా
తబీయత్ కే ముతాబిక్
కభీ మౌసమ్ నహీఁ థా
కభీ బోతల్ నహీఁ థీ
కభీ యే గమ్ నహీఁ థా
ముఝే ఆజ్ కుఛ్ నా కహనా
మేరా దిల్ ఠికానే హై నా.
ఆ రాత్రి, నాన్న తన ‘రావల్పిండి’, ‘మై కోయి బర్ఫ్ నహీ హూఁ’ కవితలను కూడా చదివారు. ‘అర్పణ్’ చిత్రంలోని ‘అశా హుఁ, తుర్ర్ జాన్ ఆయే కే దిన్ రైనే గయే థోడే.. లిఖ్నే వాలే నే లిఖ్ దాలే’ అనే పాట పాడారు. త్వరలోనే మమ్మల్ని వదిలి వెళ్తానని మాకు చెప్పడానికి, బహుశా, ఆయన ఎంచుకున్న మార్గం ఇది.
2001
జూలై 28:
‘నా స్నేహితుడు సుభాష్ ఘాయ్ గొప్పవాడయ్యాడు. అతని విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. అతను మంచి స్నేహితుడు, మంచి నిర్మాత, నన్ను గౌరవిస్తాడు.’
(ఘాయ్ ముక్తా ఆర్ట్స్ అప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయ్యిందనే శుభవార్త విని నాన్న దీనిని రాశారు.)
ఆగస్టు 12:
‘నేను నా ఆహారాన్ని, భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నేను జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడు ఎందుకు బాధపడాలి? నా చిన్నతనంలో లాగా నేను పొగ త్రాగలేను, తినలేను అని నేను అంగీకరించాలి.’
మా కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎస్.జి. గోఖలే ఒకసారి నాన్న గురించి ఈ వినోదభరితమైన కథను నాతో పంచుకున్నారు:
“ఒకరోజు తన కుడి చేయి పైకెత్తలేకపోతున్నానని బక్షిజీ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను మీ ఇంటికి పరుగెత్తుకొచ్చాను, ఆయన పక్షవాతం బారిన పడుతున్నట్లు అనిపించింది. ఆయన్ని పరీక్షించాను, వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని చెప్పాను. కానీ తనకి కొద్దిగా బాగున్నదని చెప్పారు, ఒక నిమిషం వేచి ఉండమని అడిగారు. మీ అమ్మని ఒక కిళ్ళీ ఇవ్వమని అడిగారు. ఇప్పుడు కిళ్ళీ ఏంటి అని నేను కసురుకున్నాను, ‘బక్షిజీ, మీరు పొగాకు తినకూడదు, అది మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది’ అన్నాను. కానీ ఆయన వినిపించుకోలేదు, పైగా సిగరెట్ కూడా తాగారు! ఈ మొండి మనిషికి ఏం జరుగుతుందో తెలియక నేను కోపంతో ఊపిరి బిగపట్టాను. నేను మీ ఫామిలీ డాక్టర్‌ని, స్నేహితుడిని కాబట్టి బాధ్యత నాది. అప్పుడు మీ అమ్మగారిచ్చిన కిళ్ళీ తీసుకుని, ‘డాక్టర్ సాబ్, పాన్ ఎమర్జెన్సీ మే కామ్ ఆతా హై (అత్యవసర సమయంలో కిళ్ళీ ఉపయోగపడుతుంది)’ అని అన్నారు బక్షిజీ.
మేము ఆసుపత్రికి బయలుదేరాము. మేము ఆసుపత్రి లాబీలోకి ప్రవేశించగానే, బక్షిజీ కుప్పకూలిపోయారు! అదృష్టవశాత్తూ, ఐసియు అక్కడే ఉంది, కాబట్టి త్వరలోనే కోలుకున్నారు. కొన్ని వారాల తర్వాత, సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ‘బక్షి సాబ్ రోజ్ సుబాహ్ ఏక్ పాన్ బన్‌వాతే హైఁ ఔర్ ఉసే అప్నే పాస్ రఖ్తే హైఁ ఔర్ దిన్ భర్ ఉసే ఖాతే నహీఁ, ఔర్ షామ్ కో ఉసే ఫేక్ దేతే హైఁ. రోజ్ ఐసా కర్తే హైఁ (ఆయన ప్రతి రోజూ ఉదయం కిళ్ళీ కట్టమంటారు, రోజంతా దానిని తనతోనే ఉంచుకుంటారు, తినరు. సాయంత్రం దానిని పారేస్తారు)’ అని మీ అమ్మగారు తరువాత నాకు చెప్పారు. ఆ కిళ్ళీ తినకుండా పారేసేటట్టయితే రోజూ ఎందుకు కట్టిస్తున్నరని మీ అమ్మ చిరాకుపడేవారట. ఆశ్చర్య కూడా కలిగేదట. నేను అలా ఎందుకు చేస్తారని బక్షిజీని అడిగాను. ఆయన, ‘డాక్టర్ సాబ్, పాన్ ఎమర్జెన్సీ మే కామ్ ఆతా హై’ (అత్యవసర సమయంలో కిళ్ళీ ఉపయోగపడుతుంది) అని జవాబు చెప్పారు. ‘ఆ రోజు నేను ఇంట్లోనే చనిపోయేవాడిని, కానీ నా వద్ద కిళ్ళీ ఉండటం వల్ల, నేను స్వయంగా నడిచి ఆసుపత్రికి చేరుకున్నాను, కొన్ని వారాల్లో సజీవంగా ఇంటికి వచ్చాను. కాబట్టి, నేను కిళ్ళీ తినకపోయినా, అటువంటి అత్యవసర పరిస్థితి కోసం నేను ప్రతిరోజూ ఒకటి సిద్ధంగా ఉంచుకుంటాను. పాన్ హై తో జాన్ హై!”
ఏప్రిల్ 2001లో, తరువాత సెప్టెంబర్ 2001లోను, ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చినప్పుడు – వార్డు సిస్టర్లు, నర్సులు, వైద్యులు, ఇంకా స్వీపర్ల కోరిక మేరకు ఆయన పాటలు పాడేవారు. జన్మతః, ఆయన వినోదం అందించే వ్యక్తి.
2001లో ఒకసారి, ఆనంద్ బక్షి తన శ్రేయోభిలాషి, గాయకుడు, గీత రచయిత అయిన సమీర్ అంజాన్‌తో మాట్లాడుతూ, ‘నేను త్వరలో చనిపోతానని నాకు తెలుసు. చావంటే భయపడను, లేదా బెంగపడను. నేను రాయాల్సిన పాటలు ఇంకా చాలా ఉన్నాయనేదే నా బాధ, వాటిని నేను రాయగలను. నా కుటుంబానికి లేదా మీలాంటి మంచి గీత రచయితకు ఉచితంగా ఇవ్వగలను. అయితే, అవి నాలోంచి వచ్చాయి, కాబట్టి నాతోనే పాటు వెళ్లిపోవాల్సి ఉంటుందనే బాధపడుతున్నాను.’ అని అన్నారు.
‘మేరే సబ్ కుఛ్ మేరే గీత్ రే, గీత్ బినా కౌన్ మేరా మీత్ రే.’ – జిందగీ
1984లో, ఏ పాటను మీ ఉత్తమ రచనగా భావిస్తున్నారని అడిగినప్పుడు, ఆనంద్ బక్షి, ‘నేను ఇంకా పెద్దగా సాధించలేదు. నా ఉత్తమ పాటలు ఇంకా రాయలేదు. త్వరలోనే అది సాధించగలనని ఆశిస్తున్నాను. ఆశ ఎప్పటికీ చనిపోదు. ఆశ మరణంతోనే చనిపోతుంది.’ అన్నారు.
24 సెప్టెంబర్:
నాన్న నాకు రాసిన చివరి నోట్/లేఖ: ‘ప్రియమైన డాబూ, నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించు గాక. ఎలా ఉన్నావు? అమ్మని, మీ అన్న గోగిని జాగ్రత్తగా చూసుకో.’
30 నవంబర్:
ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాన్న వ్రాసుకున్నారు:
‘నేను బతికే ఉన్నాననేది మంచి వార్త. ఈ అనుభూతి అన్నింటికంటే సంతోషకరమైనదని వాళ్ళు అంటున్నారు. దేవుడు ఏదో ఒకవిధంగా మళ్ళీ జీవితపు ఖాళీ కాగితాన్ని ఇచ్చాడు; ఇప్పుడు రాయడం మొదలుపెట్టాలి. “నేను పాడేందుకు వచ్చిన పాటను నేనెప్పుడూ పాడలేదు. నా వాయిద్యం తీగలను విప్పి బిగించడంలో తీరిక లేకుండా ఉన్నాను” అన్నారు టాగోర్ ఒకసారి. ఇలా సమయం వృథా చేయడం ఆపాలి. పాడాలి. పాడాలి. పాడాలి. మనమందరం నటులం; వేదికపై ప్రదర్శన ఇస్తాం, ముగిసాకా వెళ్ళిపోతాం. అందరూ వచ్చారు, అందరూ వెళ్లారు. రాజులు, ఫకీర్లు, కవులు, ధనవంతులు, శక్తివంతులు. ఎల్లప్పుడూ ఈ జీవిత వేదికపై జీవించే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఎంత విసుగ్గా ఉంటుందో. ఈ శరీరం పనికిరానిదిగా మారినప్పుడు, మీకు, ఇతరులకు ఉద్రిక్తతకు కారణమవుతుతుంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. సత్యమే దేవుడు. కొంతకాలం ఆనందించండి. ఎందుకంటే కొత్త శరీరం, కొత్త బాధ్యతలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రతిదానికీ సిద్ధంగా ఉండండి – కొత్త నందో. ఆనంద్ ప్రకాష్ బక్షి.’
‘జగత్ ముసాఫిర్‍ఖానా, లగా హై ఆనా జానా’ – బాలికా బధు
2002
జనవరి 3:
‘ఓ మై గాడ్. ఎప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. దేవుడిని ఎలా సంబోధించాలో నాకు తెలియడం లేదు. ఆయనని ఏ పేరుతో పిలవాలి? భగవానా, రాముడా, అల్లానా, క్రీస్తా, గురు నానకా? నేను శ్రీకృష్ణుడనే అంటాను. సుదీర్ఘమైన, తీవ్రమైన ఆస్తమా వచ్చింది. డాబు నాకు నెబ్యులైజర్ ఇచ్చాడు. నేను ప్రశాంతంగా నిద్రపోయాను. నేను రాత్రి 11 గంటలకు లేచాను, తీపి కస్టర్డ్ తిని, మందులేవీ వేసుకోకుండానే నిద్రపోయాను. ఉదయం మేల్కొన్నాను. నేను గోగికి, కమలాకి జరిగినదంతా చెప్పాను. ఆ సమయంలో నాకు కలిగిన భావన: దేవుడు నాతో అన్నాడు – ‘నీ కష్టాలు తీరిపోయాయి. నువ్వు తగినంత బాధపడ్డావు. ఈ రోజు నుండి, నువ్వు రోజువారీ జీవితంలో సమస్యలు తప్ప, ఈ అనారోగ్యాలు, రోగ లక్షణాల నుండి విముక్తి పొందావు’ అని. ఓ దేవా కృష్ణా! బన్సీ వాలే, నేను దుఃఖానికీ, సుఖానికీ కూడా నీకెప్పుడూ కృతజ్ఞతలు చెప్తునే ఉన్నాను. ప్రతిరోజూ మెరుగుపడుతున్నానని నేను భావిస్తున్నాను.’
జనవరి 8:
‘మా ఇంటి బయట ఉన్న తోటలో నడుద్దామని వెళ్లి కిందపడి గాయపడ్డాను. సెప్టెంబర్ 2001 నుండి, నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి, కానీ దేవుడు నన్ను రక్షించాడు. నేను బతికే ఉన్నాను. నేను ఈ ఆరోగ్య యుద్ధంలో గెలిచి మళ్ళీ పాత మనిషిగా, ఒకప్పటి ఆనంద్ ప్రకాష్‌లా మారాలి. నన్ను దీవించు దేవా. నేను బతికే ఉన్నాననేది అత్యంత సంతోషకరమైన, ఉత్తమమైన అనుభూతి.’
జనవరి 31:
‘ఉదయం 6.15 గంటలకు – నేను అనారోగ్యంతో నిద్రపోతున్నానని కల కన్నాను, కానీ దేవుడు నన్ను చూస్తూ, నవ్వుతున్నాడు. ఆయన ముఖంలో సంతృప్తి. ఏం జరుగుతుందని దేవుడిని అడిగాను. “సరే, నేను మీ కోసం కలలు కన్నాను. నన్ను క్షమించు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే, నా కోరికలను అంగీకరించు. జీవితానికి, మరణానికి కృతజ్ఞతతో ఉండి, అన్ని అద్భుతాలు సంతోషంగా జరగనివ్వు” అన్నాడు దేవుడు. నేను అంగీకరించాను. దేవుడు మనకోసం ఆలోచిస్తున్నాడు. నాకెంతో సంతోషం కలిగింది. మెలకువ వచ్చేసరికి బొంబాయిలో కోస్టే బెల్లెలో మంచం మీద ఉన్నాను. మీ కుమారుడు. ఆనంద్ బక్షి.’
ఫిబ్రవరి 11:
‘రాత్రి 1.30 గంటలకు ఓ కల వచ్చి నిద్ర తేలిపోయింది. ఆ కలలో ఇద్దరు వ్యక్తులు నా శవాన్ని మోస్తున్నారు. అంతా మారిపోయింది. నా పేరు మారిపోయింది, కొంత పొగ వచ్చింది, నా శరీరం మొత్తం మారిపోయింది. నా బాధ అంతా పోయింది. నా శరీరం ఇప్పుడు అక్కడ లేనందున నేను ఎవరికీ దాన్ని చూపించలేను.’
ఈ తేదీ తర్వాత డైరీ ఎంట్రీలు లేవు.
***
‘ఆప్ కే అనురోధ్ పే, మై యే గీత్ సునాతా హూఁ.’
నాన్న ఒకే ఏడాదిలో రెండు సార్లు కోమాలో ఉన్నారు, రెండో సారి కోమాలోకి వెళ్ళినప్పుడు ఇక తిరిగి రాలేదు. నాన్న సాహిత్యం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది, దాని రచయితకి, దాని సృష్టికర్త అయిన ఆయనకి కూడా స్ఫూర్తినిస్తుందనే ఆశతో – ఆయన చెవుల్లో హెడ్‍ఫోన్‍లు పెట్టి, ఆయన పర్సనల్ మోనో క్యాసెట్ ప్లేయర్‌లో, ఆయనే వ్రాసిన పాటలను వినిపించాము. ఆయన పాడటానికి ఇష్టపడే పాటలను ప్లే చేశాము – ‘చింగారీ కోయి భడ్కే’, ‘గాడీ బులా రహీ హై’ వంటి అనేక ఇతర పాటలు వినిపించాం. ఆయన పరిసరాల గురించి తెలుసుకుంటారని, తన స్వంత స్ఫూర్తిదాయకమైన మాటలు ఆయన్ని మేల్కొలిపి, మన ప్రపంచానికి తిరిగి రావడానికి ప్రేరేపిస్తాయని ఆశించాము. ఇది మేం తోబుట్టువులం, మా అమ్మ ఆశించిన ఒక అవకాశం, ఒక ఆశ, ఒక ప్రార్థన. మేం ఆయనని బ్రతికించడంలో విఫలమయ్యాము, కానీ మేం ఆయన కోసం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసని, చివరి క్షణాలలో ఆయనకి మా ప్రేమ అందిందని మేము నమ్ముతున్నాము.
నాన్న డైరీ నుండి, అంతకుముందు రాసుకున్న, తేదీ లేని, వాక్యాలు:
‘సంభవాలు అంటే జీవితం. జీవితం నన్ను ఈ సంభవాల ప్రపంచంలోకి తీసుకువచ్చింది. మరణం నన్ను ఏమీ జరగని చోటికి తిరిగి తీసుకువెళుతుంది. ఏమీ లేదు. మరణం తర్వాత మాత్రమే ఏమీ జరగదు. మరణం తర్వాత, ఒక వ్యక్తి శూన్యంలోకి వెళ్తాడు. భావాలు ఉండవు, శబ్దం ఉండదు. నేను కూడా కొంతకాలం ఆ శూన్యపు వాతావరణంలోనే ఉంటాను. మళ్ళీ, ఏదో జరుగుతుంది, మరియు నాకు కొత్త జీవితం, కొత్త పేరు, కొత్త ఆట, నా చుట్టూ కొత్త వ్యక్తులు, కొత్త బాల్యం, కొత్త శరీరం, ప్రతి ఒక్కటి కొత్తవి లభిస్తాయి. చింతించడానికి ఏముంది? ఏమీ లేదు. జీవితం, మరణం నా శాశ్వత సహచరులు, ఎందుకంటే పునర్జన్మ ఒక వాస్తవం. ఈ రాకపోకలు శాశ్వతంగా కొనసాగుతాయి. జీవితం, మరణం – రెండూ చాలా అందమైనవి. జీవితం అంటే పని, మరేమీ కాదు. మరణం విశ్రాంతి, మరేమీ కాదు. మరణం లేకుండా, జీవితానికి ప్రారంభం, ముగింపు, అర్థం లేదు.
మరణం నుండి ఎందుకు పారిపోవాలి? మరణం ఎక్కడో లేదు, ప్రతిచోటా ఉంది, మీతో, మీలోనే. నేను శాశ్వతంగా జీవించలేనని అంగీకరించండి. మనం మరణానికి భయపడినప్పుడు, మనం దేవుడిని అనుమానిస్తాం. నేను దేవుడిని అనుమానిస్తానా? లేదు. నేను దేవుడిని నమ్ముతాను. నేను దేవుడికి ఒక చిన్న ఋజువును. ఆయన ఏడు సముద్రాలు. నేను ఒక నీటి బిందువును. నేను ఆయన నుండి, ఆయన కోసం వచ్చాను.’
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
